రామశేషు కూడా లేచాడు. "ఇక లాభం లేదంటావు?" అన్నాడు చివరి యత్నంగా.
"ఊహుఁ" అని దారితీశాడు రమణయ్య.
9
"నీకింకా వాడిపై అభిమానం చావలేదు, విశాలా! మనం అభిమానపడితే మాత్రం ఫలితం ఏముంది? చెడి బ్రతికిన వెధవ కృతఘ్నుడు. ఈ ఇంట పెరిగానే ఈ ఇంట తిరిగానే, ఈ ఇంటివారి వల్లనే ఇంతవాడినయ్యానే__ అన్న కృతజ్ఞతలేని రాస్కెల్.
"మనం చెడి అమ్ముకుంటున్నాం, వాడు బాగుపడుతున్నాడు.
"బాగోగులు మనుషుల చేతుల్లో లేవు. మనం చెడాలన్నా, బాగుపడాలన్నా అంతా భగవంతుడి దయ. మనం తక్కువ చేసిందీలేదు. వాడు ఏడిచింది లేదు. మనకు పొలం ఖర్చు ఇంటి ఖర్చు ఎక్కువ. వాడిదేముంది? పిల్లికి బిచ్చం పెట్టడు వెధవ. మరో యావ లేదు. ఇల్లు, పొలం _ వాడికేం తెలుసు? దర్జా. పరువు, మర్యాద తెలియని వాడు. ఎందుకు చెప్పి పంపామో కొంచెమైనా అర్ధం చేసుకొన్నాడా?
"వాడు కాదంటే పని ఆగిపోతుందని గర్వం కాబోలు."
"నిమిషాలపై కొన్నాడు పుల్లయ్య. మరో రెండువేలు ఎక్కువ పెట్టాడు ధర. మనం చెడ్డామా - వాడే చెడ్డాడు కాని?"
శివ తాండవం చేస్తూన్న అన్నయ్యను చూసి నోరెత్త లేదు విశాల. రమణయ్య మాటలు రామశేషు ద్వారా విన్న విశాలకు అతనికి వాదన నచ్చింది. 'తాగలేని పిల్లి బోర్లబోసుకుందన్నట్టు సంసారాన్ని చక్కగా నిర్వహించుకోలేని తాము పొలాలూ, దొడ్లూ అమ్ముకుంటూ ఉంటే, ఒకనాడు అన్నిటికీ పెత్తనం వహించి అజమాయిషీ చేసిన వ్యక్తికి మాత్రం దుఃఖంగా ఉండదా?" అనుకుంది.
అందుకే చంద్రయ్య అరుపులకు జవాబు చెప్పలేదు విశాల. డబ్బు అందిన రాత్రే భార్యతో సహా మద్రాసు బయలుదేరాడు చంద్రయ్య.
విశాల నిట్టూర్చింది. ఇక ఆ డబ్బంతా హారతి కర్పూరమల్లే కరిగిపోయాకే అన్నయ్య తిరిగి వచ్చేది అనుకుంది.
ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళే చంద్రయ్య ఆ పర్యాయం భార్యతో సహా వెళ్ళటానికి కారణం ఉంది. పెళ్ళయి ఇన్నేళ్ళయినా ఇంకా వారికి సంతానం కలగలేదు. పట్నం తీసికెళ్ళి ఏ లేడీ డాక్టరుకయినా చూపించి పరీక్ష చేయించాలని అతని ఉద్దేశ్యం.
వెళ్ళిన భార్యా భర్తలు మూడు నెలలకు కానీ తిరిగిరాలేదు. డబ్బుకి డబ్బు ఖర్చి అయిందే కానీ చంద్రయ్య ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. నిశ్శయంగా జయంతి తల్లి కాబోదని తేల్చి చెప్పారు డాక్టర్లు. ఒకరికి నలుగురిని సంప్రదించినా అదే మాట చెప్పటంతో నిరాశతో తిరిగి వచ్చాడు చంద్రయ్య.
పరంధామయ్యగారి సంసారం కూడా పలచబడింది.
కొడుకుతో భాగాలు పంచుకున్నారాయన.
జయంతి పెళ్ళి అయిపోయాక కొడుకు పంచుకుని పోయాక, వృద్ధాప్యంలో భార్యా, ఆయనా మిగిలిపోయారు. గుడ్డికాకికి తోడు కుంటి కాకి అన్నట్లుగా సదా రోగి అయిన భార్య పరంధామయ్యకు తోడుగా నిలవ లేకపోయింది. అంతలో మరదలు భర్త మరణించటంతో ఆమె చిన్నకూతురు హైమావతిని తమ వద్దే ఉంచుకునే ఉద్దేశ్యంలో వెళ్ళి వెంట తెచ్చుకున్నారు వాళ్ళు.
హైస్కూలు చదువుతో చదువు ముగించిన హైమావతి చాలా చలాకి అయిన పిల్ల. పెదతండ్రి, తల్లి మనసు తెలిసి ప్రవర్తించేది.
కళ్ళల్లో కనుపాప అయి, తలలో నాలుక అయి వ్యవహరించింది హైమావతి.
వృద్దాప్యంలో తమకు తోడు నీడ అయిన హైమావతిని వదిలి ఉండలేని స్థితికి వచ్చారు, ఆ దంపతులు.
అందుకే ఇల్లరికం ఉండే యోగ్నుడైన అల్లుణ్ణి వెతుక్కుంటున్నారు. వాళ్లు మేడి పండులా చంద్రయ్య సంసారం చూసి ఇంకా అల్లుడు బాగానే వున్నాడనే భ్రమలో ఉన్నారు వాళ్లు. అందుకే అతనిపై గౌరవం, అభిమానం తగ్గలేదు వాళ్ళకు.
ఒక సంక్రాంతి పండుగకు అల్లుడినీ, కూతురినీ పిలిపించుకుని, తమ మనస్సులోని ఆలోచన చెప్పారు, కూతురు కడుపు పండనందుకు చాలా చింతించారు.
చూడగా చూడగా వాళ్ళ ఆలోచన హైమావతిని చంద్రయ్యకిచ్చి చెయ్యాలని ఉందా అనిపించింది జయంతికి.
తల్లిని ఆ మాట చూచాయగా అడిగింది జయంతి, మనస్సుని అదుపులో పెట్టుకోలేక. తన కడుపు ఫలించకున్నా సవతి పేరు, ఆహ్వానించే త్యాగం లేదు ఆమెలో. అయితే తన ఉద్దేశ్యం బయట పడకుండా తన కుటుంబం నిలిచేందుకు వంశాంకురం కోసం మళ్ళీ పెళ్ళి చేసినా తన కభ్యంతరం లేదనీ, వాళ్ళు ఇష్టపడి హైమావతిని ఇస్తే తను సంతోషిస్తుందని చెప్పింది.
ఆమె తల్లి జయంతి మాటలు విని ఆశ్చర్యం పోయింది. "జయా! చంద్రానికి వయసు మించిపోకపోయినా హైమాకు అతనికీ ఈడు కాదు పైగా మాకు ఇల్లరికం వుండే అల్లుడు కావాలి. ఆ దృష్టితో ఏదైనా సంబంధాలు చూడండి, చాలు" అంది.
జయంతి మనస్సు తేలిక పడింది.
తప్పకుండా మంచి సంబంధం చూస్తామని చెప్పింది. పండుగ మూడురోజులూ హాయిగా గడిపి చీరె సారెలు అందుకుని భర్తతో సహా అత్తవారింటికి వెళ్ళిపోయింది ఆమె, చంద్రయ్యకీ విషయం ఏమీ తెలియదు.
* * *
మంచి సినిమా వచ్చిందనీ, సినిమాకు వెళ్ళి తీరాలనీ పట్టుబట్టింది రూంమేటు సరిత.
సహజంగా సినిమా అంటే రాధకు ఇష్టంలేదు. కానీ, అప్పుడప్పుడు బలవంతంగా సరిత లాక్కువెళ్ళితే వెడుతుంది.
"సుశీల, ఘంటసాల పాటలకయినా వెళ్ళి తీరవలసిందే" అంది సరిత, చాలా ఇష్టం ఆమెకు ఘంటసాల పాట వింటూంటే రాధకు నిద్రాహారాలు అక్కరలేదు! సుశీల పాటలంటే చెవి కోసుకుంటుందామె.
"ఇదిగో, రాధా? మహదేవన్ మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉందట"
"అవునే! నేను ఒక పాట కూడా విన్నాను."
"సరి ఈ రోజే వెళ్ళొద్దాం"
"సినిమా వచ్చి ఇంకా రెండు వారాలు కూడా కాలేదు. రష్ గా వుంటుందేమో?"
"బోడి రష్ హైక్లాసు టిక్కెట్టుకు వెళ్ళితేసరి."
అయినా రేపు ప్రాక్టికల్సు వున్నాయి. రికార్డు తయారు చెయ్యనే లేదు" అంది రాధ.
"ఆడవాళ్లు అబద్ధాలాడితే గోడకట్టినట్టుగా వుండాలట. ఇలా తేలికగా తేలిపోయే అబద్ధాలాడితే ఎలా నీవు రికార్డు మొన్ననే తయారు చేశావు. చూడు" అని వెళ్ళి తెచ్చి చూపింది సరిత.
నవ్వింది రాధ.
"ఇదుగో, అమ్మాయి! ఈ రోజు సినిమాకి వెళ్ళాలని లేదు ఎందుకో. రేపు వెళదాంలే" అంది రాధ.
"ఏమిటమ్మా ఈ రోజుకి అడ్డంకి? ఏ హీరో అయినా అపాయింట్ మెంటు ఇచ్చాడా? బీచికి వెళ్ళాలా?"
"అలా అన్నావంటే..." చెవి నులిమింది రాధ.
"మరి అలా అన్నావంటే అర్ధమేమిటి? యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళకి అనవసరంగా మూడ్ చెడుతుందా? రాధా! నా వెంట ఈ రోజు రాకపోయావో - ఇంకేంలేదు, నీతో పచ్చి."
"ఈ రోజు మాత్రమేనా!"
"ఫరెవర్!" అని రేడియో ఆన్ చేసింది సరిత. వివిధ భారతి ట్యూన్ చేసింది. సరిగా ఆ చిత్రంలో ఘంటసాల, సుశీల పాడినపాట వచ్చింది. పాట పూర్తిగా విన్న రాధ సరిత ముఖం చూసింది.
"రాధా! నీ ముఖం అద్దం లాంటిదే, అందులో నీ మనస్సు ప్రతిబింబిస్తూ వుంది పద, పద, త్వరగా తయారవు."
మరో అరగంటకల్లా బయలుదేరారిద్దరూ.
ధియేటర్ వద్దకు వెళ్ళేసరికి ఇంకా టైం కాకపోవటంతో దగ్గరలో వున్న హోటల్ కు వెళ్ళి, టిఫిన్ తిని, కాఫీ తాగి తిరిగి వచ్చారు.
సరిత ఫస్టుక్లాస్ టిక్కెట్లు కొనుక్కుని వచ్చింది.
ధియేటర్లోకి వెళ్ళి కూర్చున్నారిద్దరూ. జనం ఒక్కరొక్కరే రాసాగారు, ధియేటర్ నిండసాగింది. సినిమా ప్రారంభం కాబోతూ ఉన్నదనగా గోపీ కూడా వచ్చాడు సినిమాకి. అతను వచ్చిన కొద్దిసేపట్లోనే లైట్లారిపోయాయి, స్లయిడ్స్ వేయసాగారు. మరో అయిదు నిమిషాల్లో న్యూస్ రీల్.
సినిమా ప్రారంభమైంది. నాగేశ్వరరావునూ, వాణిశ్రీనీ చూస్తూ ఒళ్ళు మరిచిపోయిన రాధకు హఠాత్తుగా ఎవరో జబ్బమీద గిచ్చినట్లయి ఉలిక్కిపడింది. సరిత సినిమా చూడటంలో నిమగ్నమయింది.
చెదిరిన మనస్సుతో వెనుదిరిగి చూసిన రాధకు వెనక ఎవరో పెద్ద మనిషి కూర్చుని వుండటంతో అది సరిత పనే అనిపించింది.
చెదిరిన మనస్సుకు కుదుట బరుచుకుని మళ్ళీ తెరపై లగ్నం చేసింది. వాణిశ్రీ నటన రాధని సమ్మోహ పరుస్తూంది.
మళ్ళీ జబ్బపై ఎవరిదో చేయి ఉలిక్కిపడి చూచింది.
సరితకాదు! ఆ పెద్దమనిషి.
విసురుగా చేయి తీసివేసి, వెనుదిరిగి ఉరిమి చూసింది రాధ. కానీ, ఆ చీకట్లో అతనికామె చూపులు కనిపించలేదు.
అంతలో ఇంటర్వెల్ లైట్లు వెలిగాయి.