విస్తట్లో అన్నం, యింత పచ్చడో చారో వుంటుందనుకున్న రామ్మూర్తికి ఎదురుగా వంకాయ కొత్తిమీర కారం, కూర, కొబ్బరిపచ్చడి, చారు అన్నీ చూచేసరికి ఇవన్నీ ఎక్కడివన్న ప్రశ్నే పుట్టనీయకుండా ఆబగా, గబగబ అన్నం తినడం మొదలుపెట్టాడు.... సగం తిన్నాక ఆత్మారాముడు కాస్త చల్లబడ్డాక....
"అమ్మ పడుకుందేం అమ్మా? అనడిగాడు మజ్జిగ పోస్తున్న కూతుర్ని నెమ్మదిగా. మధ్యాహ్నంనించి అమ్మ అలా ఏడుస్తూ పడుకుంది నాన్నా...." అంది రహస్యం చెప్తున్నట్లు కూతురు.
"ఎందుకెందుకు?" ఆందోళనగా అడిగాడు. పిల్లలు ఆకలికి ఏడిస్తే చాతకాక వాళ్ళని రెండు బాది, తనని రెండు బాదుకుని ఏడుస్తుందేమో అనుకోడానికి సుష్టుగా భోజనం వుండగా ఏడుపెందుకో రామ్మూర్తికి అర్థం కాలేదు.
"మధ్యాహ్నం పెద్దక్కని అమ్మ చీపురుతో కొట్టింది. నాన్నా.... అప్పటినించి అలా ఏడుస్తూ పడుకుంది." గుసగుసలాడింది కూతురు.
"అక్కని కొట్టిందా? ఎందుకు?" అయోమయంగా అడిగాడు రామ్మూర్తి.
కూతురు తలవంచుకుని జవాబీయలేదు. రామ్మూర్తికేం తట్టలేదు.
"ఏం చేసిందది. ఎందుకు కొట్టింది!" నెమ్మదిగా అడిగాడు.
"ఏమో నాన్నా....అక్క ఎక్కడికో వెళ్ళి డబ్బు తెచ్చింది.... అందుకు...." బితుకు బితుకు చూస్తూ తల్లి వింటుందని నెమ్మదిగా అంది కూతురు.
"డబ్బు తెస్తే కొట్టిందా? ఎక్కడనుంచి తెచ్చింది? ఎవరింటి నుంచి?"
కూతురు మరీ తలదించుకుంది. మరి కాస్త గొంతు తగ్గించి రహస్యం చెపుతున్నట్టుగా "మన ఎదురింట్లో స్టూడెంటు లేడూ.... అతని గదికి వెళ్ళింది....చాలాసేపుంది...."
"అక్కడనించి ముప్ఫై రూపాయలు తెచ్చింది....అందుకు కొట్టింది అమ్మ...."
రామ్మూర్తి చేతులో ముద్ద జారిపోయింది.... తెల్లపోతూ చూశాడు. సంభ్రమాశ్చర్యాదలతో "అక్కడికెళ్ళిందా!.... డబ్బు తెచ్చిందా!" తడబడుతూ అన్నాడు.
"ఊ.... అక్క వెళ్ళడం అమ్మ చూడలేదు.... అతని గదిలోంచి వస్తూంటే చూసింది. డబ్బీయగానే పట్టుకు చితక్కొట్టేసింది...."
రామ్మూర్తికి కథ అర్థం అయింది. అతని చెయ్యి అన్నంతో వణకసాగింది, "ఈ బియ్యం.... అవి ఆ డబ్బుతోనే కొన్నారా."
"ఆ....అమ్మ విసిరేసిన ఆ నోట్లు చిన్నక్క తీసి దాచింది. అదే బజారుకెళ్ళి సామానుతెచ్చి వంట చేసింది...."
"అమ్మ వూరుకుందా?"....
ఆ పిల్ల దోషిలా తలవంచుకుంది.... "అమ్మ తిట్టింది నాన్నా.... తినండర్రా నిర్భాగ్యపు వెధవల్లారా.... ఆ దరిద్రపు తిండి కడుపులు పగిలేలా తింటున్నారా, సిగ్గులేకుండా.... దౌర్భాగ్యపు వెధవల్లారా ఆ తిండి తినకపోతే చస్తారా.... అంటూ, అరిచి మిమ్మల్ని తిట్టి, తల బాదుకుంటూ ఏడుస్తూ పడుకుంది."....
"అక్కేది?"
"పెరట్లో ఆ ప్రక్క అరుగుమీద కూర్చుంది ఏడుస్తూ.... ఇంట్లోకి రమ్మంటే రావడంలేదు.... అన్నంకూడా తినలేదు.... అదేమిటి మజ్జిగ అన్నం తినవా నాన్నా"
"వద్దమ్మా.... కడుపు నిండిపోయింది.... చాలింక" రామ్మూర్తి విస్తరి ముందునుంచి లేచిపోయి చేయి కడిగేసుకున్నాడు.
పెరట్లోకి నాలుగడుగులు వేసి ఆగిపోయాడు రామ్మూర్తి.... అటు వెళ్ళి కూతురి మొహం చూడాలంటే సిగ్గనిపించింది.... లోపలికెళ్ళి పెళ్ళానికి మొహంచూపలేక వీధిలోకి వెళ్ళిపోయి నిలబడ్డాడు. అతని గుండెల్లో పెద్ద బండరాయి పడేసినట్లు, గొంతులో పెద్ద మంచుముద్ద అడ్డుపడినట్లు, ఊపిరి ఆడనట్లు అనిపించసాగింది. ఏం చెయ్యాలో తోచనిస్థితి అది.
రామ్మూర్తి వీధిలో నిలబడడంచూసి పక్కింటి అవధానిగారు గుమ్మం దిగి రామ్మూర్తి దగ్గరకు వచ్చాడు. ఓసారి రామ్మూర్తిని ఎగాదిగా చూసి గొంతు సవరించుకుని "చూడు రామ్మూర్తి.... మాట...." అంటూ మరికాస్త దగ్గిరకు జరిగాడు "ఇదిగో చూడు, నేను నీకంటే పెద్దవాడ్ని, నేనో మాట అంటే ఏమనుకోకు.... అది సరేగాని, నీకసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా.... ఆహాఁ తెలుస్తుందా.... అని.... తెలిసే వూరుకుంటున్నావా?... అవ్వ.... బ్రాహ్మణ పుట్టుక పుట్టిన మన ఇంటా వంటా ఇలాంటి పనులు జరగడం కనివిని ఎరుగుదుమా?...."
రామ్మూర్తి గుడ్లప్పగించి చూడటం మొదలుపెట్టాడు.... "ఇవాళ మధ్యాహ్నం నీ పెద్ద కూతురు ఎదురింటి స్టూడెంటు గదిలోంచి వస్తూంటే యీ వీధిలో నాలుగైదిళ్ళవాళ్ళు చూశారట.... ఇదేమిటయ్యా.... పెళ్ళికాని పిల్ల.... యింతకి తెగిస్తుందా.... ఇంక నీ పిల్లలకేం పెళ్ళిళ్ళవుతాయి.... ఆ మాత్రం పిల్లల్ని అదుపులో పెట్టుకోలేక ఇలా వదిలేస్తారుటయ్యా.... నీ పరువు ప్రతిష్ఠ గంగలో కలిపేసుకున్నావా? తిండి లేకపోతే చావాలి గాని ఇలాంటి పనులటయ్యా చేస్తారు.... కలికాలం.... నీ వెలా ఇంకా బుర్రెత్తుకు తిరుగుతున్నావో కానీ, నేనయితే ఈపాటికి తల పగలగొట్టుకుని చచ్చేవాడిని...."
రామ్మూర్తికి పౌరుషం వచ్చేసింది. అసలే చికాకుగా వున్న అతనికి తన చేతకానితనాన్ని వేలెత్తి చూపుతుంటే వెర్రి ఆవేశం వచ్చేసి ఊగిపోయాడు. "అయ్య అవధానిగారూ, తమరి నీతి పన్నాలు వినేందుకు నాకు ఓపిక లేదు. వెళ్ళండింక.... నా ఖర్మానికి నన్ను వదిలిపొండి. మీకెందుకయ్యా మా యింటి గొడవ.... ఇన్ని పెద్దకబుర్లు చెప్పే మీరు తిండిలేక మాడుతున్నా ఓ పూట శేరు బియ్యమన్నా ఇచ్చారా? ఒక్క రూపాయైనా అప్పిచ్చారా.... మా కష్టం ఆర్డ్చి, తీర్చలేని మీకు మా గొడవెందుకు.... నా యిష్టం.... ముష్టెత్తుతాను.... మూటలు మోస్తాను.... నా కూతుర్లని బజార్లో పెట్టి సంపాయిస్తాను.... ఏంచేస్తే మీకేం బాధ.... వెళ్ళండి.... పరువు, ప్రతిష్ఠలు అన్నీ వున్నవాడికి, నాలాంటివారికి కాదు.... పిచ్చివాడిలా గొంతు చించుకుని అరవసాగాడు రామ్మూర్తి.
'రామ్మూర్తి!' అవధానిగారు కలవరపడ్తూ "మతిపోయిందా, ఏమిటా కేకలు.... జరిగింది చాలక.... ఇంకా నలుగురూ వినాలా...." అంటూ వారించాడు.
"ఆ....ఆఁ ఊరు వాడ చాటుతాను.... నా యిష్టం వచ్చినట్లు చేస్తాను. అడిగేవాడెవడో చూస్తాను...." ఊగిపోయాడు ఆవేశంతో రామ్మూర్తి.
అప్పటికే గుమ్మంలో నించుని ఆడవాళ్ళు, గుమ్మాలు దిగి మగవాళ్ళు చోద్యంచూడటం ఆరంభించారు. రామ్మూర్తి చిన్నకూతురు పరిగెత్తుకువచ్చి 'నాన్నా.... అమ్మ లోపలికి రమ్మంటూంది' అంటూ లాక్కెళ్ళింది లోపలికి.