Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 18


    "నేను కూలివాడిని కానండీ...." అన్నాడు సగం చచ్చి!
    "అలాగా.... తెలియక అడిగాను ఏమనుకోకు బాబూ" అందావిడ.
    పోనీ సంచులు తీసికెడితే, ఓ పావలా ఇస్తుంది....దాంతో అరడజను అరటిపళ్ళన్నా కొనుక్కుతిని ఇన్ని నీళ్ళు తాగచ్చు అనిపించింది ఓ క్షణం రామ్మూర్తి. ఛా... ఛా... ఎవరన్నా చూస్తే.... పరువేంగాను....అనుకున్నాడు మళ్ళీ.
    మరో నాలుగు అడుగులు నడిచాక, రెండు రోజులుగా తిండిలేని అతని శరీరంలో అవయవాలు ముందుకు కదలమని మొరాయిస్తుంటే తనమీద తనకే పట్టలేని కోపం వచ్చింది. వెధవ భేశాజానికి పోయి ఆ పావలా కూడా పోగొట్టుకున్నాడు. రోజుకి రెండు, మూడు రూపాయలు సంపాదించే కూలివాడి కంటే తనెందులో మెరుగు? వాడి కక్కరలేని పరువు, మర్యాద కోసం తనెందుకు ప్రాకులాడాలి? ఆ ముష్టివాళ్ళలా కుక్కలతో సమానంగా కలియబడి దొరికిందేదో తిని బ్రతగ్గలిగే తెగువా, ధైర్యమూ లేవు. ఇటు మూటలు మోసో, తట్టలు దించో నాలుగు డబ్బులు తెచ్చుకోలేని తనలాంటి బ్రతుకులకి మోక్షం లేదు! "నీకెందుకయ్యా, ఇంత కసి మా మీద, ఎందుకింత ద్వేషం, మా బ్రతుకులు యిలా త్రిశంకు స్వర్గంలో ఎందుకు పడేశావు" అని కసిదీరా మరోసారి ఆ దేవుడ్ని శపించుకున్నాడు మనసులో రామ్మూర్తి! కాళ్ళీడ్చుకుంటూ ఓ గమ్యం లేకుండా ఆ ఎండలో పడి రామ్మూర్తి నడుస్తున్నాడు.... ఇంటికెడితే పిల్లల ఆకలి మొహాలు చూసి, పెళ్ళాం తిట్లూ శాపనార్థాలు విని రెండూ సహించలేడు.... ఇవాళ కొట్టుకు శలవయింది.... లేకపోతే ఆ కొట్లోనే పడుండేవాడిని అనుకున్నాడు....
    రామ్మూర్తి పూర్వాశ్రమంలో ఎన్.జి.వో.ఎల్.డి. క్లర్కుగా జాయిన్ అయి హెడ్ గుమస్తాగా రిటైరయ్యాడు!.... రిటైరు అవలేదు! రిటైరు చేయబడ్డాడు. మరో ఏడాదికి రిటైరవుతాడనగా ఏవో కాగితాలు మాయం చేశాడని తప్పుడు లెక్కలు రాశాడని, లంచం తీసుకున్నాడని.... ఏవేవో నేరారోపణలు చేసి సస్పెన్షన్ లో పెట్టబడ్డాడు. ఓ రెండేళ్ళు అర్థ జీతం తీసుకుంటూ కోర్టులంట తిరిగాక నేరాలు రుజువుచేసి డిస్మిస్ చేయడమే కాక పెన్షన్ రద్దుచేస్తూ శిక్ష విధించారు.
    పాపం రామ్మూర్తి వేలు, లక్షలు ఏం తినలేదు. ఓ పదికి, పాతికకి మహా అయితే వందకి కక్కుర్తి పడ్డాడు. పడ్డాడంటే రామ్మూర్తి తన తప్పేం లేదంటాడు. ఎదుగు బొదుగు లేని జీతం, ఎదగకపోయినా రోజురోజుకి ఎదిగిపోతున్న సంసారంతోపాటు ధరలు .... ఏం చేస్తాం అంటాడు. పై వాళ్ళందరూ తినగా లేనిది తను తినడం తప్పా అనుకున్నాడు అప్పుడు! కానీ పాపం అప్పుడు ఆ తినడం యింత ముప్పు తెస్తుందని అనుకోలేదు రామ్మూర్తి. తీరా ముప్పు వచ్చాక ముప్పొద్దులా కాళ్ళరిగేలా తిరిగి పెద్దల కాళ్లు పట్టుకున్నాడు! పెద్దలు కాళ్ళేకాక చేతులూ విదిలించేసుకుని "పో.... పో.... ఇంకా నయం జైలు కెళ్ళనందుకు సంతోషించు, దయతల్చి యింతటితో వదిలేశా?" మని తమ దయార్ద్ర హృదయాలని వెల్లడించుకున్నారు.
    రామ్మూర్తి నిస్సహాయుడై కసితో అధికారులని, కోర్టులని, న్యాయమూర్తులను మనసులో మాత్రం శపించుకోగలిగాడు.... "అయ్యలారా, వేలు, లక్షలు తినేవారిని వదిలి నాలాంటి పదులు ఇరవైల వాళ్ళని మాత్రం శిక్షించడం ఏంధర్మం!..... న్యాయమూర్తులారా మీరే శెలవీయండి' అని ఎలుగెత్తి అరవాలనుకున్నాడు. కానీ ఏదీ నిరూపించలేని తనలాంటి వాడిమాట నమ్మేదెవరని నోరు మూసుకున్నాడు. ఇంకా మాట్లాడితే జైల్లోకి తోస్తారేమోనని భయపడి నోరు మెదపలేదు.
    అప్పటినించి పొట్టకూటికి రామ్మూర్తి పడని పాట్లు లేవు. సస్పెండ్ అయిన ఏభై అయిదేళ్ళ రామ్మూర్తికి ఉద్యోగం దొరకడం అంటే మాటలు గాదు! ఏ ప్రయివేట్లో చెప్పుకుందామన్నా చదువు చెప్పకుండానే ప్యాసు చేయించే నేర్పు వుండే స్కూలు మేష్టర్లని కాదని రామ్మూర్తిలాంటి వాడి దగ్గర ప్రయివేట్లు యీ రోజుల్లో ఎవరికి కావాలి?
    ఆఖరికి ఆర్నెల్లు తిరిగాక, తప్పుడు లెక్కలు కరక్టుగా కనిపించేట్టు రాయగలిగిన నేర్పు వున్న రామ్మూర్తిని తప్పుడు లెక్కలు కరక్టుగా కనపడేటట్టు రాయడానికి ఓ బట్టలకొట్టు యజమాని అరవై రూపాయలకి కుదుర్చుకున్నాడు.
    రామ్మూర్తి పెద్ద కొడుకు మరో వూళ్లో గుమస్తా రక్తం పిండి పంపుతున్నట్టు బాధపడుతూ తప్పక నూట ఎనభై లోంచి ఓ ఏభై యింటికి పంపుతాడు. మిగతాదాంతో పెళ్ళాం, యిద్దరు పిల్లల్ని పోషించుకోలేక, చావలేక, బ్రతకలేక బ్రతుకుతున్నాడు.
    తాతలనాడు కట్టించిన మూడు గదుల కొంపలో ఓ గది అద్దెకిచ్చి ఒకటిన్నర గదిలో కాలక్షేపం చేస్తున్నాడు రామ్మూర్తి. ఆ అరవై, కొడుకు పంపే ఏభై ఇంటద్దె పాతికతో రామ్మూర్తి ఇంట్లో ఎనమండుగురికి నెలకి సగం రోజులు మాత్రం రెండు పూటలా నోట్లోకి వేళ్ళు వెడతాయి! ఆ మిగతాలో సగం రోజులు ఒక పూట మాత్రం లోపలికి వేళ్ళు వెడతాయి. ఆఖరివారం అసలు నోట్లోకి వేళ్ళు వెళ్ళవు. అమ్మదగినవి, కుదువబెట్టతగినవి అన్నీ రామ్మూర్తి నిరుద్యోగపర్వంలో వుండగానే హరించిపోయాయి, ప్రస్తుతం సిల్వర్ బొచ్చెలు, మట్టి కుండలు, చింకి చాపలు, కుళ్ళు బొంతలు.... అస్థి పంజరంలాంటి భార్య, చదువులేక పెళ్ళికాక గుండెల మీద కుంపటిలా పెళ్ళికెదిగి కూర్చున్న పాతికేళ్ళ ఆడపిల్లలు ఇద్దరూ, మేము తయారే అంటూ బెదిరిస్తున్న పధ్నాలుగేళ్ళ పన్నెండేళ్ళ ఆడపిల్లలిద్దరూ, పదేళ్ళ కొడుకు.... ఇవీ రామ్మూర్తి ఇంట్లో కనిపించే సజీవ, నిర్జీవ వస్తువుల జాబితా.
    ప్రస్తుతం రామ్మూర్తికి నెలలో ఆఖరివారం_
    నోట్లోకి వేళ్ళు వెళ్ళని రోజులు! నిన్న ప్రొద్దుట పెళ్ళాం ఎదిరింటినించో బదులు తెచ్చిన రెండు గొట్టాల బియ్యం అందరూ కలసి ఇంత జావలా కాచుకు త్రాగడానికి సరిపోయాయి. నిన్న ఉదయం త్రాగిన ఆ జావా అరిగిపోయి పాతిక గంటలే అయినా పాతిక రోజులుగా అనిపిస్తూంది రామ్మూర్తికి.
    రాత్రి ఏడున్నర వరకు త్రిపాధి నక్షత్రంలా తిరిగి .... కనపడిన చోటల్లా పైపు నీళ్ళతో పొట్ట నింపుకుంటూ, చీకటిపడ్డాక .... తప్పదన్నట్టు ఇంట్లోకి అడుగుపెట్టాడు భయపడ్తూ భయపడ్తూ.
    ముందు గదిలో చాపమీద గోడవైపు తిరిగి భార్య పడుకుంది. మరోప్రక్క బొంతమీద వారం రోజులనించి జ్వరంతో పడున్న ఆఖరి కొడుకు పడుకున్నాడు. ఎక్కడినించో చిరిగిపోయి శిథిలావస్థలో వున్న పాత పత్రికలని తెచ్చుకుని తలొక మూలా ముగ్గురు కూతుళ్ళు కూర్చుని శ్రద్ధగా ఆసక్తిగా చదువుతున్నారు. తండ్రి రాగానే బితుకు బితుకుమంటూ చూశారు కూతుళ్లు. ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం చూసి కాస్త భయపడ్డాడు రామ్మూర్తి. ఒక్క క్షణం అలా నిలబడి పెళ్ళాం ఎక్కడ లేస్తుందోనని పిల్లిలా అడుగులేస్తూ నూతి దగ్గిర కాళ్ళు చేతులు కడుక్కుని పెరటి అరుగుమీదే కూర్చున్నాడు.
    పదినిమిషాలు గడిచాక "నాన్నా.... అన్నానికి రా" అంది మూడో కూతురు వచ్చి రామ్మూర్తి మనసు సంతోషంతో ఊగిపోయింది. గంజి నీళ్ళకే గతిలేదనుకున్నవాడికి మృష్టాన్నం దొరికితే కలిగే ఆనందంలాంటిది ఆ సంతోషం. పెళ్ళాం ఎక్కడో తెచ్చి వండిందన్న మాట! "అన్నం వండారా తల్లీ!" అంటూ గబగబ వంటింట్లోకి వెళ్ళాడు రామ్మూర్తి.

 Previous Page Next Page