"నా యిష్టం.... నా యిష్టం వచ్చినట్లు చేస్తాను.... అదేమన్నవాళ్ళని పాతేస్తాను.... నా వూసుకి వచ్చిన వాళ్ళమీద ఉమ్మేస్తాను...." లోపలికి వెళ్ళేవరకు అరుస్తూనే వున్నాడు.
ఇంట్లోకి రాగానే భార్యని చూసేసరికి రామ్మూర్తి నోరు దానంతటదే మూతపడింది. ఆమె చింతనిప్పులాంటి కళ్ళతో, విరబోసిన జుట్టుతో ఊగిపోతోంది. ఆవిడ చూపులకే శక్తి వుంటే రామ్మూర్తి అక్కడికక్కడే మాడి మసి అయిపోయేవాడు!.... ఎన్ని నోములు, ఎన్ని పూజలు చేసుకుంటేనో ఇలాంటి మొగుడు, ఈ పిల్లలు. ఎంత పాపం చేసుకున్నానో.... మహాప్రభో నన్నెందుకు తీసికెళ్ళవు ఇంకా.... అంటూ గొల్లున ఏడ్చింది. గోడకేసి తలబాదుకుంది. రామ్మూర్తి చిక్కచచ్చిపోయి, వెర్రివాడిలా చూస్తూ నిల్చున్నాడు. అప్పటికి గానీ తను చేసిందేమిటో తెలిసి రాలేదు. సిగ్గుపడి పోయాడు. "అమ్మా అమ్మా" అంటూ ఇద్దరు కూతుర్లు గోడకేసి తలబాదుకుంటున్న తల్లిని వెనక్కి లాగారు. ఆవిడ భోరుమని ఏడుస్తూ మళ్ళీ ఆ చాపమీదే పడింది.
రామ్మూర్తి మాడిపోయిన మొహంతో నెమ్మదిగా పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ పది నిమిషాలు తచ్చాడి, ఆఖరికి కూతురు కూర్చున్న అరుగు దగ్గిరకెళ్ళి నిలబడ్డాడు. ఏడుస్తున్న కూతురు అలికిడికి తలెత్తి చూసింది. ఆ గుడ్డి వెన్నెలలోనే కూతురి మొహం చూసి చలించిపోయాడు రామ్మూర్తి. ఆ కళ్ళ భయం, బెదురు, దీనత్వం, పాపభీతి చూసి అతని మనసు ద్రవించింది.
"అమ్మా లక్ష్మీ...." అన్నాడు కరిగిపోయి.
"నాన్నా!" అంటూ బావురుమంది లక్ష్మి. ఆశించని ఆదరణ కన్పించగానే.... తండ్రి చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.
"ఊరుకో అమ్మా.... ఊరుకో!" కంఠం పూడుకుపోగా ఎలాగో అన్నాడు.
"నాన్నా....నాన్నా...." ఏదో చెప్పాలని ఆరాటపడ్తూ ఎలా చెప్పాలో తెలియక కొట్టుకుంటూంది లక్ష్మి.
ఆ బాధ రామ్మూర్తికి అర్థం అయింది. "ఊరుకో అమ్మా.... ఏడవకు.... లే.... లేచి ఇంట్లోకి పద...." తండ్రినించి ఇంత ఆదరణ సానుభూతి లభిస్తుందని ఎదురుచూడని కూతురు దుఃఖం మరింత పెరిగింది. అంతా చెప్పుకుంటేగాని బాధ తగ్గదనిపించింది.
"నాన్నా.... నేను చెయ్యాలని ఆ పని చెయ్యలేదు నాన్నా...."
"సరే.... జరిగింది జరిగింది. ఇంక బాధపడి ఏం ప్రయోజనం...."
"కాదు నాన్నా చెప్పనీ నన్ను.... మూడు రోజులుగా ఎవరికి భోజనం లేదు. నిన్న ప్రొద్దుట త్రాగిన గుక్కెడు జావ తప్ప.... ఇవాళ అదీ లేదు.... అమ్మకసలు ఓపికలేదు, సరిగా భోంచేసి ఎన్నాళ్ళయిందో, శోష వచ్చినట్లు లేవలేక పడుకుండిపోయింది. చెల్లెళ్లు పాపం అలా ఆకలికి నీరసంగా వ్రాలిపోయారు.... తమ్ముడు.... వాడికి పాపం వారం నుంచి జ్వరమా.... ఇవాళ కాస్త తగ్గి.... ఆకలే అని గోలపెట్టాడు. ఇన్ని కాఫీ నీళ్ళయినా వాడికి ఈయడానికి డబ్బులు లేకపోయాయి.... పాపం ఆఖరికి ఓ బత్తాయి పండో, రెండు బిస్కట్లన్నా పెట్టమని గోలపెడుతూ ఏడ్చాడు. ఎవరిని అడిగినా ఓ అర్థ రూపాయన్నా ఈయలేదు. వాడేడుస్తూంటే అమ్మ ఏడుస్తూ కూర్చుంది. వాడు మొండిపట్టు పట్టి ఏదన్నా పెట్టమని ఏడుస్తూంటే అమ్మ చాతకాక వాడిని రెండు బాది, తననెత్తి బాదుకుంది.... నేను చూడలేకపోయాను నాన్నా.... ఎవరూ అప్పీయలేదని, ఆఖరికి పోనీ ఆ ఎదురింటి స్టూడెంట్ నడిగాను. ఓ ఐదో పదో బ్రతిమిలాడి తెద్దామని వెళ్ళాను నాన్నా.... అంతే నాన్నా, నిజంగా అందుకే వెళ్ళాను.... కాని అతను డబ్బు వూరికే ఈయనన్నాడు.... ముప్పై రూపాయలు చూపించి ఆశ పెట్టాడు.... ఆ డబ్బు చూస్తే నాకప్పుడేం తెలియలేదు.... ముప్పై రూపాయలతో.... ఎన్ని కొనవచ్చునన్న ఆలోచన తప్ప మరోటి రాలేదు. ఓ వారం కడుపునిండా తిండి వుంటుందని ఆశపడ్డాను.... ఏడుస్తున్న తమ్ముడికి పళ్ళు బిస్కట్లు అవి కొనవచ్చని పొంగిపోయాను.... అంతే తప్ప నే చేసేది తప్పన్న ఆలోచన రాలేదు.... చెప్పు నాన్నా.... నే చేసేది తప్పా?.... ఆకలితో చచ్చిపోతుంటే చూడలేక నే చేసిన పని తప్పా? అమ్మ తిట్టింది.... కొట్టింది.... ఇరుగు పొరుగు నానా మాటలన్నారు.... నేనేం చెయ్యను నాన్నా....
రామ్మూర్తి నిరుత్తరుడయ్యాడు.... కూతురు తల నిమురుతూ కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటూ వుండిపోయాడు.... కూతురు హృదయ విదారకంగా ఏడుస్తూ "చెప్పు నాన్నా.... నీవేనా చెప్పు నాన్నా.... నే చేసింది తప్పు కాదని నీవైనా అను నాన్నా!" అంటూంది.
"లేదమ్మా లేదు.... నీ తప్పేం లేదు తల్లీ.... పరిస్థితులన్నీ అలా వస్తే నీవేం చేస్తావు! మన రోజులు బాగాలేవు అమ్మా....నీ తప్పేంవుంది తల్లీ.... దోషమేమన్నా వుంటే అది నాది.... ఆ తర్వాత.... మనల్ని పుట్టించిన దేవుడిది.... కూతురు తల ప్రేమగా నిమురుతూ కన్నీళ్ళమధ్య అన్నాడు రామ్మూర్తి.
లక్ష్మి కళ్ళు మిలమిలలాడాయి.... "నిజంగా నే చేసింది తప్పు కాదా నాన్నా...." అంది అమాయకంగా.
"తప్పుకాదని నీవైనా అను నాన్నా.... నామీద కోపంలేదని అను నాన్నా...." అంటూంది.
"లేదమ్మా.... చూడు తల్లీ.... నిన్ను ఏ క్రూరజంతువో వెంటాడి తరుముకొస్తూ చంపాలని చూస్తూంటే నీవేం చేస్తావు! దాని బారినుంచి తప్పించుకోడానికి ఓపికున్నంత వరకు పరిగెడ్తావు.... ఏదో విధంగా తప్పించుకోడానికి ప్రయత్నిస్తావు.... ఆఖర్న ఏ ప్రయత్నమూ లాభంలేదని తెల్సినా చివరి క్షణం వరకు వంటరిగా ఎదురొడ్డి, పోరాడాలని ప్రయత్నిస్తావు గానీ.... ఎలాగో చస్తాం అని చేతులు ముడుచుకు ఆహుతి అవవు గదా!.... అలాగే యీ ఆకలి.... వాటిని మించిన క్రూరాతి క్రూరమైనది తల్లీ!.... ఆకలిని జయించినవాడు మనిషికాడు.... యీ ఆకలి తీర్చుకోడం కోసం మానవుడు పడరాని పాట్లు పడతాడు!.... దీని బారినుంచి తప్పించుకోడానికి ఎన్ని మార్గాలు అన్వేషించాలో అన్నీ అన్వేషిస్తాడు. ఆ బాధ తీర్చుకోడం కోసం మనిషి ఎంత హీనానికి, ఎంత నీచానికైనా దిగజారుతాడు.... మహామహులే జయించలేకపోయిన ఈ ఆకలిని నీవు.... నీలాంటివారు ఎలా జయించగలరు!.... నీవేం చేస్తావు.... దీని బారినించి తప్పించుకోడానికి నీకు చాతనయిన ఉపాయం వేదికావు అంతే తల్లీ.... అంతకంటే నీవు చేసిన నేరం ఏంలేదు.... రామ్మూర్తి దృఢంగా అన్నాడు.
"నాన్నా?" అంది లక్ష్మీ సంతోషంగా.
"లే అమ్మా.... ఇంక ఏడవకు.... లోపలికెళ్ళి భోజనం చెయ్యి...."
నాన్నా.... అమ్మ అన్నం తినలేదు నాన్నా.... దీనంగా అంది. రామ్మూర్తి గాఢంగా నిట్టూర్చాడు కూతుర్ని ఒప్పించినంత తేలిగ్గా భార్యని నమ్మించలేనని అతనికి తెలుసు! శుష్కహాసం చేసి "దాని పేగులు ఆకలితో మలమలమాడి ఏనాడో ఎండిపోయాయి.... దానికి ఆకలుండదు తల్లీ.... నీవెళ్ళి తిను.... పద.... అన్నాడు రామ్మూర్తి కూతుర్ని లేవదీసి ఇంట్లోకి పంపిస్తూ.
చాలాసేపు గడిచాక ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు రామ్మూర్తి. కూతురు చేసిన పని తప్పుకాదని చెప్పడం తప్పా రైటా అన్న మీమాంసలో ఆ రాత్రి రామ్మూర్తికి నిద్రపట్టలేదు.
(ఆంధ్రజ్యోతి వారపత్రిక 1972)
* * * *