హుండీని వూపితే గలగలా శబ్దం వస్తోందిగానీ, ఒక్క నాణెమూ కిందపడలేదు. ఇక లాభం లేదని దానిని పగులకొట్టాడు. అన్నీ అయిదు పైసల బిళ్ళలే. మూలకొకటి చెదిరాయి.
అన్నిటినీ చేతిలోకి తీసుకుని లెక్కపెట్టాడు. యాభై అయిదు పైసలున్నాయి. కవర్ యాభైపైసలే. మరో ఐదుపైసలు రాజాకు లంచం ఇచ్చి తెప్పించుకోవచ్చని పైకి లేచాడు.
బయటికొచ్చి రాళ్ళపల్లి ఇంటి ముందు చూశాడు.
కింద శ్యామల, స్వప్న ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు.
"ఇదిగోనే అమ్మా! నువ్వు నా మ్యాచింగ్ విషయంలో తలదూరిస్తే ఎదురుగ్గా ఉన్న టైలర్ తో లేచిపోతాను. లేదూ బొత్తాములు కుడతాడే చూడు ఆ కుంటి కుర్రాడితో లేచిపోతాను. సరేనా?" స్వప్న అన్నది వినిపించింది నరేష్ కు.
దాంతో శ్యామల భయపడిపోయి, తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని "నీ ఇష్టం, నీకు నచ్చినట్టు నువు తయారవ్వు" అని అతను డాబా మీద వున్నట్టు గ్రహించి తలపైకెత్తి కూతురిపై అతనికి ఫిర్యాదు చేసింది.
"చూడూ బాబూ! ఇదేం మ్యాచింగ్ పిచ్చో నాకర్థంకావడం లేదు. తను తెల్లటి డ్రస్ వేసుకున్నదని లిప్ స్టిక్ కూడా తెలుపురంగులోనే కావాలంట."
నరేష్ హాయిగా నవ్వాడు.
"రాజా వున్నాడా ఆంటీ?"
"వున్నాడు నాయన. పంపిస్తాను" అని చెప్పి లోపలికెళ్ళింది ఆమె.
రాజు రాగానే "ఇన్ లాండ్ కవర్ ఒకటి తీసుకో. అయిదు పైసలు మిగులుతాయి. అది నువ్వు తీసుకో" అని ఐదుపైసల బిళ్ళల్ని వాడిచేతిలో పోశాడు నరేష్.
"నేను వెళ్ళను అంకుల్! అన్నీ ఐదుపైసల బిళ్ళలే. వీటిని పోస్టాఫీస్ లో యిచ్చి కవర్ యివ్వమంటే నేనేదో ముష్టివాడిననీ, నాకు ఈ బిళ్ళలన్నీ కలెక్షన్ లో వచ్చాయనీ అనుకుంటారు. ఇస్తే అర్థరూపాయి బిళ్ళ యివ్వండి. లేకపోతే నేను తెచ్చి యివ్వను. నువ్వే తెచ్చుకో" అన్నాడు వాడు సీరియస్ గా.
ఆ నాణేల్ని తన ముఖంమీద కొడతాడేమోనని భయపడుతున్న నరేష్ అలా జరగకపోయేసరికి కాస్తంత స్థిమితపడి "ఏం చేద్దాం రాజా! వున్నవి అవే. ఎలాగో సర్దుకో! నా బుజ్జిగదా! అర్జెంట్ గా కవర్ తెచ్చిపెట్టు" అని వాడి గడ్డం పట్టుకుని బ్రతిమాలాడు.
సరేనన్నట్టు వాడి తల వూపి అయిష్టంగానే బయలుదేరాడు.
నరేష్ కవర్ తో తను యింతక్రితం అనుకున్న రెండు లైన్ లూ రాశాడు. కింద సంతకం కానీ, పైన సంబోధన ఏమీ రాయకుండా అలానే అతికించి, అడ్రస్ రాశాడు.
దాన్ని పోస్టు చేయమని రాజాకు చెప్పడానికి అయిదుపైసలు లేకపోవడంతో తనే పోస్టాఫీస్ కి బయలుదేరాడు.
ఫర్లాంగు దూరం నడిచి, ఉత్తరాన్ని డబ్బాలో పడేసి, తిరిగివచ్చి ఇంటి గేట్ తీస్తుండగా పూర్ణానందం ఇంట్లోంచి వచ్చాడు.
"ఎక్కడికెళ్ళావు బాబూ? నీకోసమే ఎదురుచూస్తున్నాను" అన్నాడు సిగరెట్ దమ్ము లాగుతూ.
"పోస్టాఫీస్ కి వెళ్ళి వస్తున్నానండీ!"
"నీకు ఏదో కవర్ వచ్చిందయ్యా! ఇప్పుడే పోస్టుమాన్ యిచ్చి వెళ్ళాడు" అని గోధుమరంగు కవరు అందించాడు పూర్ణానందం.
ఆ కవర్ ను చూడగానే నరేష్ గుండె వేగంగా కొట్టుకుంది.
కొంపదీసి రజనీ కూడా తను రాసినట్టే, తనకు ఉత్తరం రాసిందా అన్న ఆలోచన అతన్ని వూపేసింది. వణుకుతున్న చేతుల్తో కవరును తీసుకున్నాడు.
అర్థంలేని టెన్షన్ తో ఒళ్ళంతా తూలిపోతుండగా కవర్ చించాడు. అందులోని లెటర్ ని చూడగానే అది రజనీ నుంచి వచ్చింది కాదని తెలియడంతో నిరుత్సాహం ఆవరించి, లెటర్ చదివాక ఆనందంతో ఎగిరి గంతేసాడు.
"ఏదయినా శుభవార్తా?" పూర్ణానందం అడిగాడు నరేష్ వాలకాన్ని చూసి.
"అవునండీ! స్మిత ఎక్స్ పోర్టింగు కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది."
"మరి చెప్పవేం! శుభవార్త చెవిన పడేశావ్! ఈ శుభ సందర్భంలో తాగే సిగరెట్ మరీ అద్భుతంగా వుంటుంది" అని మరో సిగరెట్ వెలిగించాడాయన.
"వస్తానండి" అని పూర్ణానందంతో చెప్పి మెట్లెక్కుతున్న నరేష్ కి వెంటనే ఓ అనుమానం వచ్చింది.
ఇంటర్వ్యూ జరిగిన యిన్ని రోజులకి తనకు ఉద్యోగం ఎలా వచ్చిందా అన్నదే అతని సందేహం. అందునా తన ఇంటర్వ్యూలో చెప్పింది యేమీ లేదు. మరెలా తనకు ఉద్యోగం యిచ్చారని అతను ఆలోచనలో పడిపోయాడు.
అప్పుడు గుర్తొచ్చింది అతనికి రజని రెండుసార్లు తనను ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళిందీ అడగడం.
రజనీనే ఈ ఉద్యోగం యిప్పించిందని అనిపించడంతో అతని ఆనందం రెట్టింపయింది.
అయితే అతను వూహించింది తప్పు. అతనికి ఆ ఉద్యోగం ఇప్పించింది స్మిత. ఆ కంపెనీ యజమాని మారుతీరావు భార్య.
* * * * *
టైమ్ పదకొండు గంటలయింది. సూర్యుడు నిప్పుల కళ్ళెంలా కాగిపోతున్నాడు. ఎండ చురచురమంటూ నడినెత్తిని కాల్చేస్తోంది. గాలి వేడిగా తగుల్తోంది. చెట్టుమీద వాలిన కాకులు ఎండకు బెదిరి పదేపదే అరుస్తున్నాయి.
వేలు గసపోసుకుంటూ వచ్చి ఓ చెట్టుకింద కూర్చున్నాడు. నీడలో కూర్చోవడంతో ప్రాణం శాంతించింది అతనికి. ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు. పైసా ఆదాయం లేని ఈ పోస్టుమాన్ ఉద్యోగానికి యూనిఫారమ్ ఒకటి అనుకుంటూ తన బట్టలను దులుపుకున్నాడు. చెమటకు నానిన బట్టలు మెత్తగా మేకచర్మంలా వున్నాయి.
కొద్దిసేపు ఎండను తిట్టుకున్నాక, తీరిగ్గా తన పోస్టుబ్యాగ్ అందుకున్నాడు. అందులో కవర్లు, కార్డులు, ఎన్ వలప్ లు బోలెడున్నాయి.
కవర్లను, ఎన్ వలప్ లను పక్కకుబెట్టి కార్డులను అందుకున్నాడు.
మొదటగా పైనున్న కార్డును చదవడం మొదలుపెట్టాడు.
చిరంజీవి వెంకట్రామయ్యకు దశరధరామ్ నమస్కరించి వ్రాయునది. ఇక్కడంతా క్షేమం. మీరూ క్షేమమని తలంచుతున్నాను. ఇక్కడ ఒకటే వాన. అక్కడ వానలు కురిశాయా? చెల్లెలు ఆరోగ్యం జాగ్రత్త! నేను మీ వూరు వచ్చినప్పుడు కలుస్తాను ఇంతే సంగతులు.