సమాధానం చెప్పలేక గుండె లోతుల్లో పేరుకుపోయిన బరువైన బాధ కరిగి కన్నీరయ్యేవరకు, తనివితీరా ఏడ్వాలని వుందామెకు ఆ క్షణాన.
అది వివేక్ స్థయిర్యాన్ని మరింత దిగాజార్చుతుందని ఊహించబట్టే చటుక్కున వెనుదిరగబోతూ, అతని చేతి వేళ్ళమీద తన పెదవుల్ని ఒక్క క్షణం వుంచి ఆ మరుక్షణంలో వేగంగా ఆ గదిలోంచి వెళ్ళిపోయింది.
ఆమె ప్రవర్తనకు విస్తుపోయాడు వివేక్.
వరదప్రవాహమై ప్రవహించబోయే దుఃఖాన్ని తను చూడకూడదనే అలా వెళ్ళిపోయిందని ఆపైన అర్ధం చేసుకున్నాడు అతను.
* * * *
"శభాష్! చెరొక కవర్ ని సంపాదించుకున్నారు. ఇంకా సంపాదించుకోవాలని లేదా?" రామదాసు అడిగాడు.
"ఉంది గురువుగారూ! చెప్పండి- మేం ఏం చేయాలో?" ఒకేసారి అడిగారు చిదంబరం, నిరంజనం.
"సింపుల్...." అని వాళ్ళని దగ్గరకు రమ్మని సైగచేసి వాళ్ళ చెవుల్లో ఏదో చెప్పాడు.
ఆ మరుక్షణం వాళ్ళ ముఖాలు వెలిగిపోయాయి.
* * * *
సాయంత్రం ఆరున్నర గంటల సమయం....
వేరే ఇద్దరు ఖైదీల్ని తీసుకొని వివేక్ వున్న సెల్ దగ్గరకు వచ్చాడు నిరంజనం.
వివేక్ ఆశ్చర్యపోయి చూస్తుండగా....
"మరో పన్నెండుమంది కొత్త ఖైదీలు ఈ జైలుకొచ్చారు. వారిని విడిగా వుంచటానికి గదులు లేవు. అందుకే ఈ రాత్రికి ఈ యిద్దరు ఖైదీలూ నీ గదిలోనే వుంటారు" అని అంటూ వివేక్ సెల్ తలుపులు తెరిచి, ఆ యిద్దర్ని లోనికి నెట్టి యథావిధిగా తాళం వేసుకొని వెళ్ళిపోయాడు నిరంజనం.
* * * *
జైలునుంచి సరాసరి జూబ్లీహిల్స్ ఎక్స్ టెన్షన్ పల్లవీ ఎన్ క్లేవ్ కి బయలుదేరింది మనోజ్ఞ.
అది తను అద్దెకుంటున్న కాలనీకి దగ్గర్లో వున్న కాలనీయే. వివేక్ వున్నది జూబ్లీవేలీ ఎన్ క్లేవ్.
సుచిత్ర తల్లిదండ్రులుంటున్నది ఆ పక్కనే వున్న పల్లవీ ఎన్ క్లేవ్ లో, ఆ పక్కనే తనుంటున్న సూర్యాక్లేవ్....
మూడు కాలనీలు పక్కపక్కనే వుండటం యాదృచ్చికమేమో....?
ఆటో శరవేగంతో దూసుకుపోతోంది.
మనోజ్ఞ ఆలోచనలు అంతకంటే వేగంగా పరిగెడుతున్నాయి.
తను రెండోసారి వివేక్ ని కలిసేందుకు జైలుకెళ్ళినప్పుడు- సుచిత్రని తను రేప్ చేసి చంపలేదని, అసలు తనెవర్నీ రేప్ చేయలేదని, చంపలేదని చెప్పాడు.
కనీసం సరదాకి కూడా అబద్ధాలు చెప్పడం చేతకాని అతను చెప్పేది అక్షరాలా నిజమే.
సుచిత్ర రేప్ కి గురికాబడి, చంపబడిందన్నది నిజం....మరది చేసిందెవరు?
ఆలోచనల్లో వుండగానే మనోజ్ఞ ఎక్కిన ఆటో, కావూరిహిల్స్ ని క్రాస్ చేసి పల్లవీ ఎన్ క్లేన్ లో ప్రవేశించింది. ఆటోని వుండమని దిగింది ఆమె.
అది కొత్త కాలనీ....ఒకదానికొకటి పోలికేలేని అద్భుతమైన భవనాలున్నాయా కాలనీలో.
వివేక్ కేసుని మొదటినుంచి చివరివరకు ఫాలో అయిన 'వార్త' దినపత్రిక క్రైమ్ రిపోర్టర్ హరికుమార్ సూచనలు గుర్తుకురాగా, చటుక్కున ఆగి అటూ ఇటూ చూసింది.
చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారణ చేసుకోగానే గబుక్కున ఓ ఇంటి మలుపులో వున్న చీకటి ప్రదేశానికి చేరుకుంది. వేనిటీబేగ్ లో వున్న పల్చటి బురకాని బయటకు తీసి క్షణాల్లో వేసుకుంది.
అప్పుడు తనకు తాను సంతృప్తిపడి, బయలుదేరింది. దారిలో ఎదురైన ఎవరినో సుచిత్ర యింటి అడ్రస్ అడిగి తెలుసుకుని ముందుకు కదిలింది.
సుచిత్ర ఇల్లు దగ్గరపడుతుండగానే వేనిటీబ్యాగ్ లోంచి సోనీ మైక్రో కేసెట్- కార్డర్ ఎమ్-330 బయటకు తీసి ఎడం చేతిలో వుంచుకుంది.
వేనిటీబ్యాగ్ ని కూడా ఎడంచేతిలోకే మార్చుకుంది.
ఇప్పుడెవరికీ ఆమె దగ్గర మైక్రో కేసెట్ - కార్డర్ వుందని తెలిసే అవకాశం లేదు.
ఇల్లు దగ్గరవుతుండగానే ఆశ్చర్యపోయింది.
ఇంట్లో విద్యుత్ కాంతి పట్టపగల్లా ప్రకాశిస్తోంది. ఇల్లంతా జనంతో సందడిగా వున్నట్లు తోచింది.
ఇంటిముందున్న చిన్న గేట్ ని తెరుచుకొని లోపలకు వెళ్ళి పరిసరాల్ని పరిశీలనగా చూసింది.
అదొక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇల్లులా వుంది.
మహా వుంటే మూడు బెడ్ రూమ్స్ వుంటాయేమో....ఇల్లంతా రిచ్ గా లేదు.
వాళ్ళతో ఎలా ప్రొసీడ్ అవ్వాల్సిందీ ముందుగానే ప్రిపేర్ అయివుండడంతో ధైర్యంగా కాలింగ్ బెల్ ని ప్రెస్ చేసింది మనోజ్ఞ.
ఒకింత సేపటికి ఒక యువకుడు వచ్చి తలుపు తెరిచి ఎవరన్నట్లు ప్రశ్నార్ధకంగా చూశాడు.
అతను ఆమెను లోపలకు రమ్మన్నట్లుగా సంజ్ఞచేస్తూ దారిచ్చాడు.
ఆ హాల్లోకి వెళుతూనే ఆమె ఆశ్చర్యపోయింది.
ఆమె ఒక్కక్షణం తను చూస్తున్నది కలో- నిజమో నమ్మలేక అలాగే నిశ్చలంగా వుండిపోయింది.
అక్కడున్న డజనుమంది ప్రపంచంలోని ఆనందమంతా తమ స్వంతమన్నట్లు తుళ్ళిపడుతున్నారు.
అదెలా సాధ్యం....?
సుచిత్ర చనిపోయి ఆరు నెలలే అయింది.
విషాదం తాలూకు ఛాయ ఏమాత్రం లేకపోగా ఆనందమా....?
అంతలో ఆ యువకుడే....
"మీరెవరు? మీకేం కావాలి?" అనడిగాడు.
"నేను సుచిత్రకి ఫ్రెండ్ ని! పేరు ఫాతిమా బేగమ్. మేం బి.ఎస్సీ కంప్యూటర్ సైన్స్ లో సెంట్ ఏన్స్ కాలేజీలో క్లాస్ మేట్స్ మే కాదు. మంచి స్నేహితులం. వన్ ఇయర్ గా నేను హైదరాబాద్ లో లేను. దుబాయ్ వెళ్ళాను. నిన్ననే వచ్చాను. ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను" అంది మనోజ్ఞ. అక్కడున్నవారి ముఖకవళికల్ని పరిశీలనగా చూస్తూ.
అప్పటివరకు సందడిగా వున్న వాతావరణం ఒక్కసారి గంభీరతను సంతరించుకుంది.
* * * *
ఒక నడివయస్కుడు, నడివయస్కురాలు మనోజ్ఞ దగ్గరకు వచ్చారు.
"వీళ్ళే మా పేరెంట్స్! నేను సుచిత్ర తమ్ముడ్ని. మా అక్క...." అని ఆ యువకుడేదో చెప్పబోతుండగా ఆ నడివయస్కుడు సుచిత్ర తండ్రి, కొడుకుని కళ్ళతో గద్దించాడు. "మా అమ్మాయికి ఫాతిమాబేగమ్ పేరుతో ఫ్రెండెవరూ లేరే?" అన్నాడాయన సాలోచనగా.
ఒక్కక్షణం అనుమానించింది మనోజ్ఞ. కొడుకునెందుకు వారించాడు? పోలీస్ డిపార్ట్ మెంటని భయపడి వుంటాడా....?
"మీకు చెప్పడం మర్చిపోయుంటుంది. మా క్లాస్ లో నలభైమంది స్టూడెంట్స్ వుండేవారు. ఎంతమంది పేర్లని చెబుతుంది....?" మనోజ్ఞ చేతిలోకి మైక్రో కేసెట్ కార్డర్ ఎప్పుడో ఆన్ అయిపోయి దాని పనది చేసుకుపోతోంది.
"నాక్కూడా ఎప్పుడూ మా అమ్మాయి నీ గురించి చెప్పలేదే?" సుచిత్ర తల్లి అనుమానాస్పదంగా చూస్తూ అడిగింది.
"చెప్పనంతమాత్రాన ఫ్రెండ్ ని కాకుండా పోతానా? దాన్నే పిలవండి- అదే చెబుతుంది. అయినా మీకేదో లాభం చేకూరుద్దామని వస్తే ఈ ప్రశ్నలన్నీ ఏమిటి పోలీసువాళ్ళలా....?" చిరాకును నటించింది మనోజ్ఞ.
సుచిత్ర తండ్రి ఒకసారి విస్తుపోయి మనోజ్ఞ వైపు చూసి- ఆపైన తల తిప్పి వెనక్కి చూశాడు.
అక్కడికి పదడుగుల దూరంలో నలుగురు వ్యక్తులు ఏదో మాట్లాడుకుంటూ, జోకులేసుకుంటూ కనిపించారు.
సుచిత్ర తండ్రి గబుక్కున వరండాకేసి నడుస్తూ- "అక్కడ వారికి డిస్టబెన్స్....వరండాలో మాట్లాడుకుందాం రామ్మా...." అన్నాడు బయటకు నడుస్తూ.
నలుగురూ వరండాకేసి కదిలారు.
"నువ్వెందుకు....? నువ్విక్కడే వుండు. వాళ్ళను ఇటు రాకుండా చూడు" అని కొడుక్కి చిన్నగా చెప్పి ముందుకు నడిచాడాయన.
ఆయన ప్రవర్తనకి విస్మయపడింది మనోజ్ఞ. మనోగ్న్, సుచిత్ర తల్లిదండ్రులు కొద్ది క్షణాలకు వరండాలో వున్నారు.
మనోజ్ఞ మాట్లాడబోతుండగా....
"ఒక్కక్షణం...." అని ఆయన తలుపుని దగ్గరకు లాగి- "ఏం లాభం....?" అడిగాడాయన ఆశగా.
చేప గాలానికి చిక్కింది. అదను చూసి పైకి లాగాలి.
"ఏం లేదు....నేను, సుచిత్ర కలిసి ఒక జాయింట్ ఎకౌంట్ ని మెహిదీపట్నం సిండికేట్ బ్యాంక్ లో డిగ్రీ మొదటి సంవత్సరమే ఓపెన్ చేశాం. కష్టపడి మాకై మేమే కొంత సంపాదించుకోవాలని- అమెరికన్ యూత్ లా ఆత్మాభిమానంతో ఎదగాలని నిర్ణయించుకొని కాలేజీలో, ఖాళీ సమయాల్లో హేండీక్రాఫ్ట్స్ చేస్తూ, ఇద్దరం నలభయ్ వేల వరకు బ్యాంకులో జమ చేశాం.
అడలాగే మర్చిపోయాం.
ఇప్పుడు డబ్బవసరం వచ్చింది నాకు. మా దీదీ అవసరాల్లో వుంది. నా సగం నేను విత్ డ్రా చేసి మా దీదీకి సహాయం చేయాలి. అది చేయాలంటే ఎకౌంట్ క్లోజ్ చేయాలి. ఎకౌంట్ క్లోజ్ చేయాలంటే సుచిత్ర సంతకం కూడా కావాలి. అందుకే వచ్చాను." గాల్లోకి ఒక బాణాన్ని సంధించింది మనోజ్ఞ.