Previous Page Next Page 
నిశీథి నియంత పేజి 18

    అతను జవాబివ్వలేదు. థిలాసాగా నవ్వాడు.

    దాంతో చిదంబరానికి కూడా చిర్రెత్తుకొచ్చింది.

    "ఖైదీవయ్యుండి తోటి ఖైదీల్ని కొడతావా?" గర్జిస్తున్నట్లుగా అడిగాడు.

    "వాళ్ళు నాలుగు తన్నితే వీడికే అర్ధమయిపోతుందని మీరనలేదూ? అంటే....వాళ్ళు నన్ను తన్నితే తప్పులేదా....? తన్ని నాలో వాళ్ళ పని చేయించుకుంటే తప్పులేదన్నమాట? అదే నేను చేస్తే తప్పయిందా....?" రెట్టించి అడిగాడు వివేక్.

    "తప్పా....తప్పున్నరా? ఈ విషయం సూపరింటెండెంట్ గారికి తెలిస్తే నీ బతుకేమవుద్దో తెలుసా?"

    "అప్పుడు మీ బతుకూ ఏదో ఒకటి అవుతుంది"

    "ఏం బెదిరిస్తున్నావా దొంగ....నా...."

    "చంపేస్తాను. నీ నోటివెంట ఆ మాట వచ్చిందో నిలువునా చీరేస్తాను. మాకు కాపలా కాస్తున్నందుకేరా మీకా గన్స్, యూనిఫామ్స్.... జైలుని ప్రశాంతంగా వుంచడానికేరా మీకు జీతాలిచ్చేది. బూతు మాటను చూస్తాను....అను...." రెచ్చిపోతూ మీద మీదకు వస్తున్న వివేక్ ని చూసి ఖైదీలతోపాటు సెంట్రీలు కూడా దిమ్మెరపోయారు.

    "మమ్మల్ని రా అంటావా?" నిరంజనం పళ్ళు నూరుతూ అన్నాడు.

    "ఏం? మీరు మమ్మల్ని అనగా లేంది- మేం అంటే తప్పా? మీరు మమ్మల్ని తిట్టగా లేంది మేం తిడితే తప్పా....? మీ బాబుల సొమ్ము తెచ్చి జైలుని పోషిస్తున్నారా? లేక మా మూలంగానే మీకీ ఉద్యోగాలొచ్చాయా? తాట వలిచేస్తాను నోరు సంభాళించుకోకపోతే...." అని ఆ ఖైదీల వైపు తిరిగి "ఏంటిరా చూస్తారు? నా మడిలో పని మొదలెట్టండి" అని హుంకరించాడు వివేక్.

    "పిల్లిని గదిలోపడేసి కొడితే చిరుతపులయిపోతుంది....ఇప్పుడదే జరిగింది. వాళ్ళ చావు వాళ్ళు చస్తారు. మనం పోదాం పద...." అన్నాడు చిదంబరం నిరంజనం చెవిలో.

    ఆ మరుక్షణం సెంట్రీలు ఇద్దరూ అక్కడ్నుంచి చల్లగా జారుకున్నారు.

    ఆ ఖైదీలిద్దరూ కుక్కిన పేనులా వివేక్ మడిలో వంగారు.

    వివేక్ ఆలోచనల్లో పడిపోయాడు.


                          *    *    *    *


    లంచ్ టైమ్ లొ జరిగిందంతా రామదాసుకి చెప్పాలని ఎంతగానో ఆరాటపడ్డాడు వివేక్.

    కానీ రామదాసు పత్తాలేడు.

    ఎంక్వైరీ చేయగా రామదాసుకి ఆరోగ్యం కొద్దిగా పాడైతే సెల్ కే లంచ్ పంపించారని తెలిసింది.

    ఆ లంచ్ టైమ్ లో అతని చేతిలో తన్నులుతిన్న ఆ ఖైదీలు ఇద్దరూ భయం భయంగా తనకు దూరంగా మసలటం గమనించాడతను.

    సరిగ్గా జస్పాల్ అటుగా వెళుతుండటం చూసిన వివేక్ అతడ్ని తన దగ్గరకు రమ్మన్నట్లుగా కళ్ళతోనే సైగ చేశాడు.

    జస్పాల్ భయపడుతూ అతని దగ్గరకు వచ్చాడు.

    "నీ లంచ్ నాకిచ్చి మారుమాట్లాడకుండా వెళ్ళిపో" అన్నాడు జబర్దస్తీని ప్రదర్శిస్తూ.

    ఆ మరుక్షణమే జస్పాల్ తన ప్లేట్ లోని అన్నాన్ని వివేక్ ప్లేట్ లోకి వంపి, నమస్తే పెట్టి పరుగులాంటి నడకతో ఆ ప్రాంతం నుంచి అదృశ్యమైపోయాడు.

    తిరిగి ఆలోచనల్లోపడ్డాడు వివేక్.


                                                                       *    *    *    *


    సాయంత్రం నాలుగున్నర అయింది.

    విజిటర్స్ ని జైల్లోకి అనుమతిస్తున్నారు.

    మనోజ్ఞ లోపలకు వచ్చి వివేక్ కి కబురుపెట్టింది.

    అతను బయల్దేరపోతూ క్షణం ఆగాడు. "ఎలా వుంది మీకు. డాక్టర్ వచ్చి చూశారా?" సెల్ లో అటుతిరిగి పడుకొనివున్న రామదాసునుద్దేశించి అడిగాడు వివేక్.

    "ఆఁ....మామూలు జ్వరమేలే! బ్రతికున్నరోజుల్లో ఈ శరీరాన్ని ఎన్ని హింసలకు- ఎన్ని రకరకాల ఆహారాలకు- ఎన్ని కాళరాత్రులకు బలి చేశాను....? దాని ఫలితంగా రెసిస్టన్స్ ని కోల్పోయింది పాపం పిచ్చి శరీరము....ఓడిపోయిందయ్యా! నాతో వేగలేక నా శరీరం ఓడిపోయింది.... నేనూ ఓడిపోయాను. నా శరీరమూ ఓడిపోయిందయ్యా! ఏదో కబురొచ్చిందనుకుంటా! ఎవరో వచ్చుంటారు నీ కోసం. వెళ్ళిరా...." అన్నాడు అటు తిరిగే.

    కొద్దిక్షణాలు అక్కడే ఆగాడతను.

    నా అన్నవాళ్ళు లేరు. కనీసం తనకు తన తల్లి, ఒకప్పటి ప్రియురాలు, మేనమామయినా వున్నారు!

    ఇతనికి....? ఎవ్వరూ లేరు. ఒంటరిగా, అనారోగ్యంతో బాధపడుతూ- తీరని పగా, ప్రతీకారాలతో, అవమానభారంతో రోజులను లెక్కించుకుంటున్నాడు. ఇతనికి తను ఏదో ఒకటి చేయాలి. అన్ని రోజుల తర్వాత తొలిసారి ఒక నిర్ణయానికొచ్చి విజిటర్స్ హాల్ వైపు సెంట్రీవెంట బయలుదేరాడు.


                          *    *    *    *


    మనోజ్ఞ ఒంటరిగా బెంచీమీద కూర్చుని ఎటో చూస్తోంది.

    తనీమెకు చేసిన మేలేమిటి....? ఏమీ లేకుండా కూడా ఇంతగా తపిస్తారా? మానవ సంబంధాలు ఒక్కోసారి ఎంత గొప్పగా కనిపిస్తాయి?!

    అడుగుల చప్పుడికి మనోజ్ఞ తలెత్తి వివేక్ వైపు చూసింది.

    "బాగున్నావా మనూ?" ప్రేమగా అడిగాడతను.

    అతన్ని ఆ జైల్లో బంధించాక ఆమె అక్కడకు రావటం అది ఐదోసారి.

    "నువ్వు బాగున్నావా?" ఆమె కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు.

    "నీ నిర్దోషిత్వాన్ని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను. దయచేసి నా ప్రశ్నలకు ఈసారయినా పూర్తిగా సమాధానాలు చెప్పవా? ప్లీజ్...." ఆమె అర్దిస్తున్నట్లుగా అడిగింది.
   
    అతని కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.

    తనపట్ల అంత ప్రేమ, ఆప్యాయతల్ని కురిపిస్తున్న ఆమెకు తను చేసిందేముంది? ఏం చేస్తే మాత్రం ఋణం తీరుతుంది?

    "నాకు విడుదలవ్వాలని, అవగలననే నమ్మకం లేకపోయినా- నీ కోసం చెబుతాను. అడుగు...." అన్నాడు ఆమెకు కనిపించకుండా కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ.

    ఇనుప ఊచల్లోంచి తన సన్నని వేళ్ళని జొనిపి అతని చేతిని స్పర్శించిందామె.

    అది దేవత హస్తమేమో అన్నట్లుగా ఫీలయ్యాడతను.

    "నీకు, సుచిత్రకి మధ్య ఘర్షణ జరిగిందా?" నెమ్మదిగా అడిగింది ఆమె.

    "జరిగింది"

    "అది పదిమందికీ తెలుసా?"

    "తెలిసిపోయింది"

    ఆమె సడన్ గా ఆగిపోయింది ప్రశ్నలు అడుగుతూ, అడుగుతూ, ఏదో....ఏదో మార్పు అస్పష్టంగా అతని ముఖంలో, మాటల్లో కనిపిస్తోంది. అదేమయుంటుంది? అని ఒక్కక్షణమే ఆలోచించింది ఆమె.

    పరిశీలనగా అతని కళ్ళలోకి చూసి, తరచి అడిగుంటే ఆ మార్పు దేనివల్లననేది చూచాయగానైనా పసిగట్టగలిగేదామె.

    గతంలో ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక నిరామయముగా చూసిన వివేక్ లో ఆ మార్పెలా వచ్చిందని ఆమె ఆలోచించి వుంటే ముంచుకురాబోతున్న పెనుప్రమాదాన్ని వూహించగలిగేదే!

    ఆమెకు జైల్లో ఏం జరుగుతున్నదీ తెలీదు.

    రామదాసు గురించి అంతకంటే తెలీదు.

    వాళ్ళమ్మ ప్రయత్నం గురించి అసలే తెలీదు.

    తెలిసుంటే కథ మరో మలుపు తిరిగేదేమో!

    "నీ కేసుని వాదించిన లాయర్ పేరు?"

    "ఆదిరెడ్డి" అంటూ పళ్ళు కొరికాడు.

    అతను పళ్ళు కొరకటాన్ని ఆమె ఆ సంభాషణల్ని టేప్ చేసే పనిలోపడి గమనించలేదు.

    "సుచిత్ర తల్లిదండ్రుల అడ్రస్?"

    చెప్పాడు అతను.

    "నీ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన ఎస్.ఐ. పేరు?"

    "దీక్షిత్...."

    "ప్రధాన సాక్ష్యం?"

    "కేశవమూర్తి....అబద్దాలకోరు"

    "దీక్షిత్ పై ఆఫీసర్ ఎవరు?"

    "సి.ఐ. పద్మనాభన్"

    "రేప్ చేసిన వ్యక్తి పేరు?"

    "తెలీదు"

    "చంద్రనాథ్ కావచ్చా?"

    "అవకాశాలున్నాయి"

    "నీకు ది గ్రేట్ క్రిమినల్ లాయర్ భూషణరావు గురించి తెలుసా?"

    "తెలుసు"

    "తెలిసే ఆదిరెడ్డి దగ్గరకెళ్ళావా?"

    "ఖర్మ అలా రాసిపెట్టి వుంది."

    ఆమె గుండె లోతుల్లో ఎవరో గునపాలు దింపినట్లుగా విలవిల్లాడింది అతని మాటల్లోని నిర్వేదాన్ని గమనించి.

    రాబోతున్న దుఃఖాన్ని దిగమింగుకునే ప్రయత్నంలో పెదవిని పంటికింద నొక్కిపట్టి గట్టిగా కళ్ళు మూసుకుంది. మూసుకున్న కనురెప్పల మధ్యనుంచి రెండు నీటిబొట్లు నిశ్శబ్దంగా రాలి వివేక్ చేతులమీద పడ్డాయి.

    'మనూ బయటకు రాగలిగితే ఎంత బావుణ్ణు....' ఆమె హృదయం ఒక్కక్షణం ఆవేదనకు గురయింది.

    "నేను బ్రతుకుతానంటావా?" వివేక్ ప్రశ్నకు ఆమె విలవిల్లాడింది.

 Previous Page Next Page