Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 19

    పరస్పర పరిచయాలయిన తరువాత, ముగ్గురూ మామూలుగా అయిపోయారు. పలురకాల కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు.

    "మీరిద్దరూ మాట్టాడుకుంటూ కూర్చోండి! నేను ఇప్పుడే వస్తాను." అంటూ ఛటర్జీ లోపలి వెళ్ళాడు.

    ఛటర్జీ అక్కడ లేకపోవటంతో వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడాలనుకున్నారు.

    ఏవేవో మాటలు వాళ్ళ మధ్య దొర్లాయి. షాలిని గురించి ఛటర్జీ గురించి మాట్లాడుకున్నారు.

    వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ వుండగానే, ట్రేలో మూడు కప్పులు పెట్టుకుని వేడివేడి కాఫీతో వచ్చాడు ఛటర్జీ.

    "ఇప్పుడు మీరు చేశారా అంకుల్ కాఫీ! నాతో చెబితే క్షణంలో తయారుచేసి తీసుకువచ్చేదాన్ని కదా!" బబిత నొచ్చుకుంటూ అంది.

    "నా చేత్తో కాఫీ ఇవ్వాలనిపించిందమ్మా! వేడి కాఫీ త్రాగుతూ, తియ్యతియ్యగా మాట్లాడుకుందాం!" చెరో కప్పు అందిస్తూ ఛటర్జీ అన్నాడు.

    ఆ తరువాత.

    బబిత అరగంట కూర్చుని లేచింది వెళ్ళటానికి.

    "నీ రాకతో ఈరోజు మంచి కాలక్షేపం అయిందమ్మా బేబీ!" అన్నాడు ఛటర్జీ.

    ఛటర్జీ వినయంగా బాగా స్వరం తగ్గించి మనోజ్ "నాక్కూడా చాలా హేపీగా వుంది!" చిలిపిగా అన్నాడు.

    నాకూనూ! అనబోయింది బబిత.

    మనోజ్ కళ్ళల్లో చిలిపితనం చూసి వుత్త "థాంక్స్!" అంటూ వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది బబిత.


                                         14


    ఉన్నట్లుండి ఆ యింట్లో వాళ్ళంతా పోలీసు కుక్కల్లా మారిపోయారు.

    ఆ యింట్లో మనుషుల విషయం చూస్తే తలకొక పార్టీ, తలావొక సొంతగది వున్నాయి. అందరికీ కలిపి ఆ యింట్లో పెద్దహాలు. ఆ అసెంబ్లీ హాలులాగా మారిపోయింది.

    ఎన్నో రోజుల చర్చలూ, సమావేశాలు తరువాత.

    కేంద్రంలో వున్న వారిని గద్దెదింపటానికి అన్ని రాష్ట్రాల వాళ్లూ తాత్కాలికంగా ఒకమాట మీద నిలబడ్డట్లు, బోసుబాబు చర్యలని కనిపెట్టటానికి, తాత్కాలికంగా అంతా ఏకమయ్యారు.

    బోసుబాబు అసలు కథా కమావిషు ఏమిటో తెలుసుకోవాలని వాళ్ళల్లో ప్రతివారికీ వుంది. అందువల్ల ఈ విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏకాభిప్రాయానికి వచ్చినది మొదలు అతని ప్రతి చర్యనీ ఒకకంట కనిపెట్టి చూస్తున్నారు.

    బోసుబాబు తాలూకా ఈ రహస్యమేమిటో తామే ముందు తెలుసుకోవాలని ఎవరికి వారు పాటుపడుతున్నారు.

    ఆ పూట.

    సుమిత్ర ఇంకా కాలేజీ నుండీ ఇంటికిరాలేదు. జగన్నాధం బజారునుంచీ ఇంటికి రాలేదు. అలాగే లక్ష్మణమూర్తి ఇంకా ఆఫీసునుండీ ఇంటికి రాలేదు. కల్యాణమ్మ ప్రక్కవాళ్ళతో కలిసి తెలిసిన వారింటికి వెళ్ళింది.

    ఇంటి మొత్తం మీద వదినా, మరిది మాత్రమే మిగిలారు.

    అప్పుడు సాయంత్రం అయిదు గంటలు కావస్తోంది.

    సామ్రాజ్యలక్ష్మి తన పనులు తను చేసుకుపోతూ ఓ కన్ను బోసుబాబు మీద వేసి వుంచింది.

    బోసుబాబు వంటింట్లోకి వెళ్ళి మైదాపిండి ఏ డబ్బాలో వుందో అడిగి తెలుసుకుని అది ఒక గరిటెడు తీసుకుని, తనే గ్యాస్ పొయ్యి దగ్గరవుండి మైదాపిండిని పేస్ట్ లా ఉడికించాడు. ఆ పేస్ట్ లో పాడవకుండా వుండటానికి మైలుతుత్తం వేశాడు.

    ఇది చూసిన సామ్రాజ్యలక్ష్మి అనుకుంది. మైదాపిండిని ఉడికిస్తున్నాడు దేనికో? ఏ కాయితం ముక్కలయినా అంటించటానికేమో?"

    "ఎందుకండీ మరిదిగారూ! మైదాపిండిని ఉడికించారు" అని మర్యాదగా అడిగినా అతని నోటిలోంచి సమాధానం మటుకు తిన్నగా రాదు.

    "నా నోటికి అంటించుకుందామని ఉడికించాను సరే? వదినమ్మా!" అని తిక్క సమాధానం ఇస్తాడు. ఇలాంటి ప్రశ్నలు అడగకుండా వుంటేనే మంచిది.

    సామ్రాజ్యలక్ష్మి ఇవేమీ అడగకుండా తనపని తను చేసుకుపోతూ ఏదో కావాల్సింది తీసుకోటానికి వచ్చిన దానిలాగా మధ్య మధ్య బోసుబాబు వున్న చోటుకి వచ్చి అక్కడ కాసేపు తచ్చాడి....చాలా తెలివిగా వ్యవహరిస్తోంది.

    బోసుబాబు తనకేమీ పట్టనట్లు తన పని తాను చేసుకుపోతున్నాడు.

    ఆ పూట ఎందుకో బోసుబాబు చాలా హుషారుగా వున్నాడు. చాలా తగ్గుస్వరంతో ఈలపాట పాడుతూ పని చేసుకుపోతున్నాడు.

    మైదాపిండిని ఉడికించడం పూర్తయింది. తీరుబడిగా కూర్చుని ఉల్లిపాయలు సన్నగా ముక్కలు తరిగాడు.

    ఆ ఉల్లిపాయని పొట్లం కట్టాడు. ఉడికించిన మైదాపిండిని తరిగిన ఉల్లిపాయ ముక్కలు కట్టిన పొట్లాన్ని తన గదిలోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి వచ్చాడు.

    పెరటిలోకి వెళ్ళి రెండు బాదం ఆకుల్ని బస్తాలోంచి నాలుగు బొగ్గు ముక్కల్ని తీసుకున్నాడు. మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి విసనకర్రా, పీటా, గ్లాసూ చెంచా తీసుకున్నాడు. అవి తీసుకువెళ్ళి మళ్ళీ గదిలో పెట్టి వచ్చాడు.

    ఇదంతా చూస్తుంటే, సామ్రాజ్యలక్ష్మికి మహాయాంగ్జేటీగా వుంది. ఈ రహస్యమేమిటో ఛేదించాలని. ఓ గంటదాకా ఇంటికి ఎవరూ రాకూడదని దేవుడికి మొక్కు కూడా మొక్కుకుంది.

    బోసుబాబు ఈ తఫా బాత్ రూమ్ లోకి వెళ్ళాడు. బయటకి  రాంగానే ఒకసారి అటూ ఇటూ చూశాడు ఆ తరువాత తృప్తిగా తలపంకించి తన గదిలోకి గబగబా వెళ్లాడు.

    చాటునుంచీ ఇదంతా గమనిస్తున్న సామ్రాజ్యలక్ష్మి. బోసుబాబు అటు వెళ్ళగానే బాత్ రూమ్ లో దూరి పరిశోధన గావించింది. బాత్ రూమ్ లో వుండవలసిన సబ్బుబిళ్ళ లేదు. అంతే కాదు కుంకుడుకాయ డబ్బాలో వున్న గుప్పెడు కుంకుడు కాయలు మాయమయినాయి. అంటే బోసుబాబు వాటిని తీసుకువెళ్ళాడన్న మాట. 

    "ఇదేదో చాలా పెద్ద విషయమే. ఇవన్నీ ఎందుకో ఏంపాడో?" అనుకుంది సామ్రాజ్యలక్ష్మి.

    "వదినా!" అంటూ పెద్దగా పిలిచాడు బోసుబాబు.

    "ఏమిటేమిటి? అంటూ కంగారుపడుతూ బోసుబాబు దగ్గరికి వెళ్ళింది సామ్రాజ్యలక్ష్మి.

    "వేడివేడిగా ఒక కప్పు కాఫీ ఇస్తావా వదినా! ఎందుకో తల అంతా దిమ్ముగా ఉంది." బోసుబాబు మామూలుగా అడిగాడు.

    "కాఫీయేగా! అదెంత భాగ్యం! ఒక్కక్షణంలో ఇస్తాను. డికాషన్ కూడా రెడీగా వుంది" సామ్రాజ్యలక్ష్మి ఇంకా కంగారు తగ్గలేదు అందువల్ల కంగారుగానే అంది ఈ మాటలని.

    "వదినా! నీ ముఖం ఏమిటి అదోలా వుంది?" బోసుబాబు అడిగాడు.

    "అదోలాగా వుందా! అలా ఏమీలేదే. మామూలుగానే వున్నాను మరిదిగారూ! మీకలా అనిపించి వుంటుంది" అంది సామ్రాజ్యాలక్ష్మి.

 Previous Page Next Page