Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 18

    పాండురంగం ఆ విషయం ఎత్తకపోగా, ఆ టాపిక్ మాట్లాడటం ఇష్టంలేనట్లు మాట మారుస్తూ "ఉల్లిపాయ పకోడీలు కనిపెట్టింది మన దేశం వాళ్ళంటావా, చైనా వాళ్ళంటావా? శేఖరం నవ్వుతూ అడిగాడు.

    "మన దేశంలోనే అని, నేననుకుంటున్నాను" అన్నాడు నవ్వుతూ శేఖరం.

    "అలా అని ఎలా చెప్పగలవోయ్?"

    "తరచూ మా అమ్మ ఇవే చేస్తుంది కాబట్టి" నవ్వుతూ ముగించాడు ఆ విషయాన్ని శేఖరం.

    ఆ మాటలతో అందరూ పేపరులో ప్రచురణ అయిన 'గిఫ్ట్' తాలూకా వార్తని మరచిపోయి, కాసేపు పకోడీల విషయం గురించి నవ్వుతూ మాట్లాడుకున్నారు.

    ఆ తరువాత వాళ్ళ మాటలు వేరే దారినపడ్డాయి.

    ఏ విషయమైతే వినటానికీ, చర్చించటానికి ఇష్టపడలేదో అదే విషయం గురించి పాండురంగం ఆలోచిస్తున్నాడని అక్కడ ఎవరికీ తెలియలేదు.

    ఏ మనిషి మనస్సులో ఏ ఆలోచనలు జరుగుతున్నాయో, ఎదుటి వారికి తెలిసిపోతూంటే, అంతకన్నా నరకం మరొకటి ఉండదు.

    "మనసు పిడికెడు, ఆలోచనలు ఆకాశమంతా."

    పాండురంగం వీళ్ళ ఎదుట అయితే కూర్చున్నాడు గానీ, అతని ఆలోచనలు ఎంతో దూరంపోయి ఎక్కడెక్కడో పయనిస్తున్నాయి.

    పాండురంగం ఆలోచనలు అక్కడ అందరికీ తెలిస్తే?

    కొంపలు మునుగుతాయి.


                                          13


    "హాయ్ అంకుల్! హౌ ఆర్ యూ?

    ఉదయం పూట మొక్కలకి వాటరింగ్ చేస్తూన్న ఛటర్జీ తలెత్తి చూశాడు.

    ఎదురుగా చిరునవ్వుతో బబిత కనిపించింది.

    ఆయన ముఖం ఆనందంతో విప్పారింది.

    'ఫైన్ బేబీ! కమ్, కమ్!" అంటూ చేతిలోవున్న నీటి పైపుని చెట్టు మడిలో పడేసి, ఇంట్లోకి దారితీశాడు.

    "వాట్ బేబీ! చాలా రోజులకి వచ్చావ్. అంకుల్ ని మర్చిపోయావా ఏమిటి?"

    "ఎస్ అంకుల్! నిన్న రాత్రి వరకు మిమ్మల్ని పూర్తిగా మరిచిపోయాను రాత్రి కల్లోకి వచ్చారు. ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చాను!" నవ్వుతూ అంది బబిత.

    "కల్లోకి రాకపోతే వచ్చేదానివి కాదన్నమాట" ఛటర్జీ కూడా నవ్వుతూ అన్నాడు.

    "అంతే కదా మరి!"

    "ఈ పేపర్ వాళ్ళంత స్వార్ధపరులు ఇంకెవరూ ఉండరు. అవసరం పడితే తప్పరారు. నిన్ను రప్పించాలానే రాత్రి నీ కల్లోకి వచ్చాను. నిన్ను చూసి చాలారోజులయింది. ఎందుకో నిన్ననేనీ మాట అనుకున్నాను. ఈరోజు మీ యింటికి నేనే వద్దామనుకున్నాను. సరే నువ్వే వచ్చేశావ్? ఏమిటి విశేషాలు? నీ వర్క్ ఎలా వుంది?" ఛటర్జీ అడిగాడు.

    ఇద్దరూ వచ్చి హాల్లో సోఫాల్లో కూర్చున్నారు.

    "నాకు నచ్చిన వర్క్ అండ్ నేను మెచ్చిన జాబ్. నాకు చాలా సంతృప్తికరంగా వుంది. నేనెంతో కష్టపడి విషయ సేకరణ చేసి క్విక్ గా న్యూస్ అందిస్తాను కదా! అంత క్విక్ గా కొందరు పని చెయ్యలేక కళ్ళనీరు పెట్టేసుకుంటున్నారు. మనిషికి మనిషి సహకరించాల్సింది పోయి ప్రతివాళ్లూ ఏదేదో మాట్లాడేస్తారు! ఇంతెందుకు అంకుల్! ఇప్పుడు క్రొత్తగా వచ్చిన టూ టౌన్ ఇన్ స్పెక్టర్ ని చూశావా!....

    "కొత్తగా వచ్చిన ఇన్ స్పెక్టరా? ఆయనెవరు బేబీ?" 

    "ఆయన కాదు అంకుల్! "అతను" కొత్తగా టూ టౌన్ స్టేషన్ కీ బదలీ అయ్యి రావటమే కాదు, జాబ్ కూడా కొత్తేమో, వృత్తిధర్మం కన్నా యంగ్ హీరోలాగా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తూంటాడు!

    "అతని పేరేమిటి బేబీ?"

    "మనోజ్! పేరు కూడా అతని లాగానే చక్కగా వుంది. పోలీసు కౌర్యం అని ఒక పేరు ఉంది. ఈ ఇన్ స్పెక్టర్ ముఖంలో ఆ కౌర్య లక్షణాలు అసలు లేవు. నేను స్టేషన్ కి వెళ్ళేసరికి ఒక్క కేసూ లేక, గోళ్లు కొరుక్కుంటూ తీరుబడిగా కూర్చుని ఉన్నాడు. ఇన్ స్పెక్టర్ కే పనిలేకపోతే అతని క్రింద వారికి ఏం పని వుంటుంది? ఈయనగారు కొరికి పారేసిన గోళ్ళని కానిస్టేబుల్స్ ఎత్తి బయట పారవేస్తున్నారు."

    బబిత చెప్పేతీరుకి ఛటర్జీ నవ్వాపుకోలేక గట్టిగా పగలబడి నవ్వేశాడు.

    "నన్ను చూసి ఏమన్నాడో తెలుసా అంకుల్?" బబిత అంది.

    "ఏమన్నాడేమిటి?" ఆత్రుతగా కాస్త ముందుకు వంగి అడిగాడు ఛటర్జీ.

    "ప్రెస్ రిపోర్టర్ అంటే అమ్మాయికాదు "ఆవిడ" ఏమో అని అనుకున్నాడట. ఫలానా వాళ్లు ఫలానాలా వుంటారు అని ముందే అంచనా వేసుకున్న మహానుభావుడు రేపు దొంగలనెలా పడతాడు? నా ఉద్దేశంలో అసలు అతను.... అతను.... అతను....

    బబిత కనులు పెద్దవయ్యాయి. అరిగిపోయిన రికార్డులాగా అతను....అతను....అంటూ టకీమని ఆగిపోయింది.

    "ఏమిటి అతను....అతను.... అంటూ ఆగిపోయావు? చెప్పు బేబీ! నువ్వు అతని గురించి చెబుతూంటే నాకు కూడా భలే హుషారుగా ఉంది!" ఛటర్జీ నవ్వుతూ అన్నాడు.

    మనోజ్ ఛటర్జీ వెనకాలగా వున్న గుమ్మంలోంచి వచ్చి వీరికి దగ్గరగా కూర్చున్నాడు.

    బబితకి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.

    ఆరోజు ఇతనిని ఇన్ స్పెక్టర్ దుస్తులలో చూసింది. ఇప్పుడేమో పూల పూల లుంగీ, షర్ట్, చెదిరిన క్రాఫ్ మామూలుగా ఇంటిలో వుండే కుర్రాడిలా ఉన్నాడు. అన్నింటికన్నా అతను ఇక్కడ ప్రత్యక్షమవటం బబితకి నోట మాట రాకుండా చేశాయి.

    "బబిత ఇతను...."

    ఛటర్జీ మాట పూర్తిచెయ్యక ముందే, పోండి! అంకుల్! మీరు ఇంత అబద్ధం ఆడతారని అనుకోలేదు" మామూలుగా వుండటానికి ప్రయత్నం చేస్తూ చిరుకోపంతో అంది బబిత.

    "వురిమి వురిమి మంగలం మీద పడ్డట్టు మీ మధ్యలో నేను అబద్ధం ఆడటమేమిటి బేబీ? ఒక్కపని ఎక్కువ చేస్తే అరెస్ట్ చెయ్యగలడు వీడు! ఒక్కమాట ఎక్కువ మాట్లాడితే పేపర్ కి ఎక్కించగలవు నీవు! మీ ఇద్దరితో నేను అబద్ధం ఆడటమా? ఓ! మైగాడ్!"

    ఛటర్జీ వాపోతున్నట్లుగా అంటుంటే, మనోజ్, బబిత పకపకా నవ్వేశారు.

    "మీరు ఇక్కడ ప్రత్యక్షమవుతారని అనుకోలేదు!" చిలిపిగా అన్నాడు మనోజ్.

    ఆ తరువాత ఛటర్జీ పరస్పర పరిచయం చేశాడు.

    ఛటర్జీ మనోజ్ మేనల్లుడు అయితే, బబిత స్నేహితుని కూతురు.  

 Previous Page Next Page