Previous Page Next Page 
క్రిమినల్స్ -1 పేజి 18


    "పెద్ద హీరో కావాలంటే  మొదట్లో  చిన్న చిన్న తప్పులుచేయాలి. హీరో అయ్యాక  అన్నీ మంచి  పనులేకదా చేస్తావు?"

    ఉదయ్ పసి మనస్సు సంఘర్షణకు లోనయింది. అతని మస్తిష్కంపై సినీ హీరోలు  చేసే సాహస హీరో చిత్రకృత్యాలే ముద్రవేసుకున్నాయి.

    రాజర్షికి తెలుసు ఉదయ్ మెదడును  సినిమాలు తినేస్తాయని. తాను వేసుకున్న  పధకం ఈరోజుతో పూర్తయిపోవాలి. ఇంకా ఆలస్యం చేయరాదు.

    "త్వరగా తేల్చుకో. ఎందుకంటే  నేను రేపు వూరికెళ్ళాలి. హీరో కావాలంటే ఓ చిన్న మర్డర్ చేయక తప్పదు. లేదంటే చెప్పు. నేనెళ్ళిపోతాను  మరో కుర్రాడ్ని  హీరోను చేస్తాను. కాకపోతే  నువ్వెందుకో నాకు బాగా నచ్చావ్. అందుకనే  చూస్తున్నాను."

    ఉదయ్ ఆలోచనలను రాజర్షి మాటలు విషపూరితం చేయటం ఆరంభమైంది.

    బాగా చీకట్లు  మూసుకున్నాయి.

    గాలి ఈలలు  వేస్తోంది. మసక చీకట్లో  మర్రిచెట్లులాంటి  మామిడి చెట్లు  ఒకింత  వూగుతున్నాయి.

    నిశ్శబ్దం.

    అంతటా నిశ్శబ్దం.

    పదినిముషాలు  ఎవరూ ఏం మాట్లాడకుండానే  గడిచిపోయాయి.

    ఇంతదాకా వచ్చి యిప్పుడు  ఉదయ్ వెనక్కి  తిరిగితే? ఇది ఉపయోగించుకోకపోతే  ఎప్పటికీ హీరో కాలేనేమో?

    "సరే అంకుల్! నేను మర్డర్ చేస్తాను" అన్నాడు స్థిరంగా ఉదయ్.

    రాజర్షి ఓ క్షణం  ఉలిక్కిపడ్డాడు. అతని గుండె అట్టడుగుపొరల్లో ఎక్కడో ఓ బాధాకరమైన భావన__ఓ పసి జీవితాన్ని పాపపంకిలం చేస్తున్నానేమోనన్న గిల్టీకాన్ షన్ నెస్. కేవలం ఓ క్షణం మాత్రమే. తేరుకున్నాడు రాజర్షి.

    "శభాష్ ఉదయ్ భుజాన్ని అభయం యిస్తున్నట్లుగా  మృదువుగా స్పృశించాడు రాజర్షి.

    "ఎవర్ని చంపాలి?" ఉదయ్ కళ్ళలో పట్టుదల కన్పిస్తోంది.

    "ఎవరో అయితే  ఈ వేళలో  ఈ చోటుకు రారు. నీ ఫ్రెండ్....అదే మీ శశిభూషణ్  అంకుల్  కొడుకు  రాంబాబు  నీకు మంచి ఫ్రెండ్ కనుక నువ్వెక్కడికి  రమ్మన్నా వస్తాడు. ఇప్పుడే  వెళ్ళి మర్డర్ సంగతి  చెప్పకుండా యిక్కడకు తీసుకురావాలి. తీసుకువచ్చాక ఎలా మర్డర్ చేయాలన్నది నీ తెలివి తేటలకు  వదిలేస్తున్నాను."

    రాజర్షి కళ్ళలో  ఉదయ్  సాహసాన్ని మెచ్చుకుంటున్న భావం స్పష్టంగా వ్యక్తమవుతోంది.

    ఉదయ్ ఆవేశంగా  లేచాడు.

    'చూస్కోండి నాకెంత ధైర్యం వుందో.'

    అన్నట్లు  అతనికేసి చూసి  వడివడిగా  రాంబాబు యింటికేసి  సాగిపోయాడు.

    వెళ్ళిన అయిదు నిముషాలకే  రాంబాబుని వెంటబెట్టుకుని వచ్చాడు ఉదయ్.

    కొద్దిసేపు  సినిమా విషయాలు మాట్లాడుకున్నాక రాజర్షి ఉదయ్ కి సైగచేశాడు.

    ఉదయ్ హుషారుగా లేచి ప్రక్కలకు చూశాడు. దగ్గరలో ఎవరూ లేరు.

    అంతా నిర్మానుష్యంగా వుంది. 

    రాంబాబుకి అనుమానం  రాకుండా  నేలవేపుకు  చూపులు సారించాడు.

    రాజర్షి లేచి యిప్పుడే  వస్తానంటూ  వడివడిగా  ముందుకు సాగిపోయాడు.

    "నాకు భయంగా వుందిరా ఉదయ్! దెయ్యాలొస్తాయేమో....యింటి కెళ్ళిపోదామా?" దాదాపుగా ఏడుస్తున్నట్లుగా చెప్పాడు రాంబాబు.

    "ఓరి పిరికివాడా! చిరంజీవి సినిమాలో చూశావా? గూఢాచారి నెంబర్ వన్ చూశావా? జేమ్స్ బాండ్ ను చూశావా? వాళ్ళకసలు  భయం వుండదు ఎంత చీకటయినా. ఒక్క ఐదునిముషాలుందాం. రేపు నీవు నాతో సినిమాకి వద్దువుగాని. రాజర్షి అంకుల్ రేపు భలే సినిమా చూపిస్తానన్నాడు."

    నేలమీద దేనికోసమో  వెతుకుతూనే అన్నాడు ఉదయ్.

    సరిగ్గా నాలుగు నిముషాలకు ఉదయ్ వెతికే వస్తువు కనిపించింది. రెల్లుపొదలో దాక్కొని. దాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. కాని అంత తేలిగ్గా లేవలేదు.

    బలమంతా  ఉపయోగించి  మరొక్కసారి ప్రయత్నించాడు.

    అప్పుడు కదిలింది ఒకింత.

    మొత్తానికి నాలుగయిదుసార్లు  ప్రయత్నించాక  లేచిందా వస్తువు.

    అతికష్టంమీద  ఆ వస్తువును  రెండు చేతుల్తో  పైకిలేపి  ఎత్తిపట్టుకున్నాడు  ఉదయ్.

    తన వెనుక అతను చేస్తున్న పని రాంబాబు  గ్రహించే  స్థితిలో  లేడు. అతనికి  చీకటి, అందులో  దాగిన మామిడితోపు  భయం కలిగిస్తోంది.

    సరిగా అదే సమయానికి ఊళ్ళోంచి నలుగురయిదుగురు పెద్దాళ్ళు తోటకేసి  పరుగెత్తుకోస్తున్నారు. వాళ్ళు  చేతుల్లో  వున్న హరికెన్ లాంతర్లు మిణుకు మిణుకుమంటూ దూరంనించే కనిపించాయి ఉదయ్ కి.

 Previous Page Next Page