Previous Page Next Page 
క్రిమినల్స్ -1 పేజి 19


    మరిక ఆలస్యం చేయకూడదనుకున్నాడు,

    అంతే....

    ఒక్కసారి  రాంబాబు తలవేపు  గురిచూశాడు.

    దూరం నుంచి ఏదో అలజడి.

    పదిమంది మాటలు, కేకలు  అస్పష్టంగా వినిపించటంతో రాంబాబు ఒకింత ఆసక్తిగా ముందుకు వంగాడు.

    అప్పటికే  ఆ సమూహపు  రాకను పసిగట్టిన ఉదయ్ యిక ఆలస్యంచేస్తే తను హీరో  అయ్యే అవకాశం పోతుందేమోనని కళ్ళు మూసుకుని  బరువయిన బండరాయిని గురిచూసి రాంబాబు తలపైకి  విసిరాడు.

    అంతే....

    మరుక్షణం  రాంబాబు  పెట్టిన కేక పొలిమేరవరకూ వ్యాపించింది.

    అప్పటికి  దగ్గరయిన  సమూహం తమ కళ్ళముందు జరిగిన దారుణమైన  సంఘటన చూసి అప్రతిభులయిపోయారు.

    క్రింద నెత్తుటి మడుగులో  రాంబాబు  గిలగిలా కొట్టుకుంటున్నాడు.

    సమూహం వేగంగా  ఆ స్పాట్ కేసి కదిలింది.

    అప్పటివరకూ స్థిరంగా నుంచున్న  ఉదయ్ లో హఠాత్తుగా  చలనం వచ్చింది.

    అంతే....

    తేనేతీగలా తోపులోకి దూసుకుపోయాడు. మరుసటి ఉదయానికి పోలీసులు రావటం, ఉదయ్ ని అరెస్టు చేయటం, రాజర్షి ఆశ్రమంలో తన సెటిల్ అవటం, పట్టాభి ,మధుమూర్తి, దుర్గాదాసు పండగ చేసుకోవటం, ఒకదాని వెనుక ఒకటి సాఫీగా  సాగిపోయాయి.

    ఉదయ్ లాంటి రుజువర్తనగల  పసివాడు  రాంబాబును  ఎందుకు చంపాడు?

    ఆ టైములో ఉదయ్ అక్కడ ఎందుకున్నట్లు? రాంబాబును ఉదయ్ అక్కడకు ఏ ఉద్దేశ్యంతో తీసుకెళ్ళినట్లు? అతన్ని ఎంతగా ప్రశ్నించినా సమాధానం చెప్పలేదు.

    చెప్పగలడన్న నమ్మకం కూడా లేదు.

    ఒక్కగానొక్క  కొడుకుని, ఎంతో గారాబంగా  పెంచుకుంటూ  వస్తూన్న  కొడుకు  హత్యానేరంమీద అరెస్టు కాబడ్డాడు.

    ఎన్ని విధాలుగా  ప్రయత్నించినా, ఎంత డబ్బు ఖర్చుపెట్టేందుకు  సిద్ధపడినా ప్రయోజనం కనిపించటంలేదు.

    పరమశివం కుప్పలా  కూలిపోయాడు.

    ఒకరిద్దరు  సాక్షులనయితే  కొనేయగల స్తోమతున్నవాడే  పరమశివం.

    కాని  దాదాపు పదిహేనుమంది దాకా ఉదయ్ బండరాయితో రాంబాబుని  చంపటాన్ని  కళ్ళారా  చూశారు.

    చిన్న అసత్యం  చెప్పటాన్ని  కూడా అసహ్యించుకొనేలా తను పెంచుకుంటూ  వస్తున్నాడు.

    గంజాయిని పెంచటం తప్పు చట్టవిరుద్దం  అని తను అనగా విని, చిన్న వయసులోనే  ఎంతో తెలివిగా, పోలీసులు వెంటాడుతున్నారన్న  భ్రమ కలిగించి  వాళ్ళంతట వాళ్ళే  వారి సరుకును  తగులబెట్టుకునేలా చేశాడు.

    రోజూ తోటపని చేసినందుకు రివార్డ్ గా తనిచ్చే యాభై పైసల నాణేల్ని  కిడ్డీ బ్యాంక్ లో భద్రంగా  దాచుకునేవాడే తప్ప, ఏ రోజూ పదిపైసలు ఖర్చు పెట్టలేదు.

    అక్కంటే ప్రాణమిచ్చేవాడు.

    ఓ సారి  ఎవరి అక్కని ఏదో అన్నారని  వాడితలపగులగొట్టాడు.

    పరమశివం ఆలోచనలు టక్కున  ఆగిపోయాయి. యస్....తన కొడుకు ఆవేశపరుడు కూడా ఎవరన్నా రెచ్చగొట్టారా.

    ఎంతో అల్లారు ముద్దుగా  పెంచుకుంటున్న  తన ప్రాణ సమానమైన కొడుకిప్పుడు సర్టిఫైడ్ స్కూల్ కి ఖైదీగా పంపబడనున్నాడు.

    ఎవరెంతగా  బ్రతిమిలాడినా  నోరు విప్పటంలేదు. జరిగింది జరిగినట్లు చెబితే కోర్టు క్షమించి వదిలేయవచ్చని  కూడా చెప్పిచూశాడు అయినా నోరు విప్పలేదు.

    నాన్న, అమ్మ, అక్క భోరున  విలపిస్తున్నా  ఉదయ్ పసిమొహంలో  గంభీరత చెక్కు చెదరలేదు.

    సరిగ్గా అదే  సమయంలో రాజర్షి ఒకింత ఆందోళనగా  వున్నాడు.

    ఉదయ్ గాని పొరపాటున జరిగింది జరిగినట్లు  చెబితే  తను బయటికి వస్తాడు.

    అప్పుడు  తనకేదో  అవుతుందని అతనికి భయంలేదు.

    కాని తను పరమశివానికి  విధించాలనుకునే  శిక్ష  తప్పిపోతుంది.

    పట్టాభి, మధుమూర్తిల్ని  అన్యాయం చేసిన పరమశివం కొడుకు బ్రతికే వున్నాడు.

    పరమశివానికి  సపోర్టు చేసిన శశిభూషణ్  కొడుకును పోగొట్టుకుని సర్వనాశనమై పోయాడు. 

 Previous Page Next Page