సరిగ్గా పదిరోజుల్లో పరమశివం, శశిభూషణ్ వినాశనం తధ్యం ఇంకొక్కరోజే వుంది.
"ఇంతకాలం ఆగినవాళ్ళు మరొక్కరోజు ఆగలేరా?" మరో అనుచరుడన్నాడు.
o o o
"అంకుల్! నాకు హీరో కావాలనుంది ఏంచేస్తే అవుతాను?"
అమాయకంగా అడుగుతున్న ఉదయ్ కేసి చూసిన రాజర్షి ఓ క్షణం కలవరపడ్డాడు.
తండ్రి చేసిన అన్యాయానికి అమాయకుడయిన కొడుకును బలిగొంటున్నానా?
కావచ్చు
అయినా తప్పదు.
పట్టాభి, మధుమూర్తులకు జరిగిన అన్యాయానికి తగిన శిక్ష ఇదే.
"ఏదో ఒక సాహసం చేసి నలుగురి దృష్టిలో పడాలి"
"అంటే ఎలా?"
ఉదయ్ కి ఉత్సాహంగా వుంది.
రాజర్షి చెప్పేది ఏదయినా చేసి హీరోననిపించుకోవాలని.
ప్రొద్దు ఏటవాలుతోంది. మామిడితోపు నిశ్శబ్దంలోకి జారుకుంది. ఎక్కడో దూరంగా తీతువుపిట్ట వున్నట్టుండి రెక్కల్ని టపటపలాడిస్తూ హృదయవిదారకంగా అరిచింది.
భయంగా చూశాడు ఉదయ్.
మనిషి అభివృద్ధికి అతని పిరికితనమే అడ్డుకట్టవేస్తుంది.
అతను ఉదయ్ ని ఓ క్రమపద్ధతిలో రెచ్చగొట్టుకుంటూ వెళుతున్నాడు. ఉదయ్ తిరిగి ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నాడు.
"ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, చిరంజీవి, కృష్ణ, శోభన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ఎలా హీరోలయ్యారు?"
"మంచిచేసి" ఉదయ్ తను చూసిన సినిమాల్లోని పాత్రల్నిగుర్తుకు తెచ్చుకుంటున్నాడు.
"మంచంటే చెడును చంపేకదా?"
రాజర్షి ఉదయ్ వెన్నుని లాలనగా నిమురుతూ అన్నాడు.
"అవునూ"
"సో! నువ్విప్పుడు చెడును చంపాలి. అవునా?"
"అవునా....చెడంటే?"
"సినిమాల్లో చూడలేదా?"
"చూశాను"
"హీరో కావాలనుకునేవాడికి తెలివితేటలు కూడా వుండాలి"
"అవునవును"
"ఒక దొంగతనం చేసినా సాక్ష్యాదారాలు లేకుండా చేయాలి....ఒక మర్డర్ చేసినా అలాగే చేయాలి, నువ్వే చేశావని తెలిసినా ఇన్ స్పెక్టర్ ఏం చేయలేక చేతులు నలుపుకున్నాడనుకో అప్పుడు యేమవుతుంది?"
"జనాలు చప్పట్లు కొడతారు" ఉదయ్ ఉత్సాహంగా అన్నాడు.
"శభాష్! అదీ తెలివంటే అలాగే యాభయిమంది రౌడీల్ని ఒక్కడే చావచితక్కొట్టాలి. సినిమాలో చూడలేదూ?"
"చూశాననుకో అంకుల్! కాని అదెలా? ఒక్కడే అంతమందిని ఎలా కొట్టగలడు?"
"నిజజీవితంలో కొట్టేవాళ్ళుండబట్టేకదా సినిమాల్లో అలాంటి పాత్రలు చూపెడుతున్నారు!
సినిమాల్లో కేవలం కొట్టినట్లు చూపిస్తేనే ధియేటర్ లో జనాలు నాణాలు, పిచ్చికాగితాలు, పూలు తెరమీద చల్లుతున్నారంటే నిజంగా నిజజీవితంలో ఎంతటి సమర్దుడయితే?"
"భలే వుంటుందంకుల్!"
"సినిమాలో హీరోలు చూశావా? ఎంత తెలివిగా దొంగతనం చేస్తారో?"
"అవునంకుల్! గూర్ఖాను కొట్టి, స్పృహ తప్పించి దొంగతనం చేస్తారు?"
"మరి పోలీసులు ఆ సమయంలో వచ్చారా?"
"రాలేదు. అంతా అయ్యాక వస్తారు. అవునంకుల్! అప్పటిదాకా పోలీసులేం చేస్తారు? దొంగతనం జరిగాక, హీరో విలన్స్ ని కొట్టాకగాని రారు, ఎందుకని?"
"పాపం పోలీసోళ్లు చాలా మంచివాళ్ళు ముందే వాళ్ళు వచ్చారనుకో హీరోకి పేరు రాదని ఆఖరులో వస్తారు."
"రహస్యంగా దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు వచ్చేటప్పుడు నిశ్శబ్దంగా వచ్చి చటుక్కున పట్టుకోవాలికదా? మరి ముందే తాము వస్తున్నట్లు తెలిసేలా పోలీసు సైరన్ మోగిస్తారెందుకు?"
రాజర్షి ఉదయ్ వేపు చిరునవ్వుతో చూశాడు.
"దొంగల్ని దొంగల్లా వెళ్ళి చటుక్కున పట్టుకుంటే పేరురాదు ఉదయ్! అందుకే దొంగలు పారిపోయేందుకు హింట్ యిచ్చి పారిపోయే దొంగల్ని దొరల్లా పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు."
రాజర్షి ఓసారి వాచీవేపు చూసుకున్నాడు.
"ఇంతకీ నేను హీరో కావాలంటే ఏం చేయాలి అంకుల్?"
"చెప్పానుగా! దొంగతనమో, మర్డరో చేయాలి."
"అమ్మో! తప్పుకదా?" ఉదయ్ కళ్ళు భయంతో పెద్దవయ్యాయి.