Previous Page Next Page 
శ్వేతనాగు - 2 పేజి 18

    అడవిలో ఉండగా సివంగి కూడా ఇలాగే సాధారణ మర్యాదల గురించి కాని, పై పై మెరుగుల గురించి కాని రవంత అయినా పట్టించుకునేది కాదు.
    కాని ఆమెను చూడగానే ఎంతో ప్రసన్నతా భావమూ, ఆత్మీయతా కలిగేవి. ఇప్పటిలా జుగుప్సాభావం కలిగేది కాదు. ఇతడు ప్రదర్శించే నిర్లక్ష్య భావం స్వాభావికమయినదిగా అనిపించలేదు.
    కావాలని తన అహంకారాన్ని ప్రదర్శించుకునేందుకో, ఎదుటి వ్యక్తిని భయపెట్టేందుకో చేస్తున్న ప్రయోగంలా మాత్రమే అనిపించింది వాణికి.
    ఆమెకు శరీరమంతా తేళ్ళు, జెర్రులు పాకినట్లనిపించింది. తెరిచిన తలుపు అలానే ఉంచి లోనికి వెళ్లాలని ప్రయత్నించిందామె.
    "ఆగు" అన్నాడు పాముల మల్లిగాడు గద్దింపుగా! విభ్రాంత అయి నిలిచిపోయింది. ఆమెనింతవరకూ అలా గద్దించగలిగిన వారు ఎవరూ లేరు.
    కన్నతండ్రి తనకోసం ఆంతర్యంలో బాధపడినా, తనకు విజయాలు ఎదురైనప్పుడు సంతోషించినా ఆమె సముఖంలో ఎన్నడూ కటినంగా మాట్లాడి ఎరుగరు.
    ఆ ఇంటిలోనే కాదు, ఆమె జీవితంలోనే ఎవరూ అంత దురుసుగా ఆమెతో మాట్లాడినవారు లేరు.
    భర్త అయిన స్వప్నకుమార్ బ్రతిమాలి, బామాలి ఒక విషయం తనచేత ఒప్పించాలని ప్రయత్నించేవాడు. కాని ఎన్నడూ గద్దించి, ఒత్తిడి చేసి మాట్లాడి ఎరుగడు. నాతో సమంగా విద్యాదికురాలు, నాకన్నా ఎక్కువగా సాహసికురాలు, మిక్కిలి ధనవంతురాలు, అర్దాంగిగానే కాక అన్ని విధాలా గౌరవానికి అర్హురాలు అన్న స్పృహతో మాత్రమే ప్రవర్తించేవాడు.
    అంతటి విజ్ఞానఖని అయిన ప్రొఫెసర్ కృష్ణస్వామి ఎంతో అనునయ పూర్వకంగా, ప్రశంసాపాత్రురాలు అన్నట్లుగా తనతో ప్రసంగించేవారు.
    ఆఖరుకు అడవి వారయిన సవరలూ, సుదూర ప్రాంతమైన నాగభూమినించి తరలివచ్చిన నాగాలు కూడా 'పట్నవాసం దొరసానీ' అని మన్నింపుగా మాట్లాడేవారు. అవన్నీ జ్ఞాపకం వచ్చాయి వాణికి. వారిలో ఎవరికీ కొరగానట్లుగా కనిపించే ఈ అనాగరికుడు, అందునా ముక్కూ మొహం తెలియని నవాగతుడు ఎందుకు ఇలా మాట్లాడినట్లు?
    ఇలా అనుకోగానే ఆమెకు ఒళ్ళు మండిపోయింది. అతడి మాటను తిరస్కారపూర్వకంగా అతిక్రమించి అడుగు ముందుకు వేయాలని ప్రయత్నించిందామె.
    "ఆగు" అన్నాడతడు మళ్ళి. చురుక్కున తల ఎత్తి పాముల మల్లిగాడి వంక సూటిగా చూసింది వాణి. ఆమె కొన్ని సంవత్సరాలుగా అనేక సాహసాలతో సాధించుకున్న ఆత్మ విశ్వాసమంతా ఆ చూపులో ప్రతిఫలించింది.
    ఆ చూపులు అతని శరీరంలో గుచ్చుకున్నాయి.
    ఆమె ఎన్నడూ చూడనంత వాడి చూపులు అవి. మరొకరైతే విచలితులు కావలసిన చురుకు చూపులు!
    కాని పాముల మల్లిగాడు రవంత అయినా చలించలేదు.
    "చాలించవే నీ చురుకు చూపులు, దొరసానీ! తలుపులు బిగించి దగ్గరగా రా!" అన్నాడతడు ఆజ్ఞాపిస్తున్నట్లు. అతని కంటస్వరం నీలి మేఘాలు డికొన్నప్పుడు పుట్టుకొచ్చే ఉరుముల్లా వినిపించాయి.
    మోడి ఆటలో సైతం రవంత మనో నిబ్బరాన్ని దిగాజారనియ్యని వాణి, పైధాన్ పోరాటంలో నిప్పుకర్రతో స్వప్నకుమార్ కు ప్రాణ రక్షణ చేసిన వాణి రవంత విచలిత అయింది.
    అతడు ఇచ్చిన సూచన అనుసరించి తలుపులు బిగించ లేదు కాని అలా నిలిచిపోయిందామె.
    పాముల మల్లిగాడు సుడిగాలిలా విసురుగా వచ్చి తలుపులు బిగించేశాడు. తిరిగి వెళ్ళి తన స్థానంలో కూర్చున్నాడు. వాణి అతడి ప్రవర్తనను అనుసరించి ఒక నిశ్చయానికి వచ్చింది. అతడు తండ్రి అనుమతితో వచ్చి ఉంటాడు. లేకుంటే అంత నిర్భీతిగా ప్రవర్తించటం అసాధ్యం.
    "ఎవరు నువ్వు?" అని అడిగిందామె.
    అతడు ఊఫ్.....ఫ్.... మని శబ్దం చేశాడు. అది ఉచ్చ్వాస. రవంతసేపు అయాక బుస్సుమన్నాడు. అది నిశ్వాస! వాణి కళవలపడిపోయింది.
    క్రమంగా అతని ఉచ్చ్వాస నిశ్వాసాలు ఊఫ్ ఫ్.... ఊఫ్ ఫ్ ..... మంటూ కోపం తెచ్చుకున్న పాము బుసల్లా వినిపించసాగినాయి. ఆ గదిలో కోపించిన కోడెనాగుల పూత్కారాలు నిండిపోతున్నాయి.
    తనను తాను నమ్మలేక, ఆ భయంకర శబ్దాలను భరించలేక రెండు చెవులూ గట్టిగా మూసుకుంది వాణి. చెవులు రెండూ మూసుకున్నా భయంకరమైన ఆ పూత్కారం గుండెలోంచి వినిపించినట్లుగా ఉంది.
    భరించలేకపోయిందామె.
    "యూ డెవిల్..... గెటౌట్" అని గట్టిగా అరిచిందామె. అతడు వికృతంగా నవ్వాడు.
    నవ్వెందుకు నోరు విప్పగానే వాణికి శరీరమంతా రోమాంచితమయింది జలదరింపుతో నిలువెల్లా నీరుకారిపోయింది.
    అతని నోటిలో నాలుక ఉండవలసిన స్థానంలో రెండు చిలికలున్నాయి. పాము నాలుక లాంటి చీలికలు అవి. నోటి అంతర్భాగం మందారాల్ని చిదిమి ముద్ద చేసిన విధంగా ఎర్రగా ఉంది.
    ఎర్రని నోటిలో ఎర్రని చీలికలు అతి భయంకరంగా ఉన్నాయి. నోటిలో దంతాలు ఉండవలసిన చోట చిగుళ్ళు మాత్రమే అగుపించినాయి.
    క్రింది దవడకు అసలు దంతాలే లేవు. పై దవడ మాత్రం ముందు భాగాన రెండుప్రక్కలా రెండు తెల్ల వంకిల్లాంటి కోరలున్నాయి.
    అతడు నవ్వటం చాలించి నోరు మూశాడు. మామూలు మానవ ప్రాణికి ఉండవలసిన నోరులా లేదది. అర్ధసున్నాని తలపిస్తూ సర్పముఖంలా కనిపించింది.
    నాసిక తెగిపోయిన నీటిపాము తోకలా కనిపిస్తోంది కన్నులు ఎర్రగా మండుతున్నాయి. నుదురు బాగా వెనుకకుపోయి కర్కోటకంగా కనిపించింది.

 Previous Page Next Page