Previous Page Next Page 
శ్వేతనాగు - 2 పేజి 19

    అతని భయంకరమైన ఆకృతిని చూచి వాణి అవాక్కు పడిపోయి నోరు తెరిచేసింది. 'నోటిలో కోరలేమిటి? రెండు నాలుకలేమిటి?' అనుకొంటూ ఉంటే రక్తం గడ్డ కట్టినట్టుగా బిగుసుకుపోయిందామె.
    "యూ.....యూ.....యూ డెవిల్! యూ బార్బేరియన్..... అవుట్ గెటవుట్" అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచిందామె.
    అతడు అతి భయంకరంగా నవ్వసాగాడు. ఆ నవ్వు రెండు మహా సర్పాలకు నోరువచ్చి అవ పోట్లాడుకుంటున్నంత భయంకరంగా అనిపించింది. నరకలోకపు ఘీంకారంలా అనిపించింది.   మహాదేవుని ప్రమధగణాలు మ్రోయించిన రుద్రవీణలా చెవులను హోరెత్తిస్తోంది.
    "ఈ మృత్యు రూపం అనుక్షణం నిన్ను వెన్నాడుతుంది, వాణీ! నీవు తక్షణం నాతోపాటుగా బయలుదేరి అడవికి రావాలి. శ్రీశైలానికి నాతో రావాలి. అంతదాకా ఈ వికృత మృత్యుకీల అనుక్షణం నిన్ను వెన్నాడుతుంది" అన్నాడతడు, గరగరలాడుతున్న కంటస్వరాన.
    ఇంకా ఆ పైన వాణికి అతని మాటలు వినిపించలేదు. వికృతంగా పాము పోలుసుల్లాంటి చర్మంతో నిండిన అతని శరీరాన్ని చూస్తూ విరుచుకుపడిపోయిందామె.
    హృదయ స్పందనలు రవంత సేపు నిలిచిపోయినాయి. తిరిగి ఆమెలోకి అంతర్గతమైన చైతన్యం జాగృతమయింది. కాని శరీరం మీదికి స్పృహమాత్రం రాలేదు.
    అంతదాకా ఆమె ఇచ్చిన ఆజ్ఞల మేరకులోనికి వెళ్లేందుకు భయపడి బయట నిలిచిపోయిన పనివారు ఆ ఆర్తనాదం విని తలుపులు తోసుకుని లోనికి వెళ్లారు.
    కొద్ది గంటల తరువాత హాస్పిటల్ లో శరీరం మీదికి తెలివి వచ్చి కనులు విప్పింది వాణి. కేశవరావుగారు సజల నయనాలతో ఆమె ముఖంలోకి చూస్తున్నారు.
    "డాడి! వాడెవడు! డెవిల్! బార్బేరియన్! వెళ్ళిపొమ్మను. వాడిని తక్షణం ఇంటిలోంచి గెంటివేయ్యండి. లేదా వాణ్ని కాల్చి చంపండి" అన్నదామె అరుస్తున్నట్లు.
    కేశవరావుగారి చెంపలు తడిశాయి.
    "బేబీ! నీకేమయిందమ్మా! అలాంటివారు ఎవరూ మన ఇంటిలో లేరు ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు నెమ్మదిపడమ్మా! మనసుని స్వాధీనపరుచుకో! శాంతించమ్మా!" అన్నారాయన గద్గద స్వరాన.
    అలసటగా కళ్ళు మూసుకుంది వాణి. హాస్పిటల్ గదిలో తండ్రి సమక్షంలో కలుగుతున్న అప్పటి ఆ అనుభవంలో జరిగినది కలా, నిజమా అర్ధం కాని స్థితి అయింది వాణికి.
    ఆ వికృత భయంకర రూపం తాలూకు స్మృతులు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. శరీరం జలదరిస్తోంది.
    రవంత సేపు అయాక మళ్ళి కనులు విప్పిందామె.
    "డాడీ! మన ఇంటికి కొత్తవారు ఎవరూ రాలేదా? అని అడిగిందామె హీనమవుతున్న కంటస్వరాన.
    "పాముల మల్లిగాడు వచ్చాడమ్మా!"
    "ఎప్పుడోచ్చాడు?"
    "ఈరోజే వచ్చాడు. అతడు వచ్చినప్పుడు నీవు ప్రొఫెసర్ దగ్గరకు పోయినావు. ఏమయింది?"
    "డాడీ..... వాడే! ఆ రూపం భరించలేను."
    "కొంచెం మొరటు మనిషి. అయినా అలాంటి వాళ్ళతో నువ్వు ఇంతకు మునుపే కలిసి మెలిసి తిరిగావు. ఇప్పుడింతగా భయపడటంలో అర్ధమేమిటి?" అన్నారాయన ఆశ్చర్యంగా!
    "అదికాదు, డాడీ! అతనికి రెండు నాలుకలున్నాయి."   
    "అబద్దాలాడటం అలవాటు కాబోలు" అంటూ ఆ విషయాన్ని అలా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించి తేలికగా కొట్టిపారేశారు కేశవరావుగారు.
    "అతడి వూర్పులు పాము బుసల్లా వినిపించాయి." వాణి రెట్టించింది.
    "కోపిష్టి మనిషి కాబోలు!" కేశవరావుగారు సర్దేశారు.
    "రెండు కోరలున్నాయి."
    "భయంలో పొరపాటుగా చూచి ఉంటావమ్మా!"
    "శరీరమంతా పాము శరీరంలా పొలుసులున్నాయి."
    "అది అతని మొరటుతనం, తల్లీ!"
    "నన్ను బెదిరించాడు." తండ్రి తన మాటలు అర్ధం చేసుకోలేకపోతున్నాడన్న అసహనంతో విసుగ్గా చెప్పింది వాణి.
    "నన్ను కూడా కంగారు పెట్టేశాడమ్మా! కోరలున్న పాముని శివుడల్లె మెడలో వేసుకున్నాడు. అది ముఖం పక్కనే పడగ విప్పి కోరలు చూపుతూ నోరు తెరిచింది. భయంకరంగా బుసలు కొట్టింది. అయినా నవ్వుతూ నిలబడ్డాడమ్మా! అది మనకు బెదిరింపుగానే కనిపిస్తుంది. కాని, అతనికి క్ర్రిడాప్రాయమైన విషయం.
    "నువ్వెందుకు భయపడ్డావు. నేమ్మదిపడు కావాలంటే పిలిచి నీ కళ్ళ ఎదుటే నిలబెడతాను చూడు"
అన్నారాయన కేశవరావుగారు. ఆ మాట అనగానే ఒక పనికుర్రాడు ఆ మాటల్ని అందుకుని పరుగు పరుగున బయటకు వెళ్లాడు. వాణి భయంగా కళ్ళు మూసుకుంది.
    'ఆ వ్యక్తి తిరిగి వస్తే తాను చూడగలదా? చూచి భరించటం సాధ్యమేనా?' అని తనను తాను అంచనా వేసుకోవటం ప్రారంభించింది వాణి.
    బయటకు పరుగు తీసిన కుర్రాడు పాముల మల్లిగాడు వెంటరాగా లోనికి వచ్చాడు. కేశవరావుగారు అతడిని నఖశిఖ పర్యంతం పరీక్షగా చూశారు.
    అతి సాధారణ చెంచు దొరలా కాకుంటే కొంచెం మొరటుగా కనిపించాడు పాముల మల్లిగాడు. కేశవరావుగారు తృప్తిగా నవ్వుకున్నారు.
    ఎన్నో సాహస కార్యాలను అవలీలగా సాధించిన వాణి వారి కంటికి అమాయికలా కనిపించింది. మోడి ఆటలో శక్తిమంతులయిన నాగాలను గెలిచి నాగమణిని, సప్తదాతు సంజీవని మూలికను సాధించిన వాణి. చీకటి గుయ్యారం లాంటి సర్పాల గుహలో వాసుకిని, తృణజ్యోతి, కాష్టజ్యోతి మూలికల్ని చూచి వచ్చిన వాణి వారి కన్నులకు పసిపాపలా కనిపించింది.
    "అమ్మా! పాముల మల్లన్న వచ్చాడు చూడు" అన్నారాయన లాలింపుగా! వాణి మాత్రం కన్నులు విప్పనే లేదు!

 Previous Page Next Page