"నేనిక్కడ కూర్చుంటాను, అమ్మాయికి నాలుగు వైపులా చూపించి తీసుకురా" అంది రుక్మిణి.
తోటలో నాటిన పూలమొక్కలు ఒక్కొక్కటీ ఎంత డబ్బు పెట్టుకొని వేసిందో- ఎంత కష్టపడి ఎరువులు అవీ వేసి పెంచుతున్నదీ చెప్పసాగాడు- ఆ విరిసిన పూల మధ్య వనకన్యల్లా నిలబడి విన్నారిద్దరూ-ఆ తోట అందానికి పారవశ్యంతో నిలబడిపోయింది వాణి.
ఆ తోటలో లేని కూరమొక్కల రకాలులేవు వంకాయలు, బెండకాయలు, గోరుచిక్కుడు, ఆనప,- దోసలేకాక టమోటా, కాలీఫ్లవర్, క్యాబేజీ-ఆఖరికి కొత్తిమీర, పచ్చిమిర్చి నిండివున్నాయి. లైన్లవారిగా బోదులుకట్టి నీళ్ళు పడ్తున్నారు ఇద్దరు కూలీలు-కాలువలు గుండా మోటుబావినించి నీరు పారుతూంది.
పూలమొక్కలమీద, కూరల మొక్కలమీద నెలకి ఐదువందలు వస్తాయని చెప్పాడు కిషోర్.
మామిడి, సపోటా చెట్లవైపు తీసికెళ్ళి తోటంతా తిప్పి చూపాడు- ప్రతిదీ వివరించి చెప్పుతూంటే వాణి ఉత్సాహంగా వింది.
"రెండేళ్ళనించీ అన్నయ్యతోటకి ప్రైజు వస్తూంది క్రితం ఏడు ఫ్లవర్ షోలో అన్నయ్యా గులాబీలకే ప్రైజు వచ్చింది" రేణుక గర్వంగా అంది.
వాణి ఆరాధనాపూర్వకంగా చూసింది. కిషోర్ కార్యదక్షతని మెచ్చుకుంది.
వాణి చేయిపట్టుకు అక్కడికి కొద్దిదూరంలో చిన్న కుటీరంలా అందంగా వెదురుబద్దలు కట్టివున్న చోటికి తీసికెళ్ళింది రేణుక-పైన రెల్లుగడ్డి- వెదురుకర్రలతో దళసరిగా గట్టిన గోడలు చిన్న కుటీరం-ముందు శుభ్రంగా అలికిన అరుగులు. ఒకటే గది-చిన్న కిటికీ-చిన్న పర్ణశాలలా వుంది.
"అరే, బాగుందే- యిదేమిటి - ఏం చేస్తారు యిందులో-" వాణి లోపలికి వెళ్ళుతూ అంది.
"పొలంపనిచేసి అన్నయ్యా, మధ్యాహ్నం కాసేపు రెస్టు తీసుకొంటాడు. అందుకే యీ మంచం.....లోపల మడతమంచంమీద ఫేసూ, ఓ టేబిలు, కుర్చీ-అలమరులో కొన్ని పుస్తకాలు, పత్రికలు, వున్నాయి. పొలంలో పంట కోతకి వచ్చిందంటే రాత్రిళ్ళూ యిక్కడే పడుకుంటాడు అన్నయ్య" రేణు వివరించింది.
"చాలా బాగుంది- హాయిగా ఏర్ కండిషన్ గదిలా వుంది" మెచ్చుకుంది వాణి.
"ఇంక మా ప్రోగ్రాం అయిపోయింది మీదే బాకీ వుంది. మొదలుపెట్టండి" అన్నాడు కిషోర్ చెట్టుకి ఆనుకుని కూర్చుంటూ.
"పాడమ్మా-నీ పాటకోసం యింతదూరం లాక్కువచ్చారు" అంది రుక్మిణి.
ముందురోజుకంటే ప్రకృతి వడిలో మరింత స్వేచ్చగా, హాయిగా గొంతెత్తి పాడింది వాణి.
ఆ గానామృతం సేవిస్తూ పరవశించినట్టు - పూల మొక్కలు తల లూచాయి చిరుగాలికి మామిడిమొక్కలు ఆకులు గలగల్లాడాయి పక్క వాద్యంలాగ. కొబ్బరి మట్టలు జుమ్మంటూ తలలూచాయి. శ్రోతలు ముగ్గురూ ఊపిరి పీల్చుకోవడం మరిచిపోయారు.
గంటన్నర వాణి పాటలు పాడింది.
"చాలులే అమ్మా-ఎంతసేపు పాడినా వినాలనే వుంటుంది మాకు. అలసిపోయావు" అంది రుక్మిణి ఆప్యాయంగా వాణి బుజంమీద చెయ్యివేసి.
తర్వాత అంతా నవ్వుకుంటూ ఫలహారం, కాఫీలు పూర్తిచేశారు. నాలుగు గంటలయి పొద్దు పడమటికి తిరిగింది. శీతాకాలం ఏమో సాయంత్రం అయి ఎంతోసేపయినట్లు అయిపోయింది.
"ఇవాళ ఎంతబాగా గడిచిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్ళాలంటే అప్పుడే బెంగగా వుంది. నిజంగా మీరంతా ఎప్పటినించో పరిచయం వున్న ఆప్తమిత్రులులా అయిపోయారు....." వాణి నిజంగానే దిగులుగా అంది.
"పోనీ-రాత్రికి వుండిపోకూడదూ-ఏం అన్నయా!" అంది రేణు ఆశగా.
కిషోర్ వాణివంక ఒకసారి చూసి ఏం చెప్పాలో తెలియనట్లు తటపటాయించాడు.
"వద్దమ్మా- వెళ్ళనీ-అనసూయమ్మగారు పంపించారు అంతేచాలు- రాత్రికి వుంటే ఆవిడ ఏమన్నా అనుకోవచ్చు. ఆవిడ మాట ఎలా వున్నా ఊహు-వద్దు.....వుండడం మంచిది కాదు" అంది రుక్మిణి.
తల్లి అభిప్రాయంతో ఏకీభవించినట్లు కిషోర్ వాచి చూసి "నాలుగున్నరయింది-ఐదుకి బయలుదేరుదాం. పెద్దమ్మ గారితో చీకటి పడకుండా దింపుతానని చెప్పాను. మీరు మాట్లాడుతూండండి- పెద్దమ్మగారికోసం కూరలు కోసి తెస్తాను" అంటూ కిషోర్ లేచి వెళ్ళాడు.
వాణి ఒక్కక్షణం ఆలోచించి రుక్మిణివంక చూసి-"మీకు రాజారావుగార్ని, పెద్దమ్మగారిని అందరిని తెలుసా?"
రుక్మిణి వాణి మొహంలోకి చూసి...... "తెలియక పోవడం ఏం...అయితే రాకపోకలు మాత్రం అంత లేవు" అంది అదోలా నవ్వి.
"అయితే ఒక్క ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి. రాజారావుగారి భార్య పద్మావతిగారు నిజంగా చనిపోయారా?"
"చచ్చిపోవడం ఏమిటి? ఆవిడ యింట్లోంచి లేచి పోయింది" రుక్మిణి జవాబిచ్చేలోపలే రేణు అనేసింది.
"రేణూ!" రుక్మిణి తీక్షణంగా చూసింది కూతురి వంక. "రేణూ, చదువుకున్నావు- నోటికేది వస్తే అది మాట్లాడేముందు ఆలోచించడం నేర్చుకో-నీకు తెలుసా ఆవిడ లేచిపోయిందో, చచ్చిపోయిందో?" అంది తీవ్రంగా.
తల్లి కోపం చూసి రేణు మొహం చిన్నపుచ్చుకుని "ఏమో అందరూ అనే మాట అన్నాను" అంది నెమ్మదిగా.
"ఏమోనమ్మా వాణీ, వారింటి గొడవలు మాకెలా తెలుస్తాయి? అందులో ఒక వూరు కూడా కాదు. ఆ కబుర్లు వీళ్ళు వాళ్ళు అంటే వినడం కాని మాకేలా తెలుస్తాయి? అంతా తలో రకంగా అంటారు-అయినా ఎందుకడిగావు?"