"ఇందాకటినించి అడగాలనుకునీ మీ అమ్మగారి ఎదుట అడగలేకపోయాణు, మీ నాన్నగారు పోయి ఎన్నాళ్ళయింది?" అంది వాణి కుతూహలంగా.
అంత చిలిపిగా మాట్లాడే రేణు మొహం మారి విషాదం అలుముకుంది.
"ఎన్నాళ్ళో అవలేదు, నాలుగేళ్ళే అయింది."
"ఆహా-అట్టే వయసుండి వుండదే...... అప్పుడూ యీ వూర్లోనే వుండేవారా?"
"అబ్బే-పొయేనాటికి ఏభయికూడా లేవు. అమ్మదీ నాన్నగారిదీ ప్రేమపెళ్ళి...."
"నిజం-ఆరోజుల్లోనూ ప్రేమ వివాహం జరిగిందంటే అభినందించాల్సిందే."
"అభినందనలు-మన దేశంలో తిట్టకుండా వుంటే అభినందించినంత ఫలం - అందుకే అయినవాళ్ళందరికీ దూరమయ్యారు అమ్మా నాన్నా. అమ్మది నాన్నగారిది కులం వేరు. అమ్మది కులం తక్కువైనా కాస్త వున్న కుటుంబం. నాన్న లేనింటివారు. అందుకని పెద్దలు ఆమోదించలేదుట. అయినా అమ్మ తెగించి అందరినీ కాదని నాన్నగారిని పెళ్ళాడిందట. అందుకే వీళ్ళని వెలివేసి మళ్ళీ గుమ్మంలోకి రానీయలేదట."
"అసలిడ్డరికీ పరిచయం ఎలా అయింది?" వాణి కుతూహలంగా అడిగింది.
"అమ్మ మెట్రిక్ చదువుతూండగా నాన్న ఆ స్కూలుకి మాష్టారుగా వచ్చారుట."
"మీ అమ్మగారు మెట్రిక్ చదివారా?" వాణి ఆశ్చర్యంగా అడిగింది.
"ఏం ఆశ్చర్యంగా వుందా, అమ్మ కాలంలో ఆడ పిల్లలు మెట్రిక్ చదవడం గొప్పేకదూ?" అంది రేణు "అమ్మ క్లాసంతటికి ఫస్టు వచ్చేది - మాష్టారంటే అమ్మకి గౌరవం, శిష్యురాలంటే నాన్నకి అభిమానం అలా అలా అలా యిద్దరిమధ్య ప్రేమ మొదలయింది....ఇద్దరు పెళ్ళిచేసుకోవాలనుకున్నారు. ఈ లోగా యింట్లో అమ్మ ప్రేమ వ్యవహారం తెల్సి కట్టడి, తిట్లు మొదలయ్యాయి. తాతగారు వంశ గౌరవంకోసం ప్రాణాలిచ్చే మనిషి. అమ్మ ఒకరోజు యింట్లోంచి పారిపోయి నాన్న ఆవిడ దేవాలయంలో పెళ్ళాడేసి భర్తతో సహా యింటికి వచ్చిందట-మరి ఆ యింటి తలుపులు అమ్మకి శాశ్వతంగా మూసుకుపోవడమే కాక తాతగారు తన పలుకుబడి ఉపయోగించి నాన్న మాష్టరుగిరీ పీకించి పారేసారట ఆ కోపంలో. ఉద్యోగం దొరక్క ఎన్నాళ్ళో అవస్థలు పడిపడి ఆఖరికి ఈ పల్లెటూరు వచ్చి నాన్న చిన్న స్కూలు ఆరంభించి ఊర్లో వాళ్ళ సహాయ సహకారాలతో యిక్కడ నిలదొక్కుకుని ఊరందరికి మంచి అయ్యారు. అప్పటినించి అమ్మ నాన్న యిక్కడే వుండిపోయారు.
కొందరు భూములు యిచ్చి కౌలు చేసుకోమన్నారు. అమ్మ, నాన్న ఇద్దరూ పొలంపనులు అలవాటులేక అనేక అవస్థలుపడి మమ్మల్ని చదివించారు. అలవాటులేని శ్రమకి నాన్నగారు తట్టుకోలేక ఆరోగ్యం పాడుచేసుకున్నారు. ఎలాగైనా కొడుకునన్నా చదివించి ఉద్యోగస్తుడ్ని చేయాలనుకున్నారు-.... ఆ ప్రయత్నంలో ఆయన ప్రాణాలే పోయాయి."
రేణు కళ్ళు చమర్చాయి- "అందుకే అన్నయ్య- ఏ భూమికోసం నాన్నగారు రాత్రింబగళ్ళు శ్రమించి ప్రాణాలు తీసుకున్నారో ఆ భూమిని పదింతలు చేయనిదే నిద్రపోనని ప్రతిజ్ఞపట్టాడు- చదువు అయ్యాక వెంటనే పొలంపని చేత పట్టాడు.... నాలుగేళ్ళల్లో -యీ చుట్టుప్రక్కల భూములన్నీ కౌలుకి తీసుకుని వ్యవసాయం చేతబట్టి యీ చుట్టుపక్కల రైతులందరిలోకి తలమానికం అయ్యాడు నాన్నగారి అప్పులన్నీ సగం చెల్లకట్టాడు- ప్రతీ ఏడాది ఒక ఎకరం పొలం చొప్పున మా భూమికి కలుపుతున్నాడు -మా అవస్థలు గట్టెక్కాయి - యీ రోజు దేనికీ అవస్థలేకుండా గడుపుతున్నాం అంటే మా అన్నయ్య పంతం, కార్యదక్షతవల్లే-" రేణుక ఏదో కథ పూర్తిచేసినట్టు అంతా చెప్పి-అన్నగారి వంక ఆప్యాయంగా చూసింది- "కిషోర్ పంతంపట్టినన్ను పట్నంపంపి చదివించకపోతే ఎంతోమంది పల్లెటూరి అమ్మాయిలమాదిరి యిక్కడున్న థర్డుఫారంతో నా చదువాగి పోయేది అంచేత- దెబ్బలాడినా అన్నయ్య అంటే నాకు అభిమానమే సుమండీ, మా వాదనచూసి మమ్మల్ని బద్దశత్రువులనుకోకండి" రేణు నవ్వుతూ అంది.
కిషోర్ ఆప్యాయంగా రేణుకవంక చూశాడు.
* * *
అక్కడికి రెండుమైళ్ళు వుంది కిషోర్ తోట- పొలాల మధ్య మామిడి, కొబ్బరి, సపోటా, బత్తాయి, నారింజ రక రకాల పెద్దపెద్ద చెట్లతో నిండివుందేమో చాలా చల్లగా వుంది. తోటలోకి అడుగు పెట్టగానే ఆశ్చర్యంగా నిల్చిపోయింది వాణి.
"అదేమిటి యిక్కడే నిలబడిపోయారు- లోపలికి పదండి" అన్నడు కిషోర్ నవ్వి.
ఒకరు క్యారియర్, మరొకళ్ళు ఫ్లాస్కు- వాటర్ బాటిల్ అన్నీ తలొకరు పట్టుకుని లోపలికి నడిచారు-చుట్టూతా పెదపెద్ద ఫలవృక్షాలు- మధ్యలో రెండకరాల స్థలంలో రకరకాల కూరలమొక్కలు, పాదులువరసవారిగా వున్నాయి- వాటిమధ్య మోటు బావి-బావికి రెండోపక్క చిన్న పూలతోట- తోటనిండా గులాబి, చామంతి, మల్లె, కనకాంబరం-మరువం- మళ్ళుకట్టి లైన్లవారిగా వున్నాయి.
"అబ్బ-ఎంత బాగుంది మీ తోట" చిన్నపిల్లలా సంబరపడి వాణి పూలమొక్కల మధ్యకి పరిగెత్తింది.
రేణు వాణివెంట పరిగెత్తింది.
కిషోర్ నవ్వుతూ పెద్ద మామిడి చెట్టుకింద సిమెంటుతో చప్టాచేసిన చోట తెచ్చిన జంకానా పరిచి తల్లి చేతిలోంచి క్యారియర్ అందుకుని ఫ్లాస్కు అన్నీ అక్కడ పెట్టాడు.