వెంటనే తన కర్చీఫ్ తీసి కట్టు కట్టాలని ప్రయత్నించాడు సూరజ్.
విదిలించేసి, చురుగ్గా చెప్పింది అరుణ.
"సినిమా డైలాగుల్లో చెప్పడం మీకు ఇష్టం కదా! అట్లాగే చెబుతున్నాను వినండి. ఈ రక్తం సాక్షిగా, నా దారిన నన్ను పోనివ్వండి.
"చటుక్కున లేచి నిలబడ్డాడు సూరజ్.
"వద్దు అరుణా! నేనే వెళ్ళిపోతాను. అమెరికాలో ఒక ఆఫర్ వుంది నాకు. వెళ్ళిపోతాను అరుణా!"
అప్పటికే ఒక ఆటోని ఆపింది అరుణ.
"అదేమాట మీద నిలబడండి." అని చెప్పి, ఆటో ఎక్కేసింది.
* * * *
ఆ ఫైవ్ స్టార్ హోటల్లో కాసేపు కాలక్షేపం చేసిన అభిరాంకి కొంచెం బోర్ కొట్టింది.
ఆఫ్టరాల్ ఫైవ్ స్టార్ హోటళ్ళు ఏమిటీ? తను ప్రపంచమంతా చుట్టేస్తున్నప్పుడు సెవెన్ స్టార్ హోటల్స్ లో కూడా ఎంజాయ్ చేశాడు.
అయితే ఒక్కటే ట్రబుల్!
ఈ స్టార్ ఫెసిలిటీస్ అనేవి ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఒక్కలాగే వుంటున్నాయి.
మరి ప్రపంచం రోజురోజుకీ చిన్నదయిపోతుంది కదా! గ్లోబలైజేషన్ మహిమ! నేటివ్ ఫ్లేవర్ అనేది నానాటికీ తగ్గిపోతోంది.
ఎక్కడ చూసినా ఇంగ్లీష్, అమెరికన్, చైనీస్ మెడిటెరేనియన్, థాయ్ వంటకాలూ - ఇండియాలో అయితే మొఘలాయ్ స్పెషాలిటీలూ - అంతే!
అసలు సిసలైన నేటివ్ ఫ్లేవర్ కావాలంటే రోడ్ సైడ్ న వుండే చిన్న హోటల్స్ లో తినాలి. ఫుట్ పాత్ కేఫ్ లలో ఎంజాయ్ చేయాలి. ఇరుకు సందు గొందులలో తిరగాలి. అప్పుడు కదా అసలు రుచి తెలిసేది!
బిల్లు చెల్లించి, ఉదారంగా ఐదు వందలు రూపాయల నోటు ఒకటి టిప్పుగా వదిలి, లేచాడు అభిరాం.
తక్కువ వాళ్ళకు ఎక్కువ డబ్బులు ఇవ్వడం ఇవాళ కాకపోతే రేపయినా తనకే లాభమని అతనికి స్వానుభవం.
పెద్ద సర్కిల్స్ లో దొరికే ఇన్ఫర్మేషను వేరు.
ఒక్క కాక్ టెయిల్ తాగి ఐదొందలు టిప్పు వదిలి వెళ్తోన్న అతనివైపు కృతజ్ఞతా పూర్వకంగా చూస్తున్నాడు వెయిటర్.
నవ్వి అతని భుజం మీద తట్టి బయటకు నడిచాడు అభిరాం.
పార్కింగ్ లో మిలమిల మెరిసిపోతున్న సరికొత్త కార్లని దాటుకుని, కాస్త దూరంగా ఉన్న టూవీలర్ పార్కింగ్ వైపు వెళ్ళాడు అభిరాం.
అక్కడ - మేకల మధ్య ఎనుబోతులాగా నిలబడి వుంది అతని హార్లే-డేవిడ్ సన్ మోటార్ సైకిలు!
చాలా హైపవర్ బైక్!
చాలా వెడల్పుగా ఉన్న టైర్లు - బలిష్టంగా బిల్డ్ చేసిన బాడీ.
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద క్రేజ్ సంపాదించిన మోటార్ సైకిల్ అది!
హెల్మెట్ పెట్టుకోవాలా వద్దా అని ఆలోచించాడు అభిరాం. చివరికి వద్దనే నిర్ణయించుకున్నాడు. అమెరికాలో అయితే కంపల్సరీ. ఇక్కడ ఇండియాలో హెల్మెట్ పెట్టుకుని తీరాలన్న రూలు ఉందా లేదా అన్నది తనకి అనవసరం.
రూకకే తప్ప రూలుకి విలువలేని దేశం ఇది అనీ, ఏ రూలునైనా రూకతో వంచేయవచ్చుననీ అతనికి బాగా తెలుసు.
తన హార్లే డేవిడ్ సన్ ని స్టార్టు చేశాడు అభిరాం.
సైలెన్సర్ తీసేసి వున్న ఆ బైక్ పిడుగులు పడుతున్నట్లుగా శబ్దాలు చేసింది.
నవ్వుకుని, టకటక గేర్లు మార్చి బైక్ ని రాష్ గా ముందుకు పోనిచ్చాడు. క్షణాలలోనే టాప్ స్పీడ్ అందుకుని ముందుకు వురికింది మోటార్ సైకిల్.
పార్కింగ్ లాట్ లోనూ, గేటు దగ్గరా, ఆ తర్వాత రోడ్డుమీదా ఉన్న జనం 'యముడి' వాహనంలా దూసుకువస్తున్న ఆ బైక్ ని చూసి భయభ్రాంతులై పక్కకి పక్కకి తప్పుకుంటున్నారు.
లిక్కర్ లాగా, డ్రగ్స్ లాగా ఆడపిల్లల అందంలాగా అభిరాంకి కిక్ ఇచ్చే వాటిలో మరొక ముఖ్యమైనది జనాలని టెర్రరైజ్ చేయడం.
వాళ్ళ భయాన్ని ఎంజాయ్ చేస్తూ, బీచ్ రోడ్ వెంబడే టాప్ స్పీడ్ లో చాలాదూరం వెళ్ళిపోయాడు అభిరాం. సముదపు హోరుకి ధీటుగా వినబడుతోంది హార్లే డేవిడ్ సన్ బైక్ జోరు తాలూకు రోర్.
కొంతదూరం వెళ్ళాక చేతులు రెండూ వదిలేసి సర్కస్ లో స్టంట్ రైడింగ్ లాగా ఎదురుగా వస్తున్న వాహనాలని తప్పించుకుంటూ పోనిస్తున్నాడు బైక్ ని.
పోను పోను జనావాసాలు పలచబడ్డాయి. ఊరి శివార్లలోకి వచ్చాక అక్కడ కనబడింది కొత్తగా కడుతున్న కాలనీ ఒకటి. వూరికి బాగా దూరంగా వున్నా క్లాస్ గా కట్టుకున్న ఇళ్ళు.
యధాలాపంగా చూస్తూ, కాలనీ దాటేసి వెళ్ళిపోయాడు అభిరాం.
ఆ పక్కనే వుంది ...
బీదలు వుండే ఒక బస్తీ.
పెద్దల దృష్టిలో ఉత్త 'అలగాజనం' ఆ పేదలు.
కప్పు కూలిపోయేలా ఉన్న పాతకాలపు పెంకుటిళ్ళు కొన్ని. కొన్నేమో పూరి పాకలు. మరికొన్ని రేకులతో, అట్టలతో, గడ్డితో, గుడ్డలతో కట్టుకున్న గూళ్ళు!
ఒక కుక్క అడ్డం వస్తే బైక్ ని స్లో చేశాడు అభిరాం.
చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా కుయ్యోమని శోకం పెట్టి, కాలనీ వైపు పరిగెత్తి పోయింది ఆ కుక్క.
క్షణంలో సగంలోనే గ్రహించాడు అభిరాం.
ఆ కుక్కకి పొట్ట ఎత్తుగా ఉండి. ప్రెగ్నెంటు.
తను గమనించిన అ విషయం తాలూకు ప్రభావం ఏమిటో ఆ తర్వాత మరికొద్దిసేపటిలోనే తెలిసి వచ్చింది అభిరాంకి.
బైక్ స్లో చేయగానే, అతనికి ఇంకో విషయం కూడా గమనంలోకి వచ్చింది.
అక్కడే ఒక కల్లు కాంపౌండు ఉంది. మధ్యలో ఒక మంట, మంట చుట్టూ తప్పతాగిన జనం, కేకలు, కేరింతలు, కోలాహలం.
ఇద్దరు మొగాళ్ళు కలిసి డాన్స్ చేస్తున్నారు. అందులో ఒకడు ఆడపిల్లలా అభినయం చేస్తున్నాడు.
అందరూ నవ్వులే నవ్వులు!
బైక్ ని వాళ్ళకి దగ్గరగా పోనిచ్చాక, అక్కడ పార్క్ చేశాడు అభిరాం.
తాగి ఉన్నా కూడా, అక్కడి జనాలకు తక్షణం అర్థం అయింది.
అతను ఒక తెల్ల దొర!
లేదా! - గోరా!
లేదా! - ఫిరంగీ!
దేశంలోని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలవబడినా కూడా ఐడెంటిటీ ఒక్కటే!
తెల్ల తోలు! అమ్మో!
మనకంటే మరెన్నో రెట్లు గొప్పవాడు!
ఆటపాటలు ఒక్కసారిగా ఆగిపోయాయి.
అందరూ అతని వైపు అనుమానంగానూ, భయంగానూ చూశారు.
చిన్నగా నవ్వాడు అభిరాం.
"నాకూ కాస్త కల్లు పోస్తారా?" అన్నాడు సరదాగా.
సాక్షాత్తూ ఒక తెల్ల దొరే వచ్చి కల్లు పోయమని అడిగేసరికి బ్రహ్మానంద భరితులయిపోయారు జనం.
క్షణాలలో ముంతలతో కల్లు వచ్చింది.
"కల్లు వచ్చింది గానీ నల్ల లేదా?" అన్నాడు అభిరాం.
"మీ తెల్లోళ్ళు నల్ల తింటారా సామీ?" అన్నాడొకతను తెల్లబోతూ.
"తెల్లోళ్లు అయినా, ఎర్రోళ్ళు అయినా, పచ్చోళ్ళు అయినా నల్ల రుచి చూస్తే వదల్రు" అన్నాడు అభిరాం.
"ఇక్కడ నల్ల దొరకదు సామీ! పకోడీలు ఉన్నయ్!"
"ఏం చేస్తాం! అదే తెప్పించండి"
పకోడీలు నంచుకుంటూ ముంతలకొద్దీ కల్లు తాగేశాడు అభిరాం.
చుట్టూ చేరిన వాళ్ళు సంభ్రమంగా చూస్తున్నారు..
"నల్ల కూడా తినకపోతే ఎట్లాగయ్యా! నేను ఉత్త నల్ల ఏమిటీ? నల్లమందు కూడా తింటా. ప్రపంచమంతా తిరిగి వచ్చా. ఒక్కోచోట ఒక్కొక్క వింతైన వంటకం! నత్తలకూర, వండిన గొల్ల భామలు, వేయించిన మిడతలూ, మామూలే! జపాన్ లో చేసే పూగూ చేప వంటకం తిన్నారా? పోనీ విన్నారా?"
"చేపల గురించి చెప్పేదేముంది స్వామీ! ఇక్కడా చేస్తారు గదా!"
"పూగూ చేప అంటే అట్లాంటిట్లాంటి చేప కాదు. దాని పొట్టలో విషం వుంటుంది. ఆర్సెనిక్ లాంటి అతి డేంజరస్ విషం కంటే పదమూడు రెట్లెక్కువ ప్రమాదకరం! ఆ విషాన్ని తీసేసి వండడానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ అయి, లైసెన్సు వున్న వంటవాళ్ళే కావాలి."
"వార్నీ!"