పెద్ద సైజు చాక్లెట్ బార్ లు మూడు కొన్నది అరుణ.
"మూడెందుకు?" అన్నాడు సూరజ్.
"మూడ్ కుదరడానికి" అంది చిరునవ్వుతో.
"డోస్ సరిపోతుందనే అనుకుంటాను" అంది మళ్ళీ.
హాల్లోకెళ్ళి పక్క పక్కనే కూర్చున్న తర్వాత అన్నది అరుణ.
"ఈ మూడు చాక్లెట్లూ మీకోసమే. నా కోసమైనా మీరు తిని తీరాలి."
"నాకు చాక్లెట్లంటే ఇష్టం లేదు. అయినా సరే - మీ చేత్తో చాక్ లెట్లే కాదు - పాయిజన్ ఇచ్చినా పాయసం అనుకుని తినేస్తాను అరుణా!" అన్నాడు సూరజ్, ఉద్వేగంగా అరుణ చేతిని పట్టుకుంటూ.
మృదువుగానే చెయ్యి విడిపించుకుంది అరుణ.
"ముందే చెప్పాను కదా - పెద్దమనుషులు ఎప్పుడూ పెద్ద మనుషుల్లాగే వుండాలి. చివరికి చీకట్లో కూడా! ముందు చాక్లెట్ లు తినేయండి!"
అరుణ తనని అంత ఆప్యాయంగా చాక్ లెట్లు తనమని అడుగుతున్నందుకు అంతులేని ఆనందం కలిగిందిగానీ, అసలు సంగతి ఆ తర్వాత తెలిసింది సూరజ్ కి.
సినిమా చూశాక, నెక్లెస్ రోడ్డుకి వచ్చి, ఒకచోట పచ్చగా గడ్డి పెరిగి ఉంటే అక్కడ కూర్చున్నారు. జనం ఎక్కువగానే వున్నారు, సహజంగానే. అందులో కొందరు టీనేజి రోమియోలు.
అప్పుడు వినబడింది ఒక పాట -అన్నిరకాల అపస్వరాలతో.
"చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నదీ -
దాని దిమ్మదియ్యా అందమంతా చీరలోనే వున్నదీ..."
కొద్ది క్షణాల తర్వాత అర్థమయింది అరుణకీ, సూరజ్ కీ కూడా - ఆ పాట వాళ్ళు అరుణని ఉద్దేశించే పాడుతున్నారని.
"వీళ్ళనీ.." అన్నాడు సూరజ్ కోపోద్రేకంతో.
"ఎందుకంత కోపం? వాళ్ళంటే తప్పూ - మీరు అంటే ఒప్పూ?"
"అంటే"
"మీరు మాత్రం నా చీరెని గురించి కామెంటు చేయలేదూ - నేను కట్టిన చీర మిలియన్ డాలర్ల ఖరీదు చేస్తుందీ అదీ ఇదీ అని. ఆరోజున మీరు మీ లేట్ లతీఫ్ తో చెబుతుంటే విన్నాను లెండి."
"అవును - అన్నాను - మీరు కట్టిన చీరెల అదృష్టం తలుచుకుని జెలసీ ఫీలవడమూ అదంతా అప్పటి మాట. మీరు కట్టిన చీరెకట్టూ, పెట్టిన బొట్టూ, దువ్విన జుట్టూ - ఇవన్నీ అతి శ్రద్ధగా గమనించేవాడిని అరుణా. నేను ఇప్పుడు అంతకంటే చాలా అడ్వాన్స్ అయిపోయాను."
మాట్లాడకుండా చూస్తోంది అరుణ.
"వింటున్నావా అరుణా! ఒక కవిత వినిపిస్తాను. నాకు పాట రాదనుకుంటే, పోనీ పాఠంలాగా వప్పగిస్తాను. ఒక భక్తుడు రోజూ గుడికి వెళ్ళేవాడుట. మొదట మొదట్లో అతను గుడిని చూశాడు. ఆ తర్వాత గుడినీ, గుళ్ళో వున్న దేవతని కూడా చూశాడు. ఆ తర్వాత ఇంక అతనికి గుడి కనబడటం మానేసింది. దేవత మాత్రమే కనబడటం మొదలెట్టింది. అట్లాగే, పైపై మెరుగుల మీద ఇప్పుడు నాకు మనసు లేదు అరుణా - మీ మనసు మాత్రం నాకు ముఖ్యం!"
ఇబ్బందిగా కదిలింది అరుణ. ఆ తర్వాత చెప్పింది.
"నేను ఇచ్చిన మూడు చాక్లెట్లు మొత్తం తిన్నారా లేదా?"
"దేవీ ప్రసాదం అనుకుని తినేశాను. వాటి రేపర్లు కూడా పారేయకుండా భద్రంగా జేబులో దాచుకున్నాను."
అతన్ని కట్ చేస్తూ అన్నది అరుణ.
"అసలు ఆ చాక్ లెట్లు ఎందుకు ఇచ్చానో తెలుసా?"
"ఇన్నాళ్ళూ కవర్ చేసి దాచి ఉంచిన ప్రేమ రేపర్ విప్పి ఇస్తున్నట్లుగా సింబాలిజమా?"
"కాదు. చాక్ లెట్లు ప్రేమరోగానికి పరమ ఔషధంలాంటివని ఒక సిద్దాంతం వుంది.
అది నిజమో కాదో తెలియదుగానీ మీమీద నిజంగా పనిచేయాలని నా కోరిక! ప్రేమ పిచ్చికి విరుగుడుగా!"
పట్టశక్యం కానంత నిస్పృహ కలగడం వల్ల కోపం వచ్చేసింది సూరజ్ కి.
ఆ చాక్ లెట్లలో సైనైడ్ విషం కలిపి ఇచ్చి వుంటే మీకు నా పీడ పర్మనెంటుగా విరగడైపోయి వుండేది గదా!"
అతన్ని వారిస్తూ, "సినిమా ఎలా వుంది సూరజ్?" అంది అరుణ.
"నేను సినిమా చూడలేదు. మిమ్మల్నే చూశాను."
అది వినిపించుకోనట్టుగా అంది అరుణ.
"సినిమా కథ సరిపాతదే! ఫార్ములా! అయితే, ఇందులో ఒక మహత్తర సత్యాన్ని ఆవిష్కరించాడు దర్శకుడు."
అనాసక్తిగా చూశాడు సూరజ్.
మీరెట్లాగూ సినిమా చూడలేదంటున్నారు గనుక, టూకీగా కథ చెబుతాను' అంటూ మొదలెట్టింది అరుణ.
"ఇందులో సల్మాన్ ఖాన్ ఇటలీ నుంచి ఇండియాకి వస్తాడు. సంగీతం నేర్చుకోవడం కోసం. ఒక గురువు దగ్గర చేరతాడు. సరైన సమయంలో సరైన గురుదక్షిణ అడుగుతానంటాడు గురూజీ. ఆయన కూతురు ఐశ్వర్యారాయ్. ఆమెతో తీవ్రమైన ప్రేమలో పడిపోతాడు సల్మాన్ ఖాన్."
"నాలాగానా?"
"వాళ్ళ ప్రేమ విషయం గురూజీకి తెలుస్తుంది. సల్మాన్ తన కూతురిని వదిలి వెళ్ళిపోవడమే అతను తనకు ఇవ్వగల గొప్ప గురుదక్షిణ అంటాడు ఆయన.
సల్మాన్ ఇటలీకి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఐశ్వర్యని అజయ్ దేవగన్ కి ఇచ్చి పెళ్ళి చేస్తారు. కానీ, ఆమె మనసు అప్పటికే సల్మాన్ కి ధారాదత్తమై పోయిందని గ్రహిస్తాడు అజయ్. అతను మా మంచి మనిషి. ఆమెని తిరిగి సల్మాన్ కి అప్పగించేందుకు గాను ఇటలీకి తీసుకెళ్తాడు.
ఎన్నెన్నో హిట్ అండ్ మిస్ ప్రయత్నాల తర్వాత వాళ్ళు సల్మాన్ ని కలుసుకోగలుగుతారు. ఐశ్వర్యని అతని దగ్గరకి వెళ్ళిపోమంటాడు అజయ్.
కానీ సల్మాన్ ని సమీపిస్తున్న ఐశ్వర్యకి అజయ్ మంచితనమే వెన్నాడుతూ ఉంటుంది. అజయ్ ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం గల మహామనిషి అని అర్థం చేసుకుని, అతని దగ్గరికే తిరిగి వచ్చేస్తుంది ఐశ్వర్య.
"ఇదంతా నాకు ఎందుకు చెబుతున్నారూ?" అన్నాడు సూరజ్ అనుమానంగా.
"ఈ కథ చెప్పడంలో డైరెక్టరు చేసిన చమత్కారం గురించి చెబుతున్నాను"
భయంగా చూశాడు సూరజ్.
ఇంకా ఏమి చెప్పడానికోసం ఈ ఉపోద్ఘాతమంతా?
మళ్ళీ చెప్పడం మొదలెట్టింది అరుణ.
"సినిమాలో -ఒకసారి సల్మాన్ ఇటలీకి వెళ్ళిపోయాక, ఇంక దాదాపు క్లయిమాక్స్ దాకా మళ్ళీ అతన్ని చూపించడు డైరెక్టరు.
ఇక్కడ రెండు ముఖ్యాతి ముఖ్యమైన పాయింట్లు వున్నాయి.
టైం అండ్ డిస్టేన్స్.
కాలమూ -దూరమూనూ.
కాలమూ - దూరమూ ఈ రెండింటికీ కూడా ప్రేమ తాలూకు గాయాలని మాన్పే శక్తి వుంటుంది సూరజ్.
సల్మానేమో సుదూరంలో వున్న ఇటలీకి వెళ్ళిపోతాడు. మళ్ళీ చాలాకాలందాకా ఐశ్వర్యకి కనబడడు.
ఈ లోగా -
ప్రేక్షకులు కూడా అతన్ని మర్చిపోవడం మొదలెడతారు. గాయం తాలూకు తీవ్రత తగ్గడం మొదలెడుతుంది. అజయ్ మంచితనం అడుగడుగునా ఆవిష్కారం అవుతూ ఉంటుంది. ఐశ్వర్య సల్మాన్ కి బదులు అజయ్ నే చేసుకుంటే బావుండునన్న భావన ప్రేక్షకులకి బలపడుతూ వుంటుంది.
అట్లాగే ఐశ్వర్య కూడా తనకు తెలియకుండానే మారిపోతూ వుంటుంది.
చివరికి అజయ్ తోనే వుండిపోతుంది." అని ఆగింది అరుణ.
ప్రశంసాపూర్వకంగా చూశాడు సూరజ్.
"మీ అనాలిసిస్ అద్భుతం! చాలా అనలిటికల్ గా ఆలోచిస్తారు మీరు. ఇది విన్న తర్వాత మీమీద హీరోయిన్ వర్షిప్ మరింతగా పెరిగిపోయింది నాకు."
"ఇందులో 'కాలమూ-దూరమూ' అన్న రెండు పాయింట్లు వున్నాయని చెప్పాను గదా. ఇంక ఇది మీకు చెప్పడంలో గల మూడో పాయింటు ఏమిటంటే చాక్ లెట్లకు కూడా చిక్కని ప్రేమ వికారాన్ని కాలమూ దూరమూ తగ్గిస్తాయి.
నేను మీకు దూరంగా వెళ్ళిపోదలచుకున్నాను సూరజ్. ఎందుకంటే మిమ్మల్ని దూరంగా వెళ్ళిపోమని చెప్పే హక్కు నాకు లేదు గనక!"
"ఎక్కడకి అరుణా?" అన్నాడు సూరజ్ హీనస్వరంతో.
"మీతో చెప్పలేను."
ఒంట్లోని రక్తం అంతా తోడేస్తున్నట్లు అయిపోయింది సూరజ్ కి.
"వద్దు అరుణా!" అన్నాడు నిస్సహాయంగా చూస్తూ. "మీరు ఎక్కడికీ వెళ్ళొద్దు. నేనే మీకు దగ్గరగా వుండి దూరమైపోవడానికి ప్రయత్నిస్తాను. మిమ్మల్ని మర్చిపోవడానికి ఒక్క మూడునెలలు టైమునివ్వండి అరుణా. గుండెల్లో గునపం దిగేసినట్లు అట్లా హఠాత్తుగా కట్ చేసేయకండి."
"నేను వెళ్ళాలి" అంటూ లేవబోయింది అరుణ.
చివాలున ఆమె చెయ్యి పట్టుకుని ఆపడానికి ప్రయత్నించాడు సూరజ్.
ఆమె చేతికి వున్న గాజుల్లో ఒకటి చిట్లింది. గుచ్చుకుని రక్తం కారడం మొదలెట్టింది.