"అంత ప్రమాదకరం కాబట్టి ఓ సామెత కూడా వచ్చింది. భయపడకుండా పూగూ చేపని తినేవాడు మూర్ఖుడు. భయపడి తిననివాడు పరమ మూర్ఖుడు!" అని అన్నాడు అభిరాం.
అందరూ నవ్వారు.
ఒక యువకుడు, అభిరాం ముంతని మళ్ళీ కల్లుతో నింపుతూ,
"ఇంకా చెప్పండి సామీ!" అన్నాడు ఉత్సాహంగా.
"జపాన్ లోనే సూషీ అని పచ్చిమాంసమూ, తేలు విషయమూ కలిపి ఒక వంటకం చేస్తారు. విషం అంటే గుర్తొచ్చింది. చెబితే భయపడకండేం! కాంబోడియాలో అయితే, బతికి ఉన్న తాచుపాము గుండెతో ఒక వంటకం తయారవుతుంది."
"పాముని మీరు తిన్నారా సామీ?"
"తినలేదు. ఎందుకంటే..."
అని ఆగి ఓరగా అతనివైపు చూసి అన్నాడు అభిరాం.
".....ఎందుకంటే, నాగదేవతలంటే నాకు ఇష్టం! పాముని తినలేదుగాని ఒక దానిని వెంట తెచ్చుకున్నా" అని చటుక్కున తన షర్ట్ విప్పేశాడు అభిరాం.
అతని ఛాతీ దగ్గరనుంచి నాభి దాకా, మెలికలు తిరిగి ఉన్న ఒక తాచుపాము పచ్చబొట్టు! చాలా డెటెయిల్డ్ గా, ప్రతి అంగుళమూ, ప్రతి పొలుసూ అత్యంత శ్రద్ధగా, అతి కళాత్మకంగా, రంగురంగుల కలయికతో పొడిచిన పచ్చబొట్టు!
అక్కడున్న అందరూ ఒక్కసారిగా ఊపిరి లోపలికి పీల్చుకున్న శబ్దం.
నవ్వాడు అభిరాం.
"ఇంతకీ ఈ పచ్చబొట్టుని ఇక్కడ ఎందుకు పొడిపించుకున్నానో అడగరేం?"
"ఎందుకు సామీ?"
"ఆఫ్రికా అడవుల్లో నన్ను నరమాంసభక్షకులు పట్టేసుకుని, ఖడ్గమృగం కొమ్ముతో నా పొట్ట చీల్చేశారు. వాళ్ళని తలొక పోటూ పొడిచి ప్రాణాలతో బయటపడ్డాను గానీ గాయానికి పైనుంచి కిందిదాకా కుట్లు!" అని కనబడకుండా ఈ పచ్చబొట్టు పొడిపించుకున్నానన్నమాట!"
అతనివైపు ఆరాధనగా చూశారు అందరూ. అతని పట్ల హీరో వర్షిప్ క్షణక్షణానికీ పెరిగిపోతోంది వాళ్ళకి.
మాబ్ సైకాలజీ బాగా తెలుసు అభిరాంకి.
ఎక్కడ వీలయితే అక్కడ జనాలని టెర్రరైజ్ చేయాలి. భయభ్రాంతులని చేయాలి.
ఎక్కడ కుదిరితే అక్కడ సెంటిమెంట్లు ప్లే చేయాలి.
లేచి, రెండు నిమిషాల సేపు మంట చుట్టూ తిరుగుతూ డాన్సు చేశాడు అభిరాం.
లయబద్ధంగా అడుగులు కదుపుతూ కదులుతున్న అభిరాం వంటిమీద ఉన్న పాము తాలూకు పంచవన్నెల పచ్చబొట్టు ఎగసిపడుతున్న మంటల వెలుగు నీడలలో ప్రాణం పోసుకుని పాకుతున్నట్లే కనబడుతోంది!
కళ్ళార్పకుండా దానినే చూస్తున్న ఒక పల్లెపడుచు చూపులు అప్రయత్నంగా తన చేతిమీద ఉన్న పచ్చబొట్టు మీదికి మళ్ళాయి.
వంకరటింకరగా ఉన్న నీలపు వన్నె ఆకుపచ్చ అక్షరాలతో 'సెల్వి' అని రాసి వుంది.
తన పచ్చబొట్టుతో పోకిస్తే, ఈ తెల్లదొర వంటిమీదున్న పాము బొమ్మ పచ్చబొట్టు ఎన్ని వేల రెట్లు అందంగా వుందో?
ఆరాధనా పూర్వకంగా అభిరాం వైపు చూసింది ఆ అమ్మాయి. కల్లుతో కైపెక్కి ఉన్న కళ్ళు కోర్కెతో ఎరుపెక్కాయి.
ఎంత బాగున్నాడో ఈ దొర!
ఒడ్డూ పొడుగూ కలిపి ఇక్కడి ఇద్దరు మొగాళ్ళకి సమానం.
ఆమె చూపులు అభిరాంకి వీపులో గుచ్చుకున్నట్లయింది. అడుగులు కదుపుతూనే ఆమె దగ్గరకి వచ్చి, అర్థవంతంగా ఆమెని తాకాడు.
ఆ అమ్మాయి కనురెప్పలు బరువెక్కి వాలిపోయాయి.
'వెధవది! లెక్క గుర్తుండి చావదు!' అనుకున్నాడు అభిరాం కులాసాగా. అప్పుడే ఆ అమ్మాయిని తన ఖాతాలో జమ చేసేసుకుంటూ!
"ఇంకా చెప్పండి సామీ!" అన్నాడు ఇంకో యువకుడు.
అంతలో..
వందమంది మనుషులు పరిగెత్తి వస్తున్నట్లుగా దబదబ అడుగుల చప్పుడు!
భూమి అదురుతున్న భ్రాంతి!
ఆ శబ్దంతో బాటుగా అరుపులూ - కేకలూ- తిట్లూ - శాపనార్ధాలూ!
క్షణాలలో బలంగా ఉన్న సర్వి కట్టెలు ఆ బీదా బిక్కీ వీపుల మీద విరగడం మొదలెట్టాయి.
వెనువెంటనే హాహాకారాలు!
వచ్చిన గుంపులోని ఒకడు ఒక కట్టెను అక్కడి మంటలో పెట్టి అది అంటుకున్న తర్వాత దానితో గుడిసెలని తగలెట్టడం మొదలెట్టాడు.
కొట్లాట - కత్తిపోట్లు!
అభిరాం కొంచెం దూరంగా నిలబడి, మహా రసవత్తరమైన యాక్షన్ సినిమా ఒకటి చూస్తున్నట్లుగా చూస్తున్నాడు.
దాడి చేస్తున్న వాళ్ళలో ఒకడు వీరావేశంతో అరుస్తున్నాడు.
"మా కాళ్ళు నాకుతూ బతికే కుక్కలురా మీరు- మెతుకు విదిలిస్తే తోకాడించవలసిన వాళ్ళు. అట్లాంటి కుక్కలు పెంచే ఈ కుక్కకి ఇంతటి కండకావరమా?"
వాళ్ళ కేకలని బట్టి, కాసేపటి తర్వాత అభిరాంకి కథ ఏమిటో పూర్తిగా అర్ధమయింది.
ఆ పక్కనే ఉన్న కాలనీలో ఎక్కువ మంది బాగా ధనవంతులే ఉంటున్నారు. వాళ్ళలో ఒకరి దగ్గర షీలా అనే ఆడకుక్క వుంది. ఆ బీదా బిక్కీ వుండే బస్తీలో ఒకడి దగ్గర 'రాజా' అనే మొగకుక్క వుంది. దానికీ, దీనికీ దోస్తీ కుదిరింది. దాని ఫలితంగా షీలా ప్రెగ్నెంటు అయింది.
'కూలోళ్ళ కుక్క గొప్పోళ్ళ కుక్కని చెరచడమా?" అని ఆవేశకావేశాలు.
బీదల బస్తీ తగలడిపోతోంది.
ఈలోగా -
ఆ గుంపు ఒక మహాతరంగంలా అభిరాంకి అభిముఖంగా రావడం మొదలెట్టింది.
వాళ్ళు తనకి బాగా దగ్గరగా వచ్చాక, వాళ్ళలో ఒకడి కాలుకి తన కాలు అడ్డం పెట్టాడు అభిరాం. అతను బొక్కబోర్ల పడ్డాడు. వెనక వున్నవాళ్ళు అతన్ని తట్టుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా, ఒకళ్ళమీద ఒకళ్ళు పడిపోయారు.
సరిగ్గా అప్పుడే-
అభిరాం నడుం చుట్టూ ఎవరిదో చెయ్యి పడింది.
"కమ్ విత్ మీ - సర్!" అని పక్కకి నడిపించుకుపోవడం మొదలెట్టాడు ఆ ఆగంతకుడు. "మనకు టైమయిపోతోంది సర్! వెళ్ళాలి!" అన్నాడు.
నవ్వుతూ చూసి, అతనితో నడిచాడు అభిరాం. బైక్ దగ్గరికి వెళ్ళారు.
కొద్ది నిముషాలు గడిచాక - ఇద్దరూ ఒక హోటలు చేరుకున్నారు.
చాలా పాతకాలపు భవంతి. బ్రిటిష్ వాళ్ళు పాలన చేస్తున్న కాలంలో కట్టి ఉంటారు. పెచ్చులూడిపోతున్న గోడలు. అక్కడ బోర్డు కనబడుతోంది.
'వెల్ కమ్ టు హోటల్ గోరా' అని రాసి వుంది దానిమీద.
లోపలికి నడిచారు ఇద్దరూ.
గేటులోనుంచి లోపలికి వెళ్ళాక ఒక్కసారి వెనక్కితిరిగి చూశాడు అభిరాం.
ఆ బోర్డుమీదే వెనక వైపున రాసి వుంది.
"డాగ్స్ అండ్ ఇండియన్స్ నాట్ అలవ్ డ్'
కుక్కలకూ మరియూ భారతీయులకు ప్రవేశం లేదు.
నవ్వుకున్నాడు అభిరాం. స్వాతంత్ర్యానికి పూర్వం, ఇండియాలో తెల్లదొరలు పెట్టుకున్న క్లబ్బులలో నల్లవారికి ప్రవేశం నిషిద్ధంగా ఉండేది. ఈ హోటలు ఇంకా ఆ పద్ధతిలోనే నడుస్తోంది. ఇండియాకి ఇండిపెండెన్సు వచ్చినా కూడా!
'వెల్ కమ్ బ్యాక్ సర్!' అన్నాడు హోటల్ ఓనరు జానీ - వురఫ్ జొనాధన్.
అతని అసలు పేరు జనార్ధన్.
సిసలైన భారతీయుడు.
కానీ - ఇండియా అంటే గిట్టని ఇండియన్.
అభిరాం ఆ హోటల్ కి పాత కాపే! రెగ్యులర్ కస్టమర్!
* * * *
"సర్! మీ హైదరాబాద్ ఫ్లయిట్ కి టైం అయింది" అన్నాడు ఎయిర్ లైన్స్ తాలూకు అఫీషియల్ ఒకతను. అతనిపేరు సుందర్.
"ఆ?" అన్నాడు సూరజ్ ఉలిక్కిపడి, అయోమయంగా చూస్తూ.
అరుణ గురించిన ఆలోచనలలో నుంచి బయటపడడానికి కొద్ది క్షణాలు పట్టింది సూరజ్ కి.
ఆ రోజున అరుణ తనని నిర్దాక్షిణ్యంగా నెక్లెస్ రోడ్డులో వదిలేసి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంటే, తను ఆమె వెళ్ళినవైపే దిగాలు పడిచూస్తూ నిలబడిపోయినట్లుగానే ఉంది ఇంకా అతని ఫీలింగు.
గాయాన్ని కెలుకుతున్నట్లుగా, ఆ దిగులు ఫీలింగుని గుర్తుచేస్తూ ఇక్కడ ఇవాళ ఈ హోటల్ లాబీలో సన్నగా పైప్ డ్ మ్యూజిక్ - ఇన్ స్ట్రుమెంటల్.