Previous Page Next Page 
మాయ జలతారు పేజి 18


    కారు ఆగింది. కారు ఆగడం చూచి ఇద్దరు యువకులు అరుగుమీద కూర్చున్నవారల్లా లేచి నుంచున్నారు. వారిలో ఒకడు పొట్టిగా బలంగా ఉన్నాడు. క్రాపు ముఖంమీదికి ఉంగరాలు ఉంగరాలుగా పడుతూంది. కాలర్లో ఉన్న పెద్ద జేబురుమాలు తీసి దులిపాడు. ముందుకు నడిచాడు. రెండవవాడు పొడవుగా బక్కగా ఉన్నాడు. జేబులోంచి దువ్వెన తీసి అతివేగంగా తల దువ్వుకొని కారు వైపుకు సాగాడు. ఇద్దరూ బైరాగికి సలాం చేశారు. పచ్చగా ఉన్న పండ్లికిలిమ్చాడు. పోచయ్యను వాళ్ళకు అప్పగించాడు బైరాగి. సరుకు వచ్చిందని చెప్పాడు వాళ్ళకు "చాలు పైసల్లేవు మాస్టర్!" అన్నాడు వంగి కార్లో తల పెడ్తూ పొడవువాడు. "పోబే సాలే ఇప్పుడేమీ లేవు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా" అని డ్రైవరును కారు పోనిమ్మని చెప్పడమూ, కారు సాగిపోవడమూ ఒకేసారి జరిగిపోయింది.
    పోచయ్యను తీసుకొని వారిద్దరూ అరుగుమీదికి వెళ్ళారు "ఏం భాయి! ఏ ఊరు నీది?" అడిగాడు పొట్టివాడు పోచయ్య ఏడ్చాడు. ఇద్దరూ పెద్దగా నవ్వారు "నాలుగురోజులవుతే నువ్వే గట్టివాడివి అవుతావు భై మేమూ ముందు ఇలాగే ఏడ్చాం" అన్నాడు పొట్టివాడు జూలు ఒక్కసారి దులిపి "పోచిగా! పైసలున్నయా ఏమన్న చా తాగలేదు" అన్నాడు. పోచయ్య నిక్కరు జేబులోంచి పైసలు తీసి ఇచ్చాడు మొత్తం అర్థరూపాయి ఉంది. ముగ్గురూ హోటల్లోకి వెళ్ళారు. చాయ్ తాగి బైటికి వచ్చేవరకల్లా మురికి ప్యాంటు, చారల బ్లూ షర్టూ వేసుకున్నవాడు ఎదురైనాడు "తగిలిందా ఏమన్నా?" అని అడిగాడు పొడుగువాడు ఇద్దరినీ చాటుకు తీసుకెళ్ళాడు. చారాల బ్లూషర్టు వాడు జేబులోంచి పర్సు తీశాడు. మిగతా ఇద్దరి కళ్ళల్లోనూ ఆశ, ఆతురత కనిపించింది. పర్సు విప్పాడు చారల బ్లూషర్టువాడు నూతన ఫోటో ఒకటి కనిపించింది. జేబులో పెట్టుకున్నాడు దువ్వెన పారవేయబోతే పొట్టివాడు లాక్కున్నాడు. ఒక విజిటింగ్ కార్డూ ఒక ఉత్తరమూ కనిపించాయి. రెండూ పారవేశారు. ఒక్క అయిదు రూపాయల నోటు మాత్రం ఉంది. "సాలెగాడు అయిదు రూపాయలు ఉంచాడ్రా!" అని విసిరి పారేశాడు పర్సు అయిదు రూపాయిలు జేబులో పెట్టుకుంటూ అందరి ముఖాల మీదా నిరాశ కనిపించింది.
    పోచయ్యను పరిచయం చేశారు వారిద్దరూ కొత్తవానికి ముగ్గురూ బాతాఖాని కొడ్తూ కూర్చున్నారు. పోచయ్య బెరుకు బెరుగ్గా చూస్తున్నాడు. అతనికి అంతా కొత్తకొత్తగా ఉంది. మనసులో గుబులు గుబులుగా ఉంది. ధైర్యం చెప్పడానికి ఎంతో ప్రయత్నించారు ముగ్గురూ అయినా, అతనికి ధైర్యం చిక్కలేదు ఏదో తెలియని చీకట్లోకి పోతున్నట్లనిపించింది.
    సాయంకాలం అయింది. చీకటి పడింది. లైట్లు వెలిగాయి రాత్రి అయింది. రర్సా త్రాగుదామని నిశ్చయించుకున్నారు. ముగ్గురూ పోచయ్యను తీసుకొని బైల్దేరారు. రోడ్డుదాటి గొందుల్లో పడిపోతున్నారు. అమాంతంగా ఒకడు వచ్చి మీదపడ్డాడు. "ఆబే సాలే, తీయ్ పైసలు ఎన్నాళ్ళు బే, మాదర్ చత్" అని పొడుగువాని కాలర్ పట్టుకున్నాడు. మిగతా ముగ్గురూ పరుగెత్తారు "ఇప్పుడిస్తావా? నహీతో చాకూ మార్ దూఁగా" అని జేబులోంచి కత్తితీశాడు పొడుగువాడు బ్రతిమిలాడాడు. కాళ్ళు పట్టుకున్నాడు. వినలేదు. మెడ మీంచి ఒక్కటి వేశాడు. దెబ్బలకు పడలేక చారాల బ్లూషర్టువాడి దగ్గర అయిదు రూపాయిలున్నాయని చెప్పాడు. వీణ్ణి వదలి పరిగెత్తాడు వస్తాడు. ఒక గొందిలో ఇంటినీడలో దాక్కున్నవాణ్ణి పట్టుకున్నాడు "తీయ్ బే సాలె లేకుంటే చంపేస్తా" అని జేబులోంచి కత్తి తీశాడు. అది మడతకత్తి వేలుతో వత్తగానే ఛక్ మని బైటికి వచ్చింది కత్తి వణకిపోయాడు వాడు "మాస్టర్, మూడు రూపాయలు తీసుకో. తింటానిక్కూడా పైసల్లేవ"ని బ్రతిమాలాడు "అబే తియి" అని ప్యాంటు జేబులోంచి అయిదు రూపాయిల కాగితం తీసుకొని నెత్తిమీద ఒక్కటి వేసి మాయం అయినాడు మాస్టరు "సాలా, పాంచ్ రూప్యా మార్ దియా" అని బూతులు తిట్తూ లైటు వెలుగులోకి వచ్చేశాడు. మిగతా యిద్దరూ అక్కడికి చేరారు. పోచయ్య కనిపించలేదు వారికి. భయం పట్టుకుంది. పోచయ్య పోయినాడంటే చంపేస్తాడు సూరి, వారిని గొంది సాంతం గాలించారు. ఒకచోట కూర్చుని ఉన్నాడు పోచయ్య రెండు చేతుల్తో తల పట్టుకొని. ముగ్గురూ అతన్ని తీసుకొని రోడ్డుమీదికి చేరారు.
    నలుగురూ పుట్ పాత్ మీద కూర్చొని ఉండగా వారిముందు ఒక కారు ఆగింది. "గిరాకొచ్చింది" అని ముగ్గురూ లేచారు. కార్లో ఉన్నవాడు పొట్టివాణ్ణి పిలిచి ఎక్కించుకొని వెళ్ళిపోయాడు, "ఎవరో ఎరికేనా?" అని అడిగాడు ప్యాంటువాడు పోచయ్యను. తెలీదన్నట్లు తల అడ్డంగా ఊపాడు పోచయ్య. ఫలానా సినీ స్టార్ _ హీరో అని వివరించి చెప్పాడు ప్యాంటువాడు. పోచయ్య ముఖం చేటంతైంది. ఇక్కడికెందుకు వచ్చాడు అని అడిగాడు పోచయ్య బ్రాందీ, విస్కీ, రమ్ కావలసిన వాళ్ళంతా అలా వస్తారనీ, తాము వారికి అది తెచ్చిస్తామనీ, చాలామంది సినీతారలు అలా వస్తుంటారనీ చెప్పాడు ప్యాంటువాడు పోచయ్యకు ఆశ కలిగింది. ఈ తడవ వచ్చినప్పుడు తనకు చెప్పమన్నాడు. చూస్తానన్నాడు. పోచయ్యలోని ఉత్సాహం చూచి అంతా సంతోషించారు.
    కార్లోంచి దిగాడు పొట్టివాడు, నడవండిరా తాగుదాం అని నలుగురూ మళ్ళీ అవే గొందుల్లోంచి బయల్దేరి, సగం తలుపు తీసి ఉన్న ఒక ఇంట్లో ప్రవేశించారు. "సలామ్ సేటూ" అన్నారు ముగ్గురూ, టేబుల్ ముందు కూర్చున్న బొర్రవాణ్ణి చూచి వాడు వెకిలిగా నవ్వాడు. నలుగురూ లోపలికి వెళ్ళిపోయారు. లోపల విశాలంగా ఉంది స్థలం చాలామంది జనం ఉన్నారు. బృందాలు బృందాలుగా కూర్చొని తమ మధ్య రర్రా కాపు సారాయి సీసాలు పెట్టుకొని తాగుతూ పకోడీలు తింటున్నారు.
    నలుగురూ ఒకచోట కూర్చొని రర్రా సీసాలు తెప్పించారు పకోడీలు, కబాబులూ తినేశారు. ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. తాగినప్పుడు పోచయ్యకు సాధారణంగా వచ్చే పాట "చమేలీ కే మండ్వే తలే" పాడాడు అంతా ఆనందించారు. తూలుతూ తూలుతూ నలుగురూ ఫుట్ పాత్ మీదికి వచ్చి వెల్లకిలా పడుకున్నారు దూరదూరంగా "చమేలీకే మండ్వే తలే" అని సన్నగా పాడుతూనే ఉన్నాడు పోచయ్య.

 Previous Page Next Page