Previous Page Next Page 
మాయ జలతారు పేజి 17


    పోచయ్య సీసావైపు దీక్షగా చూచాడు ఎర్రగా ఉన్న ద్రవం ఏమిటో అతనికి తెలియలేదు బైరాగి రెండు గ్లాసుల్లో రమ్ముపోసి సోడా కలిపాడు తీసుకొమ్మన్నాడు గ్లాసు ఎత్తి గటగటా తాగాడు పోచయ్య "ఏయ్, అలా కాదు కొద్దికొద్దిగా తీసుకొని చప్పరించు మజా తెలుస్తుంది. ఇది గుడంబా కాదు, రమ్" అన్నాడు పోచయ్య కొద్దికొద్దిగా తీసుకొని చప్పరించాడు ఏదో కొత్తరుచి, కొత్త అనుభూతి, గుడుంబా వెంటనే గొంతు కాల్చేస్తుంది. ఇది అలా లేదు రుచి పరిమళం ఘాటుగా లేదు. క్రమంగా మెదడు తేలిపోతున్నట్లనిపిస్తూంది.
    సిగరెట్టు వెలిగించాడు బైరాగి పోచయ్యక్కూడా అందించాడు. అది ఖరీదైన సిగరెట్టు పోచయ్య కూడా అందుకున్నాడు. దాని పరిమళం పొగ అదొకరకంగా అనిపించింది పోచయ్యకు. తనముందు కూర్చున్న బైరాగి దేవునిలా కనిపించాడు పోచయ్యకు.
    "పోచయ్యా! ఎలా ఉంది?" అడిగాడు బైరాగి.
    "శాన బాగున్నదుండి ఎంత బాగున్నదుండి!" అని తన భావం వ్యక్తపరచడానికి పదాలు లభించకపోగా ముఖంలోనూ, కన్నుల్లోనూ కృతజ్ఞత ప్రవహించింది.
    "పోచయ్యా! మళ్ళీ గుడిసెకు వెళ్తావా?"
    ఏం సెప్పాలో అర్ధంకాలేదు పోచయ్యకు కాని, స్వర్గంలో ఉన్నవాణ్ణి బూటు కాలుతో తన్నినట్లనిపించింది. వింతగా చూచాడు పోచయ్య.
    భయంగా భయంగా చూచాడు బైరాగివైపు.
    బైరాగి అర్థంచేసుకున్నాడు పెద్దగా నవ్వాడు "పిచ్చివాడా! మళ్ళీ పంపిస్తానా? వస్తావా నాతో బొంబాయికి? బొంబాయి ఇంకా అందంగా ఉంటుంది - ఏమంటావ్?"
    ఏమనాలో అర్థంకాలేదు పోచయ్యకు. బొంబాయి అనే పదం గారడీలా పనిచేసిందతనిమీద. బొంబాయిని గురించి అనేకమంది చెప్పగా విన్నాడు అది మహా పట్నం చూడాలని అతనికి ఎంతకాలం నుంచో వుంది. హిందీ సినిమాలన్నీ అక్కడే తీస్తారు. అసలే మైకంలో వున్నాడు అతని మనసు బొంబాయిలో వాలింది.
    "సరేనండీ" అన్నాడు గ్లాసు ఖాళీ చేస్తూ.
    "ఇవ్వాళ సాయంకాలమే ప్రయాణం"
    "సరేనన్నాను గదనుండి"
    బేరర్ భోజనం తెచ్చాడు. అతి రుచికరమైంది ఇద్దరూ తిన్నారు మౌనంగా.
    జుమ్ము మంటూంది పోచయ్యకు కాళ్ళు తేలిపోవడం వళ్ళు తూలడం ఏమీ జరగడంలేదు. ఏదో ఆహాయిగా వున్నట్లుంది. మగతగా వుంది బహుశః పడుకుంటే నిద్ర రావచ్చు.
    "పడుకుంటావా?" అని మంచం చూపించాడు బైరాగి.
    మంచంలో పడిపోయాడు పోచయ్య. పరుపు మెత్తగా వుంది. కిందికీ పైకీ ఎగురుతూంది. కాస్సేపు అలా ఎగిరాడు నిద్రపోయాడు.
    నయాగరా వెనుకనే ఉన్న ఉస్మాన్ యింటికి వెళ్ళాడు బైరాగి, రహస్య ద్వారం నుంచి ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. బైరాగి గదికి వచ్చేశాడు. పోచయ్యను లేపాడు. అతడు ఉలిక్కిపడి లేచాడు. ఇద్దరూ స్టేషన్ కు వెళ్ళారు.

 

                                             *    *    *

    బండి బొంబాయి చేరింది. బైరాగి ఆరు సూట్ కేసులు తెస్తున్నాడు. అవి ముగ్గురు కూలీలకు ఎత్తాడు పోచయ్యకు టిక్కెట్టిచ్చి ముందు నడవమన్నాడు. పెట్టెలు ఎవరివి అంటే తనవేనని చెప్పమన్నాడు. పోచయ్యకు ఏదో భయం భయంగా ఉంది. కసాయి ఇంటికి వెళ్ళే మేక చూచినట్లు చూచాడు. బైరాగి ఉరిమాడు నడవమన్నాడు. గత్యంతరం లేక ముందడుగు వేశాడు పోచయ్యకు కాళ్ళు వణుకుతున్నాయి. తాను చేస్తున్నది తప్పుపని అని అతనికి తెలుసు. ఆ పెట్టెలనిండా ఉన్నవి బ్రాందీ సీసాలు బొంబాయిలో మధ్యనిషేధం ఉన్న విషయం అతడు విన్నాడు. రైల్లో బైరాగిని పోలీసు బెదిరించి డబ్బుకాజేసి పోవడం తాను కళ్ళారా చూచాడు. అలాంటి సూటుకేసులు తనవి అనమంటున్నాడు బైరాగి. గత్యంతరం లేదు. బైరాగి మోసంలో పడిపోయాననుకున్నాడు. ఏంచేయాలో తోచిందికాదు. చరచరా తాను వెళ్ళిపోదామనుకున్నాడు. సూట్ కేసులు విషయం తనకెందుకూ? ఏదో రకంగా కూలిచేసుకొని బతకవచ్చు నిశ్చయానికి వచ్చి త్వరత్వరగా అడుగులు వేశాడు. పోలీసువాడు కూలివాళ్ళను ఆపేడు. ఎవరివి అని అడిగాడు అదిగో, వాడివి అని పోచయ్యను చూపించారు కూలీలు. పోలీసు పరిగెత్తి మెదమీంది ఒక్కటి పుచ్చుకొని చొక్కా పట్టి లాక్కొచ్చాడు. పోచయ్యకు కళ్ళు చీకట్లు కమ్మినట్లయింది. ఏమీ అర్థంకాలేదు. తనను ఎవరు లాక్కొస్తున్నదీ కూడా తెలీలేదు.
    "అబే సాలె కిధర్ జాతాహై, క్యా హై ఉస్ మే" అని రెండంటించాడు పోలీసు.
    దిక్కులు చూచాడు పోచయ్య. కళ్ళలో నీళ్ళు నిండాయి మాటలు తడబడ్డాయి ఒక్కొక్కరే జనం కూడుతున్నారు.
    "హర్ హర్ మహాదేవ్" అన్నాడు బైరాగి. పోలీసువాడు సాధువును చూచి తల వంచి దండం పెట్టాడు. "ఇతన్నా జులుం నహీ భాయీ, నయా ఆద్మీ దిఖతాహై కొత్తవాడులా కనిపిస్తున్నాడు" అని కన్నుకొట్టాడు "జీ మహరాజ్" అని పోచయ్యను "పో బే పో అదృష్టం బావుందిరా అయ్యగారు వచ్చారు" అన్నాడు. పోలీసు పోచయ్య టిక్కెట్ కలెక్టరుకు టిక్కెట్టిచ్చాడు "లగ్గేజ్?" అన్నాడు టిసి కూలీలు అతణ్ణి చూచి నవ్వారు. దూరంగా బైరాగి కనిపించాడు మాట్లాడలేదు టిసి. బైరాగి టిసి దగ్గరకు వచ్చాడు. తన జేబులోంచి ఒక సీసా తీసి "హర్ హర్ మహాదేవ్" అని టిసి జేబులో పెట్టాడు. వంగి సలాం చేశాడు. టిసి బైరాగి చరచరా వెళ్ళిపోయాడు.
    స్టేషన్ దాటారు. వారికోసం వేచివున్న కారు డిక్కీలో పెట్టేశారు పెట్టెలు కూలీలు. పది రూపాయిలిచ్చాడు కూలీలకు బైరాగి. వారు దండంపెట్టి వెళ్ళిపోయారు. పోచయ్య, బైరాగి కారెక్కారు. కారు శరవేగంతో సాగిపోతూంది. జనసందోహం, కార్లు, సైకిళ్ళు, ఏడేడు అంతస్తుల బంగళాలూ అన్నీ పరిగెడుతున్నాయి. కాని, వాటిని వేటినీ చూడ్డంలేదు. పోచయ్య అతనికి భయం భయంగా ఉంది. తానేదో చేయరాని పని చేస్తున్నాడు. తానేమైతానో అదే దిగులు పెట్టుకుంది. ఆలోచనలు తేనెటీగల్లా ముసురుతున్నాయి. లచ్చి, ఆస్పత్రి, గంజాయి, సారాయి.

 Previous Page Next Page