Previous Page Next Page 
చిక్కలేదు చిన్నదాని ఆచూకీ... పేజి 18


    ఏది ఏమైనప్పటికీ, she is not just an ordinary girl. గాలిని, కాలాన్ని సైతం స్థంభింపజేసేట్టున్న ఆమె నవ్వు అతన్ని ఓ విచిత్రమైన గాఢానుభూతికి లోనుచేసింది.

 

    "ఏమిటి ఆలోచిస్తున్నావ్...అమాయకపు భాగ్యరాజా? నేను క్యాసెట్ ఇచ్చి పంపించిన ఆ పిల్లాడి ముఖాన్ని నువ్వు చూశావా? వాడి ఫీచర్స్ ని మెమరీ సెల్ లో రిజిస్టర్ చేసుకున్నావా...?" అడిగిందామె కిలకిలా నవ్వుతూ.

 

    అప్పుడుగానీ శ్రీధర్ కి ఆ అనుమానం రాలేదు. నిజంగానే తనాకుర్రాడి ముఖం చూడలేదు. ఎందుకు చూడలేకపోయాడు? తనకుతానే ప్రశ్నించుకున్నాడు శ్రీధర్.

 

    "ఎందుకు చూడలేకపోయానని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటున్నావా...?" ఆమె అన్న ఆమాటల్ని వింటూండగానే అతని నవనాడులూ స్థంభించిపోయాయి. ఆమె తెలివితేటల్ని అంచనావేయలేక చైతన్యం స్థంభించిన శారీరక స్థితిలో కూరుకుపోయాడు.

 

    "క్యాసెట్ యిచ్చి నేను పంపించిన ఆ కుర్రాడి మొహం నువ్వు చూడకూడదనేకదా నేననుకుంటాను. ఆ కుర్రాడు మెట్లెక్కి నీ ఫ్లాట్ ముందుకొచ్చేప్పుడే కారిడార్ లోవున్న లైట్ ని ఆఫ్ చేసి వచ్చాడు. అలా చేయమని ఆ కుర్రాడికి చెప్పింది నేనే. సాధారణంగా ఎవరైనా మనింటి తలుపు కొట్టినప్పుడు, తలుపు తీసేముందు వరండాలో లైటు వెలిగేలా, ఇన్ సైడ్ వున్న స్విచ్ ని ఆన్ చేస్తాం... ఎందుకలా చేస్తాం...? మన తలుపు కొట్టి, తలుపు కావల నుంచున్న వ్యక్తి హితుడా? లోపలకు ఆహ్వానించ దగ్గవాడా? లేక అయిష్టమయిన వ్యక్తా? అనే విషయాలు తెలుసుకోవడానికి. కానీ నువ్వాపనే చేయలేదు. చప్పుడు విన్పించగానే వచ్చిందెవరని ఆలోచించకుండానే తలుపు తీశావ్....

 

    ఎప్పుడూ వరండాలో వెలిగే లైటు అప్పుడెందుకు వెలగడంలేదని కూడా నువ్వాలోచించలేదు. అది నువ్వు చేసిన మొదటి పొరపాటు. ఇక రెండవ పొరపాటు దొరికిన అవకాశాన్ని చేజార్చుకోడం. ఆ కుర్రాడి చేతిలోని క్యాసెట్ ని తీసుకుంటూనే వాడి చేతిని గట్టిగా పట్టుకునివుంటే వాడు నీకు చిక్కిపోయేవాడు. ఆ తర్వాత వాడిని బెదిరించో, భయపెట్టో, ప్రలోభపెట్టో నా వివరాలు సేకరించ గలిగేవాడివి.

 

    ఈ ఆలోచనలేవీ నీ బుర్రకు తట్టకూడదనే ఫోన్ లో మాట్లాడుతూ నీదృష్టి నా మీద వుండేలా చేసుకున్నాను. మీ ప్లాట్స్ సంఖ్య వందల్లో వుంది. 360 డిగ్రీల షేపులో నిర్మించిన మీ ఫ్లాట్స్ లో ఎన్ని వందల మంది పిల్లలుంటారో ఎవరు చెప్పగలరు? వద్దులే పాపం. ఇప్పటికే ఎంత ఉడుక్కుంటున్నావో నా మీద. ముందా క్యాసెట్ చూడు" అంది నిట్టూరుస్తూ.

 

    ఆమె నిట్టూర్పు తాలూకు శబ్దం శ్రీధర్ కి స్పష్టంగా వినిపించింది.

 

    శ్రీధర్ కి ఆ క్షణాన వచ్చినంతగా కోపం అతని జీవితంలో మరెప్పుడూ వచ్చి వుండదు. తన తెలివితక్కువ తనానికి ఆమెనెందుకు నిందించాలనే సంస్కారంతో తనను తాను నిగ్రహించుకున్నాడు.

 

    "ఇదిగో నల్లపిల్ల! ఈ దాగుడుమూతల బ్లాక్ మెయిలింగ్ మంచిది కాదు. కనిపించి నీకేం కావాలో చెప్పొచ్చు కదా" అడిగాడు శ్రీధర్.

 

    "దాగుడుమూతలా? అబ్బే అలాంటివేం లేదే... నేను రోజూ నీకు కనిపిస్తూనే వున్నాను. నిన్ను చూస్తూనే వున్నాను."

 

    "ఎప్పుడు కనిపిస్తున్నావ్? ఎలా?"

 

    "అది నువ్వు కనుక్కోవలసిన విషయం, బస్టాపులోనో, బసెక్కుతున్నప్పుడో, నీ ఆఫీసులోనో, ఎప్పుడూ నీకు సన్నిహితంగానే వుంటుంటాను."

 

    "నేన్నమ్మను..." స్థిరంగా అన్నాడు శ్రీధర్.

 

    "ఎందుకు నమ్మవు...? పరిసరాల పట్ల అప్రమత్తంగా వుంటానని నీకంత నమ్మకమా? సరే - ఇప్పుడే నేను నిన్ను నమ్మిస్తా... నీ ఏజ్ పాతిక సంవత్సరాలు. హైట్ అయిదడుగుల పది అంగుళాలు. వెయిట్ అప్రాక్సిమేట్లి అరవై అయిదు కిలోలు. నీ హేర్ బ్లాక్...గుంగురు జుత్తు. నీకు కణతమీద పుట్టుమచ్చుంది. విశాలమైన వక్షస్థలం, సన్నని నడుము, బలమైన తొడలు... కావాలంటే ఇంకా చెప్పగలను. కానీ చెప్పను... ఎందుకంటే చెప్పవలసి వస్తే నాకు సిగ్గుగా ఉంటుంది. వినడానికి నీకూ అలాగే వుంటుంది. యామై రైట్....?"  

 

    తన భౌతికాకారం గురించి ఆమె చెప్పినవన్నీ కరెక్ట్. ఆ ఆలోచనకు వస్తూనే షాక్ తిన్నట్టయిపోయాడు శ్రీధర్.

 

    తననంత దగ్గరగా ఈ అపరిచితురాలెప్పుడు చూసుంటుంది...? ఒక వేళ తను జయారెడ్డి పార్లర్ కి మసాజ్ చేసుకోవటానివెళ్ళినప్పుడు చూసుంటుందేమో... కానప్పుడు మసాజ్ రూంలో తను, మసాజర్ ఎప్పుడో ఒకసారి జయారెడ్డి మాత్రమే వుండడం జరిగింది. ఆ రూమ్ లోంచి తను బైటికొచ్చేటప్పుడు ఎప్పుడూ డ్రసప్ అయ్యే వస్తాడు. ఇంకెలా తన నగ్న శరీరాన్ని ఈ అమ్మాయి చూడగలిగింది...? వేలాది సందేహాలు కొద్దిక్షణాల్లోనే అతనిలో చోటుచేసుకున్నాయి. ఆ మరుక్షణమే సిగ్గుపడిపోయాడు. చేతిలోని కార్డ్ లెస్ ఫోన్ తోటి వేగంగా తన బాత్రూమ్ కెళ్ళి నలువైపులా చూశాడు. ఎక్కడా ఎలాంటి రంధ్రం కన్పించలేదు. తిరిగి ఆలోచించుకుంటూ హాల్లోకొచ్చాడు. "బహుశా నా అంచనా ప్రకారం నువ్వీపాటికి నీ బాత్రూమ్ లోకెళ్ళి దానికేమన్నా హోల్స్ వున్నాయేమోనని పరిశీలించి వుంటావు. యామై రైట్..."

 

    అది వింటూనే శ్రీధర్ పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపడ్డాడు. తను తన ఫ్లాట్ కొచ్చి తలుపులేసుకున్నాక తప్ప ఎప్పుడూ షర్టుగానీ, ప్యాంటుగాని విప్పడు. బయటికెళ్ళేప్పుడు ఫుల్ డ్రస్సప్ అయి కానీ వెళ్ళడు. మరెలా ఈ అమ్మాయి తన శరీరాకృతి గురించి తెలుసుకోగలిగింది...?

 

    "ఈపాటికే నీ ధిమాక్ ఖరాబైపోయి వుంటుంది. అవునా? ఇంకా చెబుతాను విను. నీది పొడుగైన ముఖం, కళ్ళు తీర్చిదిద్దినట్టుంటాయి. అవి క్లియర్ అండ్ ఆనెస్ట్ నెస్ కి నిదర్శనంగా అనిపిస్తాయి. మంచి ముక్కుతో పాటు చక్కని మీసాలు వుండడం నీ అందానికే హైలెట్. పై పెదవి చిన్నగా, క్రింది పెదవి పెద్దగా వుంటుంది. మగాడికి పై పెదవి చిన్నగా, కింది పెదవి పెద్దగా వుంటే సెక్సీగా ఉంటారు. చూడగానే కాకపోయినా, చూడముచ్చటగా అన్పించగానే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఆడపిల్లలకి.

 

    ఇకపోతే నీ పర్సనల్ విషయాల్లో కొస్తే నీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరూ లేదు. బయటికి చాలా తక్కువగా వెళతావ్. ఉదయం ఏడుకి ఎనిమిదికి మధ్య లేస్తావ్. టీవి చాలా తక్కువగాచూసి మేగజైన్స్ కి అతుక్కుపోతావ్. నీ డిన్నర్ చాలా సింపుల్ గా వుంటుంది. మామూలుగానైతే శాఖాహారం మాంసాహారం అన్నీ తినేస్తావు. తాగడం, గోళ్ళు కొరుక్కోవడం లాంటి చెడు అలవాట్లు లేని మంచి అబ్బాయివి" చెబుతూ ఆగిందామె.

 Previous Page Next Page