ఆ క్యాసెట్ ని ఎప్పుడు, ఎలా, ఎక్కడ తనకిస్తుందో దాన్నిబట్టి ఆమె జాడ తెలుసుకోవాలని శ్రీధర్ ఆశ.
"ఎప్పుడో ఎందుకు...? ఇప్పుడే నీ కందుతుంది."
"ఇప్పుడా...? ఎలా...? నువ్వు ఫోన్ పెట్టేసి ఆ క్యాసెట్ తీసుకుని నా ఫ్లాట్ కొచ్చేసరికి ఎంతో కొంత టైమ్ పడుతుందికదా..."
"ఇప్పుడు సరిగ్గా టైమెంతయింది?" ప్రశ్నించిందామె.
వెంటనే రిస్ట్ వాచీ వైపు చూసుకున్నాడు శ్రీధర్. "సరిగ్గా తొమ్మిదవుతోంది" చెప్పాడు వెంటనే.
"ఇంకొద్ది క్షణాలో నీ ఫ్లాట్ డోరుమీద చప్పుడవుతుంది చూడు. ఎందుకంటే నీ ఫ్లాట్ కి కాలింగ్ బెల్ లేదుగనుక."
"అది నీకెలా తెలుసు?" అని శ్రీధర్ అడుగుతూండగానే తలుపు చప్పుడయింది.
"తలుపు చప్పుడైంది కదూ? అవుతుంది. నీ చేతిలో వున్న కార్డ్ లెస్ ఫోనేకదా... వెళ్ళి తలుపుతీయి" అందామె సన్నగా నవ్వుతూ.
అటువైపు డోర్ చప్పుడు ఇటువైపు ఈమె డోరు చప్పుడవుతోందని చెప్పటం, పైగా తన చేతిలో నున్నది కార్డ్ లెస్ ఫోన్ అని చెప్పటం. ఒక్కక్షణం అతనికేం అర్థంకాలేదు. తనది కార్డ్ లెస్ ఫోన్ అని ఈ అమ్మాయికెలా తెల్సు? తిరిగి ఆశ్చర్యపోయాడు శ్రీధర్.
"చెప్పానా... పదే పదే ఆశ్చర్యపోవద్దని. మొగుడేది చెప్పినా, అవునా అంటూ గడపమీదకి తలవాల్చి బుగ్గున వేలేసుకొని ఆశ్చర్యపోయే అమాయకపు గృహిణిలా చేస్తావేంటయ్యా బాబు? నీ చేతిలో వున్న కార్డ్ లెస్ ఫోన్ గురించి నాకెలా తెల్సిందనేగా నీ ఆశ్చర్యం? నీ చేతిలో వున్న షార్ప్ కంపెనీ కార్డ్ లెస్ టెలిఫోన్. మోడల్ నెంబరు FT-4400 మేడ్ ఇన్ మలేషియా, సీరియల్ నెంబరు 50126418 అవునా? తిరిగి నువ్వు అవునా అని ఆశ్చర్యపోకు. ముందెళ్ళి తలుపుతీయి" అని డిమాండ్ చేస్తున్నట్టుగా అంది. అతను చటుక్కున సోఫాలోంచి లేచి డోర్ కేసి నడుస్తూనే తన ఎడమ చేతిలోవున్న కార్డ్ లెస్ టెలిఫోన్ వైపు చూసుకుంటూనే షాక్ తిన్నాడు. ఆమె చెప్పినట్టుగానే తన చేతిలోవున్నది అదే ఫోన్. అదే మోడల్. చివరికి అదే సీరియల్ నెంబరు కూడా. ఆ షాక్ నుంచి తేరుకొనే ప్రయత్నం చేస్తూనే ఇన్నర్ సైడ్ సేఫ్టీ చైన్ తీసి డోర్ తెరిచాడు.
ఎదురుగా ఓ పదేండ్ల కుర్రాడు చేతిలో క్యాసెట్ తో నుంచొని వున్నాడు. కారిడార్లో చీకటిగా వుండడంతో ఆ కుర్రాడి మొఖాన్ని ఆనవాళ్ళు పట్టలేక పోయాడు.
"ఎందుకాలస్యం చేస్తావ్? తీసుకో క్యాసెట్" అని ఫోన్ లో వినిపించింది శ్రీధర్ కి.
అసంకల్పితంగానే ఆ పిల్లాడి చేతిలో క్యాసెట్ ని అందుకున్నాడు. ఆ మరుక్షణమే షార్ప్ గా రియాక్టవుతూ ఆ కుర్రాడ్ని పట్టుకునేందుకు ఒకడుగు ముందు కేశాడు.
అప్పటికే ఆ కుర్రాడు వెనుదిరిగి కారిడార్లో పరుగెత్తడం ప్రారంభించాడు. పట్టుదలతో చేతిలో ఫోన్ తోటే శ్రీధర్ కూడా ఆ కుర్రాడెళ్ళిన దిశకేసి పరిగెత్తడం ప్రారంభించాడు.
"లాభంలేదబ్బాయ్. పరుగెత్తే ఆ పిల్లాడిది పి.టి.ఉష అంశ. నువ్వెంత ఛేజ్ చేసినా వాడు నీకు దొరకడు. బుద్ధిగా వెనక్కొచ్చేయ్" అని ఫోన్లో విన్పించింది. ఆ మాటలు వింటూనే మరికొంచెం వేగంగా ముందుకు పరుగెత్తాడు. కాని అప్పటికే మెట్ల దగ్గర మలుపు తిరిగిన కుర్రాడు మరిక కనిపించలేదు. ఒక్కసారిగా నిస్సహాయత ఆవరించి నట్లయింది శ్రీధర్ కి. ఉన్నచోటే శిలాప్రతిమలా నిలబడిపోయాడు.
"ఇది చాలా అన్యాయం" అని వినిపించింది అపరిచితురాలి కంఠం.
ఆమె మాటలతో షాక్ నుంచి తేరుకున్న శ్రీధర్.
"ఏదన్యాయం...?" అని అడిగాడు నీరసంగా తన ఫ్లాట్ కేసివస్తూ.
"నా తెలివితేటల్ని మరీ అంత తక్కువ అంచనా వేసినందుకు నేను కొబ్బరినూనె తలకే రాసుకుంటున్నాను, మోకాళ్ళకు కాదు."
"నాకే అర్థం కావడంలేదు. నీ మాటలు, నీ ధోరణి."
"నా అంతట నేనే క్యాసెట్ తీసుకొచ్చి నీకిస్తానని ఎలా ఊహించావ్? అలా వచ్చేదాన్నే అయితే, అంత త్వరగా నీ ఎదుట పడేదాన్నే అయితే, నీతో నా స్నేహం ఇలా ఎందుకు ప్రారంభిస్తాను?" ప్రశించిందామె అదే చిరునవ్వుతో.
"నేనూ కొబ్బరినూనె తలకే రాసుకుంటున్నాను. నువ్వు పంపిన కుర్రాడిద్వారా నీ జాడ ఈజీగా తెలుసుకోగలను" అన్నాడు శ్రీధర్ తనలో రేగుతున్న ఉక్రోషాన్ని అణచుకుంటూ.
సంపంగి పూలు జలజల రాలినట్టుగా నవ్విందామె. ఆ నవ్వులో వెక్కిరింతకాని, ఎగతాళిగాని లేవు.
"ఎందుకలా పదే పదే నవ్వుతావ్?" ఉక్రోషంగా అన్నాడు శ్రీధర్.
"నవ్వు నాలుగు విధాలుగా మంచిదని ఇలా నవ్వేస్తున్నాను. ఏం నా నవ్వుకు నీ నరాలు జివ్వుమంటున్నాయా?"
"కాదు తెగిపోయేలా వున్నాయ్. ఆ కుర్రాడిద్వారా నువ్వేవరివో ఎక్కడ్నుంచి ఫోన్ చేస్తున్నావో, నీ అడ్రస్సేమిటో అతిత్వరలోనే తెలుసుకుంటాను" సవాలు చేస్తున్నట్టుగా అన్నాడు శ్రీధర్.
తిరిగి నవ్విందామె నిండుగా, పరిపూర్ణంగా.
అందమైన ఆడపిల్ల నవ్వు అంత అందంగా వుంటుందా? వెన్నెల్ని చిలకరించినట్టు ఉషోదయాన్ని పలకరించినట్టు, పాల పుంతలోని నక్షత్రాల్ని తెంపి అందంగా అవనిపై విసిరినట్టు...
ఆమెనెలా అర్థం చేసుకోవాలో శ్రీధర్ కి ఒక పట్టాన అర్థంకాలేదు. ఎందుకు ఫోన్ చేస్తోందో...? మరీ ముఖ్యంగా తనకే ఎందుకు చేస్తోందో? అతనికే అర్థంకాలేదు.
ఎప్పుడూ మంద్రస్థాయిలో స్పష్టతను, శ్రావ్యతను తోడు తీసుకుని ఉచ్ఛరించే ఆమె మాటల్లో సంస్కారము కనిపిస్తుంది తప్ప అశ్లీలత ఎప్పుడూ తొంగిచూళ్ళేదు. సభ్యతాపరిధి దాటిన దాఖలాలు అంతకంటే కన్పించలేదు.
మాటలను వడపోసినట్టుండే ఆమె కంఠంలో ఎంతో పరిపక్వత కనిపిస్తుంది.
తనకు తెలియకుండానే ఆమె కంఠం తనని ఏ స్వాప్నిక ప్రపంచంలోకో తీసుకెళుతున్నట్టుగా అనిపిస్తుంది... ఎందుకలా?