Previous Page Next Page 
చిక్కలేదు చిన్నదాని ఆచూకీ... పేజి 19


    "ఆగిపోయావేం" అట్నుంచి అడిగాడు శ్రీధర్ కుతూహలంగా.

 

    "రాత్రి విగ్రహంలా నిలబడిపోయావు కదా. కొంపదీసి హర్ట్ అయ్యావేమోనని కాసేపాగాన్లే. ఆదివారం సినిమాకెళతావు. నిన్ను ఫాలో అవుతూ చాలాసార్లు నీతోపాటు నేను సినిమాకి రావడమే కాదు. నీ వెనుక సీట్లో కూర్చుని గమనించాను. ఇంటర్వెల్ తర్వాత థియేటర్లో చీకటిగా వున్నప్పుడు మెల్లిగా నీ పక్కసీట్లో కొచ్చి కూర్చున్నాను. నువ్వు సినిమాచూస్తుంటే, నేను నీ కళ్ళలోకి చూస్తూ కూర్చున్నాను" ఆమె చెబుతున్న కొద్దీ అతని గుండె వేగం హెచ్చింది.

 

    "ఇక ఎందుకులే అబ్బాయ్. ఇప్పటికే సతమతమైపోతున్నట్టున్నావ్. నీకింకో పజిల్ చెబుతాను. దానికి సమాధానం చెప్పు. ఈ ప్రశ్న చిన్నదే అయినా నీ లవ్ డిక్షనరీలో ప్రేమపట్ల నీకున్న పరిజ్ఞానం ఎంతటిదో తెలియజేస్తుంది."

 

    "ఏంటది చెప్పు" పట్టుదలగా అన్నాడు శ్రీధర్.

 

    "ఫిబ్రవరి ఫోర్టీన్ కున్న ప్రాముఖ్యత ఏమిటి? ఇది చాలా చిన్న ప్రశ్న. ఇది కూడా చెప్పలేకపోతే నిన్ను 6.30 కింద జమకట్టడమేమిటి? అసలు ఈ 6.30 అంటే ఏమిటి?

 

    తనకు తెలియకుండానే ఆమె ప్రశ్నలపట్ల ఆలోచనల్లో పడిపోయాడు శ్రీధర్.

 

    కాలం నీరవ నిశ్శబ్దంలో కలిసి కరిగిపోతోంది. ఎంతకీ శ్రీధర్ ఆలోచనలు ఒక కొలిక్కి రావడంలేదు.

 

    "ఇబ్బందిగా వుందా? ఏమీ తట్టడంలేదా? ఒక గంట టైం తీసుకునే చెప్పు. నీ అమాయకత్వం నాకు బాగా నచ్చిందోయ్. వుంటాను, గుడ్ నైట్" అని ఆమె అనగానే ఫోన్ డిస్ కనెక్ట్ అయిన శబ్దం వినిపించింది శ్రీధర్ కి.

 

    ఫోన్ డిస్ కనెక్ట్ అయినా, చేహ్తిలో వున్న కార్డ్ లెస్ ఫోన్ పీస్ ని మదర్ పీస్ మీద రెస్ట్ చేయలేదు.

 

    అతనికిదంతా ఒక కలలా అనిపించింది. ఒక మెరుపు మరిసి మాయమైనట్టు, తనను తానే మర్చిపోయినట్టు, కొద్ది క్షణాలపాటు కాలం స్థంభించి పోయినట్లు, ఒక విచిత్రమైన భ్రాంతికి లోనైపోయాడు శ్రీధర్.

 

    నిర్వచించలేని ఒక గాఢమైన అనుభూతి అతడ్ని వివశుడ్ని చేసింది. ఇప్పుడు అతను మూసుకున్న కనురెప్పల వెనుక ఊహాజనితమైన అపరిచితురాలి ఊహాచిత్రం క్రమంగా రూపుదిద్దుకోసాగింది. అతని ప్రమేయమేమీ లేకుండానే.


                              *    *    *    *


    క్రమంగా క్షణాలు నిమిషాలుగా మారిపోయి ఆ హాలు గోడలమధ్య పేరుకున్న నిశ్శబ్దంలో కరిగిపోతున్నాయి. ఫిబ్రవరి 14 ప్రాముఖ్యత ఏమిటి? అతి చిన్న ప్రశ్నే అని అపరిచితురాలు అంటోంది. విదేశాల్లో చదువు పూర్తిచేసిన తను ఇంత చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయిన పక్షంలో ఆ అమ్మాయి తనని, తన శక్తిసామర్థ్యాన్ని చులకనగా చూసే అవకాశం వుంది.

 

    కేవలం జనరల్ నాలెడ్జికి సంబంధించిన అతిచిన్న ప్రశ్నలా తోస్తోందది.

 

    తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.

 

    కాలం అతని ఆలోచనతో పెనవేసుకుని పోటీ పడుతోంది.

 

    పది...పదిహేను...ఇరవై...ఇరవైఐదు...

 

    నిమిషాలు గడిచేకొద్ది అతనిలో టెన్షన్ చోటు చేసుకోసాగింది... ఇంతవరకూ మొదటి పజిల్ కి సాల్వ్ చేయలేని తను రెండో ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోతే ఆమె తనని ఎంత ఎగతాళి చేస్తుందో? తన ప్రతిభా పాటవాలకు పెనుసవాలై ప్రశ్నిస్తున్నట్టుందా ప్రశ్న.

 

    అల్మారాలో వున్న కాంపిటీషన్ సక్సెస్ ఇయిర్ బుక్స్, మరెన్నో జికె పుస్తకాలను బైటికి తీసి వేగంగా రిఫర్ చేయసాగాడు.

 

    కొద్ది నిమిషాల్లో గదంతా చెదిరిపోయిన పుస్తకాలతో చిందర వందరగా తయారైంది. ఒక్క గంట గడువులో ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థాయికి తను ఎలాంటి పరిస్థితుల్లోనూ చేరుకో కూడదు అన్న పట్టుదల ఎక్కువయిందతనిలో.

 

    అప్పటికే అరగంట గడిచింది....

 

    ఇంకో అరగంట తర్వాత ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది. సమాధానం దొరకందే ఎలా చెప్పగలడు?

 

    సరీగ్గా అప్పుడే మోగింది ఫోన్.

 

    కొంపదీసి అపరిచితురాలి ఫోనై వుండదుకదా... సంశయిస్తూనే రిసీవర్ ఎత్తాడు శ్రీధర్.

 

    "ఏంటబ్బాయ్... ఏం చేస్తున్నావ్? నిద్రరావడంలేదా..." నవ్వుతూ జయారెడ్డి గొంతు వినిపించింది.

 

    ఒక్క నిమిషం ఆలోచించి- "అపర్ణ గుర్తొస్తోంది" అన్నాడు కావాలనే.

 

    "ఇదిగో అబ్బాయ్... డాన్సర్స్ ని, రచయితలనీ, కవులనీ, చిత్రకారులని, సంగీతకారులని - ఇలాంటి కళాకారుల జోలికి వెళ్ళమాక. వాళ్ళదంతా అదో వింత ప్రపంచం. చేతికి చిక్కరు. ఊహకి అందరు. పిచ్చోడివైపోగలవు. నా మాట విని నా దారిలోకొచ్చేయ్."

 

    ఒక్కక్షణం ఆలోచించి అపరిచితురాలి ప్రశ్న గుర్తొచ్చి అన్నాడు "ఫిబ్రవరి 14 కున్న ప్రాముఖ్యత ఏమిటో చెప్పగలవా?"

 

    "వెరీ సింపుల్... ఒకసారి నా ఫ్లాట్ కొచ్చేయ్... సమాధానం చెప్తా" అట్నుంచి అందామె.

 

    "తెలిస్తే ఫోన్ లో చెప్పొచ్చుగా..." టైం దగ్గరపడుతుంటే ఆతృతను కప్పిపుచ్చుకుని అడిగాడు శ్రీధర్.

 

    "ఏం ఫర్లేదులే రా అబ్బాయ్... నిన్నేం చెయ్యన్లే."

 

    అపరిచితురాలిచ్చిన గడువుకింకా పదిహేను నిమిషాలే మిగిలి వున్నాయి.

 

    "సరే ... వచ్చేస్తున్నాను" అని చెప్పి, తాళం తీసుకుని, తలుపు దగ్గరగా లాగి, లాక్ చేసి 'ఎ' బ్లాక్ నుంచి 'బి' బ్లాక్ లో వున్న జయారెడ్డి ఫ్లాట్ కెళ్ళాడు.

 

    "వెల్ కం మైడియర్ శ్రీధర్..." అంది అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ జయారెడ్డి.

 Previous Page Next Page