"పిచ్చితల్లి, మనమెవరమమ్మా - ఇవన్నీ అనుకోవడానికి అంతా ఆ భగవంతుని లీల. ఎవర్ని ఎప్పుడు కలుపుతాడో ఎప్పుడు దూరం చేస్తాడో అంతా అతనిష్టమే. మనం కేవలం నిమిత్తమాత్రులం" అంది.
ఆమె మాటల్లోని మాధుర్యాన్ని అర్థం చేసుకుని ఆనందించింది రాధిక.
ఆదివారం ఉదయం ఎనిమిదిగంటల పదినిమిషాలకు పెళ్ళి - శనివారం, సోమవారం ఆఫీసుకి సెలవుపెట్టి స్నేహితుని కారు అడిగి తీసుకుని, శనివారం ఉదయమే వేగంగా పరుగెత్తసాగాయి రాధిక మస్తిష్కంలో. ఏవో కబుర్లతో ఆమెను ఆలోచనల నుంచి తప్పించాలని మధన్ యెంతో ప్రయత్నం చేసినా, విఫలమయింది.
కారు ఆదివారం తెల్లవారుఝామున సత్తెనపల్లి చేరుకుంది. మధన్ ని చూసి, గబగబా కారు దగ్గరికి వెళ్ళారు శ్రీహరిగారు. పక్కనే వున్న రాధికను చూసి గుర్తుపట్టారు. ఆనందం, దుఃఖం ఒక్కసారిగా ఆతనిని ఆవరించి పిచ్చివాణ్ణి చేశాయి. ఏనాడో చచ్చిపోయిందనుకున్న అమ్మాయి పెరిగి పెద్దదయి, అందాలరాశిగా తన ఎదుటే నిలబడినా అమ్మా అని పిలిచి ఆనందించే అదృష్టానికి నోచుకోలేని తన అసమర్థతకి అసహ్యం అంతలోనే తనకు కాబోయే వియ్యంకుడు అటుకేసే రావడం గమనించిన శ్రీహరిగారు "ఇతను మా ప్రాణ స్నేహితుని కొడుకు బావగారు. సాంబశివరావుగారు మా యింటిపక్కనే వుండేవారని చెప్పానే వాళ్ళబ్బాయి ఒక్క కుటుంబంలోని వాళ్ళలా వుండేవాళ్ళం "మధన్ ఇతను మా వియ్యంకుడు" అని పరిచయం చేశాడు.
తలవంచుకునుంచున్న రాధిక వంక ప్రశ్నార్థకంగా చూశారు వియ్యంకుడు. అది గమనించిన శ్రీహరిగారు!
"అన్నట్టు ఈమె డాన్సరు రత్నావళిగారు. పేరు వినే వుంటారు" అన్నాడు శూన్యంలోకి చూస్తూ వొణుకుతూన్న కంఠంతో.
ఆ పరిచయ వాక్యాలు విని షాకుతిన్నదానిలా ఉలిక్కిపడింది రాధిక." నమస్కారమండీ. మీ పేరు విన్నాం కానీ మిమ్మల్ని చూడగలగడం మా అదృష్టం" అన్నారు వియ్యంకుడు.
"నమస్కారమండి" అంది ఎలాగో గొంతు పెగలించుకుని రాధిక.
"లోపలికి వెళదాం రండి" అంటూ ముందు నడిచారు శ్రీహరిగారు. "వుండు బాబు మీ అత్తయ్యను పిల్చుకొస్తాను. ఎక్కడుందో అది" అంటూ గబగబా లోపలి గదిలోకెళ్ళాడు.
రాధిక కన్నీళ్ళను దాచుకోవడానికి చీరకొంగు, "తప్పు" అంటూ సౌంజ్ఞ చేశాడు. లోపలి నుంచి ఏవో గుసగుసలు వినపడసాగినయ్. "అదేమిటండి కన్నకూతురు యిన్ని సంవత్సరాలు తరవాత తనకు తానుగా యింటికొస్తే పరాయిదానిలా చూడటం ఏ తల్లయినా చెయ్యగలదా! పాపం మనల్ని చూడాలని ఎంత తహతహలాడిపోతోందో. ఆ దేవుడు దానికి అన్యాయం చేశాడు. లేకపోతే ఈ పెళ్ళికి లక్షణంగా అది మొగిడితోటివచ్చి పెత్తనం చేస్తూ వుండేది" ఏడుస్తోంది ఆమె.
అది తల్లిగొంతుకై వుంటుందని ఊహించింది రాధిక. "అమ్మా నువ్వు మంచిదానవమ్మా" అనుకుంటూ కళ్ళు తుడుచుకుంది రాధిక. కుతూహలంగా సంభాషణ వినసాగింది.
"సరోజిని, మాకు మాత్రం ప్రేమా, మమకారం లేదంటావా కానీ ప్రస్తుతం మన కర్తవ్యం ఏమిటో ఆలోచించుకో. రాధిక, రేణుక ఇద్దరూ మనకి రెండు కళ్ళలాంటివారు. ఏ కన్ను కావాలని కోరుకుంటాం? ఏ కన్నుని వదిలిపెడతాం. రాధికవల్ల రేణుక జీవితం మనం ఇప్పుడు కూడా కొంచెం ఓర్పుతో సహనం వహించాలి."
"ఏమండి రాధిక మనబిడ్డని తెలిసినంత మాత్రాన నష్టమేముంది? పోయిందనుకున్న పిల్ల దొరకడం అదృష్టం..."
"సరోజినీ, కాకిపిల్ల కాకికి ముద్దు కావొచ్చు. ఊరందరికీ ఇష్టం కావొద్దు. రాధిక పుట్టింది మనింట్లోనే అయినా ఒక నీచమయిన చోట పెరిగింది. తాటిచెట్టుకింద పాలు తాగినా లోకాన్ని నమ్మించడం కష్టం----"
సంభాషణ ఆగిపోయాక. రాధిక మధన్ లు ఒకరిమొహాలొకరు చూసుకున్నారు. "విన్నావుగా మధన్ నా బ్రతుక్కు విలువయెంతుందో? తల్లిదండ్రులచేత కూడా అనుమానింపబడి ఛీ అనిపించుకున్నాక బ్రతికెందుకు చచ్చెందుకు!"
"రాధీ, ఉద్రేకంలో అన్నమాటల్ని యధార్థాలుగా భావించకూడదు. శ్రీహరిగారు క్లిష్ట పరిస్థితుల్లో నిస్సహాయుడుగా ఇరుక్కున్నారు అంతే కానీ---"
అంతలోనే శ్రీహరిగారూ, సరోజినీకూడా అక్కడికి రావడంతో మధన్ మాటల్ని ఆపేశాడు.
"ఈమె రత్నావళి" పరిచయం చేశారు శ్రీహరిగారు భార్యని.
"నమస్కారం" అంది ఆమె అప్రయత్నంగానే ఆమెకేసి తదేకంగా చూస్తూ.
మూగబోయినదానిలా, మాట పెగలక కళ్ళతోనే నమస్కరిస్తూ, తల్లిమొహంలోకి చూస్తూ ఏదో తెలియని తియ్యని అనుభూతిని పొందింది రాధిక.
"మీరు మొహాలు కడుక్కోండి. కాఫీ పట్టుకొస్తాను." అంటూ, చకచకా వెళ్ళిపోయింది సరోజిని.
పుట్టెడు దుఃఖాన్ని కడుపులో పెట్టుకుని, ఎలా మాట్లాడగలిగిందో, ఆశ్చర్యపోయింది రాధిక.
"మధన్ ముహూర్తం కాగానే వెళ్ళిపోదాం. నా తల తిరిగిపోతోంది. గుండెలు బద్దలయిపోతున్నాయి. నన్ను డాన్సర్ రత్నావళిగా, ఒక పరాయిదానిలా, పరిచయం చెయ్యడం కన్నా, నన్ను నిర్లక్ష్యంగా పలకరించకుండా వున్నా సంతోషించి ఉండేదాన్ని. కానీ, కన్నవారే, కానివారిలా, ప్రవర్తిస్తూ వుంటే భరించలేకపోతున్నాను" వెక్కి వెక్కి ఏడుస్తూన్న రాధికను, ఓదార్చాడు మధన్, ఊరడింపు మాటలు చెబుతూ.
కాలకృత్యాలు తీర్చుకుని, కాఫీ ఫలహారాలు పూర్తిచేసి, పందిట్లోకి వెళ్ళారు జనమంతా. అప్పుడే పెళ్ళికూతురిని తీసుకొచ్చి పీటలమీద కూర్చోబెడుతున్నాడు మేనమామ. గులాబిరంగు బెనారస్ చీర, అదే బ్లౌజు, గులాబీ పువ్వులా, నిగనిగలాడుతూ, మధన్ వెనకాలే పందిట్లోకి వచ్చి కూర్చుంది రాధిక. తెల్లనిపట్టు చీరలో కడిగిన ముత్యంలా మెరుస్తూన్న చెల్లెల్ని చూసి మల్లె మొగ్గలా ముడుచుకున్న ఆమె ముగ్ధసౌందర్యాన్ని చూసి మురిసిపోయింది రాధిక. సంతోషంతో కన్నీరు కార్చింది. "ఈవిడే డాన్సర్ రత్నావళి" హైదరాబాద్ పిల్లకదూ"..... రకరకాలుగా జనంలోంచి గుసగుసలు వినపడుతున్నాయ్.