ఆకలి
రామ్మూర్తి ఆ చెట్టు క్రింద అరగంట నించి నుంచున్నాడు. నుంచుని నుంచుని కాళ్ళు పీకాక ఆ చెట్టు మొదటే చతికిల పడ్డాడు. ఆ పెద్ద మర్రిచెట్టు ఇచ్చే నీడ అతని ప్రాణానికి చాలా హాయిగా వుంది. ఇంట్లోకంటే ఇక్కడే హాయిగా వుందనుకున్నాడు. వీలయితే ఆ చెట్టు నీడన ఉత్తరీయం పరుచుకుని కడుపులో కాళ్ళు పెట్టుకు పడుకోవాలనుంది అతనికి. కానీ, ఎవరయినా చూస్తే? ఇదేమిటి ఇక్కడ పడుకున్నావు? అని ఆరాలు తీస్తారని భయపడ్డాడు. లేకపోతే ఇల్లు, పెళ్ళాం, పిల్లలు వగైరా మాటలు మరిచి అలా పడుండేవాడు ఆ చెట్టు నీడని....
అతనికి ఇంటి కెళ్ళాలంటే భయం.... ఇంటికెళ్లేంచెయ్యాలి? ఇక్కడలేనిది ఇంట్లో ఏంవుంది? అతని ప్రశ్న అది?
అతను కూర్చున్న చెట్టుకి మూడు నాలుగు గజాల దూరంలో పెద్ద కాంపౌండు వున్న యింటి పెరటిగోడ కనిపిస్తుంది. గోడమీదనుంచి పందిళ్ళు, రాటలు, చాందినీలు, మామిడి తోరణాలు కనిపిస్తున్నాయి. అంతకి అరగంట క్రితం వరకు బాజా భజంత్రీలు ఫెళ్ళున మ్రోగి ఆగిపోయాయి. పెళ్ళయిపోయిందన్నమాట అనుకున్నాడు రామ్మూర్తి. 'పెళ్ళి' అన్నమాట అనుకోగానే అతనికి ఇంట్లో పెళ్ళికెదిగి కూర్చున్న ఇద్దరాడపిల్లలు. ఎదగడానికి తయారుగా వున్న మరో ఇద్దరాడపిల్లలు గుర్తువచ్చారు.... ....అతనికి గుండెల్లో కలచినట్లయింది.... చప్పున ఆ ఆలోచనలు మరలించడానికి పెళ్ళివారింటినుంచి వినవస్తున్న మాటల మీదికి దృష్టి మరలించేడు. "విస్తళ్ళు తుడిచి మరీ వడ్డించండి సుమా!".... "సూరమ్మొదినా! అప్పడాలు ఇచ్చావూ వేయించడానికి" .... కూరలు, పచ్చళ్ళు అన్నీ వడ్డించండి. పెళ్లివారు వచ్చేశారు. "జారీలలోకి నెయ్యి తీశారూ".... "ఒసేవ్ జానకీ మొగపెళ్ళివారి ఆకుల దగ్గర అగరొత్తులు వెలిగించండర్రా".... "ఏవండోయ్ పంతులుగారూ కాస్త చూసి వడ్డించండి...." కలగాపులగంగా ఆడ మగ మాటలు వినపడుతూంటే కుతూహలంగా వినసాగాడు రామ్మూర్తి.
పెళ్ళిపందిట్లోంచి కూరలు, పులుసులు, వాసనలు ఘుమఘుమలాడుతూ ప్రహరీ దాటి రామ్మూర్తి నాసికాపుటాలలోకి సోకాయి. రామ్మూర్తి నోట్లోంచి నీళ్ళూరడం మొదలుపెట్టాయి. ఆకలికి ధీనంగా వ్రాలి సోలిపోయిన రామ్మూర్తి పేగులు ఆ వాసనకి లేచి కూర్చుని ఆవురావురుమని అరవసాగాయి.
"నెయ్యి పుచ్చుకోవాలి బాబూ"....ఆ వంకాయ ముద్ద ఇటు రానీయండి.... మరికాస్త పప్పు వడ్డించమంటారా, 'గరిట పట్టుకొచ్చి పులుసులో ముక్కలు వేయవయ్యా' .... 'ఇటు బూరెలు వడ్డించనే లేదు. ఇద్దర్నిటు పంపు.... ....'
వింటున్న రామ్మూర్తికి ఆ వంకాయ ముద్ద రుచి, ఆ గుమ్మడికాయ పులుసు ఘుమఘుమ, బూరెలు, పులిహోర రుచులు గుర్తుకు వస్తూంటే అతని ఆకలి మరింత పెరిగింది. తింటే వంకాయ ముద్ద, ఆ పులుసు పెళ్ళింట్లోనే తినాలి. ఉత్తప్పుడు చస్తే ఆ రుచి రాదుగదా!....
రామ్మూర్తి మనసు 'తాదూర కంతలేదు మెడకో డోలు' అన్న సామెత మరచి పెళ్ళి భోజనం గురించి ఆలోచిస్తూంది. ఆ పెళ్ళివారింటికి వెళ్ళి భోజనం చేస్తే!? ఇంతమంది తింటున్నారు, అడిగితే ఓ మనిషికి విస్తరేసి పట్టెడన్నం పెట్టమంటారా?.... కానీ.... ఎలా అడగడం? తను ఏ ముష్టివాడో అయితే జాలితలచైనా అందరూ తినగా మిగిలింది ఇంత పడేస్తారు.... పోనీ పిలకా, అంగోస్త్రం వగైరాలతో వుంటే ఏ బీద బ్రాహ్మడనో గౌరవం కొద్ది అయినా విస్తరేసి పెడతారు.... తన అవతారం చూస్తే బ్రాహ్మడని ఎవరూ అనుకోరు.... అలా అని ముష్టివాడిలాగా లేడు. వెళ్ళి అడిగితే, 'వెళ్ళవయ్యా.... వెళ్ళు, దుక్కలాగ వున్నావు అడుక్కోడానికి సిగ్గులేదూ' అంటారేమో....
"అయ్యయ్యో.... కుక్క.... కుక్క, కొట్టండి.... పెరటి తలుపులు వేయండి" పెళ్ళి పందిట్లో కేకలు.... లోపల్నించి వస్తున్న భోజన పదార్థాల సువాసనలని ఆఘ్రాణిస్తూ తలుపు సందులోంచి దూరినట్టుంది కుక్క. ఎవరో నడ్డి విరగగొట్టారు. 'కుయ్యో' మంటూ ఇవతలకి వచ్చిపడింది కుక్క. జాలిగా దానివైపు చూశాడు రామ్మూర్తి.
అక్కడ ఆ కుక్కే కాక మరో అరడజను కుక్కలు చెత్త డబ్బా దగ్గర ఆత్రుతగా ఎంగిలాకుల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాయి. వాటితో పోటీకి అక్కడ ఓ అరడజను మంది ముష్టివాళ్ళు కూర్చున్నారు.
ఆఖరికి ఓ అరగంట తర్వాత భోజనాలు అయినట్లున్నాయి. "గోవిందా! గోవిందా!" అంటూ కొన్ని గొంతుకలు అన్నాయి.... చేతులు కడుక్కుంటున్న చప్పుడు. కుక్కలు తోకాడించుకుంటూ చెత్త డబ్బాకి మరి కాస్త దగ్గరగా జరిగాయి. మరిపావుగంటకి గోడమీదనించి "దబ్" మని ఎంగిలి విస్తళ్ళు పడ్డాయి.... ముష్టి వాళ్ళు కర్రలతో కుక్కల్ని అదిలిస్తూ పరిగెత్తి ఎవ్వరి కందినన్ని ఎంగిలాకులు వాళ్ళు జాగ్రత్తపరుచుకున్నారు. వాటిల్లోంచి అన్నం కూరలు, బూరెలు అన్నీ తీసి విడివిడిగా ఓ ఆకులో పెట్టుకుంటున్నారు.... "ఇవి మా ఆస్తి, మీకేం హక్కులేదు" అన్నట్టు గుర్రుమంటూ కోపంగా చూస్తూ, నిస్సహాయంగా అరుస్తున్నాయి కుక్కలు.
రామ్మూర్తి వింతగా చూస్తున్నాడు ఆ ముష్టి వాళ్ళని .... ....వాళ్ళు మహదానందంగా, ఆబగా, విందు భోజనం తింటున్నంత ప్రీతిగా ఆ ఎంగిలాకులలోనివి తీసుకుని తింటున్నారు. వాళ్లు తింటూంటే రామ్మూర్తి ఆకలి మరింత పెరిగింది.... తిండిలేక చస్తున్నా తను ఇలాంటి పని చేయగలడా?
గోడమీదనించి విసిరిన విసురుకి విస్తర్లోంచి ఓ మిఠాయి వుండ దొర్లి రామ్మూర్తి కాళ్ళదగ్గిర పడింది. దానిమీద పడింది రామ్మూర్తి దృష్టి. షోగ్గా, సుతారంగా చిన్నముక్క మాత్రం కొరికి వదిలిన వుండవైపు ఆశగా చూశాడు రామ్మూర్తి. అది చూస్తుంటే అది తీసుకు తినాలన్న కోరికని నిగ్రహించుకోలేక పోతున్నాడు.... .... ఆమట్టి దులిపేసి తింటే....? ఎంగిలయితేనేం ఆ కాస్తమేరా వదిలేస్తే సరి.... లేకపోతే ఆ పైపు దగ్గిరకి తీసికెళ్ళి కాస్త కడిగేసి తింటే.... ....పేగులు కాస్త చల్లబడతాయి.... "బొత్తిగా అంత హీనానికి దిగజారుతావా" అని మనసు నిలేసింది. ఎవరన్నా చూస్తే.... ....రామ్మూర్తి సందేహిస్తూ ఆలోచించే లోపలే ఓ కుక్క ఆ వుండని చూడనే చూసింది. ఒక్క ఉరుకునవచ్చి నోట కరుచుకుని పారిపోయింది. రామ్మూర్తికి ఉక్రోషం ముంచుకువచ్చి పెద్దరాయి తీసి కుక్కని కొట్టాడు.
ఆ ముష్టివాళ్లు తినడం ముగియగానే మరో అరడజను మంది ముష్టివాళ్ళు క్రొత్త బ్యాచి విస్తళ్ళ కోసం వచ్చారు. అలా చూస్తూ కూర్చుంటే ఆకలికి వాళ్లతోపాటు తనూ జతయి పోతానన్న భయంతో.... వాళ్ళు తింటూంటే చూసి ఆకలి భరించలేక, అక్కడనించి కదిలాడు రామ్మూర్తి.
నాలుగడుగులు వేసేసరికి.... ఓ ముసలమ్మగారు ఎడాపెడా సంచులు మోస్తూ నడవలేక నడుస్తూంది. రామ్మూర్తిని చూసి ఆగి, కాస్త సందేహిస్తూనే "చూడు నాయనా .... కాస్త ఈ సంచులు ఇంటిదాకా తెచ్చిపెడతావూ.... .... పావలా ఇస్తాలే.... వాడి దుంపతెగ ఆ రిక్షా చచ్చినాడు రూపాయి పావలా కావాలన్నాడు.... ....ఎంతో దూరం లేదులే.... ఆ రెండో వీధేలే" అంది.
రామ్మూర్తి గతుక్కుమన్నాడు. తను కూలివాడిలా కనిపిస్తున్నాడా? కనిపించాడేమో! మాసినపంచె, చిరిగిన షర్టు, రెండు నెలలుగా క్షవరానికి నోచుకోని జుట్టు, మాసిన గడ్డం, తన అవతారం చూసి ఆవిడ అనుకుంటే ఆవిడిదా తప్పు!