Previous Page Next Page 
కొత్తనీరు పేజి 17


    "మరి నేనేం చెయ్యను? మీరే చెప్పండి తాతగారూ! నే నింతకీ ఏ జాతికి చెందినదాన్నని నాకే సందేహం వస్తూంటుంది అప్పుడప్పుడు. ఏ జాతీలేని నేను, ఇంకో జాతికి చెందినవాడిని పెళ్ళాడితే వచ్చే నష్టం ఏముంది? తాతగారూ, మీరు చెప్పండి. నేను తెలుగుదాన్నా, తమిళురాలినా!"
    "అదిగో, చూశావా? రేపు నీకు పుట్టె పిల్లలకీ యీ సందేహమే రావచ్చు! నువ్వు మీ అమ్మానాన్నలమధ్య నలిగినట్లే నీ పిల్లలు నలగాలని కోరుతున్నావా? తెలిసి ఉండీ మళ్ళీ అలాంటి పొరపాటు చేయబోవడం సమంజసంగా లేదు ఉషా!" సూటిగా మనవరాలిని చూస్తూ అన్నారాయన.
    ఉష తల దించుకుంది.
    "నువ్వు ఎవరికి చెందుతావన్న సందేహం నీ కెందుకు వచ్చింది అసలు? చదువుకున్నదానివి, ఆమాత్రం తెలియదా? మన ఆచారం, కట్టుబాట్లు అనుసరించి తండ్రికి చెందుతారు బిడ్డలు. మన లోనే ఏమిటి, ప్రపంచంలో ఎక్కడయినా అదే ఆచారం. తండ్రి జాతి, మతం, భాషే పిల్లలవీనూ! పిల్లలకి తండ్రి ఇంటిపేరు వస్తుంది గాని తల్లి ఇంటిపేరు రాదుగదా! అంచేత నువ్వు ఆంధ్రురాలివి! నీ భాష తెలుగు! అందుకు నీ కే మాత్రం సందేహం అక్కరలేదు.
    "అయితే ఇది అనుకోవడం వరకే! కాగితాలమీద వరకే! నిజానికి తండ్రికంటే తల్లితో చేరిక ఎక్కువ ఉంటుంది పిల్లలకి. ముప్పాతిక మూడువంతుల పిల్లలకి తల్లి అలవాట్లు, ఆచారాలే పట్టుబడతాయి. ఎవరి విషయమో ఎందుకు? నీ సంగతి చూడు! ....నీకు మీ అమ్మ అలవాట్లే వచ్చాయి. తమిళం మాట్లాడినంత ధారాళంగా తెలుగు మాట్లాడలేవు. తమిళం రాయడం, చదవడం వచ్చును; తెలుగురాదు.... ......!"
    "స్కూల్లో సెకండ్ లాంగ్వేజి అరవం తీసుకున్నానుకదూ!" ఉష సంజాయిషీ యిచ్చింది.
    "అదే......తెలుగు ఎందుకు తీసుకోలేదు? ఏమయినా ఇలాంటి విషయాలలో తండ్రి ప్రాబల్యంకంటే తల్లి ప్రాబల్యం ఎక్కువగా వుంటుంది ఇంట్లో. మీ అమ్మ అభీష్టాలు, అభిరుచులే పాటించారు మీరు. అందులో మీరు తమిళదేశంలో ఉండిపోవడం ఈ పరిస్థితులకి మరింత దోహదం చేసింది. లాగే రేప్పొద్దున నువ్వు అతన్ని పెళ్ళాడితే, నీ పిల్లలకి నువ్వు మాట్లాడే భాష, నీ అలవాట్లు, ఆచారాలు రావడంలో ఆశ్చర్యంలేదు. అప్పుడు మళ్ళీ మీ యిద్దరిమధ్య అభిప్రాయభేదాలు వస్తే ఆశ్చర్యం ఉండదు....."
    "ఏమిటో తాతగారూ!......ఇదంతా గంద్రగోళంగా ఉంది నాకు. ఏం చెయ్యాలో తోచడంలేదు...."
    "తోచకపోవడానికి ఏముంది, పిచ్చిదానా! నాన్న చెప్పినట్లు విని, నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడానికి యింత ఆలోచన దేనికి?" పార్వతమ్మ అంది.
    "మరి అమ్మకి కోపం రాదూ?"
    "అమ్మ కోపం ఎన్నాళ్ళుంటుందే వెర్రిదానా? ముందు కాస్త కోపగించినా, నువ్వు సుఖంగా కాపురం చేసుకుంటూంటే ఆ కోపం. పంతం ఎగిరిపోతాయి!"
    "అసలు నన్నెవరు చేసుకుంటారు? ఈ అభ్యంతరం ఒకటి వుంటుందిగదా!.......మొన్న వచ్చినవాళ్ళు చేసుకోకపోవడానికి యిదేగా కారణం" ఉష సందేహం వెలిబుచ్చింది.
    "నీ కెందుకు ఆ సంగతి? నువ్వు "ఊఁ!" అంటే మిగతా దంతా నేను చూస్తాను. " అన్నారు జగన్నాథంగారు నిబ్బరంగా.
    ఉష ఆశ్చర్యంగా చూసింది.
    "అవునే అమ్మా! మీ తాతగారు నీకోసం ఓ మంచి సంబంధం చూశారు. మీ తాతగారి స్నేహితుడికొడుకు. పిల్లవాడు బుద్దిమంతుడు. గవర్నమెంటు ఉద్యోగం. వెయ్యిరూపాయల జీతం. నువ్వు సరే అంటే ఆ అబ్బాయిని పిలిపిస్తారు పెళ్ళిచూపులకి." పార్వతమ్మ ఉత్సాహంగా అంది.
    ఉష నేలచూపులు చూస్తూ ఊరుకుంది.
    "ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఏమిటి నీ అభ్యంతరం?"
    ఉష తలెత్తి చూసింది. "రాజేశ్వరీ..... ......అతను ఏమనుకుంటారో!"
    "వాళ్ళకి మాట ఇయ్యలేదన్నావుగా?"
    "లేదనుకోండి!......కాని.....కాని అది ఫీలవుతుందేమో!" ఇబ్బందిగా అంది ఉష.
    "ఏమిటమ్మా!.....ఇది నీ జీవిత సమస్య! ఎవరో యేదో అనుకుంటారని, అంటారని యిలాంటి విషయాలలో తప్పటడుగు వేస్తావా? నీకు వయసు వచ్చింది. చదువుకున్నదానివి. ఆలోచించు. నీకు యేది మంచిదని తోస్తే అది చెయ్యి. అంతకంటే నేనుమాత్రం యేం చెప్పగలను? మీ నాన్న చేసిన పొరపాటే మళ్ళీ నువ్వు చేసి బాధపడవద్దనిమాత్రం ఇంకోసారి చెపుతున్నాను."
    "ఒసే ఉషా! పెద్దదాన్ని చెపుతున్నాను. తాతగారి మాట వినమ్మా, పెద్దవాళ్ళం ఎందుకు చెపుతామో తెలుసుకో! తాతగారు చెప్పిన సంబంధం చేసుకుంటే అమ్మకి నాన్నమీద కోపం రాదు, తాతగారు చూశారు కాబట్టి. మీ నాన్న సంతోషిస్తాడు.....ఏమంటావు? మీ నాన్న ఊరికే నీ పెళ్ళిగురించి ఆదుర్దాపడుతున్నాడు. ఇరవై రెండేళ్ళ దానివి. ఇంకెప్పుడు పెళ్ళి చేసుకుంటావు!"మనవరాలిని బుజ్జగిస్తూ అంది పార్వతమ్మ.
    ఉష తాతగారివంక, బామ్మవంక చూస్తూ ఊరుకుంది.
    "దీనికంత ఆలోచన ఎందుకమ్మా! నీ యిష్టం యేమిటో చెప్పు! సిగ్గెందుకు?" అన్నారు తాతగారు.
    "బావుందండి. ఎంత చదువుకుంటే మాత్రం ఆడపిల్లకి సిగ్గుండదండీ! మీ కెందుకు, వాళ్ళని చూసుకోవడానికి రమ్మని చెప్పండి. నా ఉషతల్లి నామాట కాదనదు!" ఉష ముఖంలో భావాలు చదువుతూ అంది పార్వతమ్మ.

 Previous Page Next Page