Previous Page Next Page 
కొత్తనీరు పేజి 18


    "ఉండు, నువ్వు చెప్పడం యేమిటి! పెళ్ళిచేసుకునేదాన్నే చెప్పనీ! ఏమ్మా ఉషా, ఏమంటావు?"
    "సరే......పెద్దవాళ్ళు మీ మాట ఎందుకు కాదనాలి? అమ్మ నాన్నమీద కోపగించదు యిలాఅయితే" తనలో తను అనుకున్నట్లు అంది ఉష.
    వృద్ధదంపతుల ముఖాలు విప్పారాయి.
    "గుడ్, అలావుండాలి! పెద్దవాళ్ళు చెప్పినమాట వినడం బుద్ధి మంతుల లక్షణం." జగన్నాథంగారు లేచి మనవరాలి భుజం తడ్తూ ఆప్యాయంగా అన్నారు.
    "అది ఎప్పుడూ బుద్ధిమంతురాలే! వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళని వదిలి ఏడాది ఇంగ్లండు వెళ్ళిపోతే, పాపం, అది ఒక్కనాడన్నా అల్లరి చేసిందా! అదిగో, ఆ సీనుగాడే అల్లరివాడు!" మనవరాలిని మురిపంగా చూస్తూ అంది.
    "ఆ....ఎల్లుండి దశమి మంచిరోజు! అబ్బాయి సెలవమీద యిక్కడే వున్నాడు కనక వచ్చి పిల్లను చూసుకోమనండి.....వెంటనే పని జరిగిపోతుంది....." ఉత్సాహంగా అంది పార్వతమ్మ.
    "అలాగే.....సాయంత్రం అటు వెళ్ళి రామనాథంతో చెపుతాను..." జగన్నాథంగారు తృప్తిగా అన్నారు.
    
                               *    *    *
    
    అన్న టైముకి పెళ్ళివారు-తల్లి, తండ్రి, పెళ్ళికొడుకు-చూసుకోవడానికి వచ్చారు. రామనాథం జగన్నాథంగారి మిత్రుడే అవడంవల్ల పిల్లని చూసుకోవడం తప్ప మిగతా విషయాలు మాట్లాడుకోనవసరం లేకపోయింది.
    ఉషని చూసిన వెంటనే వాళ్ళకి ఆ విషయమూ అభ్యంతరం లేకపోయింది. పెళ్ళి కొడుకు సుధాకర్ కళ్ళు మెరిశాయి ఉషని చూడగానే. చూసిన మొదటిక్షణంలోనే ఉష అతనికి అన్ని విధాల నచ్చింది.
    మర్నాడే రామనాధం తమ అంగీకారం తెలిపి, వీలయినంత తొందరలోనే ముహూర్తం పెట్టమని మిత్రుణ్ణి కోరాడు. పార్వతమ్మ ఎంతో సంబరపడిపోయింది.సంబంధం యింత వెంటనే కుదిరినందుకు.
    జగన్నాథంగారు విషయం తెలుపుతూ వెంటనే రావలసిందని కొడుక్కి టెలిగ్రాం యిచ్చారు.
    ఉష అన్నివిధాలా యోగ్యుడైన సుధాకర్ ని చూడగానే ఆలోచనలను, సంకోచాలను అన్నింటిని వెనక్కినెట్టేసి మనస్ఫూర్తిగానే తన అంగీకారం తెలిపింది, తాతగారికి. తన సమస్య యింత తేలికాగా పరిష్కారం అయినందుకు ఎంతో సంతోషించింది. తల్లిని సమాధానపరచడం ఆమెకి పెద్ద కష్టంగా తోచలేదు. అసలు సుధాకర్ ని చూస్తే తల్లి కూడా ఏ అభ్యంతరం చెప్పదన్న విశ్వాసం కలిగింది ఉషకి.
    రామం వచ్చి సుధాకర్ ని చూసి, వాళ్ళతో అన్ని విషయాలూ మాట్లాడాక, అన్నివిధాలా సంబంధం నచ్చి, వెంటనే సుధాకర్ సెలవు అయి వెళ్ళేలోపల తాంబూలాలు పుచ్చుకోడానికి నిశ్చయించాడు. ఇంక అప్పుడు మీనాక్షికి తెలియజెయ్యకపోవడం సముచితం కాదని, వైరుచేసి ఆమెను రప్పించాడు. ఆ తాంబూలాల లాంఛనం తీర్చివేసుకుని, రెండు నెలలలో ముహూర్తంకూడా నిశ్చయం చేసుకున్నాడు.
    మీనాక్షి వస్తూనే సంగతితెలుసుకుని నిర్విన్నురాలైంది. ఒక్క క్షణం ఏమనాలో తోచక తెల్లబోయింది. పెద్దవారని మామగారి ఎదుట ఏమీ అనకుండా ఊరుకున్నా.....తరవాత ఏకాంతం దొరకగానే మొగున్ని నిలదీసి అడిగింది. "నాకు తెలియనియ్యకుండా, నాకు చెప్పకుండా కూతురి పెళ్ళికి యీ దొంగతనం ఎందుకు? చాలు మాటుగా పెళ్ళిచూపులు యేర్పాటుచేస్తారా? కన్నతల్లిని ఉన్నానని మరచిపోయారా?" ఏడుపు మినహాగా ముఖం ఎర్రబడింది.
    "ఇందులో దొంగతనం, చాటుమాటు ఏం లేదు. ఏమైనా సంబంధాలు ఉంటే చూడమని నాన్నకి రాశాను. ఆయన చూశారు. ఉషకి నచ్చింది. నాకు నచ్చింది యీ సంబంధం. అందుకే వెంటనే నిశ్చయించాను! అంతేగాని యిందులో నువ్వనుకున్నట్లు ఏ దొంగతనం ఏమీ లేదు. నీకు యిష్టం ఉన్నా లేకపోయినా, చేసుకునేదానికి యిష్టమయింది కాబట్టి యీ పెళ్ళి జరిగితీరుతుంది" అని తెగేసి అన్నాడు రామం. భర్తని ఏం అనలేక కూతురిమీద కోపగించుకుంది మీనాక్షి. "కన్నతల్లిని నా మాటలకంటే నీకు మీ తాతగారి మాట ఎక్కువదన్న మాట! నీ మంచికోరిచెపితే నామాట లక్ష్యపెట్టావుకాదు. నాకు తెలియకుండా తండ్రి, కూతురు కలపి యింతనాటకం ఆడతారా? .....ఎంతయినా ఆ తండ్రికి తగ్గ కూతురివేలే! ఆ రక్తంలోవున్న బుద్దే నీకూ వచ్చింది......మీరూ మీరూ ఒకటే......నేనే పరాయిదాన్నయిపోయాను." కళ్ళు తుడుచుకుంది మీనాక్షి.
    ఉష తల్లిని సమాధాన పరచడానికి సర్ది చెప్పింది. "ఇందులో నీ మాట కాదనడానికి, అవుననడానికి ఏముందమ్మా? నేనుచూసింది. యిష్టపడింది వ్యక్తిని గాని, జాతినికాదు, అరవవాడా, తెలుగువాడా అని నేను చూడలేదు. అన్నివిధాలా అతను నాకు నచ్చాడు. ఇందులో తాతగారుగాని, నాన్నగాని చెప్పిపెట్టింది ఏమీలేదు. నువ్వయినా నాన్నయినానా మంచికోరే చెపుతారు. నాకు యిష్టమయే చేసుకుంటున్నాను గాని, ఒకరు చెప్పారనికాదు. నీమాట కాదన్నానని బాధపడతావేమిటమ్మా? అతను ఒక్క తమిళదేశంవాడు కాడన్న అభ్యంతరం తప్ప, ఏమైనా లోటు కనిపించిందా నీకు?.....అనవసరంగా గొడవ చెయ్యకమ్మా, ఏమి లేనిదానికి..." తల్లిని శాంతపరుస్తూ అంది ఉష.
    రామం భార్య గొణుగుడును ఎంతమాత్రం లక్ష్యపెట్టలేదు. అతనికి కూతురిపెళ్ళి కుదిరిందనగానే తలమీదనించి పెద్దభారం దింపినట్లయింది. ఈ సమస్య యింత తేలికగా, యింత త్వరలో పరిష్కారం అయి, కూతురికి మంచి సంబంధం కుదిరిందన్న ఆనందంలో మీనాక్షి కోపం పట్టించుకోలేదు. రెండు మూడురోజులు అంటుంది, తరవాత తనే వూరుకుంటుంది అని ఒక్కమాటకీ జవాబీయకుండా ఊరుకున్నాడు.
    పెళ్ళికొడుకుని చూశాక మీనాక్షికి కూడా ఏం అభ్యంతరం చెప్పాలో తెలియలేదు. ఏ విషయంలోనూ ఉషకి మొగుడు కావడానికి తగని అయోగ్యత ఎంత వెతికినా కనపడకపోవడంతో ఆమెకు ఊరుకోక తప్పలేదు. తమిళుడు కాడన్నది ఒక్కటితప్ప మీనాక్షికి ఏ అసంతృప్తి లేకపోయింది. అయినా కొన్నాళ్ళు, సమయం వచ్చినప్పుడల్లా గొణుగుతూనే ఉంది. కాని, తండ్రి, కూతురు తననిలక్ష్యపెట్టక పోవడంతో ఊరుకుంది. ఇదంతా మామగారే చేశారన్న కోపం మాత్రం మనసులో వుంది మీనాక్షికి.

 Previous Page Next Page