Previous Page Next Page 
కాదేదీ కథకనర్హం పేజి 16


    "మరి మీకు దాని సంగతి, అదే, యిలా జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది."
    "అది యిల్లు వదిలాక యిలా పెళ్ళి చేసుకున్నాం అని ఉత్తరం రాసి పడేసింది. వారం తరువాత . అంతే! ఆ వుత్తరం చూసి మా వారు ఓ రోజంతా గదిలో వుండి కటిక ఉపవాసం చేసి ఎవరితో మాట్లాడలేదు---గది నుంచి వచ్చాక "యింత అది నాకు చచ్చినదానితో సమానం. దాని పేరు గాని, దాని సంగతి కాని యీ యింట్లో వినపడకూడదు " అని చెప్పేశారు అయన మగవారు కనక. కన్నతల్లిని నేను లోలోపల ఎంత బాధపడ్డా ఆయనకి జడిసి నోరెత్తలేదు. సరే ఎక్కడో దానికి కావాల్సినవాడితో సుఖంగా బతుకుతుందిలే అని సంతోషపడ్డాను. అదింట్లోంచి వెళ్ళిన పదినేలలకి కాబోలు మా ఆడపడుచు కూతురు ఉత్తరం రాసింది ---' భారతి మా వూళ్ళో వుంది. ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. ఆడపిల్ల -----నేను ఆస్పత్రిలో పురిటికి వెళ్తే అక్కడ కన్పించింది . అతనేమయ్యాడో ? అది ఒక్కర్తే దిక్కుమొక్కు లేకుండా పడుంది . కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని వుంది. దాని ఆరోగ్యం అసలు బాగోలేదు. ఎంతడిగినా ఏం చెప్పలేదు ఏడవడం తప్ప. నాకీ శిక్ష కావాల్సిందే అన్న ముక్క తప్ప భారతి ఏం మాట్లాడలేదు. ఇంతమంది వుండీ దిక్కులేని దానిలా ఆరో రోజున బిడ్డని ఎత్తుకుని ఆస్పత్రిలోంచి వెళ్తుంటే చూడలేకపోయాను . బలవంతంగా అడిగితే ఎడ్రసు యిచ్చింది. అయన వెళ్ళి చూసి వచ్చారు. చిన్న గదిలో పిల్లని పెట్టుకుని అతి బీదగా తినీ తినక కాలం గడుపుతుంది. అత్తా మీరు ఓసారి చూడండి. భారతి స్థితి బాగోలేదు" అని రాసింది. ఆ వుత్తరం చూసి విల్లవిల్లాడపోయాను. అయన ఉత్తరం చదివి శిలలా వుండిపోయారు. నేను ఆయనతో దెబ్బలాడి, ఏడ్చి, అయన వారిస్తున్నా మాట వినను అని మొండికేసి బయలుదేరి వెళ్లాను. అక్కడ దాని దైన్యస్థితి చూసి నా గుండెలు తరుక్కుపోయాయి. పదిహేను రోజుల తోలిచూలు పురటాలు ---- ఉదయం వండుకున్న ఎండు మెతుకులు పచ్చడితో మింగుతోంది. చంటి పిల్లకి పరపడానికి పాత గుడ్డలు కూడా కరువయిన దాని దీనస్థితికి గుండెలవిసిపోయేలా ఏడ్చాను. యిద్దరం ఒకరిని ఒకరు వాటేసుకుని ఏడ్చాం. అడగ్గా అడగ్గా అది ఒక్కక్క విషయం చెప్పింది అతి కష్టం మీద. యిద్దరూ పారిపోయి సింహాచలం వెళ్ళి పెళ్ళి చేసుకుని తరవాత హైదరాబాదు వెళ్ళారట. చవకరకం లాడ్జింగులో రూము తీసుకున్నారట. యిద్దరూ ఓ రెండు నెలలు శుభ్రంగా తిని తిరిగారు. ఈలోగా అతను ఏవేవో ఉద్యోగ ప్రయత్నాలు చేశాడట. నెల నెల గడుస్తుంటే చేతిలో డబ్బు, నగలు అయిపోతున్నా ఉద్యోగం దొరకలేదు. నాల్గునెలలకి అతనికి దొరకలేదు కాని దీనికి ఏదో చిన్న ప్రయివేటు స్కూల్లో టీచరుగా రెండు వందల యాభైకి ఉద్యోగం దొరికిందట. అప్పటికే దీనికి మూడోనెల. ఆయనగారికి చేతిలో డబ్బు లేకపోవడం, ఉద్యోగం దొరక్కపోవడంతో విసుగులు, చిరాకులు, కసుర్లు, దెబ్బలాటలు ఆరంభమయ్యాయి. ఊరంతా బలాదూరు తిరిగి రాత్రి, భోజనానికి వచ్చేవాడట. దీనిమీద మోజు తగ్గిపోగానే .....'ఛా.....నీవల్లే నాకీ కష్టాలు లేకపోతె హాయిగా యీ పాటికీ ఏ ఎమ్మెస్సీలోనో చేరి చదువుకునేవాడిని. ప్రేమ అనుకుని గోతిలోకి దిగాను" అంటూ సాధించి తిట్టిపోసేవాడట. అరునేలలకి ఏదో ఆఫీసులో గుమస్తా ఉద్యోగం దొరికిందట. అప్పటినించి అసలు యింటి పట్టున వుండకుండా తెచ్చుకున్నది తింటూ తిరిగేవాడుట. ఒక్కోసారి రెండు మూడు రోజులకీ వచ్చేవాడు కాదుట. అడిగితె "నాయిష్టం నోర్మూసుకో" అనేవాడట. యింకా నిలేస్తే "నువ్వేం నా పెళ్ళానివా అడగడానికి ' అన్నాడట. యిది నిర్ఘాంతపోయి "నీ భార్యని కానా?" అంటే "ఏదీ సాక్ష్యం చూపించు . ఆ దేముడు వచ్చి సాక్ష్యం చెపుతాడా" అని వికటంగా నవ్వేవాడట. ఆ తరువాత ఎన్నోసార్లు వాళ్ళ ఆఫీసులో టైపిస్టు తో తిరుగుతూ కన్పించాడట. ఆఖరికి ఎనిమిది నెలలకి, దీనికి అరునేలలప్పుడు యిది స్కూలుకి వెళ్ళగా చూసి, యింట్లోంచి తన పెట్టె బేడా పట్టుకు పోయాడుట.
    "రాస్కెల్, ఎంత పనిచేశాడు, యిది ఎలా వూరుకుంది, పోలీసులకి రిపోర్టు యివ్వాల్సింది.'
    "ఎమనిస్తుంది ----వాడు దీని భర్త అనడానికి సాక్ష్యం ఏముంది? అప్పటికే ఆరునెలలు, అబార్షన్ చేయించుకుందామన్నా కుదరక చచ్చినట్టు వాడి పాపాన్ని మోసి కనింది. అప్పటివరకు అది పడ్డపాట్లు వింటే కసాయి గుండెన్నా చెదిరిపోతుంది. రెండువందల ఏభై;లో ఎనభై రూపాయలు గది అద్దె పోగా, మిగిలిన దాంతో ఒక పూట తిని, ఒక పూట తినక నీరసంతో , తొమ్మిదో నెల వచ్చేవరకు ఉద్యోగం చేసింది. పురుడు అదీ అయి వచ్చేవరకు ఖాళీగా వుంచం అని వాళ్ళు యింకో టీచరుని వేసుకున్నారట! ఈ నెలరోజులుగా చేతిలో దమ్మిడీ లేక , ధర్మాసుపత్రిలో పురుడు పోసుకుని, వాళ్ళిచ్చిన బ్రెడ్ ముక్కలు తిని ఆరు రోజులు గడిపి, యింటికి వచ్చాక అదీ లేకుండా పడివుంటే మా ఆడపడుచు కూతురు తిట్టి ఐదొందలు ఇచ్చిందట. అప్పుగా తీసుకుంటానని తీసుకుందిట. యిప్పుడు యింకో వుద్యోగం దొరికే వరకు అదే ఆధారం అమ్మా" అంది శుష్కహాసం చేస్తూ.
    "మేం చచ్చేమనుకున్నావే. నీకింత పంతం ఏమిటే. యిలా దిక్కులేని దానిలా పడుంటావా" అని తిట్టాను. ఏడ్చాను వెంటనే యింటికి పదమన్నాను. అది ససేమిరా రానంది. "ఏం మొహం పెట్టుకుని రాను . వద్దమ్మా నా తప్పుకి నేను శిక్ష అనుభవించాలి. నా తప్పు నేనేరినెత్తినైనా రుద్ది వాళ్ళకి భారం అవను. నాలాంటి  ఆడపిల్ల లందరూ నా కధ వల్ల నీతి నేర్చుకోవాలి. మిమ్మల్ని పెట్టిన ఉసురికి నాకీ శిక్ష తప్పదు. అనుక్షణం నా తప్పు నాకు తెలిసి వచ్చేట్టు నేనిలా నరకయాతన పడుతూనే వుండాలి. నా తప్పుకి, నా పాపానికి ఫలితంగా యీ బిడ్డని కన్నాను అంతే. చచ్చినట్టు దీన్ని పెంచి పోషించాల్సిన బాధ్యత నాది. నా పాపం మీరూ పంచుకోవద్దు --- వద్దు నన్ను వదిలిపో అమ్మా- నాన్న నా మొహం చూడడు. నేనక్కడికి వచ్చి మిగతా పిల్లల పెళ్ళి పేరంటాలకి ఓ అసమస్యగా అడ్డ్డురాను" అంటూ ఎంత చెప్పినా ససేమిరా రానంది ---బలవంతంగా ఓ ఐదువందలు చేతిలో పెట్టి పిల్లకి కావాల్సిన బట్టలు, దుప్పట్లు, పాలడబ్బా, దానికి మందులు అవీ కొన్నాను. మొదటి కాన్పు ఖర్చు మాది. పెళ్ళయితే పురుడు పోయమా, అందుకే నేనేం చేసినా మాట్లాడకూడదు " అని తిట్టాను. "సరే, ఆడపిల్ల పెళ్లియ్యాక పుట్టింటి నుంచి ఎంత వరకు ఏం పొందవచ్చో అంతకంటే ఎక్కువ నాకొద్దు --- అంతకంటే ఏం యిచ్చినా పుచ్చుకొను" అంది. మా ఆడపడుచు కూతురికి మధ్యమధ్య వెళ్ళి చూడమని చెప్పి గుండె రాయి చేసుకుని వచ్చాను. యింటికి వచ్చాక జరిగింది చెపితే అంత కఠినంగా మారిపోయిన అయన ఆరోజంతా తలుపులు బిగించుకుని ఏడ్చారు. తరువాత ఆయన రాసినా, నేను రాసినా అది రాలేదు. ఆఖరికి ఆయనకి తెలిసిన ఫ్రెండు ద్వారా, బి.హెచ్.యీ.ఎల్ గర్ల్స్ స్కూల్లో ఆరువందల ఏబై రూపాయల ఉద్యోగం యిప్పించారు. కాస్త దాని బతుకు తెరువు ఏర్పడిందని సంతృప్తి పడడం కంటే యింకే చేయ్యమమ్మా? యిప్పుడు పుట్టింటి నుంచి నేను పంపే పచ్చళ్ళు, అవీ వద్దనదు. పండక్కి రమ్మని అయన రాస్తే ఏడాదికి ఒకసారి రెండుసార్లు వచ్చి నాల్గురోజులుండి వెడుతుంది. చీర యిస్తే పుచ్చుకుంటుంది. అంతకు మించి దమ్మిడీ పుచ్చుకోదు. అలా ఒంటరిగా ఆ పిల్లతో ఉద్యోగం చేసుకుంటూ బతుకీడుస్తుంది"
    'మళ్ళీ అతని కబురు తెలియలేదా, అలా వదిలేయడ,మేనా ఆ రాస్కెల్ ని"
    'ఆయనా నేనూ అదే అంటాం. వాడి పేరెత్తడానికి వీలు కాదంటుంది. వాడి నీడ కూడా నామీద నాకూతురి మీద పడకూడదంటుంది. మరి జన్మలో మగవాడి అండ దండలు కోరను, పది జన్మలకి మగవాళ్ళని నమ్మను అంటుంది కసిగా, అయిందేదో అయిపొయింది ఈరోజుల్లో రెండో పెళ్ళి తప్పుకాదు, పిల్లని నేను చూసుకుంటాను. కాస్తో కూస్తో డబ్బు పారేసి ఎవరికన్నా యిచ్చి పెళ్ళి చేద్దాం అన్నా అది అసలు వింటుందా? ఉరిమి చూస్తుంది. "పెళ్లి - ఇంకా మగవాడ్ని నమ్ముతానా" అంటుంది హేళనగా, దాని కసి అంతా దాని మీదే చూపించుకుంటూ, దాన్ని అదే శిక్షించుకుంటూ అష్టకష్టాలు పడుతూ బతుకుతోంది.
    భానుమతి కళ్ళు తుడుచుకుంది. సునయన మనసు వికలమాయిపోయింది. ఎలాంటి భారతికి ఎలాంటి దుర్గతి? భారతి లాంటి దురదృష్టవంతుల కధలు మరింత మంది భారతుల్ని అలాంటి దుర్గతినించి కాపాడగలిగితే ఆమె ఆశయం నెరవేరుతుంది! కాని అది జరిగెదా? "ప్రేమలో పడకండి అమ్మాయిలూ జాగ్రత్త" అంటే చెప్పిన వాళ్ళని చూసి హేళనగా నవ్వుకుంటారు ----- తప్పటడుగు వేస్తారు ----ఊబిలో కూరుకుపోతారు ----ఎలా వీళ్ళని రక్షించడం!
    దారి పొడవునా సునయన అలా ఆలోచిస్తూనే వుంది!

                                                                                                          (వనిత)

 Previous Page Next Page