Previous Page Next Page 
కాదేదీ కథకనర్హం పేజి 15


    పిచ్చి అమ్మ, నాన్న ....ఎంత సంబరపడిపోయారు ------ కూతురు ఆఖరికి దారికి వచ్చిందని, మొండితనం మాని తమ మాటల్లో నిజం గుర్తించిందని సంతోషపడిపోయారు. ఆ సంతోషంతో యింకాస్త ఎక్కువ ఖరీదు పెట్టి పెళ్ళి చీరలు కొనుక్కోమన్నారు. స్నేహితులందరికీ వేరే డిన్నరిచ్చుకొమన్నారు. శుభలేఖలు వేయించారు. తమ తాహతుని మించి ఘనంగా పెళ్ళి ఏర్పాట్లు చేశారు. నిజంగా తనను దురదృష్టం వెంటాడుతుందని ఆనాడు గుర్తించలేక ఆ అదృష్టాన్ని ఆనందాన్ని కాలదన్నుకుంది ......యెంత మోసం చేసింది తల్లి తండ్రులని. ఎంత బాధకి, అవమానానికి , రంపపు కోతకి గురి చేసింది కన్నవాళ్ళని. వాళ్ళ శాపమే తగిలి తనీనాడు యిలా అనుభవిస్తోంది. తన మేలుకోరి , తనని సుఖంగా ఆనందంగా చూడాలన్న వాళ్ళ తాపత్రయాన్ని నిర్లక్ష్యంగా నవ్వుకొని, నిర్దయగా లోకానికి మొహం చూపలేనట్లు చేసిన తనకి యీనాటి ఈ శిక్ష సరి అయిందే! పెళ్ళికి వారం వుందనగా స్నేహితులకి శుభలేఖలు పంచి వస్తానని చెప్పి, చేయించిన నగలు బ్యాగులో పెట్టుకుని పెళ్ళి ఖర్చుల కోసం ఉంచిన డబ్బులో రెండు వేలు పట్టుకుని ఇల్లు దాటింది!
    ఆనాటితోనే తనకి సుఖద్వారాలు మూసుకుపోయి నరకద్వారాలు తెరవబడ్డాయి. -------అని గుర్తించలేక -మహా తెలివిగా తనెంత చలాకీగా తప్పించుకు వచ్చిందో టాక్సీలో వెడుతూ చంద్రకి చెప్పి నవ్వుకున్నారు. దేముడి సమక్షంలో భార్య భర్తలయి హోటలు రూములో రాత్రి ఆనందపు శిఖరాలు అందుకున్న వేళ తనేదో ఘనకార్యం సాధించినట్టు సంబరపడిపోయింది. "హు.....వాళ్ళకేం తెలుసు, ఈ ప్రేమలో దొరికే దివ్యానుభూతి -----పిచ్చివాళ్ళు .....వాళ్ళు చూసేది ఎంతసేపు చదువు, ఉద్యోగం, తప్ప రెండు హృదయాలు కలవాలన్నది వాళ్ళకి అర్ధంకాదు -- 'అనుకుంది. ఈ పాటికి తనకోసం ఆరాటపడ్తూ వెతుక్కుంటారని , పెళ్ళి వారం వుందనగా పెళ్ళి కూతురి మాయం అయితే వాల్లెదుర్కోవలసిన అవమానం తలచుకుని అరక్షణం బాధపడ్డా ------ నేచేపితే వినకపోతే నా తప్పా, నా ప్రేమని అర్ధం చేసుకుని ఆశీర్వదిస్తే యిలా జరిగెదా? నా తప్పేం వుంది? వాళ్ళకి ముందే చెప్పాను' అనుకుంది. మరే ఆలోచనలు మనసులో జొరబడకుండా రాత్రికి పగలుకి తేడా తెలియకుండా ఉప్పెనలా చుట్టూ ముట్టిన చంద్ర ప్రేమలో ముంచి తేల్చాడు. హు....అది ప్రేమా! .....రబ్బిష్.....జస్ట్ లాస్ట్....నధింగ్ ఎల్స్.....తనలాంటి పూల్స్ --మోహాన్ని ప్రేమ అనుకుంటారు!.... ఆ తెలివి తక్కువ తనానికి తను సరి అయిన మూల్యమే చెల్లించింది....అప్పటికి ఈ రెండేళ్ళలో ఓ వందసార్లన్నా తనని తాను తిట్టుకున్నట్లే ఆ రాత్రి నిద్ర ముంచెత్తే వరకు తిట్టుకుంది భారతి. అన్ని భాధలను మరిపించే నిద్రాదేవత ఆఖరికి కరుణించేవరకూ గతం తలచుకుంటూనే నిద్రలోకి జారింది.

                                             *    *    *    *

    'అంటీ.....ఎలా వున్నారు? ఈ మధ్య మీ భారతీ మావూళ్ళో బస్సు స్టాపులో కన్పించింది. మాట్లాదేలోపల బస్సు వచ్చేసింది. అలా అయిపోయిందేమిటి? పుల్లలా, కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని వుంది. చంటిపిల్ల , ఆ ఉద్యోగంతో అలా అయిపోయిందా? వాళ్ళ ఆయనేం చేస్తున్నారు? ఇది అంత కష్టపడి వుద్యోగం చేయక పోతేనేం? వాళ్ళ అయన ఇంజనీరేమోకదా!" -- సునయన పుట్టింటికి వచ్చి బజార్లో భారతి తల్లి కనిపిస్తే పలకరించింది. భానుమతి మొహం మ్లానమయింది. ఈ పిల్ల తెల్సి వేళాకోళంగా అడుగుతుందా లేక అరా తీయడానికి అడుగుతుందా , లేక అసలు విషయం తెలియదా? ఆవిడ సునయన వంక చూసి విషాదంగా నవ్వింది. "దాని ఖర్మ అమ్మా అంతా. దానిరాత అలా తగలడితే యింకేం చేస్తుంది? దాని రంగంతా పోయింది. కట్టే పెడులా వంట్లో మాంసం లేనట్టు ఎండిపోయింది. రాతమ్మా రాత" ఆవిడ కళ్ళల్లో నీరు తిరుగుతుండగా యింకేం చెప్పలేని స్థితిలో వెళ్ళిపోయింది. సునయనకు ఏమీ అర్ధం కాక తెల్లబోయింది. యింటి కెళ్ళాక తల్లిని అడిగింది.
    "అయ్యో నీకు తెలియదా ఆ భారతి సంగతి -- అవును నువ్వు ఇండియాలో లేవుగా .....ఆ పిల్ల ఎంతకీ తెగిన్చిందో తెలుసా , తల్లుదండ్రులు నిక్షేపం లాంటి సంబంధం కుదిరిస్తే ఎవడినో ప్రేమించానని ఓ తలామాసినవాడితో యింట్లోంచి పారిపోయి పెళ్ళి చేసుకుంది. పాపం యింకా పెళ్ళి వారం రోజులుండగా కూతురు యీ పని చేసినందుకు ఎవరికీ మొహం చూపలేక ఆ తల్లీ తండ్రి కుమిలిపోయారు. తండ్రికయితే మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చింది. కూతురు అలా చేసిందన్న బాధతో, కోపంతో "యింక అది చచ్చినదాని కిందే మాకు లెక్క" అనుకున్నారు వాళ్ళు.... తరువాత సంగతులు నాకంత బాగా తెలియవు కాని యిప్పుడా అమ్మాయి వాడితో కల్సి వుండడం లేదట ---- ఓ పిల్ల పుట్టిందట , యిటు తల్లి తండ్రికి కాక అటు ప్రేమించినవాడికి కాక ఆ పిల్ల తో అష్టకష్టాలు పడుతూ ఏదో ఉద్యోగం చూసుకుని బతుకుతుందని విన్నాను. ఇలాంటివి డైరక్టుగా ఎలా అడుగుతాం, ఈనోటా ఆనోట విన్నవి తప్ప. అసలు సంగతి నాకు తెలియదు --" అందావిడ.
    'అంటే వాడు భారతిని వదిలేసిపోయాదేమిటి ? యిద్దరూ పెళ్ళి చేసుకోలేదా? అయ్యోపాపం భారతి ఎంత స్మార్టుగా చలాకీగా వుండేది, యిలా అయిందా దానికి "------ సునయన విచారంగా అంది.
    "తల్లితండ్రి పిల్లని కన్నారు గాని దాని రాతని కనలేదు ---- ఎంతో ముద్దుగా అన్నీ చెయ్యాలనుకున్నా దాని ఖర్మ అలావుంటే ఇంకోలా ఎందుకు జరుగుతుంది.
    సునయనకి భారతి గురించి తెలుసుకోవాలన్న ఆరాటం నిలవనీయలేదు. "వాళ్ళమ్మగారిని అడిగివస్తాను" అంటూ, తల్లి 'బావుండదే" అంటున్నా వినకుండా భారతి యింటికి బయలుదేరింది.
    "రా అమ్మా.....ఆరోజు బజార్లో నువ్వు భారతి సంగతి చెప్పగానే నా మనసు తల్లడిల్లిపోయింది . యింకేం మాట్లాడలేకపోయాను. దాని మాట విన్నా, తల్చుకున్నా , గుండెలు చెదిరిపోతాయి. దాని ఖర్మ.....ఏనాడో పాపం చేసింది --- అనుభవిస్తుందినాడు."
    'అంటీ, యిలా ఎందుకయింది? ఎందుకిలా చేసింది భారతి? వాళ్ళిద్దరూ అసలు పెళ్ళి చేసుకోలేదా, అతను దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడా అంటీ -----" సునయన బాధగా అంది.
    "ఏం చెప్పనమ్మా..... యిలా ఎందుకయిందంటే ......దాని ఖర్మ అనడం మినహా ఏం చెప్పను? ఆ త్రాష్టుడు దాని జీవితానికి నిప్పు పెట్టాడమ్మా---ప్రేమ కబుర్లు చెప్పి దీన్ని వలలో వేసుకుని నమ్మించి, దేముడి గుడిలో మూడుముళ్ళు వేసి మోజు తీరేవరకు ఆరునెలలు కాపురం చేసి , యింకోదాని మోజులోపడి దీని ఖర్మానికి దీన్ని వదిలి వెళ్ళాడు. గుడిలో దేముడు సాక్ష్యం చెప్పడానికి రాలేదు అప్పుడు. ఇంత చదివి లోకజ్ఞానం లేని మూర్ఖురాలిలా ఓ రిజిష్టర్ పెళ్లన్నా చేసుకున్నాది కాదు. ఆరునెలలు కాపురం చేసి ఐదు నెలల గర్బిణిగా వున్నదాన్ని వదిలి, తనదారి తను చూసుకున్నాడు. యిది తెచ్చిన నగలు, డబ్బు అయిపోగానే దాటుకున్నాడు దీన్ని నట్టేటముంచి."
    "భారతి ఏం చేసింది మరి.....ఇంటికి వచ్చేసిందా మళ్ళీ ...."
    'అలా వచ్చినా బాగుండేది ....ఎంత తిట్టినా, కొట్టినా మొహం చూడమని శపధాలు చేసినా కన్నవాళ్ళం కనక కరిగి దానికి ఆశ్రయం యిచ్చేవాళ్ళం. లేదమ్మా ----ఆ దెబ్బతో దాని మనసు విరిగిపోయింది. దాని నమ్మకాలని, దాని ప్ర్రేమని నేల రాసి వాడు వెళ్ళాక ఆ అవమానంతో తనింక మొహం చూపిస్తే అందరూ హేళన చేస్తారని గాబోలు ---నేచేసిన తప్పుకి శిక్ష నేనే అనుభవించాలి ----నా తొందరాపాటుకి ఈ శాస్తి సరి అయిందే అంటూ తనని తాను శిక్షించుకోడానికి అది ఎన్ని యిక్కట్లు పడినా, ఎన్ని కష్టాలు పడినా సహిస్తూ బతుకుతుంది గాని మా గుమ్మం లోకి రాలేదమ్మా---దానికి స్వాభిమానం , పంతం చిన్నప్పటి నుంచి ఎక్కువే."

 Previous Page Next Page