Previous Page Next Page 
ముద్దుగుమ్మ పేజి 17

    వరసగా చెప్పుకుపోతున్నాడా పెద్దమనిషి అదేదో ఉపన్యాస ధోరణిలో. ఆ పెద్దమనిషి చెప్పేది కొంచెం అర్ధమై, కొంచెం అర్ధంగాక అయోమయంగా అనిపించింది పద్మినికి. "అచ్చమ్మ పెళ్ళి వూసుకి, తనకీ సంబంధమేమిటి?" అనుకుంది పద్మిని.

    పద్మిని ప్రియదర్శిని అనుమానం తీర్చడానికా అన్నట్టు ఆ పెద్దమనిషి అసలు విషయంలోకి వచ్చాడు.

    ".........కాబట్టి నేను చెప్పేదేంటంటే ఇక్కడ పెళ్ళికావాల్సిన కుర్రవాళ్లు ఏడెనిమిదిమంది వున్నారు. ఈ ఏడెనిమిది మందికాక యింకా వున్నారు. ఐనా ముందు కొందరినే ఎన్నుకోటం జరిగింది. నిన్ను చూస్తుంటే నీ పెళ్ళి వయస్సు ఎప్పుడో దాటిపోయినట్టు అనిపిస్తున్నది అవన్నీ అనవసరం. ఇప్పుడు నీవు మా పేటలోని మనిషివయ్యావు కాబట్టి మా వాళ్ళల్లో ఒకడిని మనువాడటానికి సిద్ధపడాలి. వీళ్ళందరికి సొంత గుడిశెలు, సొంతంగ ఏవో వొక పనులు వున్నాయి. ఓలి యివ్వగల శక్తి వుంది. నీ కిష్టమైనవాడ్ని ఒకడ్ని చూపించు. వాడితో నీ పెళ్ళి జరిపిస్తాను. తొందరేమీ లేదు. రెండురోజులు ఆలోచించుకోవచ్చు నీ ఇష్టం. మా పేట మనిషి అయింతర్వాత అమ్మాయిగారు అనే పిలుపు మేం మానేస్తాం. అలా అని అగౌరవపరచటంకాదు. మాలో మనిషిగ గుర్తించినప్పుడు మా పద్ధతులతోనే నడవాలి కదా పేరుకూడా తేలిగ్గా పలకటానికి వీలుగా ఇహపై "పద్దమ్మా" అని పిలవటానికి నిర్ణయించడమైనది. ఇది మా పెద్దలందరి తీర్పు" అంటూ ఆ పెద్దమనిషి ముగించాడు. 

    అక్కడున్న మిగతా పెద్దలు అవ్...అవ్ అంటూ గొర్రెల్లా తలలాడించారు.

    ఎవడికి వాడు అమ్మాయిగారు తననే వరిస్తుందన్న ధీమాతో అప్పటికప్పుడే సినిమాల్లోని బాలకృష్ణని, చిరంజీవిని, కృష్ణని తమ అభిమాన హీరోలతో తనని తాను పోల్చుకుంటూ ఫోజులు కొట్టసాగారు.

    అట్లాంటిచోట ఏదొచ్చినా ఉపద్రవమే. అందరూ కలిసి ఒక్కసారిగ "అమ్మాయిగార్కి జై"యన్నారు. ఆ వెంటనే నాలిక్కరుచుకుని "పద్దమ్మకి జై" యన్నారు.

    ఒంటిమీద పల్చగా చర్మాన్ని ఒలిచి దానిమీద ఎర్రకారం రాచి నూట పందొమ్మిది డిగ్రీల యెండలో కింద తారురోడ్డుమీద కాళ్ళకి చెప్పుల్లేకుండ నిలబెడితే ఆ మనిషి పరిస్థితి ఎలా వుంటుందో అప్పుడు అలా వుంది పద్మిని ప్రియదర్శిని పరిస్థితి.

    కోపాన్ని వెళ్ళగక్కలేక నిభాయించుకోలేక నోటిలోంచి మొత్తం మాటలు పెగిలిరాలేక "నో"అంటూ ఒకే ఒక్క అరుపు దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది ప్రియదర్శిని.

    అక్కడేమీ తప్పు మాటలు జరగలేదు. మరి అమ్మాయిగారు ఎందు కరచినట్టు? వాళ్ళంతా ముఖముఖాలు చూసుకున్నారు. పెద్దలు మాత్రం ఇదేమీ పట్టనట్టు వాళ్ళ పని అయిపోయినట్టు తాపీగా కూర్చున్నారు.

    నిన్నటినుంచి అందరిలో ఇంత మార్పు యెందుకొచ్చిందా? అనుకొంది.

    ఇక్కడికొచ్చింతర్వాత తనపట్ల భయభక్తులతో ఉండే పిల్లకాయలు గత రెండ్రోజులనించి వెర్రివేషాలు వేయడం ఇందుకోసమేనన్నమాట. తనకి తెలీకుండానే వాళ్ళల్లో మార్పు రావడానికి కారణం ఇదన్నమాట. అసలు విషయం యిప్పుడు అర్ధమైంది.

    తన పీకకి తగిలించడానికి అందమైన ఉరితాళ్ళు అల్లుతున్నారన్నమాట. వాళ్ళ పద్ధతులు వాళ్ళకుండొచ్చు. అలా అనితన్ని శాసించడానికి వీళ్ళెవరు? ఇలాంటి సమయంలో ఉడుక్కోవడం కాదు. ధైర్యం తెచ్చుకోవాలి. ఎదిరించి నిలబడాలి.  నిర్భయంగా తన మనసులోని మాట చెప్పాలి. తనకిష్టంలేని పనిని ఆ దేవుడు కూడా ఇష్టంగా మార్చలేడు. ఐ డోంట్ కేర్.  

    "నా పెళ్ళి నిర్ణయించడానికి మీరెవరు? నేనొక ఆశయం కోసం మీ బాగుకోసం మా డాడీతో పోట్లాడి బయటికొచ్చాను. మీ కోర్కెలలోని నిజాయితి నన్ను కదిలించింది. కష్టానికి కూడా నెరవకుండా మీ దగ్గరకొచ్చేశాను. అంతమాత్రం చేత నా పెళ్ళి నా యిష్టం లేకుండా మీరు నిర్ణయిస్తారా? పైగా పద్మిని ప్రియదర్శిని అన్న అందమైన పేరు నాకుండగా "పద్దమ్మా" అని పేరుకూడా మార్చేస్తారా డామ్ ఫూల్ ఎవరు? ఎవరిచ్చారు మీకీ హక్కు?" పెద్ద కంఠం చేసుకుని పద్మిని ప్రియదర్శిని అరిచి మరీ చెప్పింది.

    ఆ అమ్మాయి ఆవేశం చూసి అంతా ఆశ్చర్యపోయారు.

    "మేమేం కానిమాట అన్నామని? మా ఆచారాలు మేం చెప్పాం. కులపెద్దల మాటలు చిన్నవాళ్లు వినాలి. అదిక్కడి పద్ధతి మా పద్ధతి కాదు అన్నవాళ్లు బయటికెళ్ళిపోవచ్చు" మేకపోతు గాంభీర్యంతో వో పెద్దమనిషి అన్నాడు.

    "పెద్దల మాటలు చిన్నలు వినాలి. మీ పద్ధతులని యెవరూ కాదనకూడదు. ఒకళ్ళభారం మీరు వహించకపోయినా మీ మాటలు "కాదు" అన్నవాళ్ళని తిరస్కరిస్తారన్నమాట. మీ ఆచారం మీకు మంచిదే! అలాంటప్పుడు మా డాడీ చేసింది కూడా ఎంతమాత్రం తప్పుకాదు. కంపెనీ ఆయనది. వర్కర్స్ అంతా మానాన్న చేతిక్రిందవాళ్ళు. మాడాడీ కంపెనీ తెరిచి మిమ్మల్ని ఆహ్వానిస్తే పనిచేస్తారు. లేకపోతే కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకుంటారు. మిమ్మల్ని పోషించే యజమాని మా డాడీ! అలాంటప్పుడు మా పద్ధతుల ప్రకారం పనిచేసి డబ్బు తీసుకెళ్ళాలి_అంతేగాని సమ్మెలు, గిమ్మెలు అంటూ వెర్రివేషాలు వేయరాదు.  

    ఏ కారణం లేకుండానే మీకంత పట్టుదల ఉన్నప్పుడు ఇంతమందిని పోషించే మా డాడీకి పట్టుదల వుండటం, మీ కోర్కెలు సమంజసం కాదనటంలో కూడా న్యాయం వుంది. కనీసం ఈ విషయమైనా మీరు ఒప్పుకుంటారా?" పరిస్థితులు పాఠాలు నేర్పుతుంటే పద్మిని ప్రియదర్శిని తెలివిగా ఈమాటలు అడగగలిగింది.

    పద్మిని ప్రియదర్శిని అలా మాట్లాడ్డం అక్కడున్న వాళ్ళెవరికీ నచ్చినట్టులేదు. వాళ్ళ ముఖాలు ముడుచుకుపోయాయి.

    పెద్దమనుషులు అప్పటికప్పుడే తెలివిగా ఆలోచించారు. మాటపోతే పరువుపోతుందని గ్రహించి "మా పద్దతుల ప్రకారం ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడటానికి వీలులేదు. అయ్యగారు ఫ్యాక్టరీ మూసేసుకున్నారు. మాకు అదిష్టంలేక సమ్మె చేస్తున్నాం. అలాగే మా పద్ధతులు నీకిష్టం లేకపోతే ఇష్టం లేనట్లు ఉండొచ్చు. కాని ఇక్కడ కాదు మీ ఇంట్లో" అంటూ గంభీరంగా చెప్పేసి పెద్ద మనుషులంతా రచ్చబండ దిగిపోయారు. అప్పటికప్పుడే చాలామంది అక్కడ్నించి వెళ్ళిపోయారు. అక్కడున్న కొద్దిమంది ముఖాలలో అమ్మాయిగారిపట్ల అయిష్టతేచోటు చేసుకుంది.

 Previous Page Next Page