"మీరు కూడా మాతో వస్తారా? ఒంటరిగా ఉన్నారుగా?"
అతనికేసి ప్రశ్నార్ధకంగా చూశాను.
ఫిన్లే పంచ కట్టాడు.
సిల్కు లాల్చీ వేసుకున్నాడు.
అతని వేషంలో నాగరికత ఉట్టిపడుతోంది.
అతని ప్రవర్తనలో ఎంతో సంస్కారం కన్పిస్తోంది.
"ఎక్కడికి వెళుతున్నారు?"
"సింహాచలం... మళ్ళీ సాయంత్రానికి వచ్చేద్దాం."
"నో! థాంక్స్! నేను లైబ్రరీకి వెళుతున్నాను."
"పనిమీద వచ్చారా?"
వంటింట్లోంచి పోపు వేగుతున్న వాసన గుబాళిస్తున్నది
"అబ్బే! పనేం లేదు. కీసు ఇచ్చి వెళదామని. నేను వచ్చేలోపల నాన్నా వాళ్ళు వస్తారేమోనని..." నసిగాను.
అతను ఆశ్చర్యంగా చూశాడు.
"మీ నాన్నగారు ఇవ్వాళా వచ్చేది? పెళ్ళి ఇవాళేనని చెప్పారే!"
నేను గతుక్కుమన్నాను.
"ఏమో వస్తారేమోనని!"
అతను అదోలా నవ్వాడు.
"మీరూ బయటికి వెళుతున్నారుగా?" అంటూ గిర్రున తిరిగి లోపలకు వెళ్ళిపోయాను.
లోపలనుంచి తాళంతెచ్చి తలుపుకు వేశాను. రోడ్డుమీదకు వచ్చాను.
వెనక్కు తిరిగి చూశాను. అతను గేటు పట్టుకొని అదోలా నన్నే చూడటం గమనించాను.
నేను వడివడిగా నడిచి వెళ్ళిపోయాను.
లైబ్రరీ పుస్తకాలు తీసుకుని వంటిగంటకు తిరిగివచ్చేశాను.
వాళ్ళ వాటాకు తాళము వేసివుంది.
చంద్రవదన భర్త బుర్రలో తిరుగుతున్నాడు.
చాలా వింతమనిషి. రాత్రి భార్యను చంపడానికి ప్రయత్నించాడు
తెల్లవారి శెలవు పెట్టి పిక్ నిక్ కు తీసుకెళ్ళాడు.
చంద్రవందన ఆ నరకం ఎలా భరిస్తుందో?
అతడ్నుంచి పారిపోవడానికి ఎందుకు ప్రయత్నించదో? ఆ అమ్మాయికి అందరూ ఉన్నారట. కలిగిన ఇంటిబిడ్డ అని కూడా అమ్మ చెప్పింది.
ఐనా అతని రాక్షసత్వాన్ని ఎలా భరిస్తుందో?
భారతనారి గదా పాపం!
మరి భరించక ఏం చేస్తుంది?
మనస్తత్వ శాస్త్ర గ్రంధాల్లో ఇలాంటి మగవాళ్ళ గురించి వుంది అసాధారణమే అయినా కొందరు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఆశ్చర్యం అతని భార్య అతన్ని అంటిపెట్టుకొని వుండడం పైగా వుత్సాహముగా వున్నట్టు నటించడం.
అతనికి భార్యమీద అనుమానామా?
లేక అతనికి అప్పుడప్పుడు మతి భ్రమణం కలుగుతుందా
ఆ సమయంలో రాక్షసుడిగా మారిపోతాడేమో. స్ప్లిట్ పర్సనాలిటీ కాదుకదా?
ఆలోచించేకొద్దీ బుర్ర తిరిగిపోతున్నది.
దీపాలు వెలిగించారు.
బయటికి వచ్చి చూశాను.
వాళ్ళింకా రాలేదు.
"అమ్మగారూ! వెళతాను" అన్నది పనిమనిషి.
"ఇవ్వాళ నాకు తోడు పడుకో" అన్నాను.
"భయంగా ఉందా అమ్మాయిగారూ?"
"భయం లేదులే. పక్కవాళ్ళు వచ్చాక వెళ్ళు" అన్నాను.
రాత్రి పదకొండు దాటినా వాళ్ళు రాలేదు.
"దూరం పోవాలమ్మగారూ! మా మావకు అసలే అనుమానం" అన్నది పనిమనిషి.
"సరే నువ్వెళ్ళు"
పాపం దీన్ని కూడా మొగుడు చావగొడుతూ ఉంటాడు. అయినా అది మొగుడి మాట వస్తే చాలు ముఖం చాటంత చేసుకొని కబుర్లు చెబుతుంది.
పనిమనిషి వెళ్ళిపోయింది.
తలుపులు వేసుకొని పడుకున్నాను.
మనసు మధన పడసాగింది.
వానాకాలపు రెక్కల పురుగుల్లా ఆలోచనలు బుర్రలో లేచాయి. రాక్షసుడు! దుర్మార్గుడు! భార్యను సింహాచలం, కొండమీదనుంచి తోసేస్తాడో ఏమో...
ఈ పాటికి కొండమీదనుంచి తోసేసి వుంటాడు. ప్రమాదవశాత్తూ పడిపోయిందని చెబుతాడు.
రాత్రి పన్నెండు దాటింది. అయినా వాళ్ళు రాలేదు.
ఆలోచనలతో నా బుర్ర బద్ధలైపోతున్నది.
పోలీసు రిపోర్టు ఇస్తే? అంతలో గేటు తెరచిన శబ్దం.
గబగబా బయటికి వచ్చాను.
అతను అప్పటికే వరండాలో నిలుచుని కన్పించాడు.
చంద్రవదన ఎక్కడ? తాళం తీస్తూ కనిపించింది.
"హమ్మయ్య" గుండెలనిండా గాలి పీల్చుకున్నాను.
"ఏమిటింకా నిద్రపోలేదా?" అతనడిగాడు.
ఏం సమాధానం చెప్పాలో నాకు బోధపడలేదు.
చంద్రవదన నాకేసి చూడలేదు. తాళంతీసి లోపలకు వెళ్ళిపోయింది. "మాకోసం ఎదురు చూస్తున్నారా ఏమిటి?" అతనే అడిగాడు. నేను సమాధానము చెప్పలేదు.
"ఒంటరిగా వున్నారు భయం వేసిందా? మీరూ వస్తే బాగుండేది."
"పుణ్యక్షేత్రమే అయినా పిక్ నిక్ కు వెళ్ళినంత సరదాగా వున్నది" మళ్ళీ అన్నాడు.
నేను గిర్రున తిరిగి లోపలకు వచ్చాను.
"గుడ్ నైట్! హోప్ స్వీట్ డ్రీమ్స్" వెనకనుంచి అతని కంఠం విన్పించింది.
"గుడ్ నైట్! యూ డెవిల్!" తలుపు వెనకనుంచి వేశాను.