వర్షా!
నువ్వు సుఖంగా, ఆనందంగా వున్నావని నాకు తెలుసు. కానీ ఇకముందు ఎలా అన్నదే నాకు భయంగా వుంది. ఎందుకంటే, విక్రం బ్రతికే వున్నాడు. నా దగ్గిరికి వచ్చి నీ అడ్రస్ కోసం చాలా అడిగాడు. తెలియదు అన్నాను. హాస్టల్ కి వెళ్ళాడు. ఈపాటికి తెలిసే వుంటుంది. జాగ్రత్త, అతనికి ఆవేశం ఎక్కువ కదా! నిదానంగా వ్యవహరించు. నాకు అతను వచ్చి వెళ్ళిన తరువాత మనస్సు మనస్సులో లేదు. ఏ సంగతీ వెంటనే తెలియబర్చు.
ఇట్లు
నీ
స్నేహితురాలు
శిల్ప
శిల్ప మరోసారి చదువుకుని, కవర్లో పెట్టి అంటించింది. వర్షకి విక్రం విషయం తెలిపి జాగ్రత్తపదాలని ఆమె సంకల్పం. కానీ విక్రమ్ కీ, వర్షిణి అడ్రస్ తెలియడానికి తానే కారణభూతురాలు అవుతోందని ఆ నిమిషంలో ఆమె వూహించనే లేదు.
వర్షిణి అడ్రస్ వ్రాసి, పోస్ట్ చేసింది.
విక్రమ్ వెయిట్ చేస్తోంది ఆ పోస్టాఫీస్ దగ్గిరే....
* * *
"నిజంగా!" విక్రమ్ కళ్ళు మెరిశాయి. "వర్షిణి" అన్న పేరుతో ఉత్తరం వచ్చిందా?"
"అవును! వారం రోజుల్నుంచీ మీరు పడుతున్న బాధ చూడలేకుండా వున్నామండీ!" అంటూ పోస్టుమాన్ ఒక కవరు అందించాడు.
విక్రమ్ ఒక్క ఉదుటున అతని చేతిలోంచి ఆ ఉత్తరం అందుకుని అడ్రస్ నోట్ చేసుకున్నాడు.
"ఇంతకీ ఆ వర్షిణి ఈవిడ అవునో, కాదో!"
పోస్టుమాన్ తన సందేహం బయటపెట్టాడు.
విక్రం కవరు వెనక్కి తిప్పి చూశాడు. "ఫ్రం శిల్ప, వరంగల్" అని వుంది.
"ఆ వర్షిణే!" అతను ఆనందం పట్టలేక పెద్దగా అరచి పోస్టుమాన్ చేతిలో వంద రూపాయిల నోటు వుంచాడు.
"కవరు ఇటు ఇచ్చెయ్యండి" పోస్టుమాన్ కూడా ఆనందంగా అతని చేతిలోంచి కవరు వెనక్కి అందుకున్నాడు.
* * *
ఆయుర్వేద వైద్యులు ఆచారిగారి అబ్బాయినించి ఫోన్ వచ్చిన మరో పావుగంటకి హర్ష టేబుల్ మీద ఫోన్ మళ్ళీ రింగయింది. విసుగ్గా ఎత్తుతూ రిసెప్షనిష్టుతో "గంటవరకూ ఏ ఫోనూ ఇవ్వొద్దని చెప్పలేదూ?" అన్నాడు కోపంగా.
"మీరు చిన్నప్పుడు తెల్సిన అమ్మాయి ఆట సార్, సాయంత్రం వూరెళ్ళి పోతుందట. చాలా బ్రతిమలాడింది" అంది సంజాయిషీ చెపుతున్నట్టు రిసెప్షనిష్టు.
హర్షకి - రామాచారి తన చెల్లెలితో కలిసి ఈ వూరు వచ్చామని చెప్పిన విషయం గుర్తొచ్చింది. "...సరే యివ్వు" అన్నాడు.
ఒక అందమైన స్వరం లైన్ లోకి వచ్చింది.
హర్షా...నేనూ కోమలిని."
"ఎవరీ కోమలి? కంఠం మాత్రం కోమలంగా వుంది" అనుకున్నాడు.
"మర్చిపోయారా? మీ ఎదురింట్లో వుండేవాళ్ళం. మీ బ్యాచ్ అంతా నన్ను జూనియర్ హేమమాలిని అని పిలిచేవారు అప్పట్లో..." అని కొంచెం ఆగి, సిగ్గుతో.... "అప్పట్లో నేను మీకు 'లవ్ లెటర్' కూడా వ్రాసేను..." అంది సిగ్గుపడుతున్నట్లుగా!
హర్ష కుర్చీలో సర్దుకున్నాడు. ఆ రోజుల్లో అతడికి చాలామంది ఆడపిల్లల్నుంచి ప్రేమలేఖలొచ్చేవి. కానీ...ఎవరీ జూనియర్ హేమమాలిని?
"అప్పుడంటే చిన్నపిల్లవి. ఇప్పుడు బాగా మెచ్యూర్ అయ్యాననుకోండి" సన్నగా నవ్వు.
"సారీ నాకు గుర్తురావటం లేదు"
"అయ్యో! అసలే గుర్తులేవా? ఆ గొంతులో ఎంతో నిరాశ.
హర్ష మళ్ళీ ఓసారి గుర్తుచేసుకోవడానికి 'ట్రై' చేశాడు, లాభం లేకపోయింది. "చెప్పండి, ఏమిటి పని?" అన్నాడు.
"మిమ్మల్ని ఓసారి కలుసుకోవచ్చా? వీలైతే ఇప్పుడే" అంది ఆ అమ్మాయి.
"ఇప్పుడా?"
"ఔను! నేను ఎంతో దూరంలో లేను. మీ ఆఫీసుకి ఎదురు గుండా వున్న హోటల్లోనే వున్నాను. మీ కోసమే అన్నయ్యని ఈ హోటల్లో దిగుదామని బలవంతంగా వప్పించాను"....చిన్న హింట్.
"అయితే ఆఫీసుకే రావొచ్చుగా!" అన్నాడు హర్ష.
"అడక్కుండా వస్తే మీరేమైనా....అనుకుంటారేమోననీ...." అంది ఆ అమ్మాయి తటపటాయిస్తున్నట్టు. "__మీరే ఇక్కడికి రావొచ్చుగా."
"ఫరవాలేదు. మీరే రండి" చెప్పాడు హర్ష వాచీ చూసుకుంటూ.
"మీరు నావల్ల డిస్టర్బెన్స్ ఏమో!"
హర్ష ఏమీ మాట్లాడలేకపోయాడు "రండి" అన్నాడు, నెమ్మదిగా.
"ఐదు నిమిషాల్లో వస్తాను" ఆ అమ్మాయి ఫోన్ పెట్టేసింది.
హర్ష వెనక్కి వాలి ఆలోచించాడు. 'ఎవరీ కోమలి? చిక్కడపల్లిలో మా ఎదురింట్లో ఆచారిగారూ వాళ్ళూ వుండేవారు. వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళ పక్కింట్లో వుండే ఇంజనీరుగారికి ఆడపిల్లలు లేరు. ఇంకా పక్కింట్లో, ఏమో! వస్తే గుర్తుపట్టవచ్చేమో!' అనుకున్నాడు. పనిచేసుకుందామన్నా ఇంకా ధ్యాస కుదరలేదు. వాచి వైపు చూసుకున్నాడు. ఇంకా రెండు నిమిషాలుంది ఆమె రావడానికి. ఆమే వచ్చి వెళ్ళాకే పని మొదలుపెట్టవచ్చు అని అలాగే కూర్చున్నాడు. మరో నిముషం గడిచింది.
"హలో!" అన్న గొంతు వినిపించి, తల ఎత్తి చూశాడు.