Previous Page Next Page 
వేసవి వెన్నెల పేజి 16


    "ఏమిటిది?"


    "నన్ను చూసి జాలిపడొద్దు. అది నేను భరించలేను. నాకు కావాల్సింది సానుభూతి కాదు. మీ ప్రేమ-"


    ఆగి శ్రీధర్ ముఖంలోకి చూసింది.


    శ్రీధర్ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.


    "నేనంటే మీకిష్టం లేకపోతే- వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోతే చెప్పండి."


    "అలా చెప్పేస్తే నీ మనసు మార్చుకుంటావా?"


    "లేదు"


    "మరి?"


    "ఇన్ని నిద్ర మాత్రలు మింగి శాశ్వతంగా నిద్రపోతాను"


    శ్రీధర్ అదోలా నవ్వాడు.


    "ఎందుకు నవ్వుతున్నారు?"


    "బెదిరిస్తున్నావా? చచ్చిపోయేవాళ్ళు అలా చెప్పరు.


    "నేను మహా మొండిని. మీకు తెలియదు.


    "అయితే చచ్చిపోతానంటావ్"


    "అనడం కాదు...అమ్మా నాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచారు. కావాలన్నది ఇవ్వకపోతే మహా మొండిగా ప్రవర్తించేదాన్ని.


    నేను ఎటువంటి సాహసం అయినా చేస్తానని నాన్నకు తెలుసు."


    శ్రీధర్ పలకలేదు.


    "పిచ్చి డాడీ అందుకే ముందు మీ ఊరు వెళ్ళి మీ పరిస్థితులు చూసి రమ్మని పంపించారు. మీ ఇల్లూ, మీ ఊరూ చూసి నా అభిప్రాయాన్ని మార్చుకుంటాననుకుంటున్నారు."


    శ్రీధర్ అమూల్య ముఖంలోకి ఓ క్షణం అయోమయంగా చూశాడు.


    "మీ డాడీకి చెప్పావా?"


    "చెప్పాను."


    "ఏమన్నారు?"


    "పెద్ద లెక్చర్ దంచేశారు. అదికాక మా డాడీకి ఈ అంతస్థులు గిట్టవు. అదీ ఆయన భయం"


    "నీది ప్రేమ కాదని, కేవలం ఈ వయసులో ఉండే ఉన్మాదం అనీ భయం. అంతే కాదు మీ కుటుంబంలో నేను ఇమడలేనని..."


    "నీకేమనిపించింది?"


    "మీరు ఉంటే చాలనీ, మరింకేమీ అక్కర్లేదని..."


    శ్రీధర్ పకపక నవ్వాడు.


    "ఈ విషయం మీ అమ్మగారికి తెలుసా?"


    "తెలియదు. తెలిస్తే మీ ఊరు రానిస్తుందా?"


    మరి మీ అమ్మగారు పెళ్ళికి ఎలా అంగీకరిస్తారు?"


    "డాడీ నచ్చజెపుతారు మమ్మీకి. ఇష్టం లేకపోయినా మీకు ఇష్టం అయితే ఈ పెళ్ళి జరుగుతుంది"


    "అలా అని మీ డాడీ చెప్పారా?"


    "చెప్పలేదు. కాని జరిగేది అదే?"


    "ఏ కష్టం లేకుండా పెరిగావు. కావాలన్నది లభించకపోతే మొండిగా ప్రవర్తిస్తావు అవునా?"


    "అవును?"


    "మరి నేను దరిద్రుణ్ని. మా కుటుంబం చూశావు. నీ కోరికలన్నీ నేను తీర్చలేనని నీకు అర్థం కాలేదా?"


    "నాకు మీరు కావాలి. మీకు ఆ భయం అక్కర్లేదు. మీ శక్తికి మించిన కోర్కెల్ని నేను కోరను."


    "తొందర పడుతున్నావ్. మరోసారి ఆలోచించు. బీదతనం అంటే నీకు తెలియదు. అందులో కూడా థ్రిల్ వుంది అనుకుంటున్నావ్.


    "అదేంకాదు."


    "కష్టాలంటే ఏమిటో నీకు తెలియదు. కొత్త నగల సెట్టు మోజుపడి మారాంచేసి కొనిపించినట్టు కాదు ఈ పెళ్ళి. నన్ను చేసుకుంటే అనుభవించాల్సిన జీవితం ఎలాంటిదో నీకు తెలియదు."


    "అబ్బబ్బ ఇక మీ లిక్చర్ ఆపండి. చెప్పానుగా మీరుంటే నాకింకేమీ అక్కరలేదని"


    "అన్నం"


    "భార్యకు అన్నం పెట్టలేనంతటి అసమర్థులు కారని తెలుసు."


    "బట్టలూ? మా చెల్లెళ్ళు కట్టే చీరలు చూశావుగా?"


    "అక్కర్లేదు"


    "ఏమిటి? బట్టలు అక్కరలేదా? అంటే?" కొంటెగా అన్నాడు.


    "యూనాటీ...ఖరీదైన బట్టలు అక్కరలేదు."


    "నగలూ?"


    "నాకు ఇప్పటికే నాలుగు సెట్లు ఉన్నాయ్ అవి చాలు."


    "శ్రీధర్ ఆలోచిస్తూ ఉండిపోయాడు.


    "చెప్పండి."


    "ఏమిటి?"


    "అబ్బబ్బ మళ్ళీ మొదటికి వచ్చారు. నేనంటే మీకు ఇష్టమేనా?"


    "వెన్నెలంటే ఎవరికి ఇష్టం ఉండదు?"


    "అబ్బో కవిత్వం చెబుతున్నారే?"


    "కవిత్వం కాదు"

 Previous Page Next Page