కాంతి సెకండుకి దాదాపు మూడు లక్షల కిలోమీటర్లు వేగంతో పయనిస్తుంది. శబ్దవేగం మూడు సెకండ్లకి ఒక కిలోమీటరు దాటదు. అందుచేతే మెరుపు ముందు కనబడి తర్వాత ఉరుము వినబడుతుంది.
మెరుపు కనీకనబడగానే అప్రయత్నంగా సెకెండ్లను లెక్కించడం మొదలెట్టాడు సందీప్. మూడు సెకెండ్ల తర్వాత ఉరుము ఉరిమింది. ఆ కాలాన్ని మూడుతో భాగిస్తే మెరుపు ఎంత దూరంలో మెరిసిందో ఉజ్జాయింపుగా చెప్పవచ్చు. ఈ మెరుపు దాదాపు ఒక కిలోమీటరు అవతల మెరిసిందన్న మాట.
కంప్యూటర్ లాంటి మెదడు సందీప్ ది. దానికి తీక్షణమైన శిక్షణ ఇచ్చి మరింత పదును పెట్టాడు అతను. మామూలు మనుషులు అసలు గమనించని, గమనించినా పట్టించుకొని సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాల ద్వారానే అతను తనకి కావలసిన సమాచారం అంతా గ్రహిస్తాడు. అడవి జంతువుల పద్ధతి కూడా అదే. అతి చిన్న శబ్దాల ద్వారా, వాసనల ద్వారా, తక్కిన జంతువుల ప్రవర్తనా, అరుపుల ద్వారా పొంచివున్న ప్రమాదాన్ని అనుక్షణం గమనిస్తూ, ప్రాణాలు రక్షించుకుంటాయి.
మేకవన్నె పులులూ, గోముఖ వ్యాఘ్రాలూ సంచరించే కాంక్రీటు అడవిలాంటి సిటీలో పెరిగిన సందీప్ కూడా అలాంటి ఆత్మరక్షణోపాయాలు ఎన్నో గ్రహించేశాడు. క్షణక్షణం అన్నిటినీ వెయ్యి కళ్ళతో గమనించి చూస్తూ అలర్టుగా ఉండడం అతని స్వభావంలో జీర్ణించుకుపోయింది.
మామూలుగా మెరుపు అంటే సెకెండులో వెయ్యోవంతుసేపు మాత్రమే ఉంటుంది. అతి పెద్ద మెరుపు సెకండులో పదోవంతుసేపు మాత్రమే ఉంటుంది.
మెరుపు మెరిసిన ఆ అత్యల్ప వ్యవధిలో అడవి అంతా ఒక్కసారిగా పట్టపగలులా కనబడింది.
కుడిచేతివైపు బారుగా ఉన్నాయి కొండలు. వాటి మధ్య చిన్న తెల్ల రాతికొండ, చాలా చిత్రంగా, భయానకంగా ఉంది దాని షేపు. సాధారణంగా ఏ గుట్టలనూ, బండలనూ చూసినా, విభ్రాంతి కలిగించే ఆకారాలు కనబడుతూనే ఉంటాయి. ఎవరో అసాధ్యుడు ప్రయాసపడి ఒకదానిమీద ఒకటి పేర్చినట్లు అనిపిస్తుంది. కొన్ని బ్రహ్మాండమైన బండలను చూస్తుంటే వేల మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి రూపుదిద్దుకుంటూ కుతకుత ఉడికిపోతున్నప్పుడు, ప్రేలుళ్ళు సంభవించి ఏర్పడి ఉంటాయి ఆ చిత్రమైన ఆకారాలు.
మరికొన్ని బండలు, గాలీ నీరూ తదితర ప్రకృతి శక్తుల నిరంతర ప్రభావానికి లోనై, విచిత్రమైన ఆకారాలు దిద్దుకుంటాయి.
ఆ రెండో రకానికి చెందినదే ఈ చిన్న కొండ సైజులో ఉన్న తెల్లటి బండ. దానిమీద ఒక జలపాతం పడుతోంది. నిర్విరామంగా కలుగుతున్న ఆ ఒరిపిడి వల్ల, నున్నగా పుర్రెలా అయింది అది. కపాలం తలంటి పోసుకుంటున్నట్లు ఉంది ఆ దృశ్యం. అక్కడ ప్రవాహం రెండుగా చీలి, ఆ కపాలం తాలూకు కళ్ళలోనుంచీ ప్రవహిస్తున్న అశ్రుధారలా ఉంది.
ఆ కిందగా ఉన్న పెద్ద గుహ, తెరిచిన బోసినోరులా కనబడుతోంది, హోరున వీస్తున్న గాలి అందులో ప్రవేశించి, రోదనలాంటి శబ్దాన్ని కలగచేస్తోంది. దెయ్యాల ఏడుపులా వికృతంగా ఉంది ఆ శబ్దం.
గాఢంగా ఊపిరి తీసుకున్నాడు సందీప్. అదృష్టం సరిగ్గా ఇదే సమయానికి మెరుపు మెరిసి ఉండకపోతే, ఈ కొండ గుర్తుని మిస్ అయిపోయి ఉండేవాడు తను. కోపంగా భూతాలరాజు వైపు తిరిగాడు.
'నువ్వు వెధవ్వేషాలు మానలేదు" అన్నాడు మండిపడుతూ.
"ఏమిటి ? ఏమయింది ?" అన్నాడు భూతాలరాజు ఏమీ ఎరగనివాడిలా.
"ఆ కనబడే బండని పుర్రె కొండ అంటారు. ఇక్కడే మనం కుడిచేతివైపు ఉన్న మట్టిదారిలోకి మళ్ళాలి. నువ్వు నోరు మెదపకుండా కూర్చుని తప్పుదారి పట్టిస్తున్నావ్ ! అవునా ?"
"ఎవరి సొంత ప్రాణంమీద వాళ్ళకి తీపి ఉంటుంది. నేను నీతో రాలేను, నన్ను వదిలెయ్ ! నీ కాళ్ళకు దణ్ణం పెడతాను" అన్నాడు రాజు. భయంతో అతని గొంతు కీచుగా వస్తోంది.
సందీప్ ఏదో అనబోయి ఆగాడు. జీపు హెడ్ లైట్ల వెలుగులో, రోడ్డుకి అడ్డంగా సరసర పాకుతూ పోయింది ఒక పాము - ప్రాణభయంతో. దాని వెనకాతలే దాదాపు పద్ధెనిమిది అడుగుల పొడుగు ఉండి, కొండచిలువేమో అన్న భ్రాంతి కలిగించేటంత పెద్దసైజు "కింగ్ కోబ్రా" అనే త్రాచు తరుముతూ వచ్చింది. రోడ్డు దాటేస్తున్న చిన్నపాముని నోటితో పట్టేసుకుంది. కొద్దిక్షణాలు విలవిల్లాడి, నిశ్చలంగా అయిపోయింది చిన్న పాము.