నిలువు గుడ్లేసుకుని అది చూస్తున్న రాజు నెమ్మదిగా సందీప్ వైపు తిరిగాడు. "చూశావా? అది కింగ్ కోబ్రా! జెయింట్ సైజు త్రాచుపాము. మామూలు పాములు కప్పలనీ, ఎలుకలనీ తింటే, ఇది సాటి పాములనే తింటుంది."
"అవును ! అలా స్వజాతి జంతువులనే తినే లక్షణాన్ని కానిబాలిజమ్ అంటారు."
"ఆ లక్షణం మనుషుల్లో కూడా కొన్ని తెగలలో ఉంది. నువ్వు వెదుకుతున్న విగ్రహం చుట్టూతా ఇలాంటి తెగ మనుషులు ఉన్నారు. సాటి మనుషులనే తినే ఆటవికులు వాళ్ళు." అన్నాడు రాజు. కనుబొమ్మల మీదనుంచీ కళ్ళలోకి జారుతున్న చెమటని మోచేత్తో తుడుచుకుంటూ.
"షిట్ ! అబద్ధాలు చెప్పి నన్ను బెదరగొట్టాలని చూడకు !" అన్నాడు సందీప్. "మనుషుల్లో కానిబాల్ తెగల గురించి నాకూ తెలుసు. ఎక్కడో ఆఫ్రికా ఖండంలోని కొన్ని కీకారణ్యాలలో, ఆస్ట్రేలియా దగ్గర న్యూగినీలోని 'కూకూకూకూ' తెగలో తప్ప మనుషులని తినే కానిబాల్స్ ఇంకెక్కడా మిగిలిలేరు. ఇండియాలో అసలు కానిబాల్ జాతులు ఉన్నాయని ఎవరూ, ఎప్పుడూ వినలేదు." అని నిర్లక్ష్యంగా నవ్వి, స్వప్నవైపు తిరిగాడు సందీప్.
ఎప్పుడు మెలకువ వచ్చిందోగానీ, తను లేచి కూర్చుని చూస్తోంది. తెరుచుకుని ఉన్న పెదిమలు తడి ఆరిపోయి ఉన్నాయి. విహ్వలంగా ఉన్నాయి చూపులు. "నేను వెళ్ళిపోవాలి, నన్ను వదిలెయ్! నన్ను వదిలెయ్ !" అంటోంది పదేపదే.
ఆ అమ్మాయిని చూస్తే జాలివేసింది సందీప్ కి.
తనకి వంతపాడేవాళ్ళు మరొకళ్ళు దొరికినందుకు సంతోషించాడు భూతాలరాజు. అతనికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. "ఇదే రోడ్డుమీద మరో నలభై కిలోమీటర్లు వెళితే, చిన్న రైల్వేస్టేషను ఒకటి వస్తుంది. అక్కడికి వెళ్ళి జీపు వదిలేసి రైలందుకుని ఎటన్నా వెళ్ళిపోవచ్చు. బతికి ఉంటే బలుసాకు తినవచ్చని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు" అన్నాడు.
అతని మాట పూర్తికాక ముందే జీపులోనుంచి కిందకి దూకేసింది స్వప్న. వెనక్కి తిరిగి చూడకుండా ఎక్కుపెట్టి వదిలిన బాణంలా దూసుకుపోయింది.
జీపు ఆపి, ఆమె వెనకనే పరిగెత్తాడు సందీప్. అందుకుని చెయ్యిపట్టి ఆపాడు.
"మొన్న లాస్ ఏంజలిస్ ఒలింపిక్స్ లో పి.టి. ఉష వలసమ్మలకి బదులు నిన్ను పంపి ఉంటే గోల్డు మెడల్ తెచ్చి ఉండేదానివి, ఎక్కడికా పరుగు ?" అన్నాడు విసుగ్గా.
"నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను" అంటోంది స్వప్న. ఆమె నోటివెంబడి మరో మాట రావడం లేదు. పరుగువల్ల ఊపిరాడక రొప్పుతోంది. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
రెండు క్షణాలు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు సందీప్. "ఓకే ! పద! నిన్ను ఆ రైలు స్టేషనులో ఏదో ఒక రైలు ఎక్కించి మేము తిరిగి వస్తాము. జీపు ఎక్కు !" అన్నాడు.
భూతాలరాజు పారిపోకుండా చూడడానికే తనకి సమయం చాలడం లేదు. దానికితోడు ఈ అమ్మాయి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వెళ్ళిపోతానని గోలపెడుతూ ఉంటే, తను అసలు పనిమీద దృష్టి నిలపలేడు.
"ఈ పిల్లని నేను భద్రంగా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటిదగ్గర దింపుతానుగానీ, నువ్వేం ఇబ్బంది పడకు. నీ టైం వేస్టు చేసుకోకుండా ఆ విగ్రహాన్ని వెదుక్కుంటూ వెళ్ళిపో! ఆ పుర్రెకొండ వెనకాతలే కనబడుతుంది." అన్నాడు రాజు, చిన్నపిల్లాడిని మరిపించడానికి మాటలు చెబుతున్నట్లు.
అతనివైపు తీక్షణంగా చూసి, జీపు స్టార్ట్ చెయ్యడానికి ఇగ్నిషన్ కీ తిప్పాడు సందీప్.
వెంటనే స్పార్క్ వచ్చి జీపు స్టార్ట్ కాలేదు. ఆకాశంలో జిగేలుమని స్పార్క్ వచ్చింది. బ్రహ్మాండమైన మెరుపు మెరిసింది.
వెంటనే మంత్రించినట్లు గొంతెండుకు పోయింది అందరికీ.
హఠాత్తుగా విరుచుకుపడిపోయాడు భూతాలరాజు. అతని పెదిమలు అస్పష్టంగా కదులుతున్నాయి.