"తరుణి" భుజంగరావు, భువనేశ్వరీల గొంతుల్లో నుంచి ఒకేసారి ఆశ్చర్యంగా విన్పించిందా మాట. కొద్ది క్షణాలు ఒకరి మొఖాలకేసి ఒకరు చూసుకున్నారు.
"అవునండి" అన్నాడు ఆనందం కంగారుగా.
"అమ్మాయ్... బాగుంటుందా?" మళ్ళీ ప్రశ్న వేసిందావిడ.
"చక్కని ఫుల్ స్టాపులా ఉంటుందండి" అనబోయి మళ్ళీ ఆమె తిడుతుందనుకొని-
"చెప్పరా... నీ పెళ్ళాం గురించి" చేత్తో డొక్కలో పొడిచాడు ఆనందం.
"నా పెళ్ళాం గురించి నేను చెప్పుకోవడం బాగోదు కదండీ..." వినయాన్ని నటిస్తూ అన్నాడు ఆంజనేయులు.
"ఓర్నీ అంజి వెధవోయ్... నీకెన్ని తెలివితేటలు! సడన్ గా ఎలా వచ్చేసేయిరా? బడుద్ధాయ్..." మనసులోనే ఆనందించాడు ఆనందం.
"సాయంత్రం ఆఫీసునుంచి వస్తావ్ గదా... వచ్చాక, కొంచెం తీరుబడి చేసుకున్నాక, అమ్మాయి ఫోటో అయినా చూపించు బాబూ... చూస్తాను... ఏవండీ..." అని భర్తవేపు చూస్తూ అంది భువనేశ్వరి.
ఆయనకి తప్పక తలూపాడు.
ఆనందం గుండెలో రాయి పడితే, ఆంజనేయులి గుండెల్లో ఏకంగా బాంబే పడిపోయింది.
అబద్ధం మీద అబద్ధం... విధిలేక భుజంగరావు తలూపాడు.
"ఈ కాలం పిల్లలు భార్యల ఫోటోల్ని, ప్రియురాళ్ళ ఫోటోల్ని పర్సుల్లో పెట్టుకు తిరుగుతారట గదా! ఏదో ఆతృత... ఏదీ... చూపించు" అండి భువనేశ్వరీదేవి తిరిగి.
ఆంజనేయులు బిక్క మొఖమేసుకొని భుజంగరావేపు, ఆనందం వేపు చూశాడు.
"ఇంతకీ అసలు..." అంటూ భువనేశ్వరీదేవి ఒకింత అనుమానంతో అనటంతో ఆనందం ప్రమాదం ముంచుకొచ్చిందని గ్రహించి షార్ప్ గా రియాక్ట్ అయ్యాడు.
"మీరన్నది నిజమే - కాని మావాడు వాళ్ళావిడ ఫోటోని ఆఫీసు సొరుగులో పెట్టుకుని తరచూ చూసుకుంటూ వియోగ భారాన్ని తట్టుకుంటున్నాడు. పర్సులో అయితే నలుగుతుందని" మరో అబద్ధం ఆడేశాడు ఆనందం.
"అయితే సాయంత్రం తెచ్చి చూపించండి" అంటూ తేల్చి చెప్పేసి వెళ్ళిపోయింది.
ఇద్దరూ శిలాప్రతిమలయిపోయారు.
ఇదంతా మీ ఇద్దరి మూలంగానే అన్నట్లుగా భుజంగరావు, ఆనందం గుర్రుగా చూస్తూ-
"ఏం చేస్తారో చేసుకోండి" అని విసవిసా బయటకెళ్ళిపోయాడు ఆంజనేయులు.
* * * *
అప్పటివరకూ సేల్స్ సూపర్ వైజర్ తో మాట్లాడి, రిలాక్స్ అవుతుండగా ఆంజనేయులు ఛాంబర్ లోకి ప్రవేశించింది మేరీ మాథ్యూస్.
"మార్నింగ్ నుంచీ మీరు బాగా బిజీగా వున్నట్టున్నారు?" కూర్చుంటూ అంది మేరీ.
"అవును..." ఆంజనేయులు ఒకింత దిగులుగా అన్నాడు.
"నిన్న సిన్మాకు మీరు రాలేదుగానీ... ఎంత ట్రాజెడీగా వుందో తెల్సా? ఐ లవ్ ట్రాజడీస్."
"ఏ సిన్మాకెళ్ళారు?"
"జడలో ప్రేమ-శిగలో పెళ్ళి"
"బాగుందా?" నేరకపోయి అడిగాడు ఆంజనేయులు.
"బ్రహ్మాండంగా వుందండి... అనగనగా ముగ్గురు హీరోలు... ఆ వెనకో ముగ్గురు హీరోయిన్ లు... ఒక భయంకరమైన పరిస్థితుల్లో ముగ్గురు హీరోలూ, ముగ్గురు హీరోయిన్లనీ కలుస్తారు... అనుకోని కారణాల వల్ల వాళ్ళు ప్రేమించిన వాళ్ళని కాకుండా, మిగతా వాళ్ళని పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఇంటర్వెల్ అవుతుంది. నిజంగా వాళ్ళ ముగ్గురికీ లవర్స్ తోనే పెళ్ళవుతుందా లేదా అనేది సస్పెన్స్ అడుగడుక్కీ ఆ సస్పెన్స్ అలా పెరుగుతూ, పెరుగుతూ శుభం వరకూ వస్తుంది.
ఒకరికి తెలీకుండా ఒకరు ఆత్మహత్యలు చేసుకుంటారు... భోరు భోరున కన్నీటి వాన... ఆ సిన్మా ప్రేక్షకుల్ని కూడా ఎంత ఇన్ స్పైర్ చేసిందో తెల్సా? హాలునిండా కన్నీళ్ళే" చెప్పింది మేరీ.
"అందుకేనా... మీరు 'మూడీ'గా వున్నారు?" అడిగాడు ఆంజనేయులు.
"నేనా! మూడీగానా? లేదే... ఆ సిన్మా చూశాక నేను మరోసారి దృఢంగా నిర్ణయించుకొన్నాను."
"ఏమని?"
"ఇప్పుడు చెప్పను... బైదిబై... ఆంజనేయులు గారూ... ప్రేమకు మీరిచ్చే డెఫినేషన్ ఏవిటి?"
"ఎందుకు?"
"ముందు చెప్పండి"
"ఇప్పటివరకూ నేనెవర్నీ ప్రేమించలేదు... నేనెలా చెప్పగలను."
"అస్సలు ప్రేమించలేదా?"
"లేదు"
"అయితే మీరు చెప్పే కొటేషన్ ఫ్రెష్ గా వుంటుంది. చెప్పండి"
"ప్రేమేమీ కాయగూరలు కాదుగదా? ఫ్రెష్ గా వుండడానికి..." అన్నాడు ఆంజనేయులు.
"తప్పించుకోగూడదు... చెప్పండి."
తప్పదా అన్నట్టు చూశాడు మేరీ వేపు నిస్సహాయంగా. అతనికి చాలా విసుగ్గా వుంది. మేరీని వదిలించుకోవాలంటే కొటేషన్ చెప్పక తప్పదు.
"ప్రపంచంలో ప్రేమనేది లేదు. ఉన్నట్టు అనుకోవడమే ప్రేమ. కొన్ని కారణాల వల్ల, కొన్ని కారణాల కోసం జరిగే ఒక కారణం పేరే ప్రేమ..."
కొటేషన్ చెప్పి ఎలా వుందన్నట్టు చూశాడు ఆంజనేయులు.
"కాదు... యూ ఆర్ రాంగ్ సర్... నేనెప్పుడో, ఎక్కడో చదివాను... ఆ కొటేషన్ నాకెంతో ఇష్టం....
OUR LIVES ARE
SHAPED BY THOSE WHO LOVE US
BY THOSE WHO REFUSE TO LOVE US"
దాన్నే ప్రేమ అంటారు సర్.
సీరియస్ గా చెప్పింది మేరీ.
ఆ మాటన్న ఆమె వేపు సీరియస్ గా చూశాడు ఆంజనేయులు.
అంతవరకూ మేరీని తక్కువగా భావించినందుకు తనని తానే తిట్టుకున్నాడు.