Previous Page Next Page 
నా జీవితం నీ కౌగిలిలో పేజి 15


    అదే సమయంలో ప్రవేశించింది భువనేశ్వరీదేవి.

 

    "ముహూర్తాలూ వగైరా పట్టింపులన్నీ ఉన్నాయన్నమాట... నాకూ అంతే..."

 

    "నమస్కారం పిన్నిగారూ..." ఆవిడ్ని చూడగానే ఆనందం నమస్కారం పెట్టడంతో చేతిలోని చాప కింద పడిపోయింది.

 

    చాపా, తలగడలవేపు ఆశ్చర్యంగా చూసిందావిడ.

 

    "ఎలాగూ అమ్మాయి వచ్చినపుడే మిగతా అన్నీ తెద్దామని..." నసిగాడు ఆంజనేయులు.

 

    ఆ మాటకు భుజంగరావు మనసులోనే ఆనందించి-

 

    "నిజం... నిజం... అమ్మాయితో పాటే అన్నీ రావడం మంచిది... శ్రేయస్కారం కూడా..." అని మిస్సమ్మలో ఎస్వీ రంగారావులా అన్నాడు.

 

    "అబ్బాయిలూ రండి... మీ గది మీకు చూపిస్తాను..." అని మెట్లు దిగిందావిడ.

 

    భుజంగరావు వాళ్ళిద్దరి వేపూ తిరిగి కన్నుగొట్టాడు.

 

    "థాంక్స్ బాబాయిగారూ" అని గొణిగి పిన్నిగారి వెనక నడిచాడు ఆనందం.

 

    వెనక ఆంజనేయులు అనుసరించాడు.

 

    చిన్న హాలు. ఆ వెనకో బెడ్ రూం, కిచెన్, తర్వాత బాత్ రూము వెనక పెరడు అదీ అవుట్ హౌస్.

 

    "ఇదయ్యా అవుట్ హౌసు. ఎలా వుంది?" అడిగిందావిడ.

 

    "బ్రహ్మాండంగా వుందండి" అన్నాడు ఆంజనేయులు.

 

    "అమ్మాయికీ, నీకూ బ్రహ్మాండంగా సరిపోతుంది... కొత్త కాపురం. కొన్నాళ్ళు ఏకాంతం కావాలని అమ్మాయందనుకో... మీ ఫ్రెండు మా హాల్లో పడుకుంటాడు. లంకంత కొంప" అందావిడ.

 

    "అలాంటి ప్రశ్న అక్కర్లేదండీ... అమ్మాయ్... గిమ్మాయ్... ఎవరూ రారండి" అనేశాడు అమ్మాయి విషయం మర్చిపోయిన ఆంజనేయులు.

 

    పరాకుగా విందా మాటలు భువనేశ్వరీదేవి.

 

    "ఏమంటున్నావ్...?" అని మళ్ళీ అడిగిందావిడ. అప్పటికి తెల్సొచ్చింది ఆంజనేయులికి. ఎలా కవరు చెయ్యాలా 'సిన్మారీళ్ళలా' ఆలోచిస్తున్నాడు.

 

    ఆ సమయంలో బాత్ రూమ్ అందాల్ని చూస్తున్న ఆనందం పరుగు పరుగున వచ్చి-

 

    "ఇంకెంత, వారం రోజులే గదా పిన్నిగారూ... ఆలోపు వాడిపెళ్ళాం వచ్చేస్తుంది. ఈ వారం రోజులూ ఈ మగ సంసారాన్ని ఇలా గట్టెక్కించేస్తే చాలు" గబగబా సర్దేశాడు ఆనందం.

 

    "నువ్వు మాటల్ని అమ్మేస్తావయ్యా..." బొబ్బాసి పండులాంటి బుగ్గల నిండా నవ్వుల్ని నింపుకుని అంది భువనేశ్వరీ దేవి.

 

    ప్రమాదం గడిచి గట్టెక్కినందుకు ఊపిరి తీసుకున్నాడు ఆంజనేయులు.   

 

    "స్నానాలవీ కానిచ్చాక రండి... టిఫిన్, కాఫీ తాగి ఆఫీసు కెళ్దురుగాని" అనేసి ఆవిడ కదిలింది.

 

    "మళ్ళీ కాఫీయా... పిన్నిగారూ..." ఆ 'ఇత్తడి' గ్లాసుల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ అన్నాడు ఆనందం భయంగా.

 

    పిన్నిగారు బయటకు వెళ్ళగానే తలుపు వేసేసి-

 

    "హమ్మయ్య..." అంటూ కూలబడ్డాడు ఆనందం.

 

    "నిన్న సాయంత్రమే నీకు చెప్దామని మర్చిపోయాను. అమ్మాయి విషయం కూడా... మనకేం బెంగక్కర్లేదు... ఎందుకంటే... మేరీ... అని" అని మేరీ విషయం అంతా చెప్పాడు ఆంజనేయులు.

 

    చెప్పి....

 

    "ఎలా ఉంది మన ప్లాన్... సరిగ్గా వారం రోజులనాడు... ఉదయాన్నే ఎనిమిది గంటలకు ఆటోలో మేరీ దిగుట... మన ఆహ్వానించుట జరుగును" అన్నాడు డ్రమెటిగ్గా.

 

    "ఆఫీసులో అమ్మాయితో ఇలాంటి డ్రామాలు వేశావనుకో... ఇద్దరి ఉద్యోగాలూ పోవడం ఖాయం. ఆ తర్వాత... బంగారం లాంటి ఈ అవుట్ హౌస్ పోవడం ఖాయం... అంచేత బ్రదరూ... ఆ అమ్మాయొప్పుకున్నా నేనొప్పుకోను... అంతే..." కరాఖండీగా అన్నాడు ఆనందం.

 

    "మరి... ఈ ప్రమాదం నుంచి గట్టెక్కడం ఎలాగురా?"

 

    "వారం రోజుల తర్వాత గదా... బాబాయిగారు ఉండనే ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ఆయనే మనల్ని రక్షిస్తారు. అసలు ఆడపిల్ల ఈ అవుట్ హౌస్ కి రావడం అనే ప్రమాదం రాకుండా జాగ్రత్తపడడమే చాలా మంచిదని నా అభిప్రాయం... ఆడపిల్లే వచ్చిందనుకో, మన సంసారం అడ్డంగా విడిపోవడం ఖాయం. మనం ఎవరికి వారే యమునా తీరే అయిపోవడం ఖాయం... పద... స్నానం చెయ్యి. కానీ ఆవిడ దగ్గర కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. అమ్మాయ్... గిమ్మాయ్ రాదని తిక్క మాటలు మాట్లాడకు. సర్దలేక నేను ఛస్తున్నాను" అన్నాడు ఒకింత అసహనంగా.

 

    మరో అరగంట తర్వాత వాళ్ళిద్దరూ భుజంగరావు భవనంలో, విశాలమైన డైనింగ్ హాల్లో, టేబిల్ ముందు కూర్చుని, వేడి వేడి దోసెలు తింటున్నారు.

 

    "అమ్మాయిది ఏ వూరు బాబూ?" సడన్ గా ఆ ప్రశ్న వినబడేసరికి దోసె ముక్క గొంతులో గుచ్చుకున్నట్టయింది ఆంజనేయులుకి.

 

    "అమ్మాయి ఊరాండి... అదే మా అంజిగాడి అత్తవారూరా... స్టూవర్టుపురమండి... స్టూవర్టుపురం" కంగారుగా చెప్పాడు ఆనందం.

 

    "స్టూవర్టుపురమా? అదే వూరయ్యా బాబూ..." భుజంగరావు మధ్యలో అన్నాడు.

 

    "స్టూవర్టుపురం పక్కనున్న నెల్లూరన్నమాట" సర్డాడు ఆంజనేయులు.

 

    "అమ్మాయి పేరేం పేరు?" మళ్ళీ అడిగిందావిడ.

 

    "తల్లీ నీ టిఫిన్ కీ, నీ అవుట్ హౌస్ కీ, ఓ దండం కానీ... ఈ ప్రశ్నలాపుతావా తల్లీ?" మనసులోనే అనుకున్నాడు ఆంజనేయులు.

 

    "సంగీతా బ్రిజ్ లానీ అండి" టక్కుమని చెప్పాడు ఆనందం.

 

    "అతన్నడుగుతుంటే నువ్వు సమాధానాలు చెప్తావేమిటయ్యా... అతన్ని చెప్పనిస్తావా? లేదా?" కసురుకుందావిడ.

 

    "చెప్పరా... చెప్పు... నీ పెళ్ళాం పేరేదో జాగ్రత్తగా ఆలోచించుకుని మరీ చెప్పు... జాగ్రత్తరోయ్" నెమ్మదిగా గొణిగాడు ఆనందం.

 

    అన్ని అబద్ధాలు ఆడవలసి రావటం చాలా ఇబ్బందిగా వుంది ఆంజనేయులికి. కానీ తప్పదు. ఇప్పుడేమిటి తరుణోపాయం అని వేగంగా ఆలోచిస్తున్న ఆంజనేయులు సడన్ గా తరుణోపాయం అనే పదం దగ్గర ఆగిపోయాడు. అంతే... పేరు తట్టింది.

 

    "తరుణి" నెమ్మదిగా అన్నాడు.

 Previous Page Next Page