ఆమె ఏకాంబరానికి ఏదో షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వబోతున్నట్టు తిలక్ గ్రహించాడు.
ఆమె చెబుతోంది. "ఓ వూర్లో వరూధిని అనే పేరుగల టీచరుంది. ఆమెకంత రొమాంటిక్ పేరున్నా రొమాన్సు గురించి ఏమీ తెలియదు. పాతిక సంవత్సరాలు వయసున్నా, తెలుగులో ఎం.ఏ. పట్టా వున్నా ఆమెకు శృంగారంలో ఆ - ఆటకూడా రాదు. ఆమెకి పెళ్ళి కాలేదు. అయితే సెక్స్ గురించి ప్రాక్టికల్ నాలెడ్జి కాదుగదా థీరిటికల్ నాలెడ్జి కూడా లేదు. ఎంఏలో వరూధినీ ప్రవరాఖ్యం కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదివింది. కోరికతో మీదపడిన వరూధినిని ప్రవరాఖ్యుడు కింద తోసేస్తే 'కృపారహితాత్మక , నీవు త్రోయ నిచ్చోట....' అనే పద్యం లెక్చరర్ చదువుతుంటే 'నిచ్చోట' అనే దగ్గర అబ్బాయిలంత సకిలించారు. అమ్మాయిలంతా తలలు దించుకున్నారు.
అయితే మన వరూధినీ మాత్రం యదా ప్రకారం వుండిపోయింది. కారణం వరూధిని ప్రవరాఖ్యుడ్ని ఎక్కడ చూడమందో అర్థంకాక పోవడమే. అలాంటిది వరూధిని టీచర్ గా చేరాక కూడా డెవలప్ కాలేదు.
ఆమె ఓరోజు ఎనిమిదో తరగతి విద్యార్థులకు పాఠం చెప్పటానికి వెళ్ళింది. అంతకుముందు రోజు చెప్పిన లెస్సన్ కి నోట్సు ఇవ్వడం ప్రారంభించింది పిల్లలంతా రాసుకుంటున్నారు. అయితే చివర బెంచీలో కూర్చున్న ప్రసాద్ మాత్రం రాసుకోవడం లేదు. అటూ ఇటూ ఇబ్బందిగా దిక్కులు చూస్తున్నాడు. అతన్ని గమనించిన వరూధినికి వళ్ళు మండిపోయింది. తను యింత కష్టపడి నోట్స్ చెపుతుంటే అతను రాసుకోకుండా కూర్చోవడం కోపాన్ని తెప్పించింది.
అతని దగ్గరగా వెళ్ళి "ఏం చేస్తున్నావ్?" అని కటువుగా ప్రశ్నించింది.
"పెన్ లేదు మేడమ్! ఎవరయినా యిస్తారేమోనని చూస్తున్నాను" అన్నాడు ఆ అబ్బాయి.
అయితే వరూధినికి అతను చెబుతున్నది నిజమని అనిపించలేదు.
"నువ్వు అబద్ధం చెపుతున్నావ్. ఏదీ నన్ను చూడనీ" అంటూ అతని నిక్కర్ కుడిజేబులో చేయి దోపింది.
పెన్సిల్ తగిలింది.
మరింత కోపంతో ఎడమజేబులో చేయి పెట్టింది.
పెన్ తగిలింది.
ఒక జేబులో పెన్సిలూ, మరో జేబులో పెన్నూ పెట్టుకుని రాసుకోవడానికి ఏమీలేదని చెప్పిన అతన్ని నమిలేసేటట్టు చూస్తూ "స్టాండప్ ఆన్ ది బెంచ్" అంది.
బిక్కచచ్చిపోయిన అతడు మరోమాట మాట్లాడక బెంచీ ఎక్కాడు కానీ తమాషా ఏమిటంటే అతను నిజమే చెప్పాడు. అలానే ఆమెకూడా నిజమే చెప్పింది. మరి పొరపాటు ఎక్కడ జరిగిందో చెప్పగలవా బావా" అని ఆగింది లాలస.
ఏకాంబరం ఆలోచనల్లో పడ్డాడు.
"బావా! అలా ద్వారం దగ్గిర నిలబడి ఆలోచించు" ప్లీజింగ్ గా అని తిలక్ వేపు తిరిగింది.
ఏకాంబరం తనలోతానే గొణుక్కుంటూ ద్వారం దగ్గరకెళ్ళి నిలబడ్డాడు.
తిలక్ ఇవేమీ గమనించడం లేదు. ఆమెను ఎక్కడయినా చూసావా అని మనసు పొరలను అటూ ఇటూ తిప్పుతున్నాడు. గానీ ఏమీ రాలడం లేను.
ఆమెను మరింత పరిశీలనగా చూశాడు.
బ్లూజీన్స్ ప్యాంటుమీద గళ్ళున్న తెల్లటి ఫుల్ హ్యాండ్ షర్టు వేసుకున్న ఆమె కాంచనమాలలో సోఫియా లారెన్స్ ను కలిపేసినట్టు తూర్పు పశ్చిమాల నాగరికతల సమ్మేళనంగా వుంది.
వేసవి సాయంకాలం తుఫాను రేగినప్పుడు ఆకాశంలో అలుముకున్న మేఘాన్ని కత్తిరించి అతికించినట్టు మెడ కిందకు దిగిన బాబ్డ్ హెయిర్ పసుపును ఆరబెట్టినట్టు విశాలమైన నుదురు - నానాసూనవితాన అంటూ శార్దూలం అరుపులా సాగిన పద్యం రాసిన ముక్కు తిమ్మన వర్ణనలకు కూడా అందని అందమయిన ముక్కూ - సూర్యోదయం, సూర్యాస్తమయం ఒక్కసారే జరిగినట్టు పెదవులు.
ముఖ్యంగా ఆమె కళ్ళు చాలా అద్భుతంగా వున్నాయి. సముద్రాల్ని తమలో దాచేసుకున్నట్టు నీలం కళ్ళు. ఒడ్డుమీద కాళ్ళు చాపి కూర్చున్నప్పుడు ఎంతో అభిమానంతో పలకరించినట్టు మన కాళ్ళను తడిపిలోనికి జారుకునే కెరటాల్లా ఆమె చూపులు.
"ఎవరు మీరు?" మెల్లగా ప్రశ్నించాడు.
"నా పేరు లాలస. అంతకంటే నాగురించి చెప్పేందుకు ఏమీ లేదు. కానీ మీరు నాకు ఆత్మీయుల కంటే ఎక్కువ. మీతో పెద్ద పనే వుంది"
"ఏమిటి?"
"మిమ్మల్ని యిక్కడి నుంచి తప్పించాలని వచ్చాను"
అతను చిన్న జర్క్ యిచ్చాడు.
"అవును, నేనెవరో? ఎందుకు మిమ్మల్ని జైలునుంచి తప్పించాలనుకుంటున్నానో ప్రస్తుతానికి అడక్కండి. జెయిలు గురించి నాకేమీ తెలియదు. అయితే మీరు పారిపోవడానికి బయటనుంచి ఏ సహాయమైనా చేస్తాను. ఇక్కడి నుంచి బయటపడడానికి మీరే ఏదైనా ప్లాన్ చేయండి. దాన్ని నేను అమలు చేస్తాను."
ఆపాటి అభిమానానికి అతను కదిలిపోయాడు. అనాధ ఆశ్రమంలో పెరిగిన కుర్రాడతను. ఎప్పుడూ అతని గురించి రాలేదు.ఇప్పుడు సడన్ గా ఓ అద్భుమయిన అమ్మాయి వచ్చి నీకోసం నేను ఉన్నానని అవడం ఎంత థ్రిల్లింగ్ గా వుంది. కానీ అతను తన భావాల్ని బయటికి ప్రదర్శించలేకపోయాడు.
"నేను ఇక్కడి నుంచి పారిపోతానని ఎందుకనుకున్నారు?" చాలాసేపటికి ప్రశ్నించాడు.
"చాలా సింపుల్. చేయని నేరానికి మీలాంటివాళ్ళు నోరు మెదపకుండా శిక్ష అనుభవించరని తెలుసు కాబట్టి"
"నాగురించి మీకేం తెలుసు!"
"అవసరమయినంతవరకు తెలుసు. మీపేరు తిలక్. ఎం.ఏ. చదివారు.రాయుడి మీద హత్యా ప్రయత్నం చేసినందుకు మీమీద కేసు పెట్టారు. ఆ నేరాల్ని రాయుడు రుజువు చేశాడు. దాంతో మీకు అయిదేళ్ళు శిక్ష పడింది."
అతను అప్రతిభుడై వింటున్నాడు. నిజానికి ఆ మాత్రం సమాచారం సేకరించడం ఎవరికయినా చాలా సులభం. తను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలు ఏమిటో తెలుసుకున్నానని ఒక వ్యక్తి వచ్చి చెప్పడం ఎవరికయినా ఎనలేని మానసిక స్థయిర్యాన్ని ఇస్తుంది.
"ఇవన్నీ ఎలా సేకరించగలిగారు"
ఒక వ్యక్తిమీద మనకు ఇష్టం కలిగినప్పుడు ఆ వ్యక్తి ఇంకా మన గురించి చెపుతుంటే వినడానికి ఉత్సాహపడతాం. అతనూ ఆ స్థితిలోనే వుండి ఆ ప్రశ్న వేశాడు.
"చెప్పాను గదా మీరు నాకు ఆత్మీయులని. అందుకే మీకు సంబంధించిన ప్రతి చిన్న విషయం నాకు తెలుసు"