"ఏమండీ తలుపులు తియ్యండి" గట్టిగా అరవసాగాను.
తలుపులు తెరుసుకున్నాయ్.
ఎదురుగా అతను కన్పించాడు. కళ్ళు ఎర్రగా వున్నాయి. జుట్టు లేచి ఉంది.
నాకు వళ్ళు ఝల్లుమంది.
మాటలు పెగల్లేదు.
వెర్రిచూపులు చూస్తూ నిల్చున్నాను.
అతడు నా ముఖంలోకి పరీక్షగా చూశాడు.
నేను తడబడ్డాను.
"ఏమిటి ఇలా వచ్చారు అర్ధరాత్రిపూట?" అతని కంఠం అదోలా వుంది.
"అబ్బే ఏం లేదు"
అతను అదోలా నవ్వాడు.
నేను ధైర్యాన్ని కూడదీసుకుంటూ ఏదో చెప్పాలనే ప్రయత్నంలోనే వుండగానే.
"అంటే వూరికినే అర్ధరాత్రి తలుపుకొట్టారా?" కనుబొమ్మలు ముడివేసి అడిగాడు.
కట్ బనీను వేసుకొని గళ్ళలుంగీ కట్టుకున్నాడు.
నా గొంతుకు ఏదో అడ్డం పడినట్టు బేలగా చూశాను.
"ఏం కావాలో చెప్పండి."
"నాకా?"
"మీకే"
"ఏమీ వద్దు."
"మరి?"
"ఏవో అరుపులు విన్పిస్తేనూ."
"అరుపులా ఎక్కడ?"
ఎంత అమాయకంగా అడుగుతున్నాడో.
"దొడ్లోనుంచా?"
చాలా తెలివైనవాడు.
"చెప్పరేం? పదండి చూద్దాం" అంటూ బయటికి దారి తీశాడు.
"దొడ్లోనుంచి కాదు."
"మరి?" ఆశ్చర్యాన్ని నటించాడు
"మీ గదిలోనుంచి" కటువుగా అన్నాను.
"మా గదిలోనుంచా?" విస్మయం చెందినట్టు నటించాడు.
"అవును మీ గదిలోనుంచే."
అతను నవ్వాడు.
ఆ నవ్వులో ఎగతాళి ఉన్నట్టు తోచింది.
ఎంత అమాయకంగా నటిస్తున్నాడు. సంస్కారం గలవాడిలా కన్పిస్తాడు. మనిషికీ రాక్షసుడికీ మధ్య ఉండే తెర అతి సున్నితంగా ఉంటుంది కాబోలు. అంతా నటన! మోసం! మేక వన్నె పులి.
"ఏమిటి ఆలోచిస్తున్నారు?"
నేను అతని ముఖంలోకి చూశాను కసిగా.
"పాపం పీడకల వచ్చినట్టుంది" అన్నాడు.
అంతా దొంగవేషం.
అతి తెలివిగా నటిస్తున్నా ననుకుంటున్నాడు.
"నాకేం పీడకల రాలేదు. మీ గదిలోనుంచే అరుపులూ ఏడుపులూ విన్పించాయి మీ భార్యను పిలవండి" వళ్ళు మంటగా అన్నాను.
"నిద్రపోతూ ఉంది" తాపీగా అన్నాడు.
"నిద్రపోతుందా?" అతని కళ్ళలోకి చూస్తూ అడిగాను.
అతనిలో బొత్తిగా తొట్రుపాటు లేదు.
"అవును. లేపమంటారా?" అతి మామూలుగా అన్నాడు.
నేను పిచ్చిదానిలా అతని ముఖంలోకి చూశాను.
"ఏమిటి అలా చూస్తారు?"
వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాను.
"ఒంటరిగా ఉన్నారు. భయంగా ఉన్నట్టుంది. మా గదిలోకి వచ్చి పడుకోండి."
నేను కోపంగా రోషంగా అతని ముఖంలోకి చూశాను.
"పర్వాలేదు రండి. నేను ఈ వరండాలో పడుకుంటాను. మా ఆవిడను లేపనా?" జాలిపడుతున్నట్టు అడిగాడు.
"నాకేం భయంలేదు. కేకలు విన్పించి వచ్చాను. అంతే"
గిర్రున తిరిగి మా వాటాలోకి వచ్చాను. పడుకున్నాను. ఎంతకూ నిద్రపట్టలేదు.
అబ్బ! ఏం మనిషి? ఎంత నటన? చాలా వింతమనిషి.
గడియారం టిక్ టిక్!
లేచి వెళ్ళి దాన్ని తీసుకెళ్ళి వంటగదిలో పడేశాను.
తెలతెల వారుతుండగా నిద్రలోకి జారిపోయాను.
తెల్లవారి వాళ్ళ వాటావైపు వెళ్ళాను.
పదకొండు అయింది.
అతను ఆఫీసుకు వెళ్ళిపోయి వుంటాడనే నమ్మకంతో తలుపుకొట్టాను.
నేను దిమ్మరపోయాను.
"మీరా రండి" అన్నాను రాత్రి ఏమీ జరగనట్టే అతి మామూలుగా.
"మీరు... మీరు ఆఫీసుకి వెళ్ళలేదా?"
"శెలవు పెట్టాను. రండి లోపలకు అక్కడే నిలబడి పోయారేం?"
నేను నిల్చుండిపోయాను.
"చంద్రా! చూడు మీ పిన్నిగారి అమ్మాయి వచ్చింది" అన్నాడు.
"వస్తున్నానండీ" లోపల్నుంచి చంద్రవదన కంఠం విన్పించింది.
"త్వరగా రా..."
"కూర్చోమనండి."
రాత్రి అంత గొడవ జరిగిన ఇద్దరూ యెంత మామూలుగా మాట్లాడుకుంటున్నారు!
"రండి... కూర్చోండి."
నేను కదలలేదు.