"అమ్మ నాన్నకు ఏం చెప్పిందో?
ఆయన నన్ను గురించి ఏమనుకున్నారో?
ఈ ముసలాళ్ళకు వయసుమళ్ళాక కోరికలు ఎక్కువౌతాయో ఏమో..."
"ఛ అదేమిటి సావీ?"
"అప్పుడు నేననుకున్నది చెబుతున్నాను."
"సరే చెప్పు."
"అమ్మకు అసలు ఆ పిల్ల ఏమి చెప్పిందో ఎంతడిగినా అమ్మ చెప్పలేదు అనూ."
సావిత్రి ఆవలించింది. "మంచినీళ్ళు కావాలి" అంది.
అనసూయ మంచినీళ్ళు తెచ్చింది.
7
అనసూయ వంటింట్లోకెళ్ళి మినప్పప్పు నీళ్ళల్లో వేసి వచ్చింది.
సావిత్రి పడుకుని వున్నది.
"నిద్ర పోయావా?"
"లేదు. ఆలోచిస్తున్నాను" అంటూ లేచి కూర్చుంది.
"ఆ తర్వాత ఏం జరిగిందో చెబుతావా? నిద్రొస్తుంటే వద్దులే. రేపు మాట్లాడుకోవచ్చు."
"ఇప్పుడే చెబుతాను" ఉద్రేకంగా అన్నదామె.
"ఐతే చెప్పు" అనసూయ నడిమంచంమీద బాసింపట్ల వేసుకొని కూర్చుంది.
"ఆ తర్వాత నేను కొన్ని రోజులు వాళ్ళ విషయం పట్టించుకోలేదు. ఆ భార్యాభర్తలు ఎవరు ఎదురుపడ్డా కన్నెత్తి చూడటం కూడా మానేశాను.
అప్పుడప్పుడు ఆ అమ్మాయి ఏడ్పు విన్పిస్తూనే వుండేది. నాకెందుకులే అని సరిపుచ్చుకొని నిద్రపోవటానికి ప్రయత్నించేదాన్ని. అయినా ఆ అమ్మాయి అంటే నాకు అమితంగా జాలివేసేది. ఆ అమ్మాయిని ఆ రాక్షసుడి బారినుంచి తప్పించాలనిపించేది. అతను శాడిస్టు అయినా అయి వుండాలి లేక సైకో అయినా అయి వుండాలనే నిర్ణయానికి వచ్చాను.
మా బాబాయి కొడుకు పెళ్ళికి అమ్మానాన్నా వెళ్ళారు.
నేను రానన్నాను.
ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను.
ముందు అమ్మ నన్ను వదిలి వెళ్ళనన్నది. నా బలవంతంమీద బయలుదేరింది. పనిమనిషి పొద్దుపోయేదాకా ఉండివెళ్ళేది.
అమ్మా నాన్నా ఊరికి వెళ్ళి మూడురోజులు అయ్యింది.
ఆ మూడో రాత్రి...
ఇప్పటికీ మర్చిపోలేదు.
పన్నెండు దాటింది.
అలసటగా పడుకున్నాను
అప్పుడే కునుకుపట్టింది.
ఎవరో వీపుమీద చళ్ళున చరచినట్లు తృళ్ళిపడి లేచి కూర్చున్నాను.
ఎవరిదో కెవ్వున కేక విన్పించి నిద్ర మెలకువ వచ్చింది.
నాకు వెన్నముకలో నుంచి ఏదో జరజర ప్రాకుతున్నట్టు వళ్ళు జలదరించింది.
సన్నగా మూలుగు విన్పిస్తోంది.
అంతా నిశ్శబ్దం.
టేబుల్ గడియారం ఆ నిశ్శబ్దాన్ని కొలుస్తున్నట్టు టిక్ టిక్ మంటూ ఉన్నది. ఇవ్వాళ ఇది ఇంత పెద్దగా శబ్దం చేస్తున్నదేమిటి అనిపించింది.
మళ్ళీ సన్నగా ఏడుపు మూలుగులాంటి ఏడుపు. మనిషి బలవంతంగా ప్రాణం పోతున్నప్పుడు వచ్చేలాంటి మూలుగు. ప్రాణం శరీరాన్ని వదలలేక పడే మధన ఆ ఏడుపులో.
"అబ్బ ఎంత భయంకరంగా వర్ణిస్తున్నావే!" అన్నది అనసూయ.
"నీకు నేను చెబుతుంటేనే ఇంత భయంగా ఉంది కదా? మరి అప్పటి నా మానసికస్థితిని ఆలోచించు."
"నేనయితేనా... నా గుండె ఆగి చచ్చిపోయేదాన్ని."
సావిత్రి అదోలా నవ్వింది.
"ఊఁ చెప్పు ఆ తర్వాత?"
"మధ్య ప్రశ్నలు వేస్తే చెప్పలేను."
"సారీ! మళ్ళీ నోరు తెరవనుగా. చెప్పు"
సావిత్రి ఓక్షణం ఆలోచిస్తూ కూర్చుంది.
ఆమె చూపులు ఆ గదిలో దేన్నీ చూడటం లేదు. చూపుల్ని చూడలేక అనసూయ పక్కచూపులు చూడసాగింది.
"నా గదిలోనుంచి డ్రాయింగ్ రూంకు ఆనుకొని వాళ్ళ వాటాలో బెడ్ రూం ఉన్నది.
మంచం దిగాను.
తలుపు సందుల్లోనుంచి చూడటానికి ప్రయత్నించాను.
మూగవెలుగు మాత్రమే కన్పించింది.
ఆ మూలుగు మరీ పెద్దదైంది. వేటగాడి బాణం తగిలిన గొడ్డు మూలుగులా ఉన్నది.
తలుపువారగా బీరువా పెట్టడంవల్ల ఏమీ కన్పించడం లేదు.
నేను ఆ అరుపును భరించలేకపోయాను.
"నన్ను చంపకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను."
"అహ! అహహ! హ!" వికృతంగా నవ్వు.
నా వంట్లోకి చలి కుదుపు వచ్చినట్టు అన్పించింది.
"అబ్బా నా కంఠం బిగిసిపోతున్నది. నన్ను వదలండి" కీచుగా అరుపు.
నేను అప్రయత్నంగానే నాగది తెరిచాను. బయటికి వచ్చాను. వరండాలోకి వచ్చి లైటు వేశాను.
వాళ్ళ తలుపు కొట్టాను.
అరుపులు ఆగిపోయాయి.
మళ్ళీ కొట్టాను.
నిశ్శబ్దం.
కసిగా దబదబ కొట్టసాగాను.