శ్రీధర్ చటుక్కున చెయ్యి లాక్కున్నాడు.
"ఏం నేను నిప్పులా నీచేతిని కాల్చానా?" అక్కసుగా అన్నది అమూల్య.
"లేదు అందువల్ల నాలో కూడా బలహీనత ఏర్పడుతుంది. బలహీనతను తట్టుకోలేకపోతే కష్టం. నా మీద ఎన్నో బాధ్యతలున్నాయి. మా నాన్న వచ్చే సంవత్సరం రిటైర్ అవుతారు. ఇంట్లో కూర్చున్న ఇద్దరు చెల్లెళ్ళు పెళ్ళి చెయ్యాలి."
కారు స్పీడ్ ఎక్కువైంది. కారు డ్రైవర్ కు తెలుగు బొత్తిగా రాదు. అయినా అద్దంలోనుంచి మధ్య మధ్య వెనక కూర్చున్న ఇద్దర్నీ చూస్తున్నాడు.
ఏదో అర్థం చేసుకున్నట్టు ముసిముసిగా నవ్వుకుంటున్నాడు.
"ఇంతకీ మీరు అనేది ఏమిటి?"
"మన మధ్య వున్న అంతస్థులు మన ప్రేమను అంగీకరించవు."
"ప్రేమకు అంతస్థులు లేవు అన్నానుగా"
"అది జీవితమంటే ఏమిటో తెలియని అమాయకురాలు అనే మాట."
"అంతస్తుల్ని కాసేపు మర్చిపోండి, ఇది చెప్పండి. నేనంటే మీకు ఇష్టం లేదా?"
"దానివల్ల ప్రయోజనం"
"నా ప్రశ్నకు సూటి సమాధానం కావాలి."
"నువ్వంటే నాకిష్టమే"
"నిజంగా?" శ్రీధర్ చెయ్యి పట్టుకుంది.
ఈసారి శ్రీధర్ ఆమె చేతినుంచి తన చేతిని లాక్కోలేదు. ఆమె చేతిలో వున్న తన చేతిని చూస్తూ ఉండిపోయాడు.
"నేను చాలా ఆనందంగా ఉన్నాను. మీకోసం అన్నీ వదులుకుంటాను."
"మన మధ్య ఉన్న అంతస్థులు సుడిగాలిని సృష్టిస్తే?"
"నా హృదయంలోని ప్రేమజ్యోతి ఆ సుడిగాలిని ఎదుర్కొంటుంది. అంతేగాని దానికి ఆ జ్యోతిని ఆర్పే శక్తి దానికి ఉండదు."
ఈ క్షణం శ్రీధర్ ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె ముఖం గంభీరంగా ఉంది. ఆ ముఖంలో తనకు తెలిసిన చిలిపితనం గానీ, అమాయకత్వం గానీ కన్పించలేదు.
"అమూల్య పెనుతుఫాన్ గా మార్చి దాన్ని ఎదుర్కొంటుంది.
శ్రీధర్ పకపక నవ్వాడు.
"ఎందుకు నవ్వుతున్నారు? నేను సీరియస్ గానే అంటున్నాను."
"నేను ఊహించినడి కరెక్టే"
"ఏమిటది? మళ్ళీ మీరు మీరు అంటున్నారు" శ్రీధర్ చేతిని వదిలేసింది.
"నువ్వు తెలుగు నవలలు బాగా చదువుతావు కదూ?"
"అవును."
"అందువల్లనే ఇలాంటి డైలాగ్స్ సునాయాసంగా వదిలేస్తున్నావ్"
"అమూల్యకు కోపం వచ్చింది. కోపంలో వున్న అమూల్యను తన రెండు చేతులతో బంధించి ఆర్తిగా గుండెలకు హత్తుకోవాలనిపించింది. తనను తాను సంబాళించుకున్నాడు.
"ఒక పని చెయ్యి"
"ఏమిటి?"
"మన ప్రేమను గురించి మంచి నవల రాయి. నన్ను మాత్రం మర్చిపో"
అమూల్య కళ్ళలో నీరు గిర్రున తిరిగింది.
శ్రీధర్ అనుకోకుండానే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు.
ఇద్దరి గుండెలూ వేగంగా కొట్టుకున్నాయి.
శ్రీధర్ ఆమె చేతిని వదిలేశాడు. తన మనసు అదుపు పెట్టుకునే ప్రయత్నంలో పడ్డాడు.
"మీకోసం నేను అందర్నీ వదులుకుంటాను. అవసరం అయితే"
"నువ్వు అంత పని చెయ్యగలవని నాకు తెలుసు. కారణం బీదతనం అంటే ఏమిటో నీకు తెలియక పోవడమే."
"బీదతనం బీదతనం.. ఆకలి..అంతస్థులు అందరూ ఈ మాటల్ని వల్లిస్తారు. అవి అరిగిపోయిన రికార్డులోని మాటల్లా నాకు వినిపిస్తాయి."
ఈ డైలాగ్ ఏ నవల్లో చదివావ్"
అమూల్యకు కోపం వచ్చింది. పెదవులు అదురుతున్నాయ్. ముఖం కందిపోయింది.
"సారీ నిన్ను బాధపెడితే క్షమించు. ఆకలని అంత తీసిపారెయ్యకు. కడుపునిండుగా ఉన్నప్పుడే, అంటే మనిషికి కావల్సిన ప్రాధమిక అవసరాలు తీరినప్పుడే ఈ మమతలు ప్రేమలూ..."
"మీరు ఈ మాటల్తో నా మనసును మార్చలేరు. మా డాడీ మీకంటే పెద్ద ఉపన్యాసమే ఇచ్చారు.
శ్రీధర్ తృళ్ళిపడి అమూల్య ముఖంలోకి చూశాడు.
"మీ నాన్నకు చెప్పేశావా?"
"ఆహా."
"ఏమని ?" గాభరాగా అడిగాడు.
"నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాననీ, మిమ్మల్ని తప్ప వేరొకర్ని పెళ్ళిచేసుకోననీ"
"నిన్ను అతి గారాబంగా పెంచి పాడుచేశారు."
"అదంతా నాకు తెలియదు" నాకు తెలిసింది ఒక్కటే-"
"ఏమిటి?"
"మిమ్మల్ని ప్రేమిస్తున్నానని...మీరు లేకపోతే బ్రతకలేనని. శ్రీధర్ అమూల్య ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.
"ఒక్క మాట చెప్పెయ్యండి."