లేచేవరకు ఎండ బాగా ఎక్కింది ఒళ్ళంతా నొప్పులనిపించింది ఒళ్ళు విరుచుకున్నాడు ఇటూ అటూ చూచాడు జనం అప్పుడప్పుడే ఆస్పత్రికి వస్తున్నారు డొక్క చూసుకున్నాడు లాక్కుపోయింది మళ్ళీ ఆకలి మొదలైంది ఏమీ తోచలేదు లేచి పార్కులోని పంపు దగ్గర పుక్కిలించి ఊశాడు బైల్దేరాడు గౌలీగూడెం చమన్ దగ్గరుండే మనుషుల మార్కెట్టుకు.
పండ్లకూ, కూరగాయలకూ, కోళ్ళకూ, చేపలకూ, మార్కెట్లు కట్టేవారు మనుషులను గురించి ఆలోచించరు మనుషుల మార్కెట్టుకు ఇళ్లుండవు, బోర్డు వుండదు ప్రత్యేకంగా స్థలం వుండదు.
రోడ్డుకు రెండుపక్కల బారులుతీరి నుంచున్న జనం తమ శ్రమను మార్కెట్లో అమ్ముకోవడానికి అమ్ముకోవడానికి వచ్చారు వారివారి వృత్తుల్ను సూచించడానికి వాళ్ళ చేతుల్లో వారివారి పనులకు సంబంధించిన పనిముట్లు - తాపి, కొంచె, సుత్తె ఉన్నాయి.
పోచయ్య మనుషుల మార్కెట్టుకు వచ్చాడు అక్కడ నుంచున్న వారంతా అతన్ని వింతగా చూచారు.
"ఏయ్! ఎవల్నువ్వు?" అడిగా డొకడు.
"మడిసివి"
"అది కండ్ల బడ్తాంది ఈడికెందు కొచ్చినవ్?"
"పనికి"
"ఏ అడ్డలోనివి?"
"చిక్కడపల్లి"
"ఈడి కెందుకొచ్చినవ్?"
పోచయ్యకు కోపం వచ్చింది ఈ అడ్డా (వ్యాపారస్థలం) వానికి గుత్త అయినట్లు మాట్లాడతాడేం? తానూ కూలి చేసుకోవడానికి వచ్చాడిక్కడికి వాడి పెత్తనం ఏమిటిక్కడ అనుకున్నాడు.
"ఈ అడ్డేం గుత్త గొన్నావా?" అన్నాడు పోచయ్య.
"చూడ్రో, దిమాఖి కొడతాండు ఇదేం వీని అయ్యసొమ్మైనట్లు" అన్నాడు వాడు అక్కడున్నవాళ్ళతో.
ఇంకొకడు కాస్త బలంగా ఉన్నవాడు పోచయ్యమీదికి ఉరికి వచ్చాడు.
"ఏం బే సర్ ఫిరాయిస్తున్నదా? ఈ అడ్డ నీ తాతదా బే సాలే పోతవా ఈన్నుంచి, జబ్డలు పగలకొట్టనా?" అన్నాడు.
"ఏందయో! మీది మీది కొస్తాన్నవు జర్ర సంబ్లాయించుకొని మాట్లాడు నువ్వు కూలి చేస్కునే టంద్కొచ్చినవ్, నేను కూలి చేస్కునేటంద్కుచ్చిన, ఈ జాగేం గుత్త కొన్నవా?"
"ఏంది బే, పెద్ద లీడరోలె మాట్లాడ్తాన్నవు సాలె ఫో ఈన్నుంచి హడ్డీనరమ్ చేస్త" అని ఒకటి పుచ్చుకున్నాడు అక్కడున్న వారంతా కూడి కొట్టారు పోచయ్యను పోచయ్య ఒక్కడు ఏం చేస్తాడు?
క్రింద పడిపోయిన పోచయ్య లేచాడు నోట్లోంచి రక్తం కారుతూంది చేత్తో రక్తం తుడుచుకొని అక్కన్నుంచి వెళ్ళిపోయాడు ఆస్పత్రి వైపు.
"వచ్చిండయయా నీతుల్చెప్పేటందుకు" అన్నాడొకడు.
"నవాబురా నవాబు" అన్నాడొకడు.
అందరూ గొల్లుమని నవ్వారు.
ఒళ్ళు తిరిగినట్లయింది పోచయ్యకు కొంతదూరం వెళ్లి ఒక దుకాణం ముందున్న అరుగు మీద కూలబడ్డాడు రెండు చేతులతో తల పట్టుకొని కూర్చున్నాడు కొంతసేపటి తరవాత స్థిమిత పడ్డాడు.
"అరే ఎవడ్రా, ఈడకూకున్నడు? దొంగ ఉన్నట్లున్నడు సాలెగడు" అన్నాడు దుకాణం తెరవడానికి వచ్చిన కుర్రాడు లేచి వెళ్ళిపోయాడు పోచయ్య.
పోచయ్య ఆస్పత్రి ముందుకు చేరి కూలబడ్డాడు అతని గుండెపై రాయి పడింది అతనిపై దౌర్జన్యం జరిగింది అతడేం చేయగలదు? బలం ఉన్నవాడి ముందు బలం లేనివాడు లొంగిపోతున్నాడు మోకాళ్ళ మీద తలపెట్టుకుని ఏడ్చాడు.
"హరహర మహదేవ్" - బైరాగి ధ్వని విని ప్రాణం లేచివచ్చింది పోచయ్యకు చొక్కాతో కన్నీరు తుడుచుకొని బైరాగి వైపు చూచాడు బైరాగి అతని పక్కనే కూర్చున్నాడు "ఏం భాయీ, ఇలా ఉన్నావు?" అన్నాడు దుఃఖం పొంగి వచ్చింది అయినా, దిగమ్రింగి జరిగిందంతా చెప్పేశాడు పోచయ్య.
"భాయీ! దుఃఖించకు ఇదిగో రూపాయి తీసుకో" అన్నాడు బైరాగి.
రూపాయి తీసుకొని వెళ్లిపోయాడు పోచయ్య ఫుట్ పాత్ మీద రొట్టె లమ్మే మనిషి దగ్గర తిన్నాడు, బీడీలు కొనుక్కొని వచ్చి, బైరాగి దగ్గర కూర్చున్నాడు కృతజ్ఞత ఎలా తెలియజేయాలో తెలియక తికమకపడ్డాడు.
"భాయీ! దమ్ములాగు" అన్నాడు బైరాగి దమ్ములాగాడు పోచయ్య అతనికి లక్ష్మి కనిపించింది మళ్ళీ మళ్ళీ దమ్ములాగాడు లక్ష్మి తన ఎదుటనే కనిపించింది.
బైరాగి వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తానన్నాడు.
ఆ రోజు కూడా లక్ష్మికి స్పృహ రాలేదు నిరాశచెంది వచ్చేశాడు పోచయ్య.
* * *
7
పార్వతి దేవుని గదిలో కూర్చొని ఉంది ఆవిడ ముందు సీతారామ లక్ష్మణులున్నారు అని స్ఫటికపువి సుందరమైనవి సీతారాముల చిరునవ్వు చిందిస్తున్నారు పార్వతి ఆ నవ్వుతో తన్మయురాలు అవుతూంది కాని, ఆరు రోజులనుంచీ ఆమె మనసు ఆ విగ్రహాలమీద లగ్నం కావడంలేదు.
ఆరో రోజుల నుంచీ నిద్రాహారాలు లేవు పార్వతికి రాత్రింబవళ్ళు ఆస్పత్రిలోనే ఉంటూంది ఉదయం వచ్చి స్నానం చేసి పూజ చేసుకుంటూంది తన భర్తను కాపాడమనీ, మాంగల్యం రక్షించమనీ ప్రార్ధిస్తూంది.
నేడు ఎలాగైనా రాముని మనసున చూడాలనుకుంది చేతులు జోడించి, కళ్ళు మూసుకుని, ధ్యానించింది ఎంతో ప్రయత్నించింది కాని, ఫలించడంలేదు సీతారాములు వస్తున్నారు కాని, క్షణంలో అదృశ్యులు అవుతున్నారు రాజారావూ, అతని మంచం ప్రత్యక్షం అవుతున్నాయి.
నారాయణరావుగారు గుమ్మంలో నుంచొని చూశారు పార్వతికి అతని అడుగుల చప్పుడు కూడా వినిపించినట్లులేదు నారాయణరావుగారు రావడం ఇది రెండవసారి నిన్న అతనికి డబ్బు దొరకలేదు! ఈ రోజు కురుక్షేత్రం చూడాలని అతని తాపత్రయం! కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు! బ్రాందీ పడితేకాని మనిషికాడు!
పార్వతి అలా కూర్చొని తన మాంగల్యం కాపాడమని సీతమ్మను బ్రతిమాలింది! రామయ్యను ప్ర్రార్ధించింది! హారతి ఇచ్చి వెనుకకు చూచింది - తండ్రి కనిపించాడు! గ్రహించింది హారతి అందించింది ప్రసాదం ఇచ్చింది గది తలుపులువేసి తాళంవేసి రాజారావు గదికి వెళ్ళింది నారాయణరావు అనుసరించాడు పార్వతి తండ్రికి డబ్బు అందించింది నోట్లు అందుకొని వెళ్ళబోతూ "కురుక్షేత్రం ఆడుతున్నారు, రవీంద్ర భారతిలో" అన్నాడు పార్వతి చంద్రయ్యను పిలిపించింది.
చంద్రయ్య చెప్పులు విడిచి గదిలో ప్రవేశించి పార్వతికి నమస్కారం చేశాడు ప్రతి నమస్కారం చేస్తూనే అడిగింది పార్వతి "కురుక్షేత్రం టిక్కెట్లు వచ్చాయి కదూ మనకు?"
"అవ్ వచ్చిని జబర్ధస్తిగ కట్టిండుండి ఇంజనీరు పానాల్తింటాన్రుండి ఆప్సర్లు ఊఁ అంటే చందంటరు ఆఁ అంటే చందంటరు"
అయ్యకివ్వమని తండ్రిని చూపించి, "రాత్రికి ఫియట్ కాళీగా ఉంటుందికదా?" అడిగింది.
"పుర్సతాడుదుండి ఫైట్ కు సూపర్ జరింట్ల లగ్గమైతాంది ఆయినకిచ్చినం ఒకటే రద్దాయిస్తాండు పెట్రోలేమో మనకాతాల్నే"
"ఎం-బాసిడర్?"
"పొద్దుమికేయోల పుర్సతుంటది కౌన్సిలర్ గుట్టకు పోతనంటే ఇచ్చినం నిన్న ఇయాలొస్తది"