Previous Page Next Page 
మాయ జలతారు పేజి 16


    "సాయంకాలం అంబాసిడర్ అయ్యక్కావాల పంపు రవీంద్రభారతికి వెళ్తారు మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో దింపాలి డ్రైవరుతో చెప్పు, మరెక్కడికీ తీసికెళ్ళొద్దని" అదంతా విని నారాయణరావుగారు వెళ్ళిపోయారు.
    ఈలోగా టెలిఫోన్ చేసి భర్త విషయం తెలుసుకుంది పార్వతి పరిస్థితి అలాగే ఉందనీ, వస్తే ఈ రోజు స్పృహ రావచ్చనీ, సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తున్నామనీ చెప్పాడు డాక్టర్ రాజారావు పక్కన నర్సు ఉన్నదనే విషయం ధృవపర్చుకుంది ఏ పరిస్థితుల్లోనూ రాజారావుకు జరిగే సేవలో లోపం కలుగరాదని ఆమె అభిప్రాయం.
    "పనులెలా జరుగుతున్నాయి?" అడిగింది పార్వతి.
    "దవాఖాన బత్తయింది కళాయి పెడ్తాన్రియాల పంజగుట్టకాడ సడక్ పని నిలిచింది రోడ్ రోల రియ్యమంటే ఇస్తలేడు ఇంజనీర్ ఆయినకేదన్న ఇయ్యాలె లేకుంటే ఇచ్చేటట్టులేడు లష్కర్ల డ్రైనేజి పని ఆడనే ఆగింది గొట్టాల్లేవంటాన్రు, రైల్వేవాండ్ల ఇండ్ల పని జరుగుతాంది.
    "ఇంజనీరు పైక మడుగుతాండు బిడ్డ లగ్గమట మనకేమో బిల్లురావాలె పైకమియ్యకుంటే బిల్లు రాయనంటాడు దొర యిస్తనని ఒప్పుకున్నాడు"
    "ఎంత?"
    "పాంచ్ హజార్!"
    "మూడు వేలకు చెక్కు రాసిస్తా, తీసికెళ్ళు ఇంకెంత కావాలివ్వాళ?"
    "దస్ హజార్ కావాల్నుండి"
    "నిన్నటి పైకానికి లెక్క తెచ్చావా?"
    "ఇదో నుండి లెక్క" అని కాగితాలు టేబుల్ మీద పెట్టి, వెనక్కు నుంచున్నాడు చంద్రయ్య.
    జాగ్రత్తగా లెక్క చూచింది పార్వతి.
    "ఈ రాతి పొడేమిటి?" అడిగింది.
    "సిమ్మెంట్ల కలిపేటంద్కు"
    "సిమెంట్లో ఏమీ కలపొద్దు మంచి సిమెంటు వాడండి, డబ్బు మంచి సిమెంటుకు పుచ్చుకుంటున్నాంగా మనం?"
    "అట్ల అయితాదుండి? లుక్సానొస్తది అప్సర్లందరికీ తగల పెట్టొద్దండి! యాన్నుంచొస్తది?"
    "ఎందుకియ్యాలి మనం నీతిగా పనిచేసేటప్పుడు?"
    "గదంతా నడ్వదుండి గద్దలు పొడ్చుక తిన్నట్టు తింటరు"
    "ఏమో ఇదంతా అయోమయంగా ఉంది నీతి నియమాలు గలవాడు బతికేట్లు లేదు సరే, ఇదిగో పదమూడు వేల చెక్కు లెక్క చూపించాలి రేపు మనకు రావాల్సిన బిల్లు ఇవ్వాళ రావాలి రేపు నేను చెక్కురాసివ్వను" అని చెక్కు అందించాలి.
    "సరేనుండి" అని సలాంపెట్టి వెళ్లిపోయాడు చంద్రయ్య డ్రాయరుకు తాళంవేసి లేస్తుండగా మళ్ళీ ప్రవేశించాడు "ఇన్కంటాక్సాయనకు సుత ఇయ్యాల్నుండి"
    "ఇప్పుడుకాదు దొర అలా పడివున్నాడా - నా కాతాలో డబ్బిస్తున్నా చెప్పు ఆయనతో తర్వాత సర్దుతామని"
    "సరే, అట్లనేనుండి" అని వెళ్లిపోయాడు చంద్రయ్య.
    పార్వతి భర్త గదిలో ప్రవేశించింది రాజారావు మంచం పక్కన డెయిజీ కూర్చుని ఉంది పార్వతిని చూచి లేచి నుంచుంది నమస్కరించింది పార్వతి అర్ధం చేసుకుంది లిప్తపాటు కోపం ప్రకోపించింది క్షణంలో అది తగ్గిపోయింది. డెయిజీదేం తప్పు భర్తది కాని? అది తన దురదృష్టం అనుకుంది చిరునవ్వు నవ్వి ప్రతి నమస్కారం చేసింది.
    "ఎప్పుడొచ్చారు?" ఆమె ప్రశ్న ప్రసన్నంగా ఉంది డెయిజీ ఆశ్చర్యపడింది హిందూ భార్యలు సాధారణంగా భర్తలు పరాయి స్త్రీలతో ఉండడం సహించరు అలా ఉండడం తమ భర్తల దోషంగా కాక అ స్త్రీల దోషంగా పరిగణిస్తారు కాని, పార్వతి అలాకాక ప్రసన్నంగా ప్రశ్నించడంతో ఆశ్చర్యపడింది డెయిజీ.
    "ఉదయం వచ్చాను అప్పటికి మీరు వెళ్ళిపోయారు ఇప్పటికి వెళ్లిపోయేదాన్నే కాని, ఈ రోజు స్పృహ వస్తుందని చెపుతున్నాడు డాక్టరు మీరు దగ్గరలేరు కాబట్టి కాస్త ఎక్కువ సేపు కూర్చున్నాను వెళ్తా" అని నమస్కరించింది.
    వాస్తవానికి డెయిజీ రోజూ ఉదయం వస్తూంది పార్వతి వెళ్ళిపోయిం తర్వాత వస్తూంది పార్వతి వచ్చేవరకు వెళ్లిపోతూంది.
    "ఎలా వెళ్తారు?"
    "బస్సు"
    "కారుంది వెళ్ళండి త్వరగా పంపించెయ్యండి" డెయిజీ ఉక్కిరిబిక్కిరైంది ఆ సానుభూతినీ, దయను భరించే స్తోమత లేకపోయింది ఎరుపు తరంగం ముఖం మీదనుంచి పరుగెత్తింది థాంక్సు అని వెళ్ళిపోయింది.
    పార్వతికి లక్ష్మి గుర్తుకు వచ్చింది లక్ష్మి అంటే ఆవిడకు ప్రత్యేకమైన సానుభూతి ఏమీలేదు ఒక పేదది తన పనిమీద వున్నప్పుడు పడిపోయింది ఆవిడను చూడడం తన కర్తవ్యంగా భావిస్తుందావిడ రోజూ చూచి వస్తుంది లక్ష్మిని పేదవారంటేనూ, తిండిలేని వారంటేనూ ఆవిడకు దయగాని సానుభూతికాని లేదు ఆవిడ విశ్వాసం వేరు ఆవిడ సిద్దాంతం  వేరు ఏ జన్మలోనో పాపం చేసుకున్నవారు ఈ జన్మలో దరిద్రులై పుడతారని ఆవిడ నమ్మకం దరిద్రం మన సమాజంలోని అస్తవ్యస్తాల ఫలితమనీ, దాచుకునేవారుండబట్టి దారిద్ర్యం ఉందని మనం వాదించి ప్రయోజనం లేదు.
    పార్వతి లక్ష్మి పక్కన కూర్చుంది లక్ష్మి శవంలా పడి ఉంది అయినా ఆవిడ ముఖంలో అందం ఉంది కళ ఉంది తనలో లేని అందం లక్ష్మిలో ఉంది అందుకు ఈర్ష్య సైతం కలిగింది పార్వతికి లక్ష్మి జీవిస్తుందని ఏ కోశానా విశ్వాసం లేదు పార్వతికి ఊపిరి ఆడుతుండడం తప్ప లక్ష్మి జీవించి ఉందనడానికి  సంబంధించిన ఏ లక్షణమూ కనిపించడంలేదు.
    "రాజారావుగారికి తెలివి వచ్చింది" అని ఒక నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పి ఉరికింది టెలిఫోను చేయడానికి.
    పరిగెత్తింది పార్వతి అప్పటికే ముగ్గురు నలుగురు నర్సులున్నారు రాజారావు మంచం దగ్గర పార్వతిని చూచి వారు తొలగిపోయారు.
    పార్వతిని చూచాడు రాజారాఉ వింతగా చూచాడు ఆస్పత్రి కప్పులనూ, చుట్టూ ఉన్న మంచాలనూ చూచాడు "పార్వతీ! నేనెక్కడున్నాను?" అడిగాడు.
    "ఇది ఆస్పత్రండీ!" అని జరిగిన విషయం అంతా చెప్పేసింది.
    "నే నొక్కన్నే పడ్డానా?"
    "లక్ష్మి కూడా పడింది"
    "దెబ్బలు బాగా తగిలాయా?"
    "స్పృహతప్పి పడిపోయింది ఇంకా స్పృహ రాలేదు ఏం బ్రతుకుతుందో పాపం!"
    గుండెల్లో ముల్లు గుచ్చుకున్నట్లయింది రాజారావుకు.
    "చూడాలి ఆ అమ్మాయిని" అంటూండగానే వచ్చాడు డాక్టరు "హల్లో మిస్టర్ రాజారావు! మీరు చాలా అదృష్టవంతులు ఎలా వుందిప్పుడు?" అన్నాడు.
    "డాక్టర్! బాగానే ఉన్నానే అట్టే బాధేమి లేదు కాని, ఏదో నరాలన్నీ వంగకుండా కర్రలా అయిపోయి నట్లనిపిస్తూంది"
    "దట్సాల్రైట్ అదేమంత ప్రధానం కాదు ఏడు రోజుల్నుంచీ పడుకొని ఉంటే అలాగే ఉంటుంది నౌ యు మస్ట్ టేక్ సం లిక్విడ్ డైట్ యువార్ ఆల్ మోస్టు స్టార్వింగ్ సిన్స్ సెవెన్ డేస్" అంటూ కుర్చీలో కూర్చున్నాడు డాక్టరు నాడి పరీక్షిస్తూ.
    "డాక్టర్! లక్ష్మి స్థితి ఎలా ఉంది? ఆవిన్ను చూడాలని ఉంది నాకు"
    "వీల్లేదు మీరు కదలడానికి వీల్లేదు కాస్త కాగ్రట్టగా చూడమ్మా!" అని పార్వతితో చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్.
    "రాజారావుకు స్పృహ వచ్చింది" - ఈ వార్త వేల టెలిఫోన్లలో వినిపించింది ఆస్పత్రి ఆవరణ కార్లతో నిండిపోయింది రాజారావు గది పూలతో నిండిపోయింది స్థానిక పత్రికల్లో ఈ వార్త కూడా అచ్చు అయింది.
    
                                                *    *    *
    
                                                      8
    
    బొంబాయి జేలుగది కిటికీ సువ్వలు పట్టుకొని బాహ్య ప్రపంచాన్ని చూడ్డానికి ప్రయత్నిస్తున్నాడు పోచయ్య కాని, అతనికి కనిపిస్తున్నది జేలు గోడ మాత్రమే పైకి చూచాడు క్రిందికి చూచాడు పక్కలకు చూచాడు అదే గోడ కనిపిస్తూంది అవతల ప్రపంచం లేదని చెపుతూంది గోడమీదనే దృష్టి నిలిపి చూస్తున్నాడు చూపుతో గోడను చీల్చ ఆవలి ప్రపంచాన్ని చూడాలని అతని సంకల్పం.
    లచ్చి ఏమైనట్లు? లచ్చికి తెలివివస్తే? తానలా ఎందుకు వదిలి వచ్చినట్లు? అవును, ఎందుకు వచ్చినట్లు? బొంబాయి రావడానికి, జేల్లో పడ్డానికి ఆ బైరాగి కారణం.
    ఆ రోజుకూడా మామూలుగానే వచ్చాడు బైరాగి ఆస్పత్రి ముందుకు చెట్టుకింద పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు పోచయ్య పోచయ్యను చూచి చిరునవ్వు నవ్వాడు బైరాగి ఆ నవ్వు గారడిలా పనిచేసింది "తిన్నావా?" అడిగాడు బైరాగి తల ఊపాడు అడ్డంగా పోచయ్య "పాపం, ఆకలిగా ఉందేమో - తింటావా?" అడిగాడు అప్పుడుగాని అర్ధం అయిందికాదు పోచయ్యకు, ఆకలి దహించుకు పోతోందని "తింటాను" అన్నట్లుగా తల ఊపాడు బైరాగి లేచాడు పోచయ్య కూడా లేచాడు బైరాగి నడిచాడు పోచయ్య అనుసరించాడు కొంతదూరం నడిచి ఒక టాక్సీని పిలిహ్చాడు బైరాగి టాక్సీ ఎక్కాడు బైరాగి నసిగాడు పోచయ్య బైరాగి చెయ్యిపట్టి లాగి కూర్చుండబెట్టుకున్నాడు టాక్సీలో కూర్చుంటే సిగ్గనిపించింది పోచయ్యకు తన అవతారం తానూ టాక్సీలో! జుట్టు సవరించుకున్నాడు ఏదో ఆకాశంలో తేలియాడుతున్నట్లనిపించింది బస్సులన్నింటినీ దాటేసుకుని రయ్యిమని పరుగెడుతూంది టాక్సీ టాక్సీలో కూర్చుంటే తన హోదా ఏదో పెరిగిందనుకున్నాడు పెద్దమనిషి తరహాగా కూర్చోవాలనుకున్నాడు నడిచి పోతున్నవాళ్ళనూ, సైకిళ్ళ మీద ఉన్నవాళ్ళనూ అదొక రకంగా చూస్తున్నాడు.
    డ్రైవరు దిగాడు ఏహ్యంగా అతనివైపు చూస్తూ తలుపు తెరిచాడు పోచయ్య కారు దిగాడు బైరాగి అంతకు ముందే దిగాడు డబ్బిచ్చి టాక్సీని పంపించేశాడుపోచయ్య ముందుకు చూచాడు అదొక పెద్ద హోటల్ - హోటల్ నయాగరా బైరాగి హోటల్లోకి దారితీశాడు పోచయ్య అనుసరించాడు హోటలు శుభ్రంగా వుంది అంతా పైతరగతి వారున్నారు కార్లు బారులు తీరి ఉన్నాయి శుభ్రమైన దుస్తుల్లో అందమైన వారున్నారు అందులో ప్రవేశించడానికి సిగ్గనిపించింది సంకోచించాడు అయినా ముందడుగు వేశాడు బైరాగి మెట్లు ఎక్కాడు గదిలో ప్రవేశించాడు పోచయ్య కూడా ప్రవేశించాడు గదినీ, అక్కడ తగిలించి ఉన్న పటాలనూ వింతగా చూచాడు పోచయ్య బేరర్ లోనికివచ్చి బైరాగిని అడిగాడు పోచయ్య బేరర్ వైపు చూచాడు బేరర్ పోచయ్యను ఏహ్యంగా చూచాడు పోచయ్యకు కోపం వచ్చింది బేరర్ను చితక్కొట్టేయ్యాలనిపించింది బేరర్ వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడు. బేరర్ టేబుల్ మీద రమ్ సీసా, సోడా సీసాలూ, తినుబండారాలూ పెట్టి, సీసాల మూతలూ తీసిపెట్టి వెళ్ళిపోయాడు.

 Previous Page Next Page