Previous Page Next Page 
మాయ జలతారు పేజి 14


    గుండె దడదడ లాడింది.
    వెనక్కు తిరిగి చూసింది.
    "దొర!"
    ముచ్చెమటలు పోశాయి కళ్ళు తిరిగాయి తల గిరగిరా తిరుగసాగింది కళ్ళు చీకట్లు కమ్మాయి మెదడు మొద్దుబారింది.
    "ఎందుకలా అయినావ్?"
    రాజారావు ముందుకు అడుగేశాడు ఆమె వెనక్కు అడుగేసింది.
    వెనుక ఏమీ లేదు.
    వెనక్కు తూలింది.
    'ఆఁ ఆఁ' అంటూ పరిగెత్తాడు రాజారావు ఆమెను పట్టుకోలేకపోయాడు తానూ పడిపోయాడు.
    నాలుగు అంతస్తుల మీదినుంచి ఇసుకలో పడిపోయాడు రాజారావు.
    "దొర పడ్డడు" "దొర పడ్డడు" - ఈ వార్త క్షణంలో అంతటా పాకింది.
    పని పిడుగు పడినట్లు ఆగిపోయింది.
    జనం గుంపులు గుంపులుగా కూడారు.
    టెలిఫోన్లు మ్రోగాయి.
    అంబులెన్సులు వచ్చాయి.
    రాజారావును స్పృహలేని స్థితిలో ఉస్మానియాకు చేర్చారు.
    టెలిఫోన్లు, డాక్టర్లు, నర్సులు, మందులు, ఇంజక్షన్లు, విజిటర్లు - ఆస్పత్రి యుద్దరంగంగా మారింది.
    రాజారావును తీసికెళ్ళింతరవాతగాని లక్ష్మికూడా పడిపోయిందని తెలియలేదు జనానికి!
    ముఖంమీద నీళ్ళు కొట్టారు కొందరు ముక్కులో పసర్లు పోయాలన్నారు కొందరు వాత లేయాలన్నారు.
    పోచయ్య ఏడుస్తూ రిక్షా దిగాడు పరిగెత్తుకొని వచ్చాడు లక్ష్మి మీద పడి పెద్దగా ఏడ్వసాగాడు.
    అయినా లక్ష్మి కదలలేదు, కళ్ళు తెరవ లేదు.
    ఒకడు ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు ఊపిరాడుతున్నది "బతికున్నదసే రిచ్చ తేరి దవఖాన కేస్కపోదం" అన్నాడు.
    అప్పుడు పోయిన ప్రాణాలు వచ్చాయి పోచయ్యకు లేచి నుంచొని చొక్కాతో కన్నీరు తుడుచుకున్నాడు.
    రిక్షా వచ్చింది లక్ష్మి ఉస్మానియాకు చేరింది ఎమర్జన్సీ రూములో వేయి ప్రశ్నలు వేసి, గంటన్నర తరువాత ఇన్ పేషెంటుగా చేర్చుకున్నారు.
    పోచయ్యను బయటికి గెంటేసి, లక్ష్మిని లోనికి తీసికెళ్ళారు- స్ట్రెచర్ మీద .
    
                                            *    *    *
    
                                                6
    
    బుగ్గ గిల్లినట్లు ఎర్రవారింది తూర్పు తెల్లవారనున్నది సంపదను సృష్టించడంలో నలిగేవారి వాడ మేల్కొన్నది వాడ సందడిగా ఉంది వంటలు సాగుతున్నాయి ఇండ్ల కప్పుల్లోంచి పొగ వస్తూంది.
    పొగ కనిపించని, సందడిలేని ఇల్లు ఒకటుంది అది పోచయ్యది పోచయ్య మౌనంగా ఏడుస్తున్నాడు ఏమీ చేయలేడు కాబట్టి ఏడుస్తున్నాడు నిద్రాహారాలూ ఏడుపే అయినాయి అతనికి.
    ఏడు రాత్రులకు, రాత్రి కన్ను మలిగింది పోచయ్యకు కలలో లక్ష్మి కనిపించింది.
    యమదూతలు వచ్చారు లక్ష్మిని రమ్మన్నారు తాను వారితో యుద్ధం చేశాడు ఓడించాడు లక్ష్మిని తెచ్చుకున్నాడు దక్కించుకున్నాడు.
    ఆస్పత్రి ఆపరేషన్ థియేటరు మూతులకు గుడ్డలు కట్టుకున్న ముసుగు జనం తళతళా మెరిసే కత్తులు! లక్ష్మి తల తరిగేశారు! తల కెవ్వున కేకవేసింది తలను తీసుకొని పరుగెత్తుతున్నాడు తాను.
    ఆస్పత్రి తాను లక్ష్మి పక్కన కూర్చున్నాడు లక్ష్మికి తెలివి వచ్చింది వెర్రిగా తన వైపు చూస్తూంది తనను గుర్తించినట్లు లేదు తనమీద ఏదో నల్లని ముసుగు పడింది తనను ఎవరో లాక్కుపోతున్నారు.
    "లచ్చీ! లచ్చీ!" అంటూ పలవరిస్తూ లేచాడు పోచయ్య చూస్తే తెల్లవారింది అయినా, లోకం చీకటిమయంగా కనిపించింది అతనికి మనసులో చీకటి వున్నప్పుడు సూర్యుడుకూడా అమావాస్య చంద్రుడు అవుతాడు.
    లేచాడు పోచయ్య నడక సాగించాడు ఉస్మానియా ముందుకు వచ్చాడు అతనికి తెలుసు ఆ సమయంలో ఎవరినీ లోనికి పోనివ్వరని అయినా, ఆస్పత్రి ముందు కూర్చుంటాడు అందులో ఏదో సంతృప్తి ఉందతనికి.
    చెట్టు క్రింద కూర్చున్నాడు పోచయ్య ఒక బైరాగి వచ్చి పక్కనే కూర్చున్నాడు సంచిలోంచి గంజాయి తీసి అరచేతుల్లో వేసుకున్నాడు నీటి చుక్కలు వేసి బొటన వేలుతో నలిపాడు గొట్టంలో వేసి ముట్టించి దమ్ము లాగాడు "హరహర మహదేవ్" అని కాలుమీద కాలు వేసి పొగ వదిలాడు.
    పోచయ్య వింతగా చూశాడు "భాయీ! పుచ్చుకుంటావా? దేన్ని తలుస్తావో అదే ఉండిపోతుంది మనసులో భగవంతున్ని తల్చుకొని పీల్చేస్తాం ఉండిపోతాడు మనసులో హిమాలయ పర్వతాల నుంచి తెచ్చాం చూడు రుచి" - అందించాడు యాంత్రికంగా పుచ్చుకున్నాడు పోచయ్య దమ్ము లాగడం రాలేదు బైరాగి నేర్పాడు పీల్చాడు పోచయ్య పొగ వదిలాడు కొద్దిగా దగ్గి లక్ష్మి కనిపించింది తనముందే ఉన్నట్లనిపించింది మరొకసారి పీల్చాడు ఇంకొకసారి పీల్చాడు తల ఏదో దిమ్ముపట్టినట్లనిపించింది లక్ష్మి కనిపిస్తూనే ఉంది.
    "హరహర మహదేవ్" అన్నాడు బైరాగి "వస్తాను శిష్యా" అంటూ లేచిపోయాడు లక్ష్మి తనకు దూరం అవుతున్నట్లు అనిపించింది పోచయ్యకు అతడు బైరాగి కాళ్ళు పట్టుకున్నాడు "నీ కాల్మొక్త మారాజ్ ఇంక జర్రిచ్చిపో నీ గులాం నైత" అన్నాడు.
    "భాయీ! ప్రస్తుతం మా దగ్గర గంజాయి లేదు ఈ పూట హిమాచలానికి వెళ్తున్నాం రేపు పొద్దున మళ్ళీ తెస్తాం ఉండు, ఇక్కడే వాల్తా" అని వెళ్లిపోయాడు బైరాగి.
    క్రమక్రమంగా పోచయ్య ముందు నుంచి లక్ష్మి మాయం అయింది.
    నాలుగు కావస్తూంది తాను వెళ్ళగానే లక్ష్మి మాట్లాడుతుందనీ, లక్ష్మికి గంజాయి ప్రభావం తెలియజేయాలని, బైరాగిని చూపించాలనీ ఉత్సాహపడ్డాడు.
    నాలుగైదు పోచయ్య లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు లక్ష్మి నిన్నటిలాగే పడి ఉంది మౌనంగా కూర్చున్నాడు పోచయ్య ఆరింటిదాకా కూర్చున్నాడు వచ్చేశాడు ఇంటికి వెళ్ళడం మనస్కరించలేదు అంతేకాదు నీరసించిపోయాడు కదలడం కూడా చేతకావడంలేదు కూలబడిపోయాడు.
    డొక్క మాడిపోతూంది దుమ్ములో  కూలపడ్డాడు చుట్టూ చూశాడు కుడిపక్క సైకిలు స్టాండుంది జనం సైకిళ్ళు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు సైకిలుస్టాండు పక్కనే ఒక ముసిలాడు సిగరెట్లూ, అగ్గిపెట్టెలూ పెట్టుకొని కూర్చున్నాడు ఎడమపక్క గుడి వుంది కొంత దూరాన బిచ్చగాళ్ళు గిన్నెలు పట్టుకొని కూర్చున్నారు పార్కు ముందు పండ్ల దుకాణం ఉంది బత్తాయిలూ, ఆపిల్సూ అమ్ముతున్నారు అవి చూచి నోరూరింది పోచయ్యకు జేబులో వెతికాడు అయిదు పైసలబిళ్ళ కనిపించింది దాని విలువ తెలుసు అతనికి కుడివైపుకు చూచాడు రాతి ప్రహరీకి అంటివున్న గుడికి కొబ్బరికాయలు కొడుతున్నారు జనం వెళ్ళాడక్కడికి కొబ్బరి దొరికింది తిన్నాడు అయినా ఆకలి చల్లారలేదు గుడి వైపుకు వెళ్ళాడు గంటలు మ్రోగుతున్నాయి భజన జరుగుతూంది అక్కడే గోడకు ఆనుకుని నుంచున్నాడు ప్రసాదం తెచ్చాడొకడు పెట్టింది కాస్తా నోట్లో వేసుకున్నాడు అక్కడే కూలబడ్డాడు ఇంకా ఆకలి చల్లారలేదు బటానీలవాడు వచ్చాడు అయిదు పైసల బటానీలు కొనుక్కొని తినేశాడు అక్కడే నేలమీద పడుకున్నాడు నిద్ర రావడంలేదు ఆకలి ఆకలి చంపేస్తూంది కడుపు దహిస్తూంది అది గంజాయి ప్రభావం తినడానికి ఏమీ కనిపించలేదు రాత్రి చాలా అయింది అయినా లైట్లున్నాయి వెలుగు బాగా ఉంది ఆస్పత్రి ముందు జనం ఏమాత్రం లేరు పండ్లదుకాణం, సిగరెట్ల దుకాణం మాయం అయినాయి సైకిల్ స్టాండులో కూడా సైకిళ్ళు ఎక్కువ లేవు పళ్ళదుకాణం ఉన్నచోటు చూశాడు అరటిపండ్ల తొక్కలు పడివున్నాయి లేచాడు అన్నన్నుంచి పొట్టంతా ఏరుకున్నాడు, అదీ ఎంతో లేదు ఆవులు తినగా మిగిలింది ఒక్కొక్కటే తినేశాడు పార్కులోకి వెళ్ళి  నీళ్ళు తాగాడు కాస్త డొక్క నిండినట్లయింది వెల్లకిలా రెండుచేతులు నెత్తిక్రింద పెట్టుకొని గడ్డిమీద పడుకొన్నాడు ఆకాశంలో నక్షత్రాలుమిలమిలా మెరుస్తున్నాయి పక్కకు చూచాడు ఎవరో బీడీ తాగుతున్నాడు తనకూ పొగ పీల్చాలనిపించింది, పొగ పీల్చేవాణ్ణి ఒక బీడీ అడిగాడు లేదన్నాడు అటూ యిటూ వెతికాడు ఎంగిలి సిగరెట్టు దొరికింది నిప్పడిగి అంటించుకున్నాడు మళ్ళీ పడుకున్నాడు ఆకాశాన్ని చూస్తూ లక్ష్మి కళ్ళలో మసలింది పచ్చనిగడ్డి, పొడవైన పోకచెట్లు, హౌజులు, రాత్రి చుక్కలు లక్ష్మీ బాగవుతుందా? మళ్ళీ తనకు దక్కుతుందా? ఏవో వింత వింత ఆలోచనలు వచ్చాయి బైరాగిని గురించిన ఆలోచన వచ్చింది అవును, గంజాయి పీలుస్తే లచ్చి ఎపుడూ తన ముందే ఉన్నట్లుంది బైరాగి ఎపుడు వస్తాడో? బైరాగి తనకు కలిసిన చోటికి వెళ్ళాడు అక్కడే పడుకున్నాడు ఏ రాత్రికో నిద్ర ముంచేసింది.

 Previous Page Next Page