"అమ్మా, వస్తాను! సీతాపతికి నా కృతజ్ఞతలు చెప్పు!" అంటూ ముందుకు రెండడుగులు వేశాడు.
అరుంధతి ముందు ఓ క్షణం నిలబడ్డాడు. ఆమె కళ్ళలోకి నిశితంగా చూస్తూ చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు "సెలవు! ఈ జీవితానికి ఇది చాలు! హాయిగా చచ్చిపోగలను," అని చెబుతున్నట్లుంది.
పోలీసుల మధ్యగా నడుస్తూ వెళ్ళిపోతున్న రాజారావును చూస్తూ నిలబడిపోయారు శాంతమ్మా, అరుంధతీ.
అరుంధతికి రాజారావూ, పోలీసులూ అరిగిపోయిన ఫిలింలో బొమ్మల్లా మసకమసకగా కదిలిపోతూ కనిపించారు.
15
రాజారావు అరెస్టయిన మూడోనాటి సాయంకాలానికి కాని సీతాపతి ఇంటికి రాలేదు. అరుంధతికి సీతాపతే రాజారావు ఆచూకీ ఇచ్చాడని గట్టినమ్మకం కలిగింది. శాంతమ్మకు కూడా తెలియకపోలేదనుకుంది. మనస్సు అసహ్యంతో నిండిపోయింది. సీతాపతిని తలచుకున్నా, శాంతమ్మ కనిపించినా అరుంధతి మనస్సు జుగుప్సతో నిండిపోయేది. శాంతమ్మతో ఆ రెండు రోజులూ ఒక్కమాటైనా మాట్లాడలేదు. శాంతమ్మ కూడా అరుంధతిని పలకరించలేదు. ఆమె దేనికో బాధపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది.
సంచినిండా పళ్ళు కొనుక్కొని పట్టుకొచ్చాడు. కొన్ని పుస్తకాలూ, పత్రికలూ కూడా తెచ్చాడు. పువ్వులు తెచ్చాడు. వస్తూనే "అరూ! అరూ!" అంటూ కేకలు పెట్టాడు...వంటింట్లో ఉన్న అరుంధతికి అసహ్యంతో వళ్ళు జలదరించింది. అయిష్టంగానే లేచి వచ్చింది. అప్పటికే సీతాపతి శాంతమ్మకు పళ్ళూ పూలూ ఉన్న సంచి అందించాడు.
"ఇదిగో అరూ! నీకోసం పుస్తకాలు తెచ్చాను." ఉత్సాహంగా అందించబోయాడు. అరుంధతి చెయ్యి చాపలేదు. నిరసనగా చూసింది. "ఇంకా కోపం తగ్గలేదా?" అన్నాడు నవ్వుతూ. అరుంధతి ముఖం తిప్పుకుంది. సీతాపతి నిరుత్సాహంగా పుస్తకాలు పక్కనే ఉన్న అలమారులో పెట్టాడు.
"అమ్మా! రాజా ఏడీ? ఈ వేళప్పుడు బయట కెళ్ళాడేం?" అన్నాడు సీతాపతి. అరుంధతి చివ్వున తాచులా తలెత్తిచూసింది. శాంతమ్మ పలకలేదు. కొడుకు ముఖంలోకి అదోలా చూస్తూ నిల్చుండిపోయింది.
"ఏవిఁటర్రా అలా చూస్తారు? ఒక్కళ్ళూ మాట్లాడరేం?"
ఎవరూ మాట్లాడలేదు. శాంతమ్మ పెదవులు కదిలి మళ్ళీ ఆగిపోయాయి. అరుంధతికి భర్తమీద కోపం కట్టలు తెంచుకుంటూంది. ఏమీ ఎరగనట్లు ఎలా అడుగుతున్నాడు? అంత నాటకమా? మనస్సెలా వచ్చింది అంత అమాయకంగా ప్రశ్నించటానికి? తను చేసిన పనికి సిగ్గుతో తల వంచుకోవాల్సిందిపోయి, ఏమీ యెరగనట్లు అమాయకంగా ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాడు?
"ఏమిటమ్మా, కొత్తవాణ్ణి చూసినట్లు చూస్తావు! రాజా ఎక్కడంటే మాట్లాడవేం?" విసుగ్గా అడిగాడు.
అరుంధతికి సీతాపతిణి ఎవరైనా లాగి లెంపకాయ కొడితే బావుండును అనిపించింది.
"నీకు తెలియదా?" శాంతమ్మ నిదానంగా అడిగింది.
మధ్య ఆమె కూడా నాటకం ఆడుతూంది. ఇదంతా తనకు అనుమానం రాకుండా వుండటానికే.
"నాకేం తెలియదే! వెళ్ళిపోయాడా? నేను లేకుండా ఎందుకు పోనిచ్చావమ్మా?" అన్నాడు సీతాపతి.
శాంతమ్మ కొడుకు ముఖంలోకి పరిశీలనగా చూస్తూ ఉండిపోయింది.
"ఏమిటమ్మా! ఏదోలా చూస్తున్నావు? అసలు ఏం జరిగింది? రాజా కోపగించుకొని వెళ్ళిపోయాడా? వెళ్ళేరోజు నేను వాడితో ఒక్క మాటకూడా చెప్పలేదు. అందుకే కోపం వచ్చి ఉంటుంది." బాధగా అన్నాడు సీతాపతి.
శాంతమ్మ ఏదోగా చూసింది.
"రాజాను పోలీసులు వచ్చి పట్టుకెళ్ళారు." ఒక్కొక్కమాటనే నొక్కుతూ అంది.
సీతాపతి అర్ధంకానట్లు అయోమయంగా చూశాడు.
అరుంధతికి వళ్ళు మండిపోతూంది. తిరస్కారంగా చూసి, లోపలకు వెళ్ళిపోయింది. అరుంధతి చూపులోని భావం లీలగా స్పురించింది సీతాపతికి. తలపట్టుకొని కూలబడ్డాడు.
అమ్మా, అదీ తనను అలా చూట్టానికి కారణం ఇదా? అంటే వాళ్ళు తనే రాజాను పట్టించినట్లు అనుకుంటున్నారా? చేసుకున్న పెళ్ళాం తనను అంత నీచంగా అర్ధం చేసుకుంటుందా? కన్నతల్లి కూడా తనను అనుమానిస్తూందా? సీతాపతికి తనమీద తనకే జాలివేసింది.
"లే బాబూ! స్నానం చెయ్యి!" అంది శాంతమ్మ కొడుకు తలను నిమురుతూ.
"అమ్మా! నువ్వు గూడా?"
"లేదు బాబూ! నువ్వు అలాంటి పని చెయ్యవని నా మనస్సు ఓ పక్కన చెబుతూనే ఉంది. నేను నా కన్నబిడ్డనే అనుమానించాను. పాపిష్టిదాన్ని" కన్నీళ్ళు పెట్టుకుంటూ అంది.
"పోనీయ్ లేమ్మా! ఇప్పటికి నేను చెప్పకుండానే ,సంజాయిషీ ఇచ్చుకోకుండానే నమ్మావు, నాకు అంతే చాలు" అన్నాడు లేచి నిల్చుంటూ.
ఆ రాత్రి సీతాపతి అన్నం తినలేదు. అతనిమీద కసి తీర్చుకోటానికన్నట్టు అరుంధతి ఒకముద్ద ఎక్కువే తింది. ఆమెకి భర్త ముఖంలోకి చూడాలని లేదు. అతని మాటలు వినాలని లేదు. సీతాపతి పరిస్థితి కూడా అలాగే ఉంది. మనస్సునంతా మంచుతెరలు కప్పినట్లు అయింది. తన భార్య తనను అంత నీచంగా అర్ధం చేసుకుందా? ఆమె ఆడదేనా? వివాహిత అయివుండీ పరాయి మగవాడి మీద మోజు పడుతుందని తెలుసుకొని కూడా తను భరించాడే? ఆదర్శమూర్తి అయిన రాజా తనకు ద్రోహం చెయ్యడని తనకు తెలుసు కాని అతడు బాధపడుతున్నాడనీ, తన భార్యే అతన్ని ఆకర్షించటానికి ప్రయత్నిస్తూందనీ తెలిసీ, బాధనంతా దిగమింగుకున్నాడే? ఆ రాత్రి అరుంధతిని కొట్టినందుకు తను ఎంత బాధపడ్డాడు? మళ్ళీ అంతా మర్చిపోవటానికి ప్రయత్నిస్తూ ఉత్సాహంగా ఇంటికి వచ్చాడే? తను రాజాను పట్టించాడా? ఎంత నిరసనగా చూసింది తనవైపు! ఆ కళ్ళలో తనమీద అసహ్యం గూడు కట్టుకొని స్పష్టంగా కనిపించింది. తను రాజాను ఎంతప్రేమిస్తాడో అరుంధతికి తెలియదా? అలాంటి తను రాజాను పోలీసులకు అప్పగిస్తాడా? ఎద్దుకు గుండెల్ని ఇచ్చి తన బిడ్డ ప్రాణాలను రక్షించాడే? ఆ దెబ్బకు అతని ఆరోగ్యమే ధ్వంసమయిందే! అలాంటి రాజాను తను అరెస్టు చేయిస్తాడా? ఈ నాలుగు సంవత్సరాల దాంపత్య జీవితంలో అరుంధతి తనను అర్ధం చేసుకుంది ఇంతేనా?
సీతాపతికి అరుంధతి మీద ఏహ్యభావం కలిగింది. మనస్సును ఏదో నిర్లిప్తతా, ఉదాసీనతా కప్పేశాయి.
ఆ భార్యభర్తలిద్దర్లో ఎవరూ ఎవర్నీ పలకరించలేదు. ఎవరికీ ఎవరితోనూ మాట్లాడాలనిపించలేదు. ఇద్దరూ నిద్రపోలేదు. కదులుతూనే వున్నారు. వారి వారి ఆలోచనల్లో ఆ రాత్రంతా గడిపారు.
16
ఆరోజు మాధవి పుట్టినరోజు. ఉదయమే తలంటిపోసి కొత్త బట్టలు వేశారు. రెండు సంవత్సరాలు నిండి మూడో సంవత్సరంలో కాలు పెట్టింది మాధవి. రాజా అరెస్టు అయి దాదాపు సంవత్సరం దాటిపోయింది. ఆ సంవత్సరంలో ఒక్కసారికూడా సీతాపతి భార్యను పలుకరించలేదు. తలెత్తి చూడలేదు. అరుంధతి తన తప్పు తెలుసుకుంటుందని ఆశించాడు. కాని అరుంధతిలో పట్టుదల ఎక్కువయింది. శాంతమ్మ ఎన్నో విధాల కొడుక్కి చెప్పిచూసింది. సీతాపతి బెల్లం కొట్టిన రాయిలా వింటూ వుండిపోయేవాడు. కోడలికి చెప్పాలని చూసింది. కాని లాభం లేదని ఊరుకుంది. శాంతమ్మ వంటరిగా కూర్చొని కొడుకు బతుకుని తలచుకొని కుమిలి కుమిలి ఏడ్చేది. ఆ కుటుంబ విషయాలు బైటికిమాత్రం పొక్కలేదు.
అరుంధతి ఇంటి విషయాల్లో కల్పించుకోవటం ప్రారంభించింది. ఒకరోజు శాంతమ్మ ఇంటి మంగలికి బస్తా వడ్లు ఇస్తుంటే అరుంధతి అడ్డుపడింది. అందులో సగమే ఇచ్చి పంపించింది.
శాంతమ్మ మనస్సు నొచ్చుకుంది. ఇంటి విషయాలు పట్టీ పట్టకుండా ఉమ్దటానికే ప్రయత్నిస్తుంది. కాని తప్పటంలేదు.
ఒకరోజు సాయంత్రం వెంకన్న వచ్చి పొగాకు కాడ అడిగాడు.
"పొగాకులేదు ఏమీలేదు వెళ్ళు వెళ్ళు" అంటూ విదిలించింది అరుంధతి.
పొగాకు కాడతో వాకిట్లోకి వచ్చిన శాంతమ్మ కోడలి తొందరపాటుకు నొచ్చుకుంది.
"వెంకన్న, నేను ఈ ఇంట్లోకి కాపరానికి వచ్చినప్పటినుంచీ కనిపెట్టుకొని వున్నాడు. వెంకన్నను పాలేరుగా ఎవరం చూడలేదు. అందరం ఇంటి పెద్దగా గౌరవించాం" అంది శాంతమ్మ.
"పాలేరును పాలేరుగా చూడక, ఇంటి యజమానిగా చూసే దద్దమ్మను కాను నేను" అంటూ విసురుగా వెళ్ళిపోయింది లోపలకు.
శాంతమ్మకు మతిపోయినంత పని అయింది. కన్నీళ్ళు పెట్టుకుంది. కాని కొడుకు చెవిని వెయ్యలేదు. ఆనాటి నుంచి శాంతమ్మ కోడల్ని పలకరించటమే మానేసింది.
అరుంధతికి మరీ కసి ఎక్కువ కాసాగింది. తప్పుచేసి పైగా తనను సాదిస్తారేం?
ఎవరికి వారిగా బతుకుతున్న ఆ ఇంట్లో అందరి మనస్సులనూ అలరింప చేస్తున్నది మాధవి ఒక్కతే! సీతాపతి ఇంట్లో వున్నంతసేపూ మాధవిని భుజాలమీదనుంచి దింపేవాడు కాడు. ఆ తరువాత నాయనమ్మను వదిలేదికాదు మాధవి. తల్లి దగ్గర వుండేది కాదు.
మాధవికి భోగిపళ్ళు పోశారు. ముత్తయిదువులు వచ్చి వెళ్ళారు. పిల్ల తెల్లగా సున్నితంగా, బొద్దుగా, పూలచెండులా వుంది.
శాంతమ్మ వెన్నెల్లో మంచంవేసి పిల్లను పడుకోబెట్టి జోలపాట పాడుతూంది. ఇంకా వేడిగానే వుంది వాతావరణం. రామమందిరం దగ్గిరకు వెళ్ళిన సీతాపతి తిరిగి వచ్చాడు.
"ఏమ్మా! పాప ఇంకా నిద్రపోలేదూ? అందరూ వచ్చి వెళ్ళారా?" తల్లి మంచం దగ్గిర నిల్చుని పలకరించాడు.
"ఆఁ! అందరూ వచ్చారు. పిల్లకు దిష్టి తగులుతుందేమోనని భయం వేసింది. అందరూ దాన్ని అందాన్ని గురించి ఒకటే పొగడేయడం! వస్తున్నాను. పద అన్నం పెడతాను. ఇప్పుడే కళ్ళుమూసింది. కదిలితే లేస్తుందేమో!" అంది శాంతమ్మ.
"తొందరేం లేదులే," అంటూ లోపలకు వెళ్ళిన సీతాపతికి వెక్కిళ్ళు వినిపించాయి.
అరుంధతి ఏడుస్తూందా? తను మరీ కఠినంగా ప్రవర్తించటంలేదు కదా? ఏదో చిన్నతనంవల్ల తనను అర్ధం చేసుకోకపోవచ్చు. అంత కాఠిన్యమా? ఎలా వెక్కి వెక్కి ఏడుస్తూందో? ఈ సంవత్సరం రోజులుగా ఒక్కసారి కూడా తను పలకరించి ఎరగడు. సీతాపతి మనస్సు కరిగింది. వెళ్ళి హృదయానికి గాఢంగా హత్తుకొని ఓదార్చాలనిపించింది. చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్ళాడు. అరుంధతి వీపు వాకిలి వేపు వుంది. వెనగ్గా వెళ్ళి నిల్చున్నాడు. సీతాపతికి వళ్ళంతా కొయ్యబారిపోయినట్లయింది. అరుంధతి రాజా ఫోటోను చూస్తూ ఏడుస్తూంది. గిర్రున వెనక్కు తిరిగాడు. మంచం మీద పడిపోయి తల గట్టిగా పట్టుకున్నాడు. వేళ్ళకు కణతలు అదరటం తెలుస్తూ ఉంది.
తల్లి భోజనానికి పిల్చింది. యాంత్రికంగా లేచి వెళ్ళాడు. తను అన్నం తిన్నదీ లేనిదీ కూడా అతనికి తర్వాత జ్ఞాపకం లేదు.
17
వేసవికాలం గాడ్పులు ప్రారంభం అయ్యాయి. సీతాపతి యింటి దగ్గిరే ఉంటున్నాడు. పొలం మీద ఆ రోజుల్లో పని ఏమీ ఉండదు. అయినా ఎక్కువ కాలం బయటే ఎక్కడో ఏ రచ్చబండ మీదనో, రామ మందిరంలోనో గడుపుతున్నాడు.
గడపలో ఆడుకుంటున్న కూతుర్ని ఎత్తుకొని సీతాపతి లోపలకు వచ్చాడు. అరుంధతి మెల్లా ఇంట్లో గోడకు చేరబడి కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంది. శాంతమ్మ వంట్లో బాగాలేదు. మంచం వాల్చుకొని పడుకొని వుంది.
"ఏరా నాయనా, పదకొండు అయినా ఇంకా అన్నానికి రాలేదు?" అంటూ మంచం పట్టెమీద కూర్చుంది శాంతమ్మ.
మాధవి తండ్రి చేతిలో వున్న పత్రిక కోసం చేతులు చాస్తూంది. సీతాపతి అరుంధతి దగ్గరగా వచ్చి పత్రికను ఆమె వళ్ళోకి విసిరివేశాడు. అరుంధతి త్రుళ్ళిపడింది. ఎదురుగా భర్త, తన వళ్ళో పత్రిక. సీతాపతి ముఖం రాయిలా బిగుసుకొని ఉంది.
అరుంధతి మనస్సు అనిష్టాన్ని వూహించి దడదడ కొట్టుకుంది. ఏదో వార్త వచ్చి వుండాలి. ఆ వార్తద్వారా భర్తకు తనమీద కసి తీర్చుకున్నట్లు ఉండి ఉండాలి. లేకపోతే ఏనాడూ లేనిది ఇవ్వాళ ఇలా పత్రిక తెచ్చి ఇవ్వటం ఏమిటి?
రాజాను...కాల్చివేశారా? అరుంధతి వణికిపోయింది. పత్రికను చేతుల్లోకి తీసుకుంటూ ఉంటే చెయ్యి వణికింది. సీతాపతి అరుంధతినే తీవ్రంగా చూస్తున్నాడు.
పత్రిక తెరుస్తూనే పెద్ద పెద్ద అక్షరాల్లో ఉన్న వార్త కనిపించింది. అరుంధతికి చదవాలని లేదు. చదవకుండా ఉండలేదు. ఆమెకళ్ళు ఆదుర్దాగా ఆ అక్షరాల మీదకు పాకాయి.
"ప్రముఖ విప్లవకారుడు రాజారావు విడుదల, పోలీసులు కాన్ సెస్ట్రేషన్ కాంప్ లో వున్న రాజారావు లొంగుబాటు! పార్టీకి రాజీనామా ఇచ్చాడు. వాళ్ళ పార్టీ రహస్యాలను కూడా బయటపెట్టాడు. ఫలితంగా పోలీసులు చాలామందిని పట్టుకున్నారు." అని ఉంది.
అరుంధతి ఆ వార్తను నమ్మలేనట్లు మళ్ళీ మళ్ళీ చదివింది. తేలిగ్గా నిట్టూర్చింది. పోనియ్! బతికి సుఖంగా ఉండటమే కావల్సింది.
అరుంధతి ముఖంలోని భావాలను చదువుతూ నిల్చున్నాడు సీతాపతి.
శాంతమ్మకు గాబరా వేసింది. మాధవి తల్లి చేతిలోవున్న పేపరు తీసుకొని కింద వేసుకొని దాని మీద కూర్చొని నవ్వింది. అరుంధతి కూతురు కింద నుంచి పేపరును లాగబోయింది. మాధవి లేవలేదు. పేపరు చిరిగింది. సీతాపతి వ్యంగ్యంగా చిరునవ్వు నవ్వాడు.
"ఏమిటిరా బాబూ? ఆ పేపర్లో ఏమొచ్చింది?" శాంతమ్మ ఆదుర్దాగా అడిగింది.
సీతాపతి అరుంధతి ముఖంలోకి చూశాడు.
"మన రాజారావు బాగానే వున్నాడుగా?' శాంతమ్మ భయపడుతూ అడిగింది.
"వాడికేం - బాగానే వున్నాడు. 'పాపీ చిరాయుః' అన్నారు" అన్నాడు సీతాపతి.