కళారవి
పి. యస్. నాగరాజు
'శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనేలేదు' (శ్రీశ్రీ)
సిరిసిరి మువ్వ చైతన్యానికి
అసాధ్యమున్నది ఉండబోదు
ప్రజాకవి ! మన మహాకవి !
కష్టజీవుల కళారవి ! || శ్రమైక ||
పిడికిలెత్తిన విప్లవానికి
ఆకలిపొత్తిలి అమ్మఅని
మంటలతో మాట్లాడించి
రక్తంతో రాగాలెత్తి
అక్షరాలలో ఉదయబింబాన్ని
తూర్పుకెత్తిన ప్రజాకవి
ప్రజాకవి ! మన మహాకవి !
కష్టజీవుల కళారవి ! || శ్రమైక ||
శతాబ్దాలకు తరగని వెలుగు
ప్రజలభాషలో పొంగే తెలుగు
అభ్యుదయం ఆశయంగా
ఆచరణే నిప్పుల నడకగ
కవన కుతూహల పోరుబాటలో
మడమ తిప్పని కలం యోధుడు
ప్రజాకవి ! మన మహాకవి !
కష్టజీవుల కళారవి ! || శ్రమైక ||