శ్రీశ్రీకి వందనం
ఉప్పెన
వందనం... వందనం... వందనం...
మా... వందేండ్ల శ్రీశ్రీకి... వందనం
ఓ... మహాకవి... శ్రీశ్రీ...
అందుకో అందుకో వందేండ్ల వందనం || వందనం ||
మనిషిని మనిషే దోచే దోపిడి రాజ్యంలోన
మనిషిని మనిషే మోసే బానిస బతుకులపైన
రాజుల రాణుల చరితల వ్రాసుడే కవి పనికాదని
పల్లకి మోసిన బోయీల బాధలను చెప్పినట్టి || వందనం ||
తాజ్ మహల్ అందాలు వర్ణించుటే కాదని
ఆ కట్టుబడికి రాళ్లెత్తిన కూలీలు ఎవ్వరని
శ్రామిక జన సౌందర్యం అందాలను చూడమన్న
కష్టజీవి కిరువైపుల ఉన్నవాడే కవి అన్న || వందనం ||
జయభేరి నుండి మహాప్రస్థానం గీతాల వరకు
కవితలకూపిరి ఊది కథలకు ప్రాణం పోసి
గన్నులాగ పెన్నును ఎక్కుపెట్టి నిలిచినావు
ఎదురు నాకు లేదంటూ ఈ శాతాబ్ది నాదేనన్న || వందనం ||
మరోప్రపంచం పిలిచింది పదండి ముందుకు అంటు
యువతరం గుండెలను మండించిన అగ్ని కణం
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చానని
సమసమాజ స్థాపనకు కలం ఎత్తి గళమిప్పిన || వందనం ||
దొరతనాన్ని ఎదిరించి దోపిడీని ప్రశ్నించి
చైతన్యాన్ని నింపినావు సాహసాన్ని నేర్పినావు
జనాన్ని మేల్కొలిపిన ఓ మహాకవి శ్రీశ్రీ
నీ... వాణకి పదునుపెట్టి నీ... వేడిని మరిగిస్తం || వందనం ||
ఇక వెయ్యేండ్లు గడిచినా నీకు ఎదురు లేనే లేదు
ఇంక ఎందరు పుట్టినా నీకు సాటి రానేరారు
నింగిలోన ఎగురుతున్న అరుణారుణ ధ్రువతారవు
సాహితీవనములోన విరబూసిన మందారమా || వందనం ||
( 'పోరుబాటలో ఉప్పెన పాట' మార్చ్, 2015)
కమ్యూనిజమంటే నీ
కమ్మయ్యో ఎంత భయం?
నిజం చెప్పనా, కమ్యూ
నిజానిదే తుది విజయం !
(దూదిపులి మీద పుట్ర.. 'మరో ప్రస్థానం' మే 1980)