శ్రీశ్రీకి జేజేలు
ఎరుకలపూడి గోపీనాథరావు
కాలగతినే తీర్చిదిద్దిన వేధవైతివి నీవు శ్రీశ్రీ!
కావ్యగతినే మార్చివేసిన బోధకరుడివి నీవు శ్రీశ్రీ!
స్వేదజీవుల వేదనాత్మల వేదమైతివి నీవు శ్రీశ్రీ!
సమసమాజం కోరి పోరే యోధవైతివి నీవు శ్రీశ్రీ!
అద్భుతానికి రూపమిచ్చిన అభ్యుదయ సన్మార్గదర్శీ!
ధాత్రికోసం నీ సమస్తం ధారవోసితివో మహర్షీ!
బ్రతుకునిచ్చిన భారతావని మహిమ పెంచిన మనిషి నీవు!
మాట నేర్పిన మాతృభాషా ఋణముదీర్చిన ఋషివి నీవు!
కార్మికులకై, కర్షకులకై గళమువిప్పిన కలము నీది
దారితెన్నూ లేని బడుగుకి భవితనిచ్చిన కవిత నీది!
గూడులేక కూడులేక గుబులు గుబులుగ నున్నవారికి
గుండె గుడినందించిగాచి కడుపు నింపిన కరుణ నీది!
గద్దెకోసం, మిద్దెకోసం ప్రాకులాడని ప్రతిభ నీది!
చిక్కి చితికిన బ్రతుకు తీవెకు చివురులిచ్చిన ప్రతిన నీది!
నీ కవిత్వం విశ్వవ్యాప్తం! నీ సుకృత్యం నిత్యస్తుత్యం!
ఒక మహాద్భుత లక్ష్యమార్గము నొడిసి పట్టుట నీ మహాత్మ్యము!
నీ ప్రయాణం, నీ ప్రయోగం, నీ ప్రబోధం నీకే సాధ్యం!
నీకు మునువూ, నీకు వెనుకా శూన్యమన్నది నగ్న సత్యం!
పాతకాలపు కావ్యరీతులు పాతరేసీ, పాతిబెట్టీ
జాతినే వెలిగించు జాగృత కావ్యజ్యోతిగ వెలిగినావు!
బ్రతుకు దీపాలార్పు దుష్టుల, మనిషినే తెగటార్చు ధూర్తుల,
దేశమును దిగజార్చు ద్రోహుల, వెన్ను విఱవగ వెలిసినావు!
మానసమునర్పించినావూ, మానిసిని అర్చించినావూ,
సంప్రదాయపు కావ్యకన్యకు సంఘస్ఫృహనందించినావూ!
మనిషిపై రహి పెంచినావూ మనసులను రగిలించినావూ
అక్షరాలను ఆయుధాలుగ తీర్చి నువ్వు రాణించినావూ!
పుడమిబిడ్డై పెరిగినావూ, పూజ్యకవివై పరగినావూ,
ప్రజల కోసమె కలముపట్టీ, ప్రాగ్రసరుడై ప్రబలినావు!
దీనజనులను ఉద్ధరించే దివ్యతేజం నిను వరించి
కాలసంస్కరణోద్యమాగ్నికి కర్తగా నియమించుకున్నది!
రెండు 'శ్రీ' లే కోటి 'శ్రీ' లై నిండుగా ప్రభవించినాయి!
ప్రతినివాసం శ్రీనివాసం చేయవలెనని తలచినాయి!
చేతమును ఒక యజ్ఞగుండం చేసినందుకు నీకు దండం!
ధాత్రికోసం బ్రతుకునంతా ధారవోసిన నీకు దండం !
( శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురణ, మహాకవి శ్రీశ్రీ విశేష సంచిక 'శ్రీశ్రీ-101' ఏప్రిల్, 2011)
నీ ధాటికి అడ్డులేదు నీ త్యాగం వృథాకాదు !
నీ ఆదర్శం ఎపుడూ నీతోనే ఆగిపోదు !
ఇది ప్రపంచ పర్యాప్తం-జనశక్తికి పరమాప్తం !
ఈ పోరాటం అంతిమ విజయంతోనే సమాప్తం !
(తుది పయనం: తొలి విజయం..'సృజన' మాసపత్రిక, జూన్-జూలై,1971)