రిశికి జరిగింది గ్రహించడానికి రెండు నిమిషాలు పట్టింది. అప్రయత్నంగా పెదాలు తడుముకున్నాడు. పెదవుల మీద ఇంకా గులాబీ రేకులూ, తేనే కలిపిన రుచి నిలిచే వుంది! అంటుకున్న ఆమె అధరామృతం జరిగింది కలకాదు నిజం అని తెలియజేస్తోంది! అతనికి ఆమెకి ఎదురు పడాలంటే చాలా సిగ్గేసింది. నెమ్మదిగా లోపలోకి తొంగి చూసాడు.
ఆమె అతని చొక్కాకి గుండీలు కుడ్తోంది! చాలా మామూలుగా, ఏమీ జరగనట్లే వుంది ఆమె మొఖం!
అతనికెందుకో అప్రయత్నంగా వెన్ను జలదరించి భయం వేసింది. ప్రకృతిలోనూ, స్త్రీలోనూ వున్న ఆకర్షణ మరెందులోనూ లేదు. సౌందర్యంలో వున్న భయం కూడా ఇంకెందులోనూ లేదు! ఎవరి అమ్మాయో! ఎక్కడినించి వచ్చిందో! తనకి దగ్గరైపోతోందేమిటీ? తన స్థితిగతులు చూస్తూ కూడా.... అతనికి కాస్త భయం వేసింది! అమ్మో! జాగ్రత్తగా వుండాలి. చనువివ్వకూడదు. తర్వాత ఏదొచ్చి ఎటుపోతుందో అనుకున్నాడు. మనసు ఈసారి వెనక్కి లాగుతూ పారా హుషార్ అంది.
లోపలికి వెళ్ళి ఆమె ఎదురుపడాలంటే ఇబ్బందిగా అనిపించి గబగబా తడుస్తూనే వీధిలోకి వెళ్ళిపోయాడు. అతనికి మనసంతా వుద్వేగంగా వుంది. ఏదో ఆర్తిగా .... అసంపూర్తిగా.... జరగరానిది జరిగినట్లుగా, వింతగా, కొత్తగా, గిలిగింతగా....
"ఏయ్! వానలో ఎక్కడికా పరుగు? ఆగు" అంది ఎదురుగా వచ్చిన శ్రీజ.
రిషి ఎందుకో తల ఎత్తి ఆమె వైపు ధైర్యంగా చూడలేకపోయాడు. "తప్పుకో! నేను వెళ్ళాలి" అన్నాడు.
శ్రీజ గొడుగు ఇంకాస్త ఎత్తి పట్టుకుని "ఎక్కడికీ? నేనూ వస్తా" అంది.
"వద్దు! నువ్వు ఇంటికి వెళ్ళు" అన్నాడు రిషి.
శ్రీజ అతని మొహంలోకి తేరిపార చూస్తూ "ఏమిటి సంగతి బుగ్గలు ఎర్రబడ్డాయి? ఎందుకా కంగారు?" అంది.
రిషికి కోపం వచ్చింది. "ఏం జరగలేదు వట్టు!" అన్నాడు.
శ్రీజ పకపకా నవ్వి "ఏం జరిగిందని నేను అడగలేదే?" అంది.
రిషికి అంతా కంగారుగానూ, అయోమయంగానూ వుంది. తను చూసిన సినిమాల్లో, కథల్లో ఆడపిల్లలు ఇలా ప్రవర్తించరు. చెట్టంత మగాడని లేకుండా ఆ అమ్మాయి అలా చటుక్కున తనని ముద్దు పెట్టేసుకోవడం అతనికి ఇప్పుడు కోపం తెప్పిస్తోంది. ఇంటికి వెళ్ళాలంటే భయంగా వుంది. తన గురించి ఎంత నవ్వుకుంటుందో మనసులో అనుకున్నాడు.
"శ్రీజా! ఆ అమ్మాయిని త్వరగా పంపించెయ్యాలి. ఏదైనా మార్గం చూడు!" అన్నాడు.
"ఇన్నాళ్ళూ నీ గురించి నాకు చాలా డౌట్ గా వుండేది. ఇంత అందమైన దాన్ని నేను అంటిపెట్టుకుని తిరుగుతున్నా పట్టించుకోవేమిటా అని ఇప్పుడు నిర్ధారణైపోయింది. ఆడపిల్లలంటే నీకు అంత భయం ఎందుకో తెలిసింది" అంది ఆరిందాలా.
"ఏవిటి తెలిసింది నీ తలకాయ. పళ్ళు రాలగొడతాను" అన్నాడు వుక్రోషంగా రిషి.
"లేకపోతే ఎవడైనా అంత అందమైన అమ్మాయిని పంపించడానికి ఇంత తొందరపడ్తాడా?" అంది శ్రీజ.
రిషి మొహం ఎర్రబడింది. "పాపం! ఎవరింటి ఆడపిల్లో. ఇన్ని రోజులు ఇక్కడ వుండిపోతే ఎంత అపవాదూ?" అన్నాడు. ఈసారి ఈ మాటతో మనసు కూడా ఏకీభవించింది.
"అవును. ఈ జన్మలో పెళ్ళికాదు. ఆ అమ్మాయికి కాదు నీకు" అంది శ్రీజ.
రిషి వెంటనే చెయ్యెత్తి ఆమెని కొట్టబోయాడు.
శ్రీజ తప్పించుకుంటూ "అప్పుడు ఎలాగో నేనే నీకు గతికానీ, ముందు గొడుగులోకి రా!" అంది.
రిషి గొడుగు అందుకుంటూ "నిజంగా అంటున్నాను. ఆ అమ్మాయిని పంపించెయ్యాలి" అన్నాడు.
"ఏదో కారణం దొరక్కపోదు. వంట చెయ్యలేదనో, సబ్బు అరగదీసిందనో పౌడర్ ఒలకబోసిందనో, ఏదో ఒకటి అనేసేయ్. దాంతో ఆమెకి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. నీ దెబ్బకి ఆమెకి గతం అంతా సినిమాలోలా గుర్తుకొచ్చేస్తుంది" అంది.
రిషి పెదవి కొరుకుతూ ఆలోచిస్తూ నిలబడ్డాడు.
"పద.... పద.... అమ్మ త్వరగా రమ్మంది" అంది శ్రీజ.
అతను ఆమెతో కలిసి ఇంటి దారి పట్టాడు.
శ్రీజ మరోసారి అతనికి చెయ్యవలసిన పని గురించి హెచ్చరించి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఎ కారణంతో ఆమెని కొట్టడమా అని ఆలోచిస్తూ అతను ఇంట్లోకి వచ్చాడు.
రిషిని చూడగానే ఆశ్రిత ఎదురొచ్చి "మీకు మధ్యాహ్నం వుత్తరం వచ్చింది" అంటూ అందించింది.
రిషి ఉత్తరం విప్పి వుండడం చూసి "ఎందుకు చదివారూ?" అన్నాడు.
"నాకేమో అనుకున్నాను" అంది.
"మీకెవరు వ్రాస్తారూ?"
"ఏమో! అది తెలీకే గదా గొడవ" అంది.
అతను ఉత్తరం చదవసాగాడు. అతను తల్లి దగ్గర్నుండి బయలుదేరిన రోజే వ్రాసిన ఉత్తరం అది. తల్లి ఆరోగ్యం చాలా పాడయిపోయిందట. విశ్రాంతి తీసుకోమంటే వినదట. ఓసారి వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని పక్క ఇంటి ఆయన వ్రాసాడు. ఉత్తరం చదివి రిషి దీర్ఘంగా నిట్టూర్చాడు. కన్నతల్లిని ఈ వయసులో కష్టపెడ్తున్న అతని అసమర్ధత మీద అతనికే అసహ్యం వేస్తోంది. ఆమె ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణిస్తోందని అతనికీ తెలుసు.